విజయవాడలో 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తికి వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి, అమరావతి: దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా బుధవారం 31.39 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఏపీకంటే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు సైతం ఒక్క రోజులో ఏపీలో వేసినంత వేగంగా వ్యాక్సిన్ వేయలేకపోయాయి. ఇతర ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదు. 6.40 లక్షల డోసుల్లో 4.40 లక్షల డోసులు కోవిషీల్డ్, 2 లక్షల డోసులు కోవాగ్జిన్ ఉన్నాయి. 45 ఏళ్లు దాటిన వారి నుంచి ఆపైన వయసున్న వారికి వ్యాక్సిన్ వేశారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో జరిగిన వ్యాక్సినేషన్‌లో ఏపీదే రికార్డు అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని బలోపేతం చేసుకోవడం వల్లే ఈ స్థాయిలో వ్యాక్సిన్ వేయడం సాధ్యమైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పీహెచ్‌సీ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో టీకా ప్రక్రియ కొనసాగించారు. మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 255 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో వ్యాక్సిన్ వేశారు. ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన 6.40 లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఒకే రోజు జిల్లాలకు.. అక్కడ నుంచి పీహెచ్‌సీలకు, అక్కడ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీకా ప్రక్రియ కొనసాగించారు. ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, సిబ్బంది సహకారంతో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేయగలిగారు.
కేంద్రం నుంచి టీకా రావాల్సి ఉంది
రాష్ట్రంలో ఒక్క రోజులో 6 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉండటంతో ఏపీకి కేంద్రం నుంచి భారీగా వ్యాక్సిన్ రావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు కోటి డోసులు పంపిస్తామని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ హామీ ఇచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్ కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క డోసు కూడా నిల్వ లేకుండా పూర్తిగా వేయగలిగారు. ఏపీకి కేంద్రం నుంచి ఎప్పుడు వ్యాక్సిన్ వచ్చినా కనిష్టంగా 25 లక్షల డోసులు వస్తేనే వారం రోజులుకు సరిపడా వేయగలుగుతారు.
నెలకు కోటిన్నర మందికి..
రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం కావడం, కింది స్థాయిలో యంత్రాంగం ఉండటం వల్ల దేశంలోనే అత్యధిక సంఖ్యలో టీకా వేసే దిశగా ఏపీ దూసుకెళ్లింది. బుధవారం ఒకేరోజు 6.40 లక్షల మందికి వేయడాన్ని పరిశీలిస్తే.. నెలలో 25 రోజుల పని దినాల్లో టీకా ప్రకియ కొనసాగినా కోటిన్నర మందికి వేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి కావాల్సిందల్లా కేంద్రం నుంచి వ్యాక్సిన్ త్వరితగతిన సరఫరా కావడమేనని చెప్పారు.
45 లక్షల మందికి టీకా పూర్తి
రాష్ట్రంలో బుధవారం నాటికి 45 లక్షల మందికి టీకా వేశారు. తొలుత కాస్త నెమ్మదిగా టీకా ప్రక్రియ ప్రారంభమైనా, సచివాలయాల పరిధిలోకి వ్యాక్సిన్ ప్రక్రియను తీసుకురావడంతో వేగం పెరిగింది. వలంటీర్లు ముందు రోజే అర్హులైన వారిని గుర్తించడం, వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఇంటి దగ్గరకే రావడం వంటి కారణాల వల్ల ఏపీలో ఎక్కువ మందికి టీకా వేయడం సాధ్యమైంది. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరు బాగా ఉపకరించిందని అధికార వర్గాలు తెలిపాయి. మిగతా రాష్ట్రాల్లో ఇలా లేకపోవడంతో కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్‌నే సకాలంలో వేయలేకపోతున్నారు.
వ్యాక్సిన్ పంపించాలని కేంద్రాన్ని కోరాం
ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్‌ను మొత్తం వేశాం. బుధవారం రికార్డు స్థాయిలో 6.40 లక్షల డోసులు వేశాం. వీలైనంత త్వరలో కేంద్రం వ్యాక్సిన్ పంపిస్తామని హామీ ఇచ్చింది. దీని కోసం వేచి చూస్తున్నాం. రాష్ట్రానికి ఎంత ఎక్కువ సంఖ్యలో టీకా డోసులు వస్తే అంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారు. వీలైనంత త్వరగా టీకా ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు.
- కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ
Comments
Please login to add a commentAdd a comment