వైద్య వసతుల్లో ఆంధ్రప్రదేశ్ భేష్‌ | Significant Progress In Facilities Of AP Government Hospitals | Sakshi
Sakshi News home page

వైద్య వసతుల్లో ఆంధ్రప్రదేశ్ భేష్‌

Published Sat, Apr 10 2021 2:46 AM | Last Updated on Sat, Apr 10 2021 12:05 PM

Significant Progress In Facilities Of AP Government Hospitals - Sakshi

ఎన్‌క్వాస్‌ గుర్తింపు పొందిన కుప్పం ప్రాంతీయ వైద్యశాల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు స్వర్ణ యుగం వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు ప్రాథమిక ఆరోగ్యం విషయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఏపీ.. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిందంటే సామాన్య విషయం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేస్తున్న కృషే దీనికి కారణమని పలువురు కొనియాడుతున్నారు. తాజాగా ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా ఉందంటూ కేంద్రం కొనియాడటం గమనార్హం. ఇప్పటి వరకు కేరళ, తమిళనాడులోనే ప్రాథమిక ఆరోగ్య (పబ్లిక్‌ హెల్త్‌) రంగం బావుంటుందని పలువురు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి దృష్టిని ఏపీ ఆకర్షిస్తోంది. 

ఎన్‌క్వాస్‌తో నాణ్యతకు భరోసా 
తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు ఆస్పత్రులను నాణ్యత మదింపు ప్రక్రియలోకి తీసుకొచ్చింది. ఇలా చేయాలంటే ఎన్‌క్వాస్‌ (నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ – జాతీయ నాణ్యత మదింపు సంస్థ) గుర్తింపు పొందాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు ఎన్‌క్వాస్‌ కిందకు తీసుకొచ్చింది. ఈ సంస్థ సంతృప్తి చెందాలంటే ఔట్‌ పేషెంట్‌ సేవలు మొదలు.. ఇన్‌ పేషెంట్, పారిశుధ్యం, మందులు, బెడ్‌లు ఇలా పలు వసతులు సంతృప్తికరంగా ఉండాలి. ఈ విషయంలో ఏపీ అద్భుతంగా నిర్వహణ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ (నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రీసోర్స్‌ సెంటర్‌) ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెయిల్‌ ద్వారా లేఖ పంపించింది. పబ్లిక్‌ హెల్త్‌లో వసతులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ప్రతిభ కనబరిచిందని కొనియాడింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గణనీయంగా వసతులు మెరుగు పడినట్టు ఈ లేఖలో పేర్కొంది. నాడు–నేడు కింద పనులు పూర్తయితే మరిన్ని వసతులు వస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. 

ఎన్‌క్వాస్‌ ప్రతినిధులు స్వయంగా పరిశీలించాకే.. 
సాధారణంగా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు దశల వారీగా ఆస్పత్రులను నాణ్యతా మదింపు ప్రక్రియలోకి చేరుస్తుంటాయి. ఒక్కో దఫా 50 నుంచి 100 ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాలకు వెళతాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1,135 ఆస్పత్రులను ఎన్‌క్వాస్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. కొత్తగా కల్పించిన వసతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మదింపు సంస్థకు సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడమే కాకుండా, స్వయానా ఎన్‌క్వాస్‌ ప్రతినిధులు ఆస్పత్రులకు వచ్చి పర్యవేక్షించారు. 953 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 182 ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రులు.. మొత్తం 1,135 ఆస్పత్రులను పరిశీలించాకే వసతులు భేష్‌ అని గుర్తింపునిచ్చారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని జాతీయ ఆరోగ్య మిషన్‌ అధికారులు పేర్కొన్నారు. 
 
1,400 చెక్‌ పాయింట్స్‌ 

ఎన్‌క్వాస్‌ నిబంధనల ప్రకారం మొత్తం 1,400 వసతులకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ఫెసిలిటీ పూర్తి చేస్తే 2 మార్కులు ఇస్తారు. చెయ్యకపోతే సున్నా. పాక్షికంగా చేస్తే ఒక మార్కు ఇస్తారు. వసతులకు సంబంధించి ముందుగా జిల్లా కమిటీ పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ చేసి.. ధ్రువీకరణ పత్రాలు కేంద్రానికి పంపిస్తుంది. అప్పుడు కేంద్ర బృందం పరిశీలన చేస్తుంది. ఇలా మన రాష్ట్రంలోని 1,135 ఆస్పత్రులకు 70 శాతానికి పైగానే మార్కులు వచ్చాయి. 

నాణ్యత మదింపులో గుర్తించిన అంశాలు 
► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్‌ చార్టర్‌ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. 
► ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి బాణపు గుర్తులతో సూచికలు ఉన్నాయి. 
► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సరి్టఫికెట్లు ఉన్నాయి.  
► రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఉన్నాయి.   
► అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వృద్ధులకు, వైకల్యంతో ఉన్న వారి కోసం అన్ని ఆస్పత్రుల్లో వీల్‌ చైర్లు ఉన్నాయి.   
► అన్ని ఆస్పత్రుల్లోనూ ఆయా విభాగాల సిబ్బంది వృత్తి రీత్యా శిక్షణ పొందిన వారే ఉన్నారు.  
 
నాణ్యతతో కూడిన సదుపాయాల కల్పన 
ఒకే దఫా ఇంత పెద్ద స్థాయిలో పనులు చేపట్టడం చిన్న విషయం కాదు. 1,135 ఆస్పత్రులకు మనం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా వీటిపై ఎన్‌క్వాస్‌ సంతృప్తి చెందింది. త్వరలోనే మిగతా ఆస్పత్రుల్లోనూ నాణ్యతకు సంబంధిన పనులు చేపడతాం. 
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement