‘ప్రాథమిక’మే ప్రథమం! | First aid in Primary health centers | Sakshi
Sakshi News home page

‘ప్రాథమిక’మే ప్రథమం!

Published Sat, Sep 12 2015 3:01 AM | Last Updated on Mon, Jul 29 2019 7:41 PM

‘ప్రాథమిక’మే ప్రథమం! - Sakshi

‘ప్రాథమిక’మే ప్రథమం!

ఇదీ ఏడు చేపల కథే. కాకపోతే ఇవన్నీ రాజకుమారులు వేటాడేసి.. ఎండలో పెట్టిన చిన్న చేపలు కావు. దేన్నయినా అమాంతం మింగేసే షార్క్‌లు! ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి మొదలుపెడితే... ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మా కంపెనీలు, నియంత్రణ వ్యవస్థలు, బీమా కంపెనీలూ అన్నీ షార్క్‌లే. తినటానికి అలవాటుపడ్డవే. ఎండకపోవటానికి చిన్నచేపలు సాకులు చెబితే.. ఇవి మాత్రం మా నోటి దగ్గరకు వస్తే తినకుండా వదిలిపెడతామా? అని ఎదురు ప్రశ్నిస్తాయి.

మరి వీటి రోగం కుదిరేదెలా? వాణిజ్య కేంద్రాలుగా మారిపోయిన వైద్యాలయాల్ని మార్చటమెలా? ఈ వైద్య విధ్వంసాన్ని ఆపటమెలా? ఐదు రోజులుగా ఈ విషయమై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలకు వచ్చిన స్పందన అనూహ్యం. పలువురు తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల ధనదాహాన్ని కళ్లకు కట్టారు. కొందరు సూచనలూ చేశారు. స్థలాభావం వల్ల అన్నిటినీ ప్రచురించటం అసాధ్యం. అందుకే అత్యధికుల సూచనల ఉమ్మడి సారాంశం ప్రచురిస్తున్నాం.
- సాక్షి ప్రత్యేక బృందం

 
* ‘వైద్య విధ్వంసం’కు ఇదే ప్రథమ చికిత్స
* ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన
* అన్ని వర్గాల నుంచి సూచనల వెల్లువ
 
పీహెచ్‌సీలే  కీలకం
ఈ విధ్వంసానికి ప్రథమ చికిత్స చేయాలంటే తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని పటిష్టం చేయాలన్నది నిష్ఠుర సత్యం. దగ్గర్లో చక్కని వసతులు, వైద్యుడు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారమైపోతాయి. కానీ ఇపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని చూస్తే... ఎక్కడా కనీస మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. వైద్యుడు అందుబాటులో ఉండటమూ కష్టమే.

ఇక పరికరాల ఊసెత్తకపోతేనే మంచిది. అందుకే ఏ చిన్న జ్వరం, దగ్గు, జలుబుకైనా పెద్దాసుపత్రికో, డబ్బులుంటే ప్రైవేటు ఆసుపత్రికో పరుగెత్తాల్సిన దుస్థితి. దీనికితోడు ఇటీవల బాగా పెరిగినజాఢ్యం ఏమిటంటే నేరుగా స్పెషలిస్టుల్ని సంప్రతించటం. చిన్నచిన్న నొప్పులొచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా మొద ట సంప్రతించాల్సింది జనరల్ ఫిజీషియన్‌నే. కొన్ని జ్వరాలు, చిన్నచిన్న నలతలు వచ్చి నిర్ణీత కాలంలో తగ్గిపోతాయి. ఇది గ్రహించేది ఫిజీషియన్ మాత్రమే. అప్పటికీ తగ్గకుంటే సదరు ఫిజీషియనే ఏ స్పెషలిస్ట్‌ను సంప్రతించాలో రిఫర్ చేస్తాడు. కానీ చెయ్యి నొప్పి వస్తోందంటే నేరుగా ఆర్థోపెడిక్‌నో, న్యూరాలజిస్ట్‌నో, ఛాతీలో కాస్తా నొప్పిగా అనిపిస్తే నేరుగా కార్డియాక్ విభాగానికి వెళ్లడం చేస్తున్నారు.

కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌ను సంప్రతించినప్పుడు... తనకు పెట్టిన టార్గెట్ మేరకు ఆ ఫిజీషియన్ వారిని అవసరం లేకపోయినా స్పెషలిస్ట్‌ల దగ్గరకు పంపిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కాకపోతే ఇలా జరిగేది తక్కువసార్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పటిష్టంగా ఉంటే... అక్కడి ఫిజీషియన్ల చేతుల్లోనే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నది చాలామంది వ్యక్తంచేసిన అభిప్రాయం.
 
అందరికీ బీమా ధీమా ఉండాలి...
ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద... ప్రభుత్వ హెల్త్ కార్డుల కింద బీమా పొందినవారు... ప్రైవేటు బీమా కంపెనీల నుంచి నేరుగా బీమా తీసుకున్నవారు... తాము ఉద్యోగం చేసే ఆఫీసుల ద్వారా బీమా పొందినవారు.. ఇలా అందరినీ కలిపినా ఇంకా చాలామంది బీమా లేనివారు ఉంటున్నారు. ఇలా కాకుండా ప్రభుత్వమే నామమాత్రపు ప్రీమియంతో ప్రజలందరికీ సామాజిక బీమాను తప్పనిసరి చేయాలన్నది మరో సూచన.

డబ్బున్నవారు, లేనివారు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఈ బీమా పరిధిలో ఉండేలా ప్రభుత్వమే చొరవచూపాలి. అప్పుడు ప్రతి ఒక్కరికీ తనకేం జరిగినా బీమా ఉందనే భరోసా ఉంటుంది. ప్రభుత్వం తరఫున చికిత్స అందుతుందనే నమ్మకం ఉంటుంది. ఈ బీమా సరిపోదనుకునే వారు, కాస్త స్థితిమంతులు వేరే బీమా చేయించుకోవచ్చు. అలా చేస్తే ఈ సామాజిక బీమాలో క్లెయిముల సంఖ్య తక్కువే ఉంటుంది. ఫలితంగా బీమా కంపెనీలు తిరస్కరించటం, ఆసుపత్రులు కూడా అనుచిత విధానాలకు పాల్పడటం వంటివి కూడా తక్కువే ఉంటాయి.
 
డాక్టర్లు అందరిలాంటి వారేనా?
డాక్టర్లూ అందరిలాంటి వారేనని, ఇక్కడ కూడా మిగతా రంగాల మాదిరిగా కొందరు తప్పులు చేయొచ్చని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని కొందరు వైద్యులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో సామాన్యులు ఏకీభవించలేదు. ‘‘ఒక ఐటీ ఉద్యోగితో డాక్టర్లను పోల్చలేం. ఎందుకంటే ఐటీ ఉద్యోగి పడే కష్టం ఎక్కడో జీడీపీలో కనిపిస్తుంది. కానీ డాక్టరు కష్టం రోగుల మొహాల్లో కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన శరీరాన్ని కోయటానికి ఎవరికైనా అనుమతిస్తాడంటే... అది డాక్టరుకే. అలాంటి డాక్టరు తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి’’ అనేది మెజారిటీ మాట!
 
వైద్యుడి హిస్టరీ కనిపించదేం?

మనం డాక్టర్ల దగ్గరకు వెళ్లేటపుడు వారినో, వీరినో అడిగో లేదా వారికున్న మంచిపేరు చూసో వెళ్తుంటాం. కానీ వాస్తవంగా ఆ డాక్టరు అప్పటిదాకా చేసిన ఆపరేషన్లెన్ని? అందులో విజయవంతమైనవెన్ని? పేషెంట్లు సదరు డాక్టరు విషయంలో ఏం చెప్పారు? ఇలాంటి హిస్టరీ ఎక్కడా కనిపించదు. ఏ ఆసుపత్రీ చెప్పదు కూడా. రూ.100 పెట్టి సినిమా చూసినప్పుడో, ఓ రెస్టారెంట్లో భోజనం చేసేటప్పుడో అది బాగుందో లేదో తెలుసుకునే అవకాశం ఉన్నపుడు...

తన ప్రాణాన్ని అప్పగించే రోగికి తనకు వైద్యం చేసే వైద్యుడి వృత్తిగత చరిత్ర తెలియజేస్తే తప్పా? ఇందుకు రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం, దాన్ని నిజాయితీగా ప్రదర్శించటం వంటివి ఆసుపత్రులు చేసి తీరాలన్నది పలువురి లేఖల్లో వ్యక్తమైంది. ఇక ఎన్నికల ముందు అన్ని అంశాలనూ చర్చించే రాజకీయ పార్టీలు... వైద్యంపై తమ విధానాన్ని ప్రకటించాలన్నది మరికొందరి భావన.
 
వాణిజ్య శక్తులపై గట్టి నియంత్రణ!
మొత్తంగా వైద్యంపై పటిష్ఠమైన నియంత్రణ ఉండాలని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నియంత్రణ వ్యవస్థలది ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే.. ఎలుకల కోసం నిఘా వేసే స్థాయి. రాష్ర్టంలో ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు, నిర్వహణ కోసం 2007లో ఏపీ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ను తెచ్చినా... ఇది కేవలం ఆస్పత్రుల ఏర్పాటు, లెసైన్సులు, రెన్యువల్ వంటి అంశాలకే పరిమితమవుతోంది.

బాధిత రోగులకు అన్యాయం జరిగినప్పుడు ఆయా ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకోవాలన్నది ఏ చట్టంలోనూ లేదు. అలోపతిక్ ఆస్పత్రులను మాత్రమే కవర్ చేసే ఈ చట్టం పరిధిలో... ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలున్నా వీటికెలాంటి అధికారాలూ లేవు. ఇక ఆసుపత్రులపై ఫిర్యాదుల్ని చూసేది జిల్లా వైద్యాధికారి. అప్పిలేట్ అథారిటీ అధికారిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటున్నారు.

ప్రతి ఆసుపత్రీ... ఏ చికిత్సకు ఎంత రేటు వసూలు చేస్తున్నారో తెలుగు, ఇంగ్లిషు భాషల్లో నోటీసు బోర్డులో విధిగా చూపించాలన్నది ఈ చట్టం పెట్టిన నియమం. కానీ దీన్ని పాటిస్తున్న ఆసుపత్రులు ఒక్కటీ ఉండదు. ఒకవేళ దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా... దిగ్గజాల్లాంటి కార్పొరేట్ ఆస్పత్రులపై ఆయన చర్యలు తీసుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!
 
పరిహారం ఉండాలి.. నిషేధించాలి..
‘కాసు’పత్రుల నియంత్రణకు జిల్లా స్థాయిల్లో బలమైన నియంత్రణ వ్యవస్థలుండాలని, ఒకవేళ వాటివల్ల జరిగిన పొరపాటు రుజువైతే సదరు ఆసుపత్రి భారీ పరిహారాలు చెల్లించటంతో పాటు మళ్లీ సేవ లందించకుండా నిషేధించాలనేది కొందరి సూచన. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన సంఘటన చూస్తే... వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. అది వైద్యుడి నిర్లక్ష్యమేనని తేల్చిన రాష్ట్ర వైద్య మండలి... తనను మందలించి వదిలిపెట్టింది. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పీ లు చేస్తే... అది ఆ డాక్టరును కొన్నాళ్లు వైద్యం చేయకుండా నిషేధించింది. ఇలా మందలించి వదిలిపెట్టే స్థాయిలో శిక్షలుంటే ఏ డాక్టరు భయపడతాడన్నది సమాధానం లేని ప్రశ్నే.
 
ఈ పోరు కొనసాగిద్దాం..
‘వైద్య విధ్వంసం’పై ఈ-మెయిల్స్, లేఖల రూపంలో అసంఖ్యాకంగా స్పందించిన పాఠకులందరికీ ధన్యవాదాలు. స్థలాభావం వల్ల కొన్నిటినే ఇక్కడ ప్రచురించినా... మిగిలిన వాటిని కూడా సందర్భానుసారం ప్రచురించే ప్రయత్నం చేస్తాం. మా దృష్టికి వచ్చిన సమస్యలు, పరిష్కారాల సూచనలతో తగు వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అందజేస్తాం. వైద్యానికి సంబంధించి ఏ సంఘటననైనా, ఏ అభిప్రాయాన్నయినా sakshihealth15@gmail.com ద్వారా మీరు ఎప్పుడైనా మా దృష్టికి తేవొచ్చు. వాటిని తగు వేదికపై ప్రస్తావిస్తాం.
- ఎడిటర్
 
నిర్లక్ష్యమే ప్రధాన కారణం
ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయటం ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు, రోగికి కావాల్సిన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా వారికి సమీపంలోనే క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులలో జరిపే ప్రతి టెస్ట్‌కూ ప్రభుత్వమే ఫీజు నిర్ణయించాలి.       
- బి.శివప్రసాదం, పరకాల(వరంగల్)
 
హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి
హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. ఉచితంగా కాకున్నా ప్రజలు- ప్రభుత్వం కలిసి 50-50 భాగస్వామ్యంతో దీన్ని కొనసాగించాలి. అప్పుడు సామాన్యులకు వైద్యమనేది భారం కాకుండా ఉంటుంది.       
- రమేష్, ఖమ్మం
 
ప్రజారోగ్య సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి
‘వైద్య విధ్వంసం’పై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాలు అక్షర సత్యాలు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలోని వైద్యం గురించి చెప్పుకోవడం.. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్న చందంగా ఉంటుంది. అది బాధాకరమైనా సత్యం! కార్పొరేట్ ఆసుపత్రుల్లో సమర్థులైన వైద్యులతో అధునాతన చికిత్స అందుతుందని భావిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం.. ప్రతి ఒక్కరినీ అలాంటి చికిత్సకు అర్హుడిగా చేయడానికి వేసిన ఒక అడుగు. అయితే ఆ పథకాన్ని దుర్వినియోగం చేసి కొన్ని ఆసుపత్రులు తమ లాభార్జనకు వాడుకున్నాయనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు.

ఈ పథకాన్ని లోపాలు లేకుండా అమలు చేయాలి. ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పౌరసమాజ కమిటీలను నియమించాలి. నైతిక వర్తనతో ఉండే రిటైరైన ఉద్యోగులు, విశ్రాంత విద్యావంతులను, చదువుకున్న గృహిణులు, కొంత సమయం వెచ్చించగలిగే యువతీయువకులను అందులో భాగం చేయాలి. వీళ్లతో ‘ప్రజారోగ్య సంరక్షణ కమిటీ’లు ఏర్పాటు చేసి, వాటికి కొంత సాధికారిత కల్పిస్తే ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలవుతుంది.
 - డాక్టర్ ఏపీ విఠల్, ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట, నల్లగొండ జిల్లా
 
అత్యవసర చికిత్స చేసే వైద్యులు ఎక్కడ?
కోట్లు పెట్టి ఆసుపత్రులు పెట్టేవారు.. అత్యవసర సమయాల్లో చేసే చికిత్సలను పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆగిపోయినప్పుడు.. రోగి ఊపిరితిత్తుల్లోనికి రెండు నిమిషాల్లోనే గొట్టం (ఎండోట్రాకియల్ ట్యూబ్) వేయగలిగే డాక్టర్ చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. డ్యూటీ నర్సుకు గానీ, డ్యూటీ డాక్టరుకు గానీ, స్పెషలిస్టు డాక్టర్లకుగానీ ఈ చికిత్స విధానాన్ని నేర్పరెందుకు? అన్ని ఆసుపత్రులు ఈ ట్యూబ్‌ను అమర్చగల నిపుణులనూ, ట్యూబ్‌నూ అందుబాటులో ఉంచుకోవాలి.

ఏ వైద్య విధానానికి సంబంధించిన కోర్సు అయినా.. అది పూర్తయ్యేనాటికి ‘బేసిక్ లైఫ్ సపోర్టు’ (బీఎల్‌ఎస్), అడ్వాన్స్‌డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు (ఏసీఎల్‌ఎస్) అంశాలపై తర్ఫీదు ఇవ్వాలి. రోగులు సైతం.. అత్యవసర చికిత్స అందించగల నిపుణులు అందుబాటులో ఉన్నారా లేదా అని ఆసుపత్రుల యాజమాన్యాలను అడగాలి.
- డాక్టర్ బ్రహ్మారెడ్డి, సూపరింటెండెంట్, ప్రజావైద్యశాల, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు, కర్నూలు
 
అవి నిరూపితమయ్యే తప్పులు కావు
అనవసరంగా పరీక్షలు రాయడం, రోగిని పిండుకోవడం వంటివి చెప్పుకోవడానికేగానీ వాటిని నిరూపించలేరు. ఆ టెస్టు ఎందుకు చేశారని అడిగితే... ‘ఆ పరీక్ష ద్వారా నే జబ్బు కనుక్కోవచ్చని అనుకున్నా’ అని వైద్యుడు అంటా డు. ఇది తప్పు అని చెప్పలేం. అయినా ప్రొసీజర్ ప్రొటోకాల్, స్టాండర్డ్ ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్ వంటివి అమలు చేయకపోవడంతో ప్రశ్నించలేక పోతున్నాం. రోగి అవగాహన పెంచుకుని డాక్టరును ఎంపిక చేసుకోవాలి. అయినా హోటళ్లకు, హాస్పిటల్‌లకూ పెద్దగా తేడా ఉందని నేననుకోవడం లేదు.
 - డా.కె.వెంకటేష్, అదనపు వైద్య విద్యా సంచాలకులు, ఎంసీఐ మాజీ సభ్యుడు
 
టార్గెట్లు ఉంటే నమ్మకమైన వైద్యం దొరకదు
ప్రైవేటు ఆస్పత్రుల్లో స్టెంట్లు, ఇంప్లాంట్స్ వంటివాటితో రోగిని పీల్చేస్తున్నారు. ఇక్కడే రోగులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు వీటిపై తక్షణమే వ్యయ నియంత్రణ (కాస్ట్ రెగ్యులేటరీ) చేయాలి. కార్పొరేట్ ఆస్పత్రులు విధించే బిజినెస్ టార్గెట్లతో రోగికి-వైద్యుడికి మధ్య నమ్మకమైన వైద్యం సాగడం సాధ్యం కాని పని.
 - డా.కె.రమేశ్‌రెడ్డి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎంసీఐ ఎథిక్స్ కమిటీ మాజీ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement