సాక్షి, అమరావతి: నాటు వైద్యం చేసే మంత్రసాని స్థానంలో నీటుగా తెల్లకోటు వేసుకునే మంత్రగాళ్లు వచ్చారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తూ కన్నతల్లులకు కడుపులు కోసేస్తున్నారు. సాధారణంగా చేయాల్సిన ప్రసవాన్ని కూడా సిజర్స్‌తో చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పాపాయి పుట్టిన ఆనందం కంటే ఆ ఆస్పత్రి వేసే బిల్లుతో ఆ కుటుంబం భయపడుతున్న దుస్థితి. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే చాలు బిడ్డ అడ్డం తిరిగిందనో, ఉమ్మనీరు పోయిందనో లేదా మరో కారణమో చెప్పి పదినిముషాల్లో కడుపు కోయడం, బిడ్డను తీయడం డాక్టర్ల వంతయింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా విస్మయం వ్యక్తం చేసింది. దురదృష్టంఏంటంటే దేశంలోనే అత్యధిక కోత ప్రసవాలు తెలుగురాష్ట్రాల్లోనే జరగడం. ఇక్కడ జరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు ప్రపంచంలో మరేదేశంలో జరగడం లేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసవాలను భారీ వ్యాపారంగా వైద్యులు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం సిజేరియన్ ప్రసవాల ద్వారా జరుగుతున్నట్టు అంచనా.
తెలుగురాష్ట్రాల్లోనే ఎక్కువ సిజేరియన్లు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మాబున్నిసా డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా సిజేరియన్ చెయ్యాలని, లేకపోతే కష్టమని డాక్టర్లు చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి రూ. 55 వేలు చెల్లించి వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని భయపెట్టి డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక తెలంగాణలో ప్రసవాల తీరు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రతి వంద మందిలో 58 మందికి కోతల ద్వారానే ప్రసవం జరుగుతోంది. దీనివల్ల బిడ్డకంటే తల్లి ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి ప్రసవాలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. దేశంలో రెండో స్థానంలో ఉన్న ఏపీలో 40.1 శాతం సిజేరియన్ ప్రసవాలే అవుతున్నాయి. ఈ సిజేరియన్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్‌ల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిజేరియన్ ప్రసవాల ద్వారా ఏటా రూ. 4 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. రెండు రాష్ట్రాల్లో ఏటా ఆరున్నర లక్షల ప్రసవాలు జరుగుతుండగా, సగటున ఒక్కో ప్రసవానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు అయితే రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలు కూడా బిల్లులు వేస్తున్నాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ ప్రసవానికి కూడా లక్ష రూపాయలు వసూలు చేస్తుండటం గమనార్హం.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలు ఎక్కడ?
ప్రైవేటు ఆస్పత్రులు లేదా నర్సింగ్‌హోంలు వంటి వాటి పర్యవేక్షణకు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్– 2010 అమలు చేయాలి. జిల్లా వైద్యాధికారులదే అమలు బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లా వైద్యాధికారి కూడా ఆస్పత్రులకు వెళ్లి సోదాలు నిర్వహించిన దాఖలాలు లేవు. వేలల్లో నర్సింగ్ హోంలు ఉన్నా, ప్రసవాలు అడ్డదిడ్డంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 10 శాతానికి మించి సిజేరియన్‌లు జరగకూడదు. అది కూడా అత్యవసర పరిస్థితి అయినపుడే సిజేరియన్ చెయ్యాలి. ఇష్టారాజ్యంగా సిజేరియన్‌లు చేస్తే మాతా శిశుమరణాలను నియంత్రించడం కష్టమని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మందికీ 40 శిశు మరణాలు సంభవిస్తుండగా, తెలంగాణలో 37 శిశు మరణాలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లక్షకూ 140 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది.
సాధారణ ప్రసవం వల్ల...
- సాధారణ ప్రసవం వల్ల తల్లికి త్వరగా పాలు పడతాయి
- ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. దీనివల్ల తల్లి క్షేమంగా ఉంటుంది
- బిడ్డకు ఇమ్యూనిటీ (వ్యాధినిరోధకత) ఎక్కువగా ఉంటుంది
- సాధారణ ప్రసవంలో రక్తస్రావం తక్కువ.. దీనివల్ల తల్లి త్వరగా కోలుకుంటుంది
- ప్రసవానంతరం ఎక్కువగా మందులు వాడవలసిన అవసరం ఉండదు
సిజేరియన్ ప్రసవం వల్ల..
- సిజేరియన్ వల్ల తల్లికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది
- రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది
- బిడ్డకు స్తన్యమివ్వడానికి అప్పటికప్పుడు పాలు పడవు
- సిజేరియన్ కాన్పు వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితీ ఉంటుంది
- తల్లికీ, బిడ్డకూ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది
- తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండోదీ సిజేరియన్ చేయాలి
- రెండు ఆపరేషన్ల వల్ల తల్లికి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి
- సిజేరియన్ వల్ల ప్లాస్ (మాయ) ఉండాల్సిన చోట ఉండకపోవడం వల్ల తల్లి ప్రాణానికి ఎక్కువ ప్రమాదం కలుగుతోంది
గర్భిణి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి
గర్భిణికి రక్తపోటు, మధుమేహం వంటి ఇబ్బందులు లేనపుడు సాధారణ ప్రసవం మంచిది. అలాంటి ఇబ్బందులు ఉన్నపుడు సిజేరియన్ ప్రసవం తప్పదు. సాధారణ ప్రసవమా, సిజేరియన్ ప్రసవమా అన్నది పూర్తిగా గర్భిణి ఆరోగ్యం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అంతేగానీ గర్భిణి రాగానే సిజేరియన్ చేయడం మంచిది కాదు.
– డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప
సాధారణ ప్రసవమే సురక్షితం
తల్లికీ బిడ్డకూ సాధారణ ప్రసవం అన్ని విధాలా సురక్షితం. కానీ చాలా చోట్ల డాక్టర్లు డబ్బు కోసం, వేచియుండే ఓపిక లేకపోవడం వల్ల సిజేరియన్ చేస్తున్నారు. ఎక్కువ మాతా మరణాలు సిజేరియన్ వల్లే జరుగుతున్నాయి. తొలికాన్పులో సిజేరియన్ సరిగా చెయ్యకపోవడం వల్ల రెండో కాన్పులో ఇబ్బంది పడుతున్నవారున్నారు. ఏది ఏమైనా సిజేరియన్‌ల పోకడ ప్రమాదకరంగా మారింది.
– డా.కె.రాజ్యలక్ష్మి, ప్రొఫెసర్, ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment