సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్
సాక్షి,హైదరాబాద్: పేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రులకు నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర సర్కారు జాప్యం చేస్తుండటంతో ఆ పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ ప్రైవేట్ ఆస్పత్రులకు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు మొత్తం రూ.1200 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఓపీ డయాగ్నోస్టిక్, డిసెంబర్ 1 నుంచి ఇన్‌పేషెంట్ సేవల్ని కూడా నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు సోమవారం తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 240 ప్రైవేటు ఆస్పత్రులు
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో రాష్ట్రవ్యాప్తంగా 240 ప్రైవేటు ఆస్పత్రులు చేరాయి. వీటిలో ఒక్క గ్రేటర్ పరిధిలోనే వందకుపైగా ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగం గా అందిస్తున్న వైద్యసేవల్లో 70% పైగా చికిత్సలు ఈ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ఒప్పందం మేర కు రోగికి చికిత్స చేసిన సదరు ఆస్పత్రికి 40 రోజుల్లో వైద్య ఖర్చులు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యంతో పాటు చెల్లిస్తున్న మొత్తంలో టీడీఎస్‌ను కూడా కట్ చేస్తే ఆస్పత్రులకు ఒక్కో సర్జరీపై రూ2 వేల నుంచి రూ. 3 వేలే మిగులుతున్నాయి. ఇలా 2015లో ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.600 కోట్లు బకాయి పడింది. అప్పట్లో ఆస్పత్రి యాజమాన్యాలన్నీ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి, తాత్కాలికంగా కొంత మొత్తాన్ని చెల్లించింది.
ఆ తర్వాత పట్టించుకోకపోగా, ఏడాది నుంచి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఆ బకాయిలు మొత్తం రూ.1200 కోట్లకు పేరుకుపోయింది. దీంతో నిర్వహణ ఖర్చులు రెట్టింపవ్వడంతో ఇప్పటికే 30 ప్రైవేటు ఆస్పత్రులు మూతపడ్డాయి. భవిష్యత్తులో మరిన్ని ఆస్పత్రులు మూతపడే అవకాశం ఉంది. పెండింగ్ బకాయిల అంశంపై ఇప్పటికే అనేక సార్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈఓలకు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. లేదంటే డిసెంబర్ నుంచి సేవలను పూర్తిగా నిలిపివేయడానికి కూడా వెనుకాడబోం’అని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వి.రాకేశ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేశ్, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ కిరణ్‌లు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment