రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ పీహెచ్‌సీ వైద్యుల సంఘం
శాంతియుతంగా నిరసనకూ అనుమతులివ్వకుండా వేధింపులు
సోమవారం మరోసారి ఛలో విజయవాడ కార్యక్రమం
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం వైద్యులను రోడ్ల మీదకు లాగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు మండిపడ్డారు. వంద రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేశామని ప్రకటనలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం కోవిడ్‌లో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యులను అవమానాలకు గురిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున వైద్యులను నియమించి, పీహెచ్‌సీలను బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వం వైద్యులపై వేధింపులకు దిగుతోందన్నారు.
వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో 85కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు వైద్యులు శుక్రవారం శాంతియుత నిరసనలు చేపట్టారు. విజయవాడలో నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వైద్యులందరు తమ జిల్లాలకు గురువారం వెళ్లిపోయినట్లు పీహెచ్‌సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యూనస్‌మీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చే సోమవారం ఛలో విజయవాడ 2.0 కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు చర్చలు నిర్వహించిన్పటికీ తమ డిమాండ్‌లు నెరవేరలేదని, మళ్లీ చర్చలకు పిలిచి, డిమాండ్లను నెరవేర్చే వరకూ విజయవాడలో నిరసన తెలుపుతామన్నారు. శుక్రవారం ఉదయం నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులపై కేసులు పెడతామని డీఎంహెచ్‌వోలు బెదిరించారని చెప్పారు.
అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా శనివారం కూడా డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ కలిసి వేధింపులకు పాల్పడిన డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పారు.
సమస్యలు పరిష్కరించే వరకు నిరసన
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారంఅయ్యే వరకు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment