ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికీ టీకాలు | Covid Vaccines for those over 18 years of age | Sakshi
Sakshi News home page

ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికీ టీకాలు

Published Mon, Aug 23 2021 2:42 AM | Last Updated on Mon, Aug 23 2021 12:39 PM

Covid Vaccines for those over 18 years of age - Sakshi

సాక్షి, అమరావతి:రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ 44 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక 18 – 44 ఏళ్ల వయసు వారికి కూడా టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. నేటి(సోమవారం) నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన సచివాలయాల ద్వారా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రతీ జిల్లాలో అయిదు సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్‌ అందించనున్నారు.

కాగా ఇప్పటివరకూ హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, గర్భిణులు, టీచర్లు, 44 ఏళ్ల వయసు దాటిన వారికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ 96 శాతం పూర్తయింది. చాలామందికి రెండో డోసు కొనసాగుతోంది. 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలు ఇవ్వడం ద్వారా థర్డ్‌వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. రద్దీని నివారించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల వారీగా వ్యాక్సిన్లు ఇస్తారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు అర్హులను గుర్తించి ఆయా కేంద్రాలకు తరలిస్తారు. 

ఇతర కేటగిరీలకు యథాతథంగానే..
రాష్ట్రవ్యాప్తంగా 18 – 44 ఏళ్ల వయసు వారు సుమారు 1.9 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ఒకవైపు వీరికి టీకాలు ఇస్తూనే మరోవైపు ఇతర కేటగిరీలకు రెండో డోసు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో దాదాపు 2.64 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ జరిగింది. వీరిలో అత్యధికంగా 45 – 60 ఏళ్ల వయసు వారున్నారు. రాష్ట్రంలో పురుషులకంటే ఎక్కువగా మహిళలకే టీకాలు ఇచ్చారు.

లభ్యతను బట్టి రోజూ టీకాలు..
‘రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. టీకాల లభ్యతను బట్టి ఇది ప్రతిరోజూ కొనసాగుతుంది. ఎక్కడా రద్దీ లేకుండా సాఫీగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకున్నాం. వ్యాక్సిన్లు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరాయి. దీంతో పాటే ఇతరులకు రెండో డోసు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌పై సచివాలయాల వారీగా ముందే సమాచారం ఇస్తారు. దీన్ని బట్టి అర్హులంతా టీకాలు తీసుకోవాలి’
– కాటమనేని భాస్కర్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement