Family Welfare Department
-
కరోనా టీకా వల్ల మరణిస్తే పరిహారం ఇవ్వలేం: కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్నాక దుష్ప్రభావాల వల్ల మరణిస్తే బాధ్యత వహించబోమని కేంద్రం పేర్కొంది. బాధిత కుటుంబానికి పరిహారమివ్వలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల మరణించినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువతుల తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ప్రజలకు అందజేస్తున్న కరోనా టీకాలను థర్డ్ పార్టీలు (ప్రైవేట్ కంపెనీలు) తయారు చేస్తున్నాయని, అన్ని రకాల పరీక్ష తర్వాత నియంత్రణ సంస్థల ఆమోదంతోనే అవి మార్కెట్లోకి వస్తున్నాయని అఫిడవిట్లో పేర్కొంది. కరోనా టీకాలు సురక్షితమేనని, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు గుర్తించాయని వెల్లడించింది. -
93.94 % చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌లో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు కోవిడ్ ఉన్నా చిన్నారులకు ఇచ్చే టీకాల విషయంలో వైద్యారోగ్య శాఖ రాజీ పడకుండా ప్రతి చిన్నారికీ టీకా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు 93.94 శాతం టీకా వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 108.90 శాతం వేశారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 76.20 శాతం నమోదైంది. పెంటావాలెంట్(ఐదు రకాల వ్యాధులకు ఒకే వ్యాక్సిన్) మూడో డోస్‌ను 92.76 శాతం మందికి ఇచ్చారు. ఓరల్ పోలియో(పోలియో చుక్కల మందు)ను మూడో డోస్‌లో 93.15% మందికి ఇచ్చినట్టు గణాంకాలు వెల్లడించాయి. మూడో డోసు పోలియో చుక్కల మందు 3.42 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా.. 3.18 లక్షల మందికి ఇచ్చారు. పుట్టగానే వేసే బీసీజీ వ్యాక్సిన్ సెప్టెంబర్ చివరి నాటికి 85.55% మందికి, పోలియో చుక్కల జీరో డోసు 80.30% మందికి, హెపటైటిస్బి జీరో డోస్ వ్యాక్సిన్ 75.17 శాతం మందికి వేశారు. హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడంలో 2.56% వృద్ధి కనిపించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్య ఉప కేంద్రం మొదలుకుని బోధనాస్పత్రి వరకు అన్ని ఆస్పత్రుల్లోనూ వ్యాధి నిరోధక టీకాలున్నాయని, ప్రతి ఒక్క తల్లీ తమ బిడ్డకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. -
తప్పనిసరి జాబితాలోకి కొత్తగా 39 రకాల ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: తప్పనిసరి జాబితాలో కొత్తగా 39 రకాల ఔషధాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చేర్చారు. ప్రజారోగ్యంలో నిత్యం వినియోగించే ఔషధాలనే తప్పనిసరి జాబితాలో చేరుస్తుంటారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నేషనల్ లిస్టింగ్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్– 2021ను విడుదల చేసింది. దీంతో ఈ మందులను అనేక కంపెనీలు తయారు చేయడానికి, వాటి ధరలు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమమైంది. ఈ జాబితాలో ఎక్కువగా క్యాన్సర్, షుగర్ నియంత్రణ, యాంటీబయాటిక్స్ వంటి మందులున్నాయి. అయితే ఇప్పటికే జాబితాలో ఉన్న 16 రకాల ఔషధాలను తీసేశారు. మార్పులు, చేర్పుల తర్వాత తప్పనిసరి జాబితాలో ప్రస్తుతం 874 మందులున్నాయని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్య పరిరక్షణకు తప్పనిసరైతేనే... దేశంలో 1996లో తొలిసారి తప్పనిసరి మందులజాబితాను తయారు చేయగా, 2015లో విధివిధానాలను రూపొందించారు. ఈ జాబితాలో చేర్చాల్సిన మందుకు లైసెన్స్ ఉండాలి. సంబంధిత జబ్బు ప్రజారోగ్య సమస్యగా ఉండాలి. ఇప్పటికే అందులో ఉన్న మందు నిషేధానికి గురైనా, రియాక్షన్లు వచ్చినా ఆ జాబితా నుంచి తీసేస్తారు. ప్రస్తుతం జాబితాలో చేర్చిన మందుల్లో ప్రధానంగా క్యాన్సర్, టీబీ, ఆస్తమాకు సంబంధించిన కొన్ని రకాల స్టెరాయిడ్స్, పొగ సంబంధిత ఉత్పత్తుల వాడకాన్ని మాన్పించేవి, విషవిరుగుడు మందులు, లేబొరేటరీలో తయారు చేసిన ఇన్సులిన్ మందు, యాంటీవైరల్స్, యాంటీ పారసైట్స్, గర్భధారణ నియంత్రణ మందులు, రోటావైరస్ వ్యాక్సిన్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.50 వేల వరకు ధర కలిగిన గుండెపోటు మందులు.. ప్రధానంగా గుండె రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పలుచపరిచే మందు, హెచ్ఐవీ, హెపటైటిస్–బి, యాంటీ ఫంగల్ సంబంధించిన మందులను తప్పనిసరి జాబితాలో చేర్చారు. ఈ జాబితా నుంచి తీసేసినవాటిల్లో బీపీ మందు ఎటినలాల్, బ్లీచింగ్ పౌడర్, యాంటీబయోటిక్‌కు చెందిన ఎరిత్రోమైసిన్, గర్భధారణను నియంత్రించే కొన్ని రకాల మందులున్నాయి. జాబితాలో చేర్చిన మందును ఐదేళ్లపాటు కొనసాగించాలి. చిన్న, చిన్న విషయాలకు తొలగించకూడదు. దీంతో కంపెనీలు ఆ ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తాయి. భారాన్ని తగ్గించేందుకే ప్రజారోగ్య పరిరక్షణకు వినియోగించే మందుల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరి మందుల జాబితాలో చేరుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం... దేశంలో మందులపై పెట్టే ఖర్చులో 90 శాతం మేర ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఆ భారాన్ని తగ్గించేదిశగా మనదేశం 2015 నుండి మందుల జాబితాను క్రమబద్ధీకరిస్తోంది. ఈ ఏడాది అలాంటివాటిలో ఇన్సులిన్, క్యాన్సర్, హెచ్ఐవీ మందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మందులు ధరలు నియంత్రణ జాబితాలోకి వస్తే ప్రజలపై భారం కొంత తగ్గుతుంది. –డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
‘ఈ–సంజీవని’లో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలీ మెడిసిన్ సేవ ఈ–సంజీవనిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉన్నట్లు కేంద్ర కుటుంబ,ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ–సంజీవని సేవలకు సంబంధించి 1.2 కోట్ల సంప్రదింపులు పూర్తి కాగా ఆంధ్రప్రదేశ్..ఈ సంజీవని ఆయుష్మాన్ భారత్– హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ (ఏబీ–హెచ్డబ్ల్యూసీ), ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) సేవలు కలిపి 37,04,258 సంప్రదింపులతో తొలిస్థానంలో నిలిచిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ప్రారంభించిన తరువాత దీన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 2 వేల హబ్‌లు, 28 వేల స్పోక్‌లను ఏర్పాటు చేసింది. ఏపీ తరువాత ఈ–సంజీవని అందించిన రాష్ట్రాల్లో కర్ణాటక (22,57,994), తమిళనాడు (15,62,156), ఉత్తరప్రదేశ్ (13,28,889), గుజరాత్ (4,60,326), మధ్యప్రదేశ్ (4,28,544), బిహార్ (4,04,345), మహారాష్ట్ర (3,78,912), పశ్చిమ బెంగాల్ (2,74,344), కేరళ (2,60,654) ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. -
ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిధిలో ఖాళీగా ఉన్న 44 వైద్యుల పోస్టులకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గురువారం పేర్కొన్నారు. ఎంబీబీఎస్ విద్యార్హత, ఈ ఏడాది జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను cfw.ap.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు గొల్లపూడిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇవీ చదవండి: ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల రుణం పవర్ ‘ఫుల్ ఆదా’ -
వ్యాక్సినేషన్లో 44 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తొలి ప్రాధాన్యతగా వీరికి మొదటి డోసు, రెండో డోసు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల మధ్య వయస్కులు 1.93 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో సెప్టెంబర్ 7 వరకు 77,04,990 మందికి మొదటి డోసు వేశారు. మరో 8,94,624 మందికి రెండో డోసు కూడా పూర్తయింది. ఇంకా తొలి డోసు వేసుకోని వారిపై దృష్టి సారించి.. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు రెండో డోసు కోసం ఏ వయసు వారు వచ్చినా విధిగా వారికి కూడా వేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లోని కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. రద్దీ లేకుండా, జనం గుంపులు గుంపులుగా చేరకుండా క్రమపద్ధతిలో వ్యాక్సిన్ వేయాలని తెలిపింది. ఇప్పటివరకు హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 45 ఏళ్లు దాటినవారు, టీచర్లు వంటి వాళ్లందరికీ దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తయింది. దీంతో 18 ఏళ్ల పైన.. 44 ఏళ్లలోపు వారికి కూడా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు మొదటి డోసు వేసుకోని 18 ఏళ్లు దాటినవారు గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. -
డెంగీపై ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: డెంగీ జ్వరాల సీజన్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో డెంగీ కేసుల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు పడుతుండటం తో కొన్ని పట్టణ ప్రాంతాల్లో డెంగీ కేసులు పెరిగాయి. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. డెంగీ నిర్ధారణ చేసే ఎలీశా కిట్లు ప్రతి ఆస్పత్రిలోనూ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా డెంగీ నిర్ధారణ చేసే ఆస్పత్రుల సంఖ్య పెంచారు. గతంలో జిల్లా, బోధనాసుపత్రుల్లో మాత్రమే ఉండేవి. నిర్ధారించిన సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంత వాసులు వెళ్లాల్సి వచ్చేది. 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రులతో పాటు తాజాగా 48 ఏరియా ఆస్పత్రులనూ సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రుల జాబితాలో చేర్చారు. దీంతో ప్రతి ప్రాంతంలోనూ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. కనీసం నెల రోజులకు అవసరమైన కిట్లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో బ్యానర్లు డెంగీ నిర్ధారణకు గుర్తించిన ఆస్పత్రుల్లో ఆస్ప త్రి ముందు బ్యానర్లు కట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో డెంగీ లక్షణాలున్న వారిని గుర్తించి వారికి ఎలీశా టెస్టులు నిర్వహిస్తారు. సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులకు ఆయా జిల్లా మలేరియా అధికారులే బాధ్యత వహించాలి. సేకరించిన నమూనాల వివరాలు రోజూ కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర కార్యాలయానికి పంపాలి. డెంగీ అను మానిత కేసులు ఎక్కడ ఉన్నా వారికి పరీక్షలు నిర్వహించి, ఆయా ప్రాంతాల్లో మందులు పిచికారీ చేయాలి. జనరల్ మెడిసిన్ వైద్యులు, పీడియాట్రిక్స్ వైద్యులు, మైక్రోబయాలజిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నోడల్ అధికారుల మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీలు ఇవ్వాలి. వీళ్లందరూ అందుబాటులో ఉండాలని కుటుంబ సంక్షేమశాఖ ఆదేశించింది. -
ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికీ టీకాలు
సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ 44 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక 18 – 44 ఏళ్ల వయసు వారికి కూడా టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. నేటి(సోమవారం) నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన సచివాలయాల ద్వారా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రతీ జిల్లాలో అయిదు సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ అందించనున్నారు. కాగా ఇప్పటివరకూ హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, గర్భిణులు, టీచర్లు, 44 ఏళ్ల వయసు దాటిన వారికి మొదటి డోసు వ్యాక్సినేషన్ 96 శాతం పూర్తయింది. చాలామందికి రెండో డోసు కొనసాగుతోంది. 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు ఇవ్వడం ద్వారా థర్డ్‌వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. రద్దీని నివారించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్లు ఇస్తారు. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు అర్హులను గుర్తించి ఆయా కేంద్రాలకు తరలిస్తారు. ఇతర కేటగిరీలకు యథాతథంగానే.. రాష్ట్రవ్యాప్తంగా 18 – 44 ఏళ్ల వయసు వారు సుమారు 1.9 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ఒకవైపు వీరికి టీకాలు ఇస్తూనే మరోవైపు ఇతర కేటగిరీలకు రెండో డోసు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో దాదాపు 2.64 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. వీరిలో అత్యధికంగా 45 – 60 ఏళ్ల వయసు వారున్నారు. రాష్ట్రంలో పురుషులకంటే ఎక్కువగా మహిళలకే టీకాలు ఇచ్చారు. లభ్యతను బట్టి రోజూ టీకాలు.. ‘రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. టీకాల లభ్యతను బట్టి ఇది ప్రతిరోజూ కొనసాగుతుంది. ఎక్కడా రద్దీ లేకుండా సాఫీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకున్నాం. వ్యాక్సిన్లు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరాయి. దీంతో పాటే ఇతరులకు రెండో డోసు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌పై సచివాలయాల వారీగా ముందే సమాచారం ఇస్తారు. దీన్ని బట్టి అర్హులంతా టీకాలు తీసుకోవాలి’ – కాటమనేని భాస్కర్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ -
వ్యాక్సిన్.. రికార్డు: అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా బుధవారం 31.39 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఏపీకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఒక్క రోజులో ఏపీలో వేసినంత వేగంగా వ్యాక్సిన్ వేయలేకపోయాయి. ఇతర ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదు. 6.40 లక్షల డోసుల్లో 4.40 లక్షల డోసులు కోవిషీల్డ్, 2 లక్షల డోసులు కోవాగ్జిన్ ఉన్నాయి. 45 ఏళ్లు దాటిన వారి నుంచి ఆపైన వయసున్న వారికి వ్యాక్సిన్ వేశారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో జరిగిన వ్యాక్సినేషన్లో ఏపీదే రికార్డు అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని బలోపేతం చేసుకోవడం వల్లే ఈ స్థాయిలో వ్యాక్సిన్ వేయడం సాధ్యమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పీహెచ్సీ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో టీకా ప్రక్రియ కొనసాగించారు. మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 255 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో వ్యాక్సిన్ వేశారు. ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన 6.40 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఒకే రోజు జిల్లాలకు.. అక్కడ నుంచి పీహెచ్‌సీలకు, అక్కడ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీకా ప్రక్రియ కొనసాగించారు. ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, సిబ్బంది సహకారంతో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేయగలిగారు. కేంద్రం నుంచి టీకా రావాల్సి ఉంది రాష్ట్రంలో ఒక్క రోజులో 6 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉండటంతో ఏపీకి కేంద్రం నుంచి భారీగా వ్యాక్సిన్ రావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు కోటి డోసులు పంపిస్తామని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ హామీ ఇచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్ కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క డోసు కూడా నిల్వ లేకుండా పూర్తిగా వేయగలిగారు. ఏపీకి కేంద్రం నుంచి ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినా కనిష్టంగా 25 లక్షల డోసులు వస్తేనే వారం రోజులుకు సరిపడా వేయగలుగుతారు. నెలకు కోటిన్నర మందికి.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం కావడం, కింది స్థాయిలో యంత్రాంగం ఉండటం వల్ల దేశంలోనే అత్యధిక సంఖ్యలో టీకా వేసే దిశగా ఏపీ దూసుకెళ్లింది. బుధవారం ఒకేరోజు 6.40 లక్షల మందికి వేయడాన్ని పరిశీలిస్తే.. నెలలో 25 రోజుల పని దినాల్లో టీకా ప్రకియ కొనసాగినా కోటిన్నర మందికి వేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి కావాల్సిందల్లా కేంద్రం నుంచి వ్యాక్సిన్ త్వరితగతిన సరఫరా కావడమేనని చెప్పారు. 45 లక్షల మందికి టీకా పూర్తి రాష్ట్రంలో బుధవారం నాటికి 45 లక్షల మందికి టీకా వేశారు. తొలుత కాస్త నెమ్మదిగా టీకా ప్రక్రియ ప్రారంభమైనా, సచివాలయాల పరిధిలోకి వ్యాక్సిన్ ప్రక్రియను తీసుకురావడంతో వేగం పెరిగింది. వలంటీర్లు ముందు రోజే అర్హులైన వారిని గుర్తించడం, వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఇంటి దగ్గరకే రావడం వంటి కారణాల వల్ల ఏపీలో ఎక్కువ మందికి టీకా వేయడం సాధ్యమైంది. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరు బాగా ఉపకరించిందని అధికార వర్గాలు తెలిపాయి. మిగతా రాష్ట్రాల్లో ఇలా లేకపోవడంతో కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్నే సకాలంలో వేయలేకపోతున్నారు. వ్యాక్సిన్ పంపించాలని కేంద్రాన్ని కోరాం ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్‌ను మొత్తం వేశాం. బుధవారం రికార్డు స్థాయిలో 6.40 లక్షల డోసులు వేశాం. వీలైనంత త్వరలో కేంద్రం వ్యాక్సిన్ పంపిస్తామని హామీ ఇచ్చింది. దీని కోసం వేచి చూస్తున్నాం. రాష్ట్రానికి ఎంత ఎక్కువ సంఖ్యలో టీకా డోసులు వస్తే అంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా టీకా ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. - కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
ఆంధ్రప్రదేశ్: అతివల్లో ‘అతి బరువు’
సాక్షి, అమరావతి: ఇంటి బరువు బాధ్యతల్ని ఓర్పుగా నెట్టుకొచ్చే మగువల సహనానికి సరిహద్దులే ఉండవు. అలుపనే మాటే ఎరుగని ఆ మహిళలు ఇప్పుడు ఇట్టే అలసిపోతున్నారు. ఇందుకు కారణం ఇంటి బరువు బాధ్యతలు కానే కాదు. జీవనశైలి సమస్యలు వారిని చుట్టేస్తున్నాయి. ఊబకాయం (ఒబెసిటీ) రూపంలో బాధిస్తున్నాయి. తెలుగు నేలపైనా ఈ సమస్య అధికమవుతోంది. మగవారితో పోలిస్తే మహిళలు ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే ఈ విషయాలను స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రతి వందమంది మహిళల్లో 36.3 మంది అధిక బరువుతో ఉన్నట్టు వెల్లడైంది. పురుషులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మన రాష్ట్రంలో అధిక బరువుతో ఉన్న పురుషుల సంఖ్య 31.1 శాతం కాగా.. 36.3 శాతం మహిళలు ఊబకాయం బారినపడ్డారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఒబెసిటీ బాధితులు త్వరగా అలసటకు గురవుతున్నారు. అనేక సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో మరీ ఎక్కువ పల్లెల్లో కంటే పట్టణాల్లో మహిళలు అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని పట్టణాల్లో 44.4 శాతం మంది మహిళలు ఒబెసిటీతో బాధపడుతుండగా.. పల్లెల్లో 32.6 శాతం మంది బాధితులు ఉన్నారు. అదే పురుషులైతే పట్టణాల్లో 37.7 శాతం మంది, పల్లెల్లో 28 శాతం మంది ఒబెసిటీ బారిన పడినట్టు వెల్లడైంది. రోజువారీ జీవనంపై ప్రత్యక్ష ప్రభావం ఒబెసిటీ సమస్య రోజువారీ జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళల విషయానికి వస్తే.. అవగాహన లేకపోవడం, వ్యాయామం చేసేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది ఊబకాయం బారిన పడుతున్నారు. 40 ఏళ్లకే చాలామంది మహిళలు కీళ్ల నొప్పులకు గురవుతున్నారు. ఒబెసిటీ కారణంగా ఎక్కువ మంది హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జీవనశైలి జబ్బులుగా చెప్పుకునే రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దగ్గరవుతున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఒబెసిటీ బాధితులు త్వరగా అలసటకు గురవుతున్నారు. వయసు పెరిగే కొద్దీ రక్తప్రసరణ వ్యవస్థలో ప్రతికూలతలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన ఇతర అనారోగ్యాలతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు, డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఒబెసిటీ కారణమవుతోంది. వ్యాయామమే సరైన మందు మితాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువును తగ్గించుకోవచ్చు. కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తగ్గించి పీచు పదార్థం (ఫైబర్) అంటే ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. –డాక్టర్ రాంబాబు, ప్రొఫెసర్, కేజీహెచ్ ఆస్పత్రి, విశాఖ -
వైద్య వసతుల్లో ఆంధ్రప్రదేశ్ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు స్వర్ణ యుగం వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు ప్రాథమిక ఆరోగ్యం విషయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఏపీ.. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిందంటే సామాన్య విషయం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేస్తున్న కృషే దీనికి కారణమని పలువురు కొనియాడుతున్నారు. తాజాగా ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా ఉందంటూ కేంద్రం కొనియాడటం గమనార్హం. ఇప్పటి వరకు కేరళ, తమిళనాడులోనే ప్రాథమిక ఆరోగ్య (పబ్లిక్ హెల్త్) రంగం బావుంటుందని పలువురు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి దృష్టిని ఏపీ ఆకర్షిస్తోంది. ఎన్‌క్వాస్‌తో నాణ్యతకు భరోసా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆస్పత్రులను నాణ్యత మదింపు ప్రక్రియలోకి తీసుకొచ్చింది. ఇలా చేయాలంటే ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ – జాతీయ నాణ్యత మదింపు సంస్థ) గుర్తింపు పొందాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు ఎన్‌క్వాస్ కిందకు తీసుకొచ్చింది. ఈ సంస్థ సంతృప్తి చెందాలంటే ఔట్ పేషెంట్ సేవలు మొదలు.. ఇన్ పేషెంట్, పారిశుధ్యం, మందులు, బెడ్లు ఇలా పలు వసతులు సంతృప్తికరంగా ఉండాలి. ఈ విషయంలో ఏపీ అద్భుతంగా నిర్వహణ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఎస్ఆర్సీ (నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసోర్స్ సెంటర్) ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెయిల్ ద్వారా లేఖ పంపించింది. పబ్లిక్ హెల్త్‌లో వసతులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రతిభ కనబరిచిందని కొనియాడింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గణనీయంగా వసతులు మెరుగు పడినట్టు ఈ లేఖలో పేర్కొంది. నాడు–నేడు కింద పనులు పూర్తయితే మరిన్ని వసతులు వస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఎన్‌క్వాస్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించాకే.. సాధారణంగా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు దశల వారీగా ఆస్పత్రులను నాణ్యతా మదింపు ప్రక్రియలోకి చేరుస్తుంటాయి. ఒక్కో దఫా 50 నుంచి 100 ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాలకు వెళతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1,135 ఆస్పత్రులను ఎన్‌క్వాస్ పరిధిలోకి తీసుకొచ్చింది. కొత్తగా కల్పించిన వసతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మదింపు సంస్థకు సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడమే కాకుండా, స్వయానా ఎన్‌క్వాస్ ప్రతినిధులు ఆస్పత్రులకు వచ్చి పర్యవేక్షించారు. 953 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 182 ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రులు.. మొత్తం 1,135 ఆస్పత్రులను పరిశీలించాకే వసతులు భేష్ అని గుర్తింపునిచ్చారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పేర్కొన్నారు. 1,400 చెక్ పాయింట్స్ ఎన్‌క్వాస్ నిబంధనల ప్రకారం మొత్తం 1,400 వసతులకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ఫెసిలిటీ పూర్తి చేస్తే 2 మార్కులు ఇస్తారు. చెయ్యకపోతే సున్నా. పాక్షికంగా చేస్తే ఒక మార్కు ఇస్తారు. వసతులకు సంబంధించి ముందుగా జిల్లా కమిటీ పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ చేసి.. ధ్రువీకరణ పత్రాలు కేంద్రానికి పంపిస్తుంది. అప్పుడు కేంద్ర బృందం పరిశీలన చేస్తుంది. ఇలా మన రాష్ట్రంలోని 1,135 ఆస్పత్రులకు 70 శాతానికి పైగానే మార్కులు వచ్చాయి. నాణ్యత మదింపులో గుర్తించిన అంశాలు ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ► ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి బాణపు గుర్తులతో సూచికలు ఉన్నాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సరి్టఫికెట్లు ఉన్నాయి. ► రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఉన్నాయి. ► అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వృద్ధులకు, వైకల్యంతో ఉన్న వారి కోసం అన్ని ఆస్పత్రుల్లో వీల్ చైర్లు ఉన్నాయి. ► అన్ని ఆస్పత్రుల్లోనూ ఆయా విభాగాల సిబ్బంది వృత్తి రీత్యా శిక్షణ పొందిన వారే ఉన్నారు. నాణ్యతతో కూడిన సదుపాయాల కల్పన ఒకే దఫా ఇంత పెద్ద స్థాయిలో పనులు చేపట్టడం చిన్న విషయం కాదు. 1,135 ఆస్పత్రులకు మనం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా వీటిపై ఎన్‌క్వాస్ సంతృప్తి చెందింది. త్వరలోనే మిగతా ఆస్పత్రుల్లోనూ నాణ్యతకు సంబంధిన పనులు చేపడతాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
ఒక్కరోజే 25,126 మందికి వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 25,126 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 2,574 మంది వ్యాక్సిన్ పొందారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1,027 మందికి వేశారు. ఇవన్నీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కాగా.. కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తొలిసారిగా భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేశారు. రాష్ట్రంలో 3,88,327 మంది వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకోగా.. ఇప్పటివరకూ రాష్ట్రంలో 91,331 మందికి వ్యాక్సిన్ వేసినట్టు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 36.85 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. వ్యాక్సిన్ కేంద్రాల పెంపు రాష్ట్రంలో వ్యాక్సిన్ కేంద్రాలను భారీగా పెంచారు. ఈ నెల 19 వరకూ 332 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగేది. ఇప్పుడా సంఖ్య 601కి పెరిగింది. దాదాపు అన్ని మండల కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే హెల్త్‌కేర్ వర్కర్లు ఉంటారో.. వాళ్లందరికీ అదే కేంద్రంలో టీకా వేసేలా సర్కారు చర్యలు చేపట్టింది. -
మూడో రోజు 14,606 మందికి వ్యాక్సిన్
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606 మందికి వేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడో రోజు ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,847 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 459 మందికి వ్యాక్సిన్ వేశారు. 3.87 లక్షల మందికి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. తొలిరోజు 19,108 మందికి రెండో రోజు 13,036 మందికి వ్యాక్సిన్ వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 16వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 29 మంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది.. వైద్యుల పర్యవేక్షణలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత రోజు ఆగడాలలంక గ్రామానికి చెందిన కురమా షారోన్‌రాణి, చిగురుపాటి సుశీలకు తల, ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. సోమవారం వాంతులు కూడా కావడంతో ఏలూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. జిల్లాల వారీగా సోమవారం వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలు ఇలా.. -
ఆరోగ్య పథకాల 'అమలులో ఏపీ టాప్'
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఆరోగ్య పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోభివృద్ధి సాధించింది. ఏడాదిన్నర కాలంలో కొన్ని పథకాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిశీలనలో వెల్లడైంది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా పథకాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడేవి. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌ను రెండో స్థానానికి నెట్టి ఏపీ మొదటి స్థానానికి వచ్చిందని ఎన్హెచ్ఎం అధికార వర్గాలు తెలిపాయి. మిగతా కొన్ని పథకాల అమలులోనూ త్వరలోనే ముందంజ వేసే అవకాశం ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఎన్సీడీలో మొదటి స్థానం ► నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) అంటే అసాంక్రమిక వ్యాధుల నియంత్రణకు జాతీయ ఆరోగ్యమిషన్ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు ఐదు కోట్ల జనాభాకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించారు. ► 104 వాహనాల ద్వారా ప్రతి ఊరికీ వెళ్లి మందులు ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు మరింత మెరుగైనట్టు ఎన్హెచ్ఎం పరిశీలనలో వెల్లడైంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల (వీటినే ఇప్పుడు వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ అంటున్నాం) నిర్వహణలోనూ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ► రాష్ట్రంలో 10 వేలకు పైగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉండగా, వీటిలో 8,604 సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం కేంద్రాలకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్‌గా బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని నియమించారు. ► ఇందులో ప్రధానంగా 12 రకాల సేవలను అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పైస్థాయి ఆస్పత్రులకు వెళ్లాల్సిన భారం తప్పింది. ► ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్) అంటే గర్భిణుల ఆరోగ్యం, ప్రసవం అయ్యాక చిన్నారులకు సంరక్షణ వంటి వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర పరిధిలో పనిచేసే పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియలో ఎక్కడో ఉన్న ఏపీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. ► మాతా శిశు మరణాల నియంత్రణ, కుటుంబ నియంత్రణల్లో కేరళ, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. -
'న్యుమోనియాకు' చెక్
సాక్షి, అమరావతి: దేశంలో న్యుమోనియాతో జరుగుతున్న చిన్నారుల మరణాలకు అడ్డుకట్ట పడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు సుమారు 70 వేలమంది మృతి చెందుతుండగా.. అందులో 17.1 శాతం న్యుమోనియాతోనే మరణిస్తున్నట్లు అంచనా. ఎన్నో వ్యాధులకు టీకాలు వచ్చినా దీనికి సంబంధించిన టీకా ఖరీదైనది కావడంతో వేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులనుంచి దేశం గట్టెక్కింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ న్యుమోనియా టీకాను ‘న్యుమోసిల్’ పేరుతో ప్రవేశపెట్టింది. అన్ని పరీక్షలు పూర్తయిన ఈ వ్యాక్సిన్‌ను వారం రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం దేశానికి పరిచయం చేసింది. దీంతో చిన్నారుల మృతికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో బాధపడుతూ మృతిచెందుతున్న ఘటనలు కోకొల్లలు. టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా తక్కువ ధరకు అందుబాటులోకి తేవడంతో ఇకపై దిగువ మధ్యతరగతి వారు కూడా ఈ టీకాను తమ పిల్లలకు వేయించే అవకాశం ఉంటుంది. ఈ టీకా చిన్నారుల ప్రాణరక్షణకు అండగా ఉంటుందని భావిస్తున్నారు. న్యుమోనియాతో భారీగా నష్టం దేశంలో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 37 మంది మృతి చెందుతున్నారు. వీరిలో 17.1 శాతం మంది మరణానికి న్యుమోనియా కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35 మంది మృతిచెందుతున్నారు. వీరిలో 17 శాతం మంది న్యుమోనియా కారణంగానే చనిపోతున్నారు. వారం రోజుల కిందటే దేశానికి పరిచయమైన ఈ టీకాను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బిల్ అండ్ మిలిండా గేట్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీన్ని పీసీవీ (న్యుమోనికల్ కాంజుగేట్ వ్యాక్సిన్) అంటారు. తొలుత ఈ వ్యాక్సిన్‌ను న్యుమోనియా మృతులు ఎక్కువగా ఉన్న బిహార్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (17 జిల్లాల్లో), హరియాణా రాష్ట్రాల్లో వేస్తారు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి రూ.250కి, ప్రైవేటు వ్యక్తులకైతే రూ.700కు ఇస్తున్నారు. కొద్దిగా సమయం పడుతుంది కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి కొద్దిగా సమయం పడుతుంది. రెండు మూడు నెలల్లో మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ వ్యాక్సిన్ డోసు ఇలా - బిడ్డ పుట్టిన 6 వారాల్లోగా తొలిడోసు. - 14 వారాల్లోగా రెండోడోసు. - 9 నెలల నుంచి 12 నెలల మధ్య వయసులో బూస్టర్ డోసు. -
కుక్కకాటు వైద్యానికి ప్రత్యేక క్లినిక్‌లు
సాక్షి, అమరావతి: కుక్కకాటు బాధితులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ప్రభుత్వ కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఎక్కడో ఒక చోటకు వెళ్లి యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. దీంతో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ సహకారంతో ఈ క్లినిక్‌లలో ప్రత్యేక డాక్టర్‌తో పాటు ఒక స్టాఫ్‌నర్సు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. క్లినిక్‌లు ఎక్కడంటే? వైద్య విధాన పరిషత్ పరిధిలో: టెక్కలి, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, మార్కాపురం, ఆత్మకూరు, మదనపల్లె, ప్రొద్దుటూరు, హిందూపురం, నంద్యాల. బోధనాసుపత్రుల్లో: విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు క్లినిక్‌లలో ఎలాంటి సేవలు? ► ఇతర జంతువుల కాట్లకు వైద్యం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లినిక్‌లు. ► యాంటీరేబిస్ వ్యాక్సిన్‌తో పాటు యాంటీ స్నేక్ వీనం (పాము కాటు) మందు అందుబాటులో ఉంటుంది. -
జన జీవనికి ‘ఆరోగ్య’ కార్యాచరణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో వైద్యపరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వరదలు తగ్గే వరకూ శాఖాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రత్యేక ఎపిడెమిక్ (అంటువ్యాధులు ప్రబలకుండా) సెంటర్లను ఏర్పాటు చేసింది. నీటికాలుష్యం ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. రాష్ట్రంలో మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో, 7,500 సబ్సెంటర్లలోనూ మందులను అందుబాటులో ఉంచారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ మేరకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ అన్ని జిల్లాల వైద్యాధికారులకు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సంబంధిత వివరాలివీ.. - ప్రసవం తేదీ సమీపంలో ఉన్న గర్భిణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటే వారిని తక్షణమే ఇతర ఆస్పత్రులకు తరలింపు. ప్రభుత్వ రవాణా ద్వారానే వారిని చేర్చాలి. వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి. - ప్రతి ప్రాథమిక, ఆరోగ్య ఉప కేంద్రాల్లో అందుబాటులో పాము కాటుకు, యాంటీ బయోటిక్స్, బ్లీచింగ్, ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్ సహా అన్ని రకాల మందులు - కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధుల నియంత్రణ - వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీటికి ఏర్పాట్లు - అంటువ్యాధులు ప్రబలకుండా పిచికారీ మందులు - పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో జనరేటర్లు - డయేరియా ప్రబలకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది - వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హెల్త్ క్యాంపులు - శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాలోని వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో వైద్య బృందాలు ఎలాంటి సమస్యలొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం.. ప్రస్తుతం వరద ప్రభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని జిల్లాలో వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేశాం. మందులన్నీ సిద్ధంగా ఉంచాం. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళుతున్నాం. రానున్న రెండ్రోజులు కీలకం. ఈ సమయంలో 24 గంటలూ అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించాం. - కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ జిల్లాల వారీగా కాల్‌సెంటర్ నంబర్లు జిల్లా కాల్‌సెంటర్ నంబర్ విశాఖపట్నం 0891-2501259 తూర్పుగోదావరి 0884-2356196 పశ్చిమగోదావరి 1800-2331077 కృష్ణా 8309022787 గుంటూరు 0863-2324014 వరద ప్రభావం ఇలా.. వరద ప్రభావానికి గురైన గ్రామాలు 59 వరదలకు దెబ్బతిన్న ఆస్పత్రులు 05 వరద ప్రభావానికి గురైన ప్రజలు 24,855 పునరావాస కేంద్రాలు 63 పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు 3,529 మెడికల్ క్యాంపుల నిర్వహణ 104 -
ఆన్లైన్లోనే ఆస్పత్రుల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్ల రిజిస్ట్రేషన్ విధానాన్ని ఇకపై ఆన్లైన్ చేయనున్నారు. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. నాలుగైదు స్థాయిల్లో ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించాక, అంతా పక్కాగా ఉంటేనే ఆమోదం లభిస్తుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ నర్సింగ్‌హోంలు, స్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్లూ ఇవన్నీ జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉండేవి. వాటికి రిజిస్ట్రేషన్, రద్దు వంటివి జిల్లా అధికారులే చేసేవారు. ఇకపై ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. గతంలోలా ఇష్టారాజ్యంగా అనుమతులు తెచ్చుకుని నడిపేందుకు ఇక వీల్లేదు. నర్సింగ్ హోంలుగానీ, డయాగ్నస్టిక్స్ సెంటర్లుగానీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అవి ఎవరిపేరు మీద ఉన్నాయో వారి వైద్య సర్టిఫికెట్లను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు పరిధిలోకి ఆస్పత్రులు రాష్ట్రంలో సుమారు 2,000 వరకు నర్సింగ్ హోంలు, ఆస్పత్రులున్నాయి. వీటి రెన్యువల్‌కు కూడా ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రతి ఆస్పత్రీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. ► ఇందుకోసం clinicalesstact.ap.go.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ప్రాంతం, డాక్టర్లు, ఎన్ని పడకల వివరాలతో పాటు ఫైర్ ఎన్వోసీ వంటివన్నీ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలి. ► రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా ఈ వెబ్సైట్ ద్వారానే జరపాలి. ► దరఖాస్తులను కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో పరిశీలిస్తారు. ► అన్నీ బాగున్నాయనుకుంటే జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో ఆస్పత్రి పరిశీలనకు కమిటీని వేస్తారు. ► కమిటీ నివేదికను కూడా ఈ వెబ్‌సైట్‌కే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గర్భస్థ లింగ నిర్ధారణ నిర్మూలన చట్టం పరిధిలోకి డయాగ్నస్టిక్స్ సెంటర్లు.. రాష్ట్రంలో చిన్నవి, పెద్దవి కలిపి 1,000 వరకు డయాగ్నస్టిక్స్ సెంటర్లున్నాయి. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ వంటి నిర్ధారణ చేసే సెంటర్లన్నీ గర్భస్థ లింగ నిర్ధారణ నిర్మూలన చట్టం పరిధిలోకొస్తాయి. వీటి రిజిస్ట్రేషన్‌కు pcpndt.ap.gov.in వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. -
కోవిడ్ విధుల్లో 948 మంది నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 విధుల్లోకి మరో 948 మంది మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎమ్ఎల్హెచ్పీ)లు అందుబాటులోకి రానున్నారు. ఈ నెల 10వ తేదీన వీళ్లందరూ విధుల్లో చేరాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ► ఈ ఏడాది జనవరిలో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారికి నోటిఫికేషన్ ఇచ్చి, తద్వారా అర్హత పరీక్ష రాశాక ఎంపికైన వారికి ఆరు మాసాలు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయి విధుల్లో చేరే సమయంలోనే కరోనా వైరస్ వ్యాపించింది. ► వీళ్లందరి వేతనాలకు జాతీయ ఆరోగ్యమిషన్ నిధులిస్తుంది. దీంతో వీరిని విధుల్లోకి తీసుకోవాలా లేదా అన్న అంశంపై జాతీయ ఆరోగ్యమిషన్‌కు అధికారులు లేఖ రాశారు. లేఖకు స్పందించిన ఆరోగ్యమిషన్ అధికారులు వెంటనే వీళ్లందరినీ కోవిడ్–19 విధులకు వాడుకోవాలని సూచించారు. ► మొత్తం 948 మందిలో 120 మంది పురుషులు కాగా, 828 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ► ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆ జిల్లాలోనే కోవిడ్‌కేర్ సెంటర్లలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ► వాస్తవానికి మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు నియమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో వారి సేవలు ఇలా వినియోగించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఐఎంఏ డాక్టర్లూ కోవిడ్ విధుల్లోకి.. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) పరిధిలో ఉన్న వైద్యులనూ కోవిడ్ విధుల్లో వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ఏముందంటే.. ► జిల్లాలవారీగా గుర్తించిన కోవిడ్ కేర్ సెంటర్లు లేదా ఇతర ఆస్పత్రుల్లో ఆ వైద్యులను వినియోగించుకోవాలి. వైద్యుల కొరత ఉన్న చోటా వినియోగించుకోవాలి. ► జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని ఐఎంఏ అధ్యక్షులతో మాట్లాడి డాక్టర్ల వివరాలు తీసుకుని, వాటిని నోడల్ అధికారి లేదా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇవ్వాలి. ► ఆ సూపరింటెండెంట్ ప్రతి డాక్టరుకూ గుర్తింపు కార్డు ఇచ్చి.. రోజుకు 8 గంటల పాటు వారం రోజులు డ్యూటీ చేయించాలి. ఆ తర్వాత వారం రోజులు వారిని క్వారంటైన్‌కు పంపాలి. ► అవసరాన్ని బట్టి వారిని ఐసీయూ, నాన్ ఐసీయూ, జనరల్ డ్యూటీలకు వినియోగించుకోవచ్చు ► పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లను రాష్ట్ర లేదా జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో నియమించాలి. ► ఇలా పీజీ వైద్యవిద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఐఎంఏ డాక్టర్లు కలిపి 22 వేల మంది అందుబాటులో ఉన్నారు. తాజా పరిస్థితులను బట్టి 28 వేల మంది వైద్యుల అవసరముంటుందని అంచనా. -
30 ఏళ్లు దాటితే.. మధుమేహ పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మధుమేహ బాధితులు ఇప్పుడు ప్రతి పల్లెలోనూ దర్శనమిస్తున్నారు. వ్యాధితో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల వారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సంకల్పించింది. ప్రాథమిక దశలోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారిని జబ్బు బారిన పడకుండా చూసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇందుకయ్యే నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ గతంలో సిద్ధమైనా అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. ఇకపై ఈ పరిస్థితులు మారాలని.. ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లోనూ ఒక ఎన్సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజ్) క్లినిక్ నిర్వహించాలని కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్క్రీనింగ్ తప్పనిసరి ► రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేసేందుకు సీహెచ్సీలలో మౌలిక వసతుల కల్పిస్తారు. ► ఇందుకోసం 195 సీహెచ్‌సీల్లో ఒక్కొక్క ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2నుంచి 4 గంటల మధ్య ఇలాంటి వారి కోసం ఓపీ సేవలు నిర్వహిస్తారు. ► దీనికోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్‌ను నియామకం. ప్రతి ఎన్సీడీ క్లినిక్‌లో ఒక స్టాఫ్ నర్సును కేటాయిస్తారు. ► పేషెంట్ పూర్తి వివరాలు (డేటా) సేకరిస్తారు. ఇదివరకే మధుమేహంతో బాధపడుతున్న వారిని మరింత మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తారు. వీరికి మూత్ర పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, ఫండోస్కొపీ వంటివి చేస్తారు. పక్కాగా డేటా మేనేజ్మెంట్ ► రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల చిట్టా పక్కాగా ఉండాలి. దీనికోసం ప్రత్యేక పేషెంట్ రిజిస్ట్రీ నిర్వహణకు చర్యలు చేపడతారు. ► పాత రోగులు, కొత్తగా వచ్చే వారికోసం రెండు రకాల రిజిస్ట్రీలు నిర్వహిస్తారు. ఏ రోజుకారోజు ఈ డేటాను యాప్ ద్వారా పోర్టల్‌లో నమోదు చేస్తారు. ► ప్రతినెలా జిల్లా ఎన్సీడీ సెల్ ఈ నివేదిక సమర్పిస్తుంది. త్వరలోనే సీహెచ్సీలలో ఎన్సీడీ క్లినిక్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యాన్సర్ లక్షణాలపైనా దృష్టి ► మధుమేహం ఒక్కటే కాకుండా క్యాన్సర్ లక్షణాలపైనా దృష్టి సారిస్తారు. ప్రధానంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు పరీక్షలు చేస్తారు. ► ఈ పరీక్షలను మహిళా మెడికల్ ఆఫీసర్ నిర్వహిస్తారు. క్యాన్సర్ లక్షణాలుంటే బోధనాస్పత్రులకు లేదా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. ► టీబీ లక్షణాలున్నాయని అనుమానం ఉంటే ట్రూనాట్ లేదా సీబీనాట్ మెషిన్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి ఉందని తేలితే చికిత్స నిమిత్తం బోధనాస్పత్రులకు పంపిస్తారు. -
లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు
సాక్షి, హైదరాబాద్: వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సాధ్యమైనంత వరకూ మెట్ల మీదుగా వెళ్లడాన్ని అలవాటు చేసుకోవాలని, మెట్లు ఎక్కడం లో ఇబ్బందులుంటే తప్ప లిప్టు వినియోగించొద్దని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చే సింది. ఈ మేరకు గురువారం మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీచేసింది. లిప్టులో ఒకేసారి నలుగురికం టే ఎక్కువమంది వెళ్లకూడదనీ, ఒకరికొకరు ఎదురెదురుగా కాకుండా, లిఫ్టు గోడల వైపు తమ ముఖం ఉండేలా నిలబడాల ని సూచించింది. అం దరూ ఒకేచోట చేరి మూకుమ్మడిగా భో జనాలు చేయకూడ దు. వేర్వేరు సమయాల్లో భోజనానికి వెళ్లేలా ఏర్పాట్లు చే యాలి. ఒకేచోట ఎ క్కువమంది గుమిగూడి మాట్లాడుకోవడాన్ని నిలిపివేయాలి. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాల ను నిర్వహించుకోవాలని సూచించింది. ఇతర ఉ ద్యోగుల సెల్ఫోన్లను, గదులను, డెస్కులను వాడకూడదని, వాడాల్సి వస్తే వాటిని క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రపరిచాకే తాకాల్సి ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీ వాడొద్దు... సాధ్యమైనంత వరకు కొంతకాలం వరకూ సెంట్రలైజ్డ్ ఏసీని వినియోగించకపోవడమే మంచిదని కేం ద్రం సూచించింది. ఉద్యోగులందరూ ఒకేసారి ఒకే గేటు ద్వారా ప్రవేశించకుండా, వేర్వేరు ద్వారాల నుంచి ఆఫీసులోకి ప్రవేశించాలని కోరింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో కలిసిమెలిసి తిరిగిన ఉద్యోగి ఎవరైనా ఉంటే, వారు స్వయంగా హోంక్వారంటైన్ లో ఉండాలి. కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటి వ్ వస్తేనే ఆఫీసుకు రావాలని తెలిపింది. డెస్కులు, కుర్చీలను దూరం దూరంగా జిగ్‌జాగ్ పద్ధతిలో వే యాలని కోరింది. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఒకవేళ దగ్గు, తుమ్ములు వస్తే కర్చీఫ్ లే దా టిష్యూ పేపర్‌ను అడ్డం పెట్టుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. కం ప్యూటర్ కీబోర్డులు, ఫోన్లు, ఆఫీసుల్లో ఎక్కువమం ది పలుసార్లు తాకడానికి అవకాశమున్న ప్రాంతాలను, వస్తువుల పైభాగాన్ని శానిటైజ్ చేయాలి. -
నేటి నుంచి టీకాలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతకొన్ని రోజులుగా గర్భిణులకు, చిన్నారులకు ఇచ్చే వ్యాధినిరోధక టీకాలు ఆగిపోయాయి. శనివారం నుంచి ఆ టీకాలు యథావిధిగా వేయాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశించారు. ప్రతి బుధవారం, శనివారం రోటావైరస్, డీపీటీ, తట్టు, పోలియో తదితర వ్యాక్సిన్లు ఇస్తారు. నేటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయాలన్నారు. టీకాలు ఇలా వేయాలి.. ► టీకాలు వేయాల్సిన వాళ్లందరినీ గుర్తించాలి ► వారిలో అరగంటకు నలుగురుకి చొప్పున స్లాట్లు ఇవ్వాలి ► ఆశా కార్యకర్తల ద్వారా ముందురోజే ఈ స్లాట్ సమయం స్లిప్పులు ఇవ్వాలి ► గ్రామ, వార్డు పరిధిలోని లబ్ధిదారులందరికీ టీకాలు వేసే వరకూ స్లాట్లను కొనసాగించాలి ► ఏఎన్ఎంలు గానీ, ఆశాలు గానీ, అంగన్వాడీ వర్కర్‌గానీ కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే టీకాల్లో పాల్గొనకూడదు ► రెడ్‌జోన్ (కంటైన్మెంట్ జోన్) ప్రాంతాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించకూడదు ► టీకాలకు వచ్చే వారి మధ్య కనీసం 7 అడుగుల భౌతిక దూరం ఉండేలా చూడాలి ► టీకాలు వేసే ఏఎన్ఎం సర్జికల్ మాస్కు ధరించడంతో పాటు టీకా వేసేముందు చేతులు సబ్బుతో కడుక్కోవాలి -
పిల్లలకు పెద్దల జబ్బులు!
సాక్షి, హైదరాబాద్: పెద్దలకే పరిమితమైన జీవన శైలి వ్యాధులు, ఇప్పుడు పిల్లలపైనా పంజా విసురుతున్నాయి. డయాబెటిక్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పిల్లలు సతమతమవుతున్నారు. ఇదే విషయంపై కేంద్ర ఆరోగ, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, 19 ఏళ్లలోపు పిల్లల్లో ఒక్క శాతం మందికి డయాబెటిక్ సోకిందని స్పష్టం చేసింది. అదే వయసు వారిలో ప్రతి 10 మందిలో ఒకరు ప్రీ డయాబెటిక్ (డయాబెటిక్ ముందస్తు స్థితి) ఉన్నట్లు పేర్కొంది. 7 శాతం మంది కిడ్నీ వ్యాధులతో, 5 శాతం మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించింది. పాఠశాలకు వెళ్లే వారిలో 3 శాతం, 10 నుంచి 19 ఏళ్ల వారిలో 4 శాతం మంది తీవ్రమైన కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. ఈ పరిస్థితులకు అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ సమస్యలు, అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణాలని తెలిపింది. యునిసెఫ్ సహకారంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్) జరిగింది. దేశవ్యాప్తంగా 2016 నుంచి 2018 వరకు జరిగిన ఈ భారీ సర్వే వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. మన రాష్ట్రంపై బీపీ, షుగర్ పంజా.. సర్వే ప్రకారం దేశంలో 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బీపీతో బాధపడుతుండగా, తెలంగాణలో ఏకంగా 6.7 శాతం ఉండటం ఆందోళనకరం. ఢిల్లీలో 10.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.6 శాతం, మణిపూర్‌లో 8.3 శాతం ఉండటం గమనార్హం. కేరళలో అత్యంత తక్కువగా 0.5 శాతం మందికే బీపీ ఉంది. అదే వయసు పిల్లల్లో డయాబెటిస్తో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా త్రిపురలో 4.9 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. తెలంగాణ బీపీ విషయంలో 5వ స్థానం, డయాబెటిస్‌లో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నారని తేల్చింది. రాష్ట్రంలో 5–9 ఏళ్ల పిల్లల్లో ఎవరికీ డయాబెటిస్ లేదని తేలింది. అయితే ప్రీ డయాబెటిస్ స్థితిలో ఉన్న పిల్లలు 8 శాతం ఉన్నారని పేర్కొంది. 30.8 శాతం తక్కువ బరువు.. తెలంగాణలో 0–4 ఏళ్లలోపు పిల్లల్లో 30.8 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 33.4 శాతం పిల్లలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 22.7 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇక 10–19 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 26 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇదే వయసు వారిలో 5.7 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. విటమిన్ ‘ఏ’తో బాధపడేవారిలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచి ఉంది. మాంసంలో మన పిల్లల స్థానం.. 4 దేశంలో చికెన్ సహా మాంసం తినే వారిలో మన రాష్ట్ర పిల్లలు నాలుగో స్థానం వరకు ఉన్నారు. 5–9 ఏళ్లలోపు పిల్లలు మాంసం లేదా చికెన్ తినేవారు (62.1 శాతం) దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఇదే వయసు వారిలో గుడ్లు తినేవారు 75.3 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. చేపలు తినేవారు మాత్రం 19.3 శాతం ఉన్నారు. 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 63.5 శాతం మంది మాంసం తింటూ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవగా, గుడ్లు తినడంలో 72.4 శాతంతో 5వ స్థానంలో నిలిచారు. చేపలు తినేవారు 18.8 శాతమే ఉన్నారు. అయితే 2 నుంచి 4 ఏళ్ల పిల్లలు 20.7 శాతం మాత్రమే గుడ్లు తింటున్నారు. -
అమ్మలకు ‘కోత’వేదన
సాక్షి, అమరావతి: నాటు వైద్యం చేసే మంత్రసాని స్థానంలో నీటుగా తెల్లకోటు వేసుకునే మంత్రగాళ్లు వచ్చారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తూ కన్నతల్లులకు కడుపులు కోసేస్తున్నారు. సాధారణంగా చేయాల్సిన ప్రసవాన్ని కూడా సిజర్స్‌తో చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పాపాయి పుట్టిన ఆనందం కంటే ఆ ఆస్పత్రి వేసే బిల్లుతో ఆ కుటుంబం భయపడుతున్న దుస్థితి. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే చాలు బిడ్డ అడ్డం తిరిగిందనో, ఉమ్మనీరు పోయిందనో లేదా మరో కారణమో చెప్పి పదినిముషాల్లో కడుపు కోయడం, బిడ్డను తీయడం డాక్టర్ల వంతయింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా విస్మయం వ్యక్తం చేసింది. దురదృష్టంఏంటంటే దేశంలోనే అత్యధిక కోత ప్రసవాలు తెలుగురాష్ట్రాల్లోనే జరగడం. ఇక్కడ జరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు ప్రపంచంలో మరేదేశంలో జరగడం లేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసవాలను భారీ వ్యాపారంగా వైద్యులు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం సిజేరియన్ ప్రసవాల ద్వారా జరుగుతున్నట్టు అంచనా. తెలుగురాష్ట్రాల్లోనే ఎక్కువ సిజేరియన్లు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మాబున్నిసా డెలివరీ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా సిజేరియన్ చెయ్యాలని, లేకపోతే కష్టమని డాక్టర్లు చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి రూ. 55 వేలు చెల్లించి వచ్చింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని భయపెట్టి డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇక తెలంగాణలో ప్రసవాల తీరు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రతి వంద మందిలో 58 మందికి కోతల ద్వారానే ప్రసవం జరుగుతోంది. దీనివల్ల బిడ్డకంటే తల్లి ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి ప్రసవాలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. దేశంలో రెండో స్థానంలో ఉన్న ఏపీలో 40.1 శాతం సిజేరియన్ ప్రసవాలే అవుతున్నాయి. ఈ సిజేరియన్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సిజేరియన్ ప్రసవాల ద్వారా ఏటా రూ. 4 వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. రెండు రాష్ట్రాల్లో ఏటా ఆరున్నర లక్షల ప్రసవాలు జరుగుతుండగా, సగటున ఒక్కో ప్రసవానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు అయితే రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలు కూడా బిల్లులు వేస్తున్నాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ ప్రసవానికి కూడా లక్ష రూపాయలు వసూలు చేస్తుండటం గమనార్హం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు ఎక్కడ? ప్రైవేటు ఆస్పత్రులు లేదా నర్సింగ్‌హోంలు వంటి వాటి పర్యవేక్షణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 అమలు చేయాలి. జిల్లా వైద్యాధికారులదే అమలు బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లా వైద్యాధికారి కూడా ఆస్పత్రులకు వెళ్లి సోదాలు నిర్వహించిన దాఖలాలు లేవు. వేలల్లో నర్సింగ్ హోంలు ఉన్నా, ప్రసవాలు అడ్డదిడ్డంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ప్రకారం మొత్తం ప్రసవాల్లో 10 శాతానికి మించి సిజేరియన్లు జరగకూడదు. అది కూడా అత్యవసర పరిస్థితి అయినపుడే సిజేరియన్ చెయ్యాలి. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేస్తే మాతా శిశుమరణాలను నియంత్రించడం కష్టమని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మందికీ 40 శిశు మరణాలు సంభవిస్తుండగా, తెలంగాణలో 37 శిశు మరణాలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లక్షకూ 140 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది. సాధారణ ప్రసవం వల్ల... - సాధారణ ప్రసవం వల్ల తల్లికి త్వరగా పాలు పడతాయి - ఇన్ఫెక్షన్ల సమస్య ఉండదు. దీనివల్ల తల్లి క్షేమంగా ఉంటుంది - బిడ్డకు ఇమ్యూనిటీ (వ్యాధినిరోధకత) ఎక్కువగా ఉంటుంది - సాధారణ ప్రసవంలో రక్తస్రావం తక్కువ.. దీనివల్ల తల్లి త్వరగా కోలుకుంటుంది - ప్రసవానంతరం ఎక్కువగా మందులు వాడవలసిన అవసరం ఉండదు సిజేరియన్ ప్రసవం వల్ల.. - సిజేరియన్ వల్ల తల్లికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది - రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది - బిడ్డకు స్తన్యమివ్వడానికి అప్పటికప్పుడు పాలు పడవు - సిజేరియన్ కాన్పు వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితీ ఉంటుంది - తల్లికీ, బిడ్డకూ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది - తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండోదీ సిజేరియన్ చేయాలి - రెండు ఆపరేషన్ల వల్ల తల్లికి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి - సిజేరియన్ వల్ల ప్లాస్ (మాయ) ఉండాల్సిన చోట ఉండకపోవడం వల్ల తల్లి ప్రాణానికి ఎక్కువ ప్రమాదం కలుగుతోంది గర్భిణి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి గర్భిణికి రక్తపోటు, మధుమేహం వంటి ఇబ్బందులు లేనపుడు సాధారణ ప్రసవం మంచిది. అలాంటి ఇబ్బందులు ఉన్నపుడు సిజేరియన్ ప్రసవం తప్పదు. సాధారణ ప్రసవమా, సిజేరియన్ ప్రసవమా అన్నది పూర్తిగా గర్భిణి ఆరోగ్యం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అంతేగానీ గర్భిణి రాగానే సిజేరియన్ చేయడం మంచిది కాదు. – డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప సాధారణ ప్రసవమే సురక్షితం తల్లికీ బిడ్డకూ సాధారణ ప్రసవం అన్ని విధాలా సురక్షితం. కానీ చాలా చోట్ల డాక్టర్లు డబ్బు కోసం, వేచియుండే ఓపిక లేకపోవడం వల్ల సిజేరియన్ చేస్తున్నారు. ఎక్కువ మాతా మరణాలు సిజేరియన్ వల్లే జరుగుతున్నాయి. తొలికాన్పులో సిజేరియన్ సరిగా చెయ్యకపోవడం వల్ల రెండో కాన్పులో ఇబ్బంది పడుతున్నవారున్నారు. ఏది ఏమైనా సిజేరియన్ల పోకడ ప్రమాదకరంగా మారింది. – డా.కె.రాజ్యలక్ష్మి, ప్రొఫెసర్, ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్, హైదరాబాద్ -
‘కేసీఆర్ కిట్’ సిబ్బందికి జీతాల్లేవ్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ కిట్’ పథకం విజయవంతంగా నడుస్తున్నప్పటికీ ఇలాంటి కీలకమైన పథకం అమలు కోసం పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి మాత్రం వేతనాలు రావడం లేదు. కేసీఆర్ కిట్ ఉత్తమ పరిపాలన కేటగిరీలో అందించే అవార్డుకు సైతం ఎంపికైంది. కేసీఆర్ కిట్ అమలు బాధ్యతను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టింది. వైద్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పథకం అమలు కోసం ప్రత్యేక అధికారిని, రాష్ట్ర కార్యాలయంలో మరో ఐదుగురు, ప్రతి జిల్లాలో ఒకరు చొ ప్పున సిబ్బందిని నియమించారు. ఈ పథ కం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అధి కారి సహా మిగిలిన వారికి వేతనాలు అంద డంలేదు. ఎవరికి ఎంత వేతనం అనేది ఇప్పటికీ ఖరారు కాలేదని తెలుస్తోంది.