
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన మల్లారెడ్డి మెదడులో కణితి ఏర్పడింది. చికిత్స కోసం ఇటీవల ఆయన నిమ్స్ వైద్యులను ఆశ్రయించాడు. ఇప్పటికే చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారని, చికిత్స చేయాలంటే కనీసం నెల రోజులు ఆగాలని వైద్యులు సూచించారు. రాజేంద్రనగర్‌కు చెందిన వరాల నారాయణ వెన్నునొప్పితో వైద్యులను ఆశ్రయించగా, ఆపరేషన్ థియేటర్లు ఖాళీగా లేవని, రెండు నెలల తర్వాత రావాలని చెప్పారు. ఇలాగే మెదడులో కణతులు, వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న పలువురు రోగులు నిమ్స్‌లో చికిత్స కోసం నిరీక్షిస్తున్నారు.
ఆ ఆస్పత్రులు నిరాకరించడం వల్లే..
రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై మెదడులో రక్తం గడ్డకట్టిన ఆరోగ్యశ్రీ బాధితులను చేర్చుకునేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో తల గాయాల చికిత్సకు కేవలం రూ.70 వేల వరకే ఇస్తుండటంతో అవి తలగాయాల బాధితు లను చేర్చుకోవడం లేదు. దీంతో వారంతా నిమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. నిమ్స్ అత్యవసర విభాగానికి వచ్చే కేసుల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయి. రోజూ వచ్చిపడుతున్న అత్యవసర కేసులకు తోడు మెదడులో కణతులు, వెన్ను, మెడ నొప్పి బాధితులు కూడా వచ్చి చేరుతున్నారు. వీరందరికీ చికిత్స చేసే సదుపాయాలు ఆస్పత్రిలో లేకపోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు.
కాలంచెల్లిన వాటితోనే...
నిమ్స్‌లో 1991లో డాక్టర్ రాజారెడ్డి హయాం లో సమకూర్చిన వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లే నేటికీ దిక్కవుతున్నాయి. మరోవైపు న్యూరో సర్జరీ వైద్యులు ఎక్కువ శాతం సదస్సులు, సమావేశాల పేరుతో విదేశాల్లోనే గడుపుతున్నారు. ఆ విభాగాధిపతే తరచూ విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ టేబుల్స్, అనస్థిషియన్ల్ కొరత సాకుతో ఇక్కడి కేసులను వాయిదా వేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లోని సర్జరీలకు హాజరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment