వ్యాక్సినేషన్‌లో 44 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత | Preference for those under 44 years of age in Corona vaccination | Sakshi
Sakshi News home page

వ్యాక్సినేషన్‌లో 44 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత

Published Wed, Sep 8 2021 3:03 AM | Last Updated on Wed, Sep 8 2021 3:03 AM

Preference for those under 44 years of age in Corona vaccination - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తొలి ప్రాధాన్యతగా వీరికి మొదటి డోసు, రెండో డోసు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల మధ్య వయస్కులు 1.93 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో సెప్టెంబర్‌ 7 వరకు 77,04,990 మందికి మొదటి డోసు వేశారు. మరో 8,94,624 మందికి రెండో డోసు కూడా పూర్తయింది.

ఇంకా తొలి డోసు వేసుకోని వారిపై దృష్టి సారించి.. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు రెండో డోసు కోసం ఏ వయసు వారు వచ్చినా విధిగా వారికి కూడా వేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లోని కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్లలో వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. రద్దీ లేకుండా, జనం గుంపులు గుంపులుగా చేరకుండా క్రమపద్ధతిలో వ్యాక్సిన్‌ వేయాలని తెలిపింది.

ఇప్పటివరకు హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్లు దాటినవారు, టీచర్లు వంటి వాళ్లందరికీ దాదాపుగా వ్యాక్సినేషన్‌ పూర్తయింది. దీంతో 18 ఏళ్ల పైన.. 44 ఏళ్లలోపు వారికి కూడా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు మొదటి డోసు వేసుకోని 18 ఏళ్లు దాటినవారు గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement