govt hospitals
-
ఆస్పత్రుల్లో ఔషధ కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సర్కారు ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ నుంచి అవి రోగి కి చేరేవరకు పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలని తెలిపారు. సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో శుక్ర వారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తు న్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఈ ఔషధి’పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టులకు వర్క్‌షాపు నిర్వహించాలని సూచించారు. అవసరమై న ఔషధాల కోసం టీజీఎంఎస్ఐడీసీకి సకాలంలో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. ఆస్పత్రు ల్లోని ఫార్మసీల్లో ఏయే ఔషధాలు అందుబాటు లో ఉన్నాయనేది ప్రజలు తెలుసుకొనేలా అక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ల్లో మందుల సరఫరాకు డిప్యూటీ డీఎంహెచ్వోలను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఫుడ్సేఫ్టీలో హైదరాబాద్ నగరం దేశంలోనే చిట్టచి వరి స్థానంలో ఉందని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022 నాటి డేటా తో కొందరు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలపటంతో.. ఫుడ్ సేఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నెల రోజుల్లో 5 కొత్త మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ఈ ఏడాది ఇప్పటివరకు 4,366 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్‌ను అధికారులు తనిఖీ చేశారని, నిబంధనలు పాటించని 566 సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, రూ.66 లక్షల జరిమానా విధించామ ని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్య దర్శి క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ విభాగం అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యరంగంలో ఏపీ నంబర్ వన్
-
అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే సీఎం ధ్యేయం
జగ్గయ్యపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనం, తొర్రగుంటపాలెంలో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం, బలుసుపాడు రోడ్డులోని జగనన్న లేఅవుట్లో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి మంత్రి రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.16,822 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనాలు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడంతోపాటు వైఎస్సార్ ఫ్యామిలీ డాక్టర్ పథకం పేరుతో గ్రామాల్లో ఇళ్ల వద్దే రోగులకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 పీహెచ్‌సీలు, 992 సీహెచ్‌సీలు ఆధునికీకరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు వైద్యరంగానికి సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పారు. జగ్గయ్యపేట ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణానికి రెండు వైపులా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసిని, వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ పి.సరళమ్మ, డీసీహెచ్ఎస్ స్వప్న, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. ఇదేం తీరు
సాక్షి నాగర్ కర్నూల్/అచ్చంపేట రూరల్: ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది తీరు మారడం లేదు. ఎన్నిసార్లు సస్పెండ్లు చేసినా.. శాఖాపరమైన చర్యలు తీసుకున్నా.. తమ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా గురువారం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలోని సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్ సెంటర్లోకి ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు శిశువుల రక్త నమూనాలు తీసుకెళ్లడానికి వచ్చాడు. శిశువుల నుంచి రక్త నమూనాలు తీసుకుని వారి బంధువుల వద్ద ఒక్కొక్కరి దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడు. ఆస్పత్రిలోని ఓ నర్సు టీఎస్‌బీ, సీపీపీ, బీజీఎఫ్ పరీక్షల కోసం ఆస్పత్రి పేరు మీద ఉన్న చీటీలు రాసిచ్చారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు చేయడానికి వీల్లేదని, ఓ ల్యాబ్ నుంచి వ్యక్తి వచ్చి పరీక్షలు చేస్తారని చెప్పారని బల్మూర్ మండలం చెన్నారం గ్రామానికి చెందిన బాలింత జ్యోతి భర్త సాయిబాబు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్ నిర్వాహకుడు దర్జాగా ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం సేకరించాడు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి ఫార్మాసిస్టు రాజేష్‌కు విషయం చెప్పడంతో వెంటనే ఆయన వచ్చి నిలదీశాడు. ఆస్పత్రి లోపలికి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని రాజేష్ తెలిపారు. కాగా ఓ బాలింతకు చెందిన బంధువులు ఆస్పత్రిలోని ఓ నర్సు చెప్పడంతో తామంతా రక్త పరీక్షలు చేసుకోవడానికి ముందుకొచ్చామని, రూ.500 ఇచ్చామని ఆరోపించారు. ఆస్పత్రిలో అన్ని వసతులు సమకూర్చుతున్నామని, అన్ని రకాల పరీక్షలు చేస్తున్నామని ఫార్మాసిస్టు చెప్పారు. ఇటీవలి కాలంలోనే ఉన్నతాధికారులు పరీక్షల నిమిత్తం ఓ నూతన యంత్రాన్ని పంపించారని వివరించారు. కాగా బయటి నుంచి ప్రైవేటు ల్యాబ్ వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి శిశువుల వద్ద రక్తం తీసుకెళ్తున్నా పర్యవేక్షణ కరువైందని, శిశువులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. కొందరు నర్సులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, డిమాండ్‌గా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బయటకు పంపడం సరికాదు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల వసతులు సమకూరుతున్నా కొందరు సిబ్బంది తీరు మారడం లేదు. పరీక్షల కోసం రోగులు, బాలింతలు, చిన్నారులను బయటకు పంపడం సరికాదు. ప్రైవేటు వ్యక్తి వచ్చి ఆస్పత్రిలో చిన్నారుల వద్ద రక్త నమూనాలు తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. – మల్లేష్, సీపీఎం నాయకుడు, అచ్చంపేట సొంత క్లినిక్‌లకు రెఫర్ స్థానికులుగా ఉన్న వైద్యులే తరుచుగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారని, వారే స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఇక్కడి రోగులపై నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను తమ క్లినిక్‌లకు రెఫర్ చేసుకుంటున్నారని, ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించిన వైద్యులు, సిబ్బందిపై పలుమార్లు చర్యలు తీసుకున్నా.. సస్పెండ్ అయినా కొన్ని రోజులకే మళ్లీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించడంతో వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరు బహిర్గతమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆస్పత్రిలో వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందడం, అంతకు ముందు కరోనా సమయంలో ఓ చెంచు మహిళకు కరోనా ఉందని కాన్పు చేయకపోవడంతో వైద్యులను, సిబ్బందిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణను వివరణ కోరడానికి ప్రయత్నం చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. (చదవండి: పంటలకు ‘కట్’కట!) -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజ్యమేలుతోన్న నిర్లక్ష్యం
-
పేదలకు సకాలంలో అందని వైద్యం
-
‘కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉంది’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 23,685.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18,094 రెమిడెసివిర్స్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే అన్ని జిల్లాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 918 ఐసీయూ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 18,767 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,109 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాబోయే మూడురోజులు ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు సింఘాల్ తెలిపారు. అలాగే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్‌కు అవసరమైన మందులను జిల్లాలకు సరఫరా చేస్తున్నామన్నారు. కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. -
ఆక్సిజన్ అందక 13 మంది మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు మహిళలు సహా 13 మంది రోగులు మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆస్పత్రి నిర్వహణ తీరును నిరసిస్తూ బుధవారం వైద్యసిబ్బంది ఆందోళనకు దిగారు. చెంగల్పట్టు జిల్లాలో 500 పడకలతో కరోనా ప్రత్యేకవార్డును ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో ఆక్సిజన్ వసతి ఉన్న 380 పడకలున్నాయి. మంగళవారం రాత్రి పదిన్నర తర్వాత అకస్మాత్తుగా ఆక్సిజన్ సరఫరా మందగించడంతో రోగులు ఊపిరాడక విలవిలలాడటం మొదలైంది. ఆక్సిజన్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్న రోగుల్లో గంటలోగా ఐదు మంది ప్రాణాలు వదిలారు. మరికొందరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి, మరైమలైనగర్‌లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలోగా అర్దరాత్రి సమయానికి ఊపిరాడక మొత్తం 13 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 12 మంది కరోనా నుంచి కోలుకున్నవారు, ఒకరు పాజిటీవ్ నిర్దారణైన వ్యక్తిగా తెలుస్తోంది. కర్ణాటకలో నలుగురు మృతి సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. బెళగావి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బిమ్స్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో మూడు గంటల వ్యవధిలోనే నలుగురు చనిపోయారు. ఇటీవల చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో 24 మంది కరోనా బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్లు, బెడ్లు లభించక ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరయ్యారు. రోగులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టోకెన్ల ప్రకారం ఆక్సిజన్ ఇస్తామని చెప్పారని, దీంతో సీరియస్‌గా ఉన్న రోగులకు తక్షణం ఆక్సిజన్ అందక ప్రాణపాయం వస్తోందని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఐదుగురు కరోనా బాధితులు మృతి డెహ్రాడూన్/హరిద్వార్: ఆక్సిజన్ కొరత కారణంగానే కాదు, సరఫరాలో అంతరాయం వల్ల కూడా కోవిడ్–19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల ఐదుగురు బాధితులు కన్నుమూశారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోవడం వల్లే వారు మృతి చెందినట్లు తెలిసింది. తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2 గంటల దాకా ఆక్సిజన్ సరఫరా కాలేదని సదరు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కరోనా బాధితుల్లో ఒకరు వెంటలేటర్‌పై, నలుగురు ఆక్సిజన్ పడకలపై ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి ఐదుగురు కరోనా బాధితులు మరణించడం పట్ల హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ సి.రవిశంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
వైద్య వసతుల్లో ఆంధ్రప్రదేశ్ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు స్వర్ణ యుగం వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు ప్రాథమిక ఆరోగ్యం విషయంలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఏపీ.. నేడు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిందంటే సామాన్య విషయం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేస్తున్న కృషే దీనికి కారణమని పలువురు కొనియాడుతున్నారు. తాజాగా ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా ఉందంటూ కేంద్రం కొనియాడటం గమనార్హం. ఇప్పటి వరకు కేరళ, తమిళనాడులోనే ప్రాథమిక ఆరోగ్య (పబ్లిక్ హెల్త్) రంగం బావుంటుందని పలువురు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి దృష్టిని ఏపీ ఆకర్షిస్తోంది. ఎన్‌క్వాస్‌తో నాణ్యతకు భరోసా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆస్పత్రులను నాణ్యత మదింపు ప్రక్రియలోకి తీసుకొచ్చింది. ఇలా చేయాలంటే ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ – జాతీయ నాణ్యత మదింపు సంస్థ) గుర్తింపు పొందాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు ఎన్‌క్వాస్ కిందకు తీసుకొచ్చింది. ఈ సంస్థ సంతృప్తి చెందాలంటే ఔట్ పేషెంట్ సేవలు మొదలు.. ఇన్ పేషెంట్, పారిశుధ్యం, మందులు, బెడ్లు ఇలా పలు వసతులు సంతృప్తికరంగా ఉండాలి. ఈ విషయంలో ఏపీ అద్భుతంగా నిర్వహణ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఎస్ఆర్సీ (నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసోర్స్ సెంటర్) ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మెయిల్ ద్వారా లేఖ పంపించింది. పబ్లిక్ హెల్త్‌లో వసతులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రతిభ కనబరిచిందని కొనియాడింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గణనీయంగా వసతులు మెరుగు పడినట్టు ఈ లేఖలో పేర్కొంది. నాడు–నేడు కింద పనులు పూర్తయితే మరిన్ని వసతులు వస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఎన్‌క్వాస్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించాకే.. సాధారణంగా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు దశల వారీగా ఆస్పత్రులను నాణ్యతా మదింపు ప్రక్రియలోకి చేరుస్తుంటాయి. ఒక్కో దఫా 50 నుంచి 100 ఆస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాలకు వెళతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1,135 ఆస్పత్రులను ఎన్‌క్వాస్ పరిధిలోకి తీసుకొచ్చింది. కొత్తగా కల్పించిన వసతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మదింపు సంస్థకు సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడమే కాకుండా, స్వయానా ఎన్‌క్వాస్ ప్రతినిధులు ఆస్పత్రులకు వచ్చి పర్యవేక్షించారు. 953 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 182 ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రులు.. మొత్తం 1,135 ఆస్పత్రులను పరిశీలించాకే వసతులు భేష్ అని గుర్తింపునిచ్చారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు పేర్కొన్నారు. 1,400 చెక్ పాయింట్స్ ఎన్‌క్వాస్ నిబంధనల ప్రకారం మొత్తం 1,400 వసతులకు సమాధానం ఇవ్వాలి. ఒక్కో ఫెసిలిటీ పూర్తి చేస్తే 2 మార్కులు ఇస్తారు. చెయ్యకపోతే సున్నా. పాక్షికంగా చేస్తే ఒక మార్కు ఇస్తారు. వసతులకు సంబంధించి ముందుగా జిల్లా కమిటీ పరిశీలన చేస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ చేసి.. ధ్రువీకరణ పత్రాలు కేంద్రానికి పంపిస్తుంది. అప్పుడు కేంద్ర బృందం పరిశీలన చేస్తుంది. ఇలా మన రాష్ట్రంలోని 1,135 ఆస్పత్రులకు 70 శాతానికి పైగానే మార్కులు వచ్చాయి. నాణ్యత మదింపులో గుర్తించిన అంశాలు ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ► ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి బాణపు గుర్తులతో సూచికలు ఉన్నాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సరి్టఫికెట్లు ఉన్నాయి. ► రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఉన్నాయి. ► అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వృద్ధులకు, వైకల్యంతో ఉన్న వారి కోసం అన్ని ఆస్పత్రుల్లో వీల్ చైర్లు ఉన్నాయి. ► అన్ని ఆస్పత్రుల్లోనూ ఆయా విభాగాల సిబ్బంది వృత్తి రీత్యా శిక్షణ పొందిన వారే ఉన్నారు. నాణ్యతతో కూడిన సదుపాయాల కల్పన ఒకే దఫా ఇంత పెద్ద స్థాయిలో పనులు చేపట్టడం చిన్న విషయం కాదు. 1,135 ఆస్పత్రులకు మనం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా వీటిపై ఎన్‌క్వాస్ సంతృప్తి చెందింది. త్వరలోనే మిగతా ఆస్పత్రుల్లోనూ నాణ్యతకు సంబంధిన పనులు చేపడతాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
కరోనా ఉధృతి.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!
హైదరాబాద్: వివిధ వ్యాధులకు చికిత్స కోసం వచ్చేవారిలో అవసరమైన అందరికీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా పరీక్ష తప్పనిసరిగా చేయాలని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్టు తెలిపారు. తీవ్ర శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, కరోనా లక్షణాలు లేకుండా ఆస్పత్రిలో చేరే హైరిస్క్ రోగులకు, వివిధ రకాల శస్త్రచికిత్సలు, సాధారణ వైద్యం కోసం వచ్చే లక్షణాలు లేని రోగులకు, ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 శాతంగానే ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలను 40 శాతానికిపైగా పెంచేలా ప్రణాళిక రచించినట్టు తెలిపారు. నేడు మంత్రి ఈటల మీటింగ్ కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నోడల్ ఆఫీసర్లతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మంత్రి బుధవారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్సలపై సమీక్షిం చారు. కరోనా పరీక్షలను సంఖ్య మరింత పెంచడంతోపాటు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా తీవ్రత తక్కువగా ఉందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వ్యాక్సినేషన్ కూడా వేగవంతంగా జరుగుతోందన్నారు. అయితే అందరికీ వ్యాక్సిన్ అందించడానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పా రు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
వైద్యులు సూచించే మందులు ఇక డోర్ డెలివరీ
-
ఇక ఆస్పత్రుల్లో ‘అమృత్’ ఫార్మసీలు
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న నిరుపేద రోగులకు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకే మందులు, సర్జికల్స్, ఇంప్లాట్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా ఆలిండియా మెడికల్ సైన్స్(ఎయిమ్స్)ల్లో ప్రారంభించి, విజయవంతమైన దీన్‌దయాళ్ ‘అమృత్’ మెడికల్ స్టోర్స్‌ను ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ దుకాణాల్లో జనరిక్ మందులతో పాటు బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ప్రైవేటు మెడికల్ స్టోర్స్‌లోని బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ ధరలతో పోలిస్తే ఈ అమృత్ మెడికల్ స్టోర్స్‌లో 30 నుంచి 40 శాతం తక్కువ ధరకే లభించనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో హెచ్‌ఎల్‌ఎల్‌కు షాపును కేటాయించారు. రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. నిలోఫర్ సహా ఇతర ఆస్పత్రుల్లో సాధ్యమైనంత త్వరలోనే ఈ దుకాణాలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బ్రాండెడ్ బాదుడుకు ఇక చెల్లుచీటీ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి సహా నిలోఫర్, ఈఎన్టీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్, ఛాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి, నయూపూల్ ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఇక గాంధీ మెడికల్ కాలేజీ పరిధిలో గాంధీ ఆస్పత్రి కొనసాగుతోంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల ఓపీకి రోజుకు సగటున 2500 నుంచి 3000 మంది రోగులు వస్తుంటారు. మిగిలిన ఆస్పత్రుల ఓపీలకు రోజుకు సగటున 500 నుంచి 1200 మంది వస్తుంటారు. ప్రభుత్వ ఆస్పత్రులకు టీఎస్ఎంఐడీసీ మందులు సరఫరా చేస్తుంది. వైద్యులు రాసిన వాటిలో చాలా మందులు ప్రభుత్వ ఫార్మసీలో దొరకడం లేదు. దీంతో ఆ మందులను రోగులే స్వయంగా సమకూర్చుకోవాలి. ఇందుకు సమీపంలో ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తుంటే.. దుకాణదారులు బ్రాండెడ్ పేరుతో అధిక ధరల మందులు ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కేవలం అవుట్ పేషంట్లకు మాత్రమే గాక.. ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు కూడా చాలా రకాల మందులను బయటే కొంటున్నారు. అమృత్ స్టోర్స్ ఏర్పాటుతో ఖరీదైన మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్స్ సైతం తక్కువ ధరకే పొందే అవకాశం ఉండడంతో పేద రోగులకు మేలు జరగనుంది. ఏళ్ల నుంచి ప్రైవేటు షాపుల దందా గతంలో నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీలోనూ జీవన్‌ధార పేరుతో జనఔషధి మెడికల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. రోగుల నుంచి వీటికి మంచి ఆధరణ కూడా లభించింది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో లీజుపై కొనసాగుతున్న ప్రైవేటు మెడికల్ షాపుల నిర్వహకులు స్థానిక వైద్యులతో కుమ్మక్కై వాటిని సంక్షోభంలోకి నెట్టేశారు. ప్రస్తుతం ఒక్క ఉస్మానియాలోనే విజయవంతంగా కొనసాగుతోంది. గాంధీలో దాదాపు మూతపడే స్థితికి చేర్చారు. ఇక నిమ్స్‌లో మూడేళ్ల క్రితమే దుకాణం ఏత్తేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాంధీలో మూడు, ఉస్మానియాలో రెండు, నిలోఫర్‌లో ఒక ప్రైవేటు మెడికల్ స్టోర్లు కొనసాగుతున్నాయి. ఒక్కో స్టోర్‌లో రోజుకు సగటున రూ.2 లక్షల విలువ చేసే మందుల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఇప్పటికే ఆయా దుకానాల లీజు గడువు కూడా ముగిసింది. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులకు అనుమతి ఇవ్వరాదనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల నేపథ్యంలో.. అధికారులు ఇప్పటికే ఆయా దుకాణాల నిర్వహకులకు నోటీసులు జారీ చేశారు. కొంత మంది అధికారులు ఆయా షాపుల నిర్వహాకులతో కుమ్మక్కై.. కోర్టుల నుంచి స్టే ఆర్డర్లు ఇప్పించడం వివాదాస్పదంగా మారింది. -
‘జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చండి’
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా ఆధునీకరించాలని విన్నవించారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద కొత్త బ్లాక్స్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో ఈటల చర్చించారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, కొత్త వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. మరోవైపు ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుపై ఈటల చర్చించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్రమంత్రితో ఈటల సమగ్రంగా ఏమేం చర్చించారన్న విషయాన్ని కార్యాలయ వర్గాలు పూర్తిస్థాయిలో వెల్లడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇదిలాఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ‘అందరికీ అందుబాటులోకి ఆధునిక వైద్య పరికరాలు’అనే లక్ష్యంతో ‘వైద్య పరికరాలు–సేవలు’పేరుతో మంగళవారం ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు ఈటల ఢిల్లీ వెళ్లారు. కాగా, మన శాస్త్ర విజ్ఞానం రోగులకు అతి తక్కువ ధరకు వైద్యం అం దించేందుకు ఉపయోగపడాలని ఈటల కోరారు. సోమవారం హైదరాబాద్‌లో హెల్త్ అండ్ ఫార్మా సదస్సు జరిగింది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 70శాతం సిజేరియన్లే..
సాక్షి, యాదాద్రి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2018 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు 13,383 ప్రసవాలు జరిగాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 3,623 కాగా సిజేరియన్ ద్వారా 9,760 కాన్పులు చేశారు. జిల్లాలో సాధారణ కాన్పుల కంటే శస్త్ర చికిత్సల ద్వారా అధికంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు వైద్యారోగ్యశాఖ చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో ఫలించడం లేదు. ఇందుకు వైద్యులు, సిబ్బంది పనితీరే కారణమన్న విమర్శలు లేకపోలేదు. ఇదే విషయాన్ని వైద్యారోగ్యశాఖ కమిషనర్ యోగితారాణి స్వయంగా ప్రస్తావించడం జిల్లాలోని ఆస్పత్రుల్లో పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ‘‘స్థానికంగా ఉండరు.. సమయానికి రారు.. వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండరు.. సాధారణ ప్రసవాలు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు.. రాష్ట్రంలోనే అత్యధిక ఆపరేషన్లు ఈ జిల్లాలో జరుగుతున్నాయి.. అందులో సిజేరియన్లే అధికంగా ఉంటున్నాయి.. ఈ పద్ధతి మారాలి.. లేకుంటే చర్యలు తప్పవు’’ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ యోగితారాణా ఇటీవల జిల్లా ఆస్పత్రులను సందర్శించి వైద్యాధికారులను ఘాటుగా హెచ్చరించడం వారి పనితీరును ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించినస్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రధానంగా కాన్పుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని అందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. అయినా ప్రజలు తమ చేతినుంచి విదుల్చుకోక తప్పడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా ప్రసూతి కోసం మెజార్టీ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రసూతి కోసం వెళ్తే సుమారుగా రూ.25వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చవుతుంది. మండల కేంద్రాలు, మినీ పట్టణ కేంద్రాల్లో తక్కువలో తక్కువ రూ.15 వేల నుంచి రూ.30 వేలకు తగ్గడం లేదు. అందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆశించిన స్థాయిలో సేవలందకపోవడమే కారణమని తెలుస్తోంది. మొదటి కాన్పులోనే సాధారణంగా చేయాలన్నది లక్ష్యం మొదటి కాన్పులోనే సాధారణ ప్రసవం చేయాలన్నది వైద్యారోగ్య శాఖ లక్ష్యం. కానీ ప్రసవాలు అలా జరగడం లేదు. పీహెచ్‌సీల్లో డాక్టర్‌తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్, స్టాప్‌నర్సు, ఫార్మాసిస్టు అందుబాటులో ఉండాలి. చాలా పీహెచ్‌సీల్లో వీరెవరూ అందుబాటులో ఉండటం లేదు. 24గంటల ఆస్పత్రుల పనితీరు కూడా అధ్వాన్నంగా ఉంది. ఇదే విషయాన్ని కలెక్టర్ సైతం పలుమార్లు హెచ్చరించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన గర్భిణిలను సాధారణ కాన్పు చేయడానికి 24గంటల వరకు వేచి చూడాల్సి ఉండగా అలా జరగడం లేదు. దీంతో సిజేరియన్లు అధిక మొత్తంలో జరుగుతున్నాయి. జిల్లాలో ఆస్పత్రులు ఇలా.. జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. ఇందులో 24గంటలు పని చేసే పీహెచ్‌సీలు 10 ఉన్నాయి. వీటిలో రాజాపేట, బీబీనగర్, మో త్కూర్, ఆత్మకూరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, తుర్కపల్లి, వలిగొండ, నారాయణపురంలో ఉన్నాయి. అలాగే 12గంటలు పని చేసే పీహెచ్‌సీలు 9 అడ్డగూడూరు, కొండమడుగు, వర్కట్‌పల్లి, తంగడపల్లి, మోటకొండూర్, శారాజీపేట, వేములకొండ, బొల్లేపల్లి, మునిపంపులలో పని చేస్తున్నాయి. ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌లో కమ్యూనిటీ హెల్త్సెంటర్లు ఉండగా భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చే గర్భిణులను పరీక్షిస్తున్న కొందరు వైద్యులు శస్త్రచికిత్స తప్పనిసరి చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా ప్రసూతి కోసం వచ్చే వారిని అబ్జర్వేషన్ పేరుతో ఒకటికి రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి శస్త్రచికిత్స తప్పనిసరి అని చెబుతున్నారు. ఇందుకోసం తల్లీ, బిడ్డల ఆరోగ్యాన్ని ప్రమాదంగా చూపుతూ శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులపై వత్తిడి తెస్తూ వారిని ఒప్పిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేటు ఆస్పత్రులు వేసే అన్ని రకాల ఫీజులను తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. వసతుల లేమి! ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కోసం వచ్చే వారికి వసతులు, వైద్యుల గైర్హాజరు, నిర్లక్ష్యం, మత్తు డాక్టర్లు లేకపోవడం, సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది, విద్యుత్, మంచినీరు కొరత ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు చేయడానికి ప్రధాన అవరోధంగా మారింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రసూతి సమయంలో అవసరమైన సౌకర్యాలు లేవు. కొన్ని చోట్ల ఉన్నా వాటిని వినియోగించే నాథుడే లేడు. ఒక వేళ ఆస్పత్రిలో అన్ని పరికరాలు ఉన్నా వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండకపోవడం ప్రధాన సమస్య. రోజుల తరబడి ప్రాథమిక కేంద్రాలకు రాని వైద్యలు ఉన్నారంటే అతిశయోక్తికాదు. సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ఒకవేళ అన్ని సవ్యంగా ఉండి డాక్టర్ ఉన్నా సరైన వసతులు లేవని మండల కేంద్రాల నుంచి డివిజన్ కేంద్రాలకు, అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు పంపించడం జరుగుతుంది. దీంతో ప్రసూతి సమయంలో ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ప్రజలు నాలుగు డబ్బులు ఖర్చైనా పర్వాలేదంటూ అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. శస్త్రచికిత్స లేని ప్రసవాలేవీ..? ఆపరేషన్‌తో సంబంధం లేకుండా ప్రసవాలు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా యి. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఎంతగానో చెబుతు న్నా ఆచరణలో అమలు కావడంలేదు. వైద్యారోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లాలో ప్రసవాలను పెద్ద ఎత్తున శస్త్ర చికిత్సల ద్వారా చేయడం పట్ల కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, కలెక్టర్ అనితారామచంద్రన్ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో శస్త్ర చికిత్సల ద్వారా 70.8శాతం ప్రసవాలు జరుగుతండగా సాధారణ ప్రసవాలు 29.2శాతం ఉంటున్నాయి. ఇదే విషయమై తీవ్రస్థాయిలో పోస్ట్‌మార్టం జరుగుతోంది. కేసీఆర్ కిట్, నగదు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వీటిలో కూడా శస్త్ర చికిత్సలే అధికంగా జరగడాన్ని తప్పుపడుతున్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా శస్త్ర చికిత్సలే పెరగడం పట్ల అధికారులు అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్ 2018 ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు 13,383 కాన్పులు జరిగాయి. ఇందులో సాధారణ కాన్పులు కేవలం 3, 623 కాగా 9,760 ప్రసవాలను సిజేరియన్ ద్వారా నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరో వైపు పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇతర జిల్లాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవాలు.. సాధారణ సిజేరియన్ మొత్తం 3,623 9,760 13,383 -
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఇక పక్కాగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాస్పత్రులను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ వర్గాల నుంచి ఈ వ్యవస్థ ఏర్పాటుచేయాలని వినతులు వస్తుండడంతో అధికారులు ఈవైపు అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రులు నిర్మించడం.. ఆ తర్వాత వాటి నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో చాలా ఆస్పత్రులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చిన్న బల్బు వెలగకపోయినా వాటిని తిరిగి పునరుద్ధరించే వ్యవస్థలేదు. చిన్నచిన్న డ్రైనేజీ పనులుగానీ, శ్లాబ్ లీకేజీలుగానీ, రంగులు వేయించడంగానీ ఇలా చాలా పనులు చేయించేందుకు ఓ వ్యవస్థలేదు. దీంతో భవనం నిర్మించిన నాలుగైదేళ్లకే నిర్మాణాలు దారుణ స్థితికి చేరుకుంటున్నాయి. దీనివల్ల రోగులు ఆస్పత్రులకు రావాలన్నా, సిబ్బంది పనిచేయాలన్నా వీటిని చూసి భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. జోన్ల వారీగా ఇంజనీర్ల కేటాయింపు గతంలో వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న కొద్దిపాటి ఇంజనీర్లు రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థలోకి వెళ్లారు. అక్కడ కూడా కేవలం కొత్త నిర్మాణాలు చూస్తున్నారుగానీ, ఆస్పత్రుల నిర్వహణ చూడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ఇంజనీరింగ్ విభాగంతో సంబంధం లేకుండా జేఈల నుంచి ఎస్ఈల వరకూ జిల్లాలను జోన్లు వారీగా విభజించి ఇంజనీర్లను కేటాయిస్తే ఆస్పత్రులు కళకళలాడే అవకాశం ఉంటుందని కొంతమంది ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల జిల్లాల్లో పర్యటించిన సుజాతారావు కమిటీ దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకువచ్చారు. అంతేకాక.. మౌలిక వసతులుకు బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకుని ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక ఇంజినీరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో మొక్కుబడిగా నిర్వహణ కాగా, రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్ని ఆస్పత్రులు కలుపుకుంటే 2 కోట్లకు పైగా చదరపు అడుగుల్లో నిర్మాణాలున్నాయి. కానీ, వీటి నిర్వహణకు గత టీడీపీ సర్కారు ఏటా కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. అందులో 50 శాతం కూడా ఖర్చుచేయలేదు. చదరపు అడుగుకు కనీసం రూ.200 కేటాయిస్తే అద్భుతంగా నిర్వహించవచ్చని, ప్రస్తుత నిర్మాణాలకు రూ.540 కోట్లు ఖర్చుచేస్తే మూడేళ్ల పాటు వాటి నిర్వహణకు ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మాతా శిశు మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేసింది. ప్రస్తుతం ప్రతి లక్ష ప్రసవాల్లో 81 మంది తల్లులు, ప్రతి వెయ్యి జననాల్లో 28 మంది శిశువులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా ‘దక్షత’అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రసవాల సందర్భంగా లేబర్ రూం (ప్రసవ గది)లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైరిస్క్ కేసులను ఎలా డీల్ చేయాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను, ఏకరూప కార్యక్రమాన్ని తయారు చేసింది. దానికి అనుగుణంగా లేబర్ రూంలలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించేలా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు లేబర్ రూంలలో ప్రసవాలు చేయకుండా అత్యంత సురక్షిత పద్ధతిలో కీలకాంశాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే సిజేరియన్లు కాకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పది జిల్లాల్లో ‘దక్షత’ను వైద్య ఆరోగ్యశాఖ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు పది జిల్లాల్లో 2 వేల మంది డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారు కిందిస్థాయిలో మరికొందరికి ఇచ్చేలా కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మిగిలిన జిల్లాల్లోనూ ‘దక్షత’కార్యక్రమాన్ని నిర్వహించి శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వరప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుకు పూనుకోవడం విశేషం. ఆ 72 గంటలే కీలకం... మాతాశిశు మరణాలు ప్రసవ సమయం నుంచి 72 గంటల మధ్య ఎక్కువగా సంభవిస్తుంటాయి. రక్తస్రావం జరగడం, బీపీలో హెచ్చుతగ్గులు, ఇన్ఫెక్షన్ సోకడం, శిశువు బయటకు రాకపోవడం తదితర కారణాల వల్ల గర్భిణులు చనిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలాగే శిశువులైతే ఉమ్మనీరు మింగేయడంతో ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో చనిపోతుంటారు. గర్భిణులు ప్రసవం కోసం వచ్చిన దగ్గరి నుంచి ప్రసవం జరిగే వరకు మధ్యగల 72 గంటలే అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది తీసుకునే ప్రత్యేక జాగ్రత్తల మీదే మాతా శిశువుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో లేబర్‌రూంలు ఎంత గొప్పగా ఉన్నా హైరిస్క్ కేసుల్లో చేపట్టాల్సిన ప్రొటోకాల్ చికిత్సను పాటించకపోవడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన చికిత్సా పద్ధతులు పాటించడం వల్ల మరణాలు సంభవిస్తుంటాయని, అలాంటి వాటికి చెక్ పెట్టడమే దక్షత కార్యక్రమం ఉద్దేశమని డాక్టర్ వరప్రసాద్ తెలిపారు. చాలావరకు సంభవించే మరణాలన్నీ కూడా లేబర్ రూంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లేనని ఆయన విశ్లేషించారు. దక్షత ద్వారా శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రసవాల సందర్భంగా పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని పెంచుతారు. ప్రసవాల సందర్భంగా పాటించాల్సిన పద్ధతులను చెబుతారు. అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను శిక్షణలో భాగంగా నేర్పిస్తారు. సిజేరియన్ల తగ్గింపూ లక్ష్యమే... హైరిస్క్ సందర్భాల్లో అనేక మంది వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ల వైపు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 1,03,827 ప్రసవాలు జరగ్గా అందులో 62,591 మంది అంటే 60 శాతం సిజేరియన్ ద్వారానే జరిగినట్లు సర్కారు నివేదిక తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 28,790, ప్రైవేటు ఆసుపత్రుల్లో 33,801 ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరిగినట్లు నిర్ధారించారు. దేశంలోకెల్లా తెలంగాణలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎలాగైనా మాతాశిశు మరణాలను తగ్గించడం, సిజేరియన్లను వీలైనంత వరకు నివారించడమే లక్ష్యంగా దక్షత కార్యక్రమం ద్వారా ముందుకు సాగాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రసవాలను సురక్షితంగా ఎలా చేయాలి? హైరిస్క్ సమయాల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశాల గురించి వైద్యులు, సిబ్బందికి ప్రయోగాత్మకంగా చూపేందుకు ఉన్నతాధికారులు ఒక పరికరాన్ని కొనుగోలు చేశారు. ఇదొకరకంగా మాక్ డ్రిల్ లాంటిది. ఆ పరికరం ధర లక్ష రూపాయలు ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణ నాడి బాగుంది!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య రంగంలో పురోభివృద్ధి సాధిస్తున్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ‘ఆరోగ్య రంగంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పురోభివృద్దిపై’మంగళవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017–18లో ఆరోగ్య రంగంలో జరిగిన అభివృద్ధిని ఇందులో అంచనా వేసింది. ఆరోగ్యరంగంలో 23 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించింది. ఆ రెండు సంవత్సరాల మధ్య జరిగిన పురోగతిని, వెనుకబాటును విశ్లేషించింది. దీని ప్రకారం దేశంలో 21 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది. నవజాత శిశు మరణాల రేటును తగ్గించడంలో మన రాష్ట్రం అత్యధిక పురోభివృద్ధి సాధించిందని తెలిపింది. 2016–17లో ప్రతి వెయ్యి మందిలో 23 మంది మరణించగా.. 2017–18లో ఆ సంఖ్య 21కి తగ్గిందని వివరించింది. టీబీ కేసులకు అవసరమైన వైద్యం అందించడంలో పెద్ద ఎత్తున పురోగతి సాధించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్లు వేయడం, ఇమ్యునైజేషన్‌లో భారీ మెరుగుదల ఉన్నట్లు తెలిపింది. అయితే ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటులో మాత్రం మెరుగుదల లేదని, రెండేళ్లలో పరిస్థితి అలాగే ఉందని పేర్కొంది. తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నా చర్యలు తీసుకోవడంలో పెద్దగా పురోగతి లేదని వెల్లడించింది. 2016–17లో వెయ్యి మంది మగ శిశువులకు 918 మంది ఆడ శిశువులు జన్మిస్తే, 2017–18లో అది 901కు తగ్గిందని వివరించింది. కొరతను అధిగమించి... పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో స్టాఫ్‌నర్సుల కొరత కూడా పెద్దగా లేదని నీతి ఆయోగ్ పేర్కొంది. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ల కొరత ఉండేది. కానీ ఆ తర్వాత సంవత్సరంలో పరిస్థితి మెరుగుపడింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేసింది. ఇక జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత నుంచి కూడా రాష్ట్రం బయటపడింది. ఈ విషయంలో మంచి పురోగతి ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. వైద్యులు, ఇతర సిబ్బంది మొత్తంలో కూడా ఆ రెండేళ్లలో మెరుగుదల కనిపించింది. అయితే, జిల్లాల్లో గుండె సంబంధిత యూనిట్ల నిర్వహణలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. శిశు జననాల నమోదు ప్రక్రియలో భారీ మెరుగుదల ఉందని తెలిపింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా వచ్చే నిధులు ఖర్చు చేయడంలో కూడా తెలంగాణ పురోభివృద్ధి సాధించినట్లు నీతి అయోగ్ వివరించింది. కేసీఆర్ కిట్ భారీ హిట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునే మహిళల కోసం తెలంగాణ సర్కారు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. దీంతోపాటు కేసీఆర్ కిట్ కింద మాతా శిశువుల కోసం వివిధ వస్తువులను ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో కేసీఆర్ కిట్‌కు ఆదరణ భారీగా పెరిగింది. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. 2016–17లో ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 85.35 శాతముంటే, 2017–18లో అవి 91.68 శాతానికి చేరాయి. మరోవైపు ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంల కొరత తీర్చడంలోనూ ప్రభుత్వం విజయం సాధించింది. 200 కోట్లతో మౌలిక సదుపాయాలు పీహెచ్‌సీలు మొదలు బోధనాసుప్రతుల్లో కల్పన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 200 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిం చాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. తద్వారా రోగులకు, వైద్య సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాలని భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విడతలుగా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చర్చించాయి. అన్ని రకాల వసతులు కల్పిస్తే ఏమేరకు ఖర్చు అవుతుందో అంచనా వేశాయి. సంబంధిత నివేదికను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై ఆర్థిక శాఖ వద్ద అనుమతి తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది. కునారిల్లుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు.. రాష్ట్రంలో 950కు పైగా పీహెచ్‌సీలున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రులున్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రులున్నాయి. వీటిల్లో వేలాది మంది వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేని దుస్థితి నెలకొంది. చాలా ఆసుపత్రుల్లో కుర్చీలు కూడా ఉండటం లేదు. ఆసుపత్రుల్లో పడకలు లేక రోగులను ఆరుబయట లేదా నేల మీద పడుకోబెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.అనేక ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు ఉండటం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలనేది సర్కారు ఉద్దేశం. పలు చోట్ల ఖాళీలు.. రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత వేదిస్తోంది. పీహెచ్‌సీలు మొదలు బోధనాసుపత్రుల వరకు వైద్యులు, నర్సులు, ఇతర టెక్నీషియన్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ బోర్డును నియమించారు. దీని ద్వారా వీలైనంత త్వరలో భర్తీలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్ తదితర విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. కొన్ని ఆసుపత్రుల్లో ఆ స్పెషలిస్టు వైద్యులు లేరు. అందుకోసం వైద్యుల భర్తీ ప్రక్రియ కూడా జరగనుంది. -
65కు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గవర్నర్ నరసింహన్ ఆర్డినెన్స్ జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విరమణ వయసును పెంచాలని అప్పట్లో మంత్రి మండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు రావడం, తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికలు, అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు... ఇలా ఎలక్షన్ కోడ్‌తో ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వ దంత వైద్య కళాశాలల అధ్యాపకులు, వైద్యులకు కూడా విరమణ వయస్సు 65ను అమలుచేస్తారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని గవర్నర్ విడుదల చేసిన రాజపత్రంలో పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో పలువురి ఉద్యోగ విరమణ వల్ల అనేక ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయకపోవడంతో వైద్య విద్య ఇబ్బందుల్లో పడుతుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సకాలంలో పదోన్నతులు జరపకపోవడం వల్ల కూడా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కేడర్‌లోని సీనియర్ బోధనా సిబ్బందిలో భారీగా తగ్గుదల కనిపిస్తుందని ఆర్డినెన్స్‌లో వివరించారు. అంతేకాదు సూపర్ స్పెషాలిటీల్లోని కొన్ని యూనిట్లలో బోధనా సిబ్బంది కొరత అత్యంత తీవ్రంగా ఉందని, ఫలితంగా కొన్ని విభాగాలు దాదాపు మూసివేత అంచునకు చేరిన పరిస్థితి నెలకొందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బోధనా సిబ్బంది కొరతతో భారతీయ వైద్య మండలి, భారతీయ దంత వైద్య మండలీలు తనిఖీలకు వచ్చినప్పుడు పీజీ సీట్లతో సహా కొన్ని మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతమున్న సీట్ల గుర్తింపునూ కోల్పోయే పరిస్థితి ఉందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచామని వివరించారు. రాష్ట్ర శాసనమండలి ఇప్పుడు సమావేశంలో లేనందువల్ల వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నందున ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు వివరించారు. జూడాల సమ్మె విరమణ... బోధనాసుపత్రుల్లో విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల (జూడా)తో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో జూడాల నేతలు డాక్టర్ విజయేందర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహేశ్, నరేష్, లోహిత్ తదితరులున్నారు. మంత్రి హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు వారు తెలిపారు. అన్ని బోధనాసుపత్రుల్లోని ఖాళీలను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా భర్తీ చేస్తామని, నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీని నిలిపివేసి రెగ్యులర్‌గా నియమిస్తామని తమకు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. ఖాళీలను మెడికల్ బోర్డు నేతృత్వంలో భర్తీ చేస్తామన్నారని తెలిపారు. విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్ రావడంతో దానిపై సమ్మె కొనసాగించినా సర్కారు వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో జూడాలు సమ్మె విరమించారు. ఇదిలావుండగా విరమణ వయసును ఏకంగా ఏడేళ్లు పెంచడంతో బోధనాసుపత్రుల్లోని అనేక మంది వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్యం) ప్రధాన కార్యదర్శి లాలూప్రసాద్ సహా పలువురు నేతలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి హర్షం వెలిబుచ్చారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు కూడా విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే నిర్ణీతకాల పదోన్నతులు తమకు కూడా కల్పించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
వైద్యశాఖకు డిప్యూటేషన్ల జబ్బు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఇష్టారాజ్యపు పాలన సాగుతోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా వైద్యులు, నర్సులను ప్రభుత్వమే మంజూరు చేయకపోగా, ఉన్నవారిని కోరుకున్న చోటుకు పంపించే బృహత్తర కార్యక్రమం ఇక్కడ యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ వైద్యాధికారికి క్యాంప్ క్లర్క్‌గా పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి డాక్టర్లు, స్టాఫ్‌నర్సుల తలరాతలు రాసే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ డాక్టరు లేదా నర్సు, ఇతర స్టాఫ్‌లో ఎక్కడికి డిప్యూటేషన్ మీద వెళ్తారో తెలియని పరిస్థితి పెద్దపల్లి డీఎంహెచ్‌వో పరిధిలో నెలకొంది. ఇటీవలి కాలంలో డిప్యూటేషన్ల పేరిట స్టాఫ్‌నర్సులు, ఇతర స్టాఫ్ కోరుకున్న చోటుకు వెళ్లిపోతుండడంతో డాక్టర్లకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డాక్టర్ల సంఘం ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేయడంతో తంతు వెలుగులోకి వచ్చింది. బేరాలు మాట్లాడుకొని స్టాఫ్‌నర్సులను కోరుకున్న చోటకు పంపేలా వైద్యాధికారి సీసీ కీలక పాత్ర పోషిస్తున్న తీరును వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ వంటి మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే వైద్యాధికారికి సీసీగా కొనసాగాలనే నిబంధనలను కూడా పక్కనబెట్టి కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటినుంచి కమాన్‌పూర్‌లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగిని సీసీగా కొనసాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కాగా వైద్యులు, ఉద్యోగుల ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా పెద్దపల్లికి రానుండడం గమనార్హం. ఇదీ అడ్డగోలు డిప్యూటేషన్ల తీరు.. పెద్దపల్లి జిల్లాలో 15 పీహెచ్‌సీలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు సుల్తానాబాద్‌లోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నేతృత్వంలో కొనసాగుతాయి. జిల్లాలోని వైద్య అవసరాలను బట్టి స్టాఫ్‌నర్సులను, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్ మీద మార్పులు, చేర్పులు చేసే అధికారం వైద్యాధికారికి ఉంటుంది. వైద్యాధికారి వద్ద పనిచేసే సీసీ సిఫారసులు పెరగడం, ఇతరత్రా కారణాలతో ఇటీవలి కాలంలో అవసరం ఉన్నా, లేకపోయినా ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు జరిగినట్లు వైద్యులు వాపోతున్నారు. సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రిలో పని చేస్తున్న నలుగురు స్టాఫ్‌నర్సులను బేగంపేట్–2, రాఘవపూర్–1, రాగినేడు–1, ఎలిగేడు–1 పీహెచ్‌సీలకు పంపించారు. జూలపల్లి–1 స్టాఫ్‌నర్సును ఏకంగా కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు డిప్యూటేషన్ మీద పంపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సమాచారం. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు స్టాఫ్‌నర్సులను కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు పంపించడం వెనుక భారీగా చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సూపర్వైజర్లను రామగుండం కార్పొరేషన్‌కు డిప్యూటేషన్‌కు లక్షల రూపాయల లావాదేవీలు నడిచినట్లు సమాచారం. వారి స్థానంలో వివిధ పీహెచ్‌సీల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్‌పై జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కూనారం, బేగంపేట కొత్త పీహెచ్‌సీలు కాగా, ఇక్కడ ఏఎన్ఎంలతో సేవలు అందిస్తే సరిపోతుంది. కానీ స్టాఫ్‌నర్సులను అక్కడికి పంపించడం వల్ల సుల్తానాబాద్ వంటి చోట ఇబ్బంది ఎదురవుతోంది. ఎలిగేడు, రాగినేడుకు స్టాఫ్‌నర్సుల మంజూరు లేకపోయినా, అక్కడికి పంపించారు. టీబీ హాస్పిటల్లో పనిచేసే ఓ నర్సును కూడా కరీంనగర్ నర్సింగ్ కాలేజీకి పంపడం వెనుక కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. డాక్టర్లకు సైతం డిప్యూటేషనే స్టాఫ్నర్సులనే కాకుండా డాక్టర్లను సైతం డిప్యూటేషన్ మీద జిల్లాలో ఇష్టమున్న చోటికి పంపిస్తుండడం జరుగుతోంది. బసంత్‌నగర్‌లో పనిచేసే ఇద్దరు డాక్టర్లను పెద్దపల్లికి, గర్రెపల్లి పీహెచ్సీ నుంచి బసంత్‌నగర్‌కు, గర్రెపల్లి లేడీ డాక్టర్లు ఇద్దరిని డిప్యూటేషన్‌పై బేగంపేట్‌కు, బేగంపేట్‌లో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ను గర్రెపల్లికి డిప్యూటేషన్ వేశారు. అంతతో ఆగకుండా 104 సిబ్బందిని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి డిప్యూటేషన్ మీద రప్పించుకొని, అందులో పనిచేస్తున్న 4వ తరగతి సిబ్బందిని వివిధ పీహెచ్‌సీలు, యూపిహెచ్సి, వివిధ శాఖలకు పంపించినట్లు ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. నేడు పెద్దపల్లి జిల్లాకు కమిషనర్ రాక ఈ నెల 3న వైద్యారోగ్య శాఖ కమిషనర్ యోగితారాణా పెద్దపల్లి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఆమె ఫీల్డ్ విజిట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో చోటు చేసుకున్న డిప్యూటేషన్లు, అవినీతి అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు తదితర అంశాలను ఉద్యోగులు ఆమె దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిసింది. -
రక్త కన్నీరు!
కంటి చూపు మందగిస్తే అద్దాలు వాడొచ్చు. కాళ్లు, చేతులు పనిచేయకపోతే కృత్రిమ పరికరాలు పెట్టుకోవచ్చు. కానీ రక్తానికి ప్రత్యామ్నాయంగా ఏ ద్రవాన్ని వాడే పరిస్థితి లేదు. కేవలం ఒక వ్యక్తి చేసే రక్తదానమే మరొకరిని ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అందుకే అన్ని దానాల్లోకన్నా రక్తదానం మిన్న అనే నానుడి ప్రాచుర్యం పొందుతోంది. కానీ జిల్లాలో ప్రస్తుతం రక్తనిల్వలు నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు అర్బన్: జిల్లాలో ఒక నెలకు 800 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. కానీ ఇందులో సగం యూనిట్లు కూడా ప్రభు త్వ వైద్యశాలల్లో, ఇతర స్వచ్ఛంద సంస్థల్లో అందుబాటులో లేవు. కారణం.. వేసవి సెలవులు కావడం. నిజం.. వేసవి సెలవులు కావడంతో ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఊర్ల కు వెళ్లిపోయారు. దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లాలో రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిండుకుంది. ఫలితంగా గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సకాలంలో రక్తం అందే పరిస్థితి కనిపించడం లేదు. నెగటివ్ గ్రూపులకు ఇబ్బందే చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం వందకు పైగా యూనిట్ల రక్తం ఎప్పుడూ నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు 40 యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. ఇందులోనూ స్క్రీనింగ్ చేసిన పాజిటివ్ గ్రూపులు 30 వరకు ఉంటే నెగటివ్ గ్రూపులన్నీ కలిపి ఎనిమిదే ఉన్నాయి. బీ–నెగటివ్ అయితే ఒక్కటే యూనిట్ ఉంది. ఈ రక్త గ్రూపు ఉన్న గర్భిణి ఎవరైనా కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చి తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాలపై వచ్చే పరిస్థితి నెలకొంది. శస్త్ర చికిత్స సమయంలో కనీసం మూడు యూనిట్ల రక్తం కావాలి. ఇక్కడంతలేదు. చిత్తూరు రక్తనిధిలోనే రక్తం లేకపోవడంతో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుత్తూరు, పీలేరు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు చిత్తూరు నుంచి సరఫరా అయ్యే రక్తనిల్వలు ఆగిపోయాయి. రక్తదానం ఎవరు చేయవచ్చంటే.. వయసు 18–60 ఏళ్ల లోపు ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులైతే నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. సన్నగా ఉన్నవారు రక్తదానం చేయకూడదని చాలామందిలో అపోహ ఉంది. ఇది తప్పు. 45 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేశాక కొన్ని రోజుల పాటు పనులన్నీ మానుకోవాలనే అపోహ వద్దు. రక్తం ఇచ్చాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని పళ్ల రసం, పాలు వంటి స్వల్ప ఆహారం తీసుకున్నాక మళ్లీ పనులు చేసుకోవచ్చు. డబ్బులిచ్చినా దొరకడం లేదు జిల్లాలోని 15 ప్రాంతాల్లో రక్తనిధి కేంద్రాలున్నాయి. 250మి.లీ రక్తాన్ని ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ వైద్యశాలలకు అనీమియా, రోడ్డు ప్రమాద బాధితులు వచ్చినప్పుడు కనీసం మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలు ఉండవు. వీళ్లు ఓ వ్యక్తి ద్వారా రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేయించి, రూ.800 చెల్లించి ఒక్క యూనిట్ రక్తాన్ని వారి ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం డబ్బులు చెల్లించినా కూడా జిల్లాలో ఎక్కడా రక్తం దొరకడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా రక్తం తెప్పించుకుంటున్నారు. -
సంజీవనిపై ప్రైవేటు!
అసలే పెద్దాసుపత్రి. ఆరేడు జిల్లాలకు పెద్దదిక్కు. నిత్యం వేలాదిమంది రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏ వ్యాపారం పెట్టినా డబ్బే డబ్బు. అదీ మందుల వ్యాపారమైతే లాభాలకు హద్దే ఉండదు. ఇదే ఆలోచన మంత్రి అనుచరుడికి వచ్చింది. పైగా ఆ మంత్రికి సొంత శాఖ. చెబితే కాదనే సాహసం ఎవరూ చేయరు. అనుకున్నదే తడువు ఆసుపత్రి ‘పెద్ద’పై ఒత్తిడి తెచ్చారు. అసలే అక్రమాల్లో కూరుకుపోయిన ఆ ‘పెద్ద’ కూడా మంత్రి ప్రాపకం కోసం జీహుజూర్ అంటున్నారు. ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటయితే ప్రస్తుతం పేదలకు కాస్తోకూస్తో ఊరటనిస్తున్న చౌక మందుల (జనరిక్) దుకాణాలు మూతపడడం ఖాయంగా కన్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తాజాగా ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్ మందుల దుకాణాల (అన్న సంజీవని)ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో మంత్రి అనుచరుడు ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇవ్వొద్దంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులకు సైతం తూట్లు పొడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన అనుచరుడు షాపు పెట్టుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై మంత్రి ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పే సాహసం కూడా సూపరింటెండెంట్ చేయడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. మంత్రి ఆదేశాలను ఆచరణలోకి తెచ్చేందుకు వీలుగా ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనను సైతం అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టెండరు లేకుండానే డైట్ కాంట్రాక్టును మరో ఏడాది పాటు కొనసాగించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెడికల్ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మొత్తమ్మీద ఆసుపత్రి కేంద్రంగా దందా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. జనరిక్ షాపులపై దొంగ దెబ్బ! గతంలో కర్నూలు సర్వజనాసుపత్రిలో ప్రైవేటు మెడికల్ షాపులు ఉండేవి. అతి తక్కువ బాడుగకే షాపులు ఇచ్చేవారు. అయితే, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేటు మెడికల్ షాపులను రద్దు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇక మీదట ఎలాంటి ప్రైవేటు మెడికల్ షాపులనూ అనుమతించవద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం జనరిక్ మందుల షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుచరుడికి అనుమతి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి. తలూపుతున్న సూపరింటెండెంట్! పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ ఏళ్లుగా అద్దె చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని ఆర్అండ్బీ క్వార్టర్స్‌లో ‘హార్ట్ ఫౌండేషన్’ కొనసాగించారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మాటలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆందోళనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనరిక్ ఔషధశాలలను దెబ్బతీసే విధంగా, ప్రైవేటు మెడికల్ షాపు ఏర్పాటుకు అనుగుణంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లతో మంతనాలు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పలు సంస్థలు కాంట్రాక్టు పనులు చేపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనీ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. రోగులకు ఆహార పంపిణీ మొదలుకుని.. సెక్యూరిటీ, స్కావెంజర్ పనులు, వివిధ పరికరాల కొనుగోళ్లు, మందుల సరఫరా వంటి అనేక కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని కాంట్రాక్ట్‌ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. వాటిని టెండర్లు పిలవకుండానే కొనసాగించారు. అయితే, ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఫరూక్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులు చేస్తున్న వారందరికీ మంత్రి పీఏ నేరుగా ఫోన్లు చేసి.. వ్యక్తిగతంగా కలవాలంటూ కబురు పంపారు. ఏయే కాంట్రాక్టు సంస్థ ఏ విధంగా పనులు చేస్తోందనే విషయాలను కూడా ఆసుపత్రిలోని కొద్ది మంది సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా ఆయా కాంట్రాక్టు సంస్థలను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు అనేక డిమాండ్లు పెట్టి నెరవేర్చుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇప్పుడు ఏకంగా తన అనుచరుడికి మెడికల్ షాపు అప్పగించేలా మంత్రి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
పంజా విసురుతోన్న డెంగీ
సాక్షి, హైదరాబాద్: కాలం కాని కాలంలో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా పడగ విప్పుతోంది. ఆస్పత్రుల్లో డెంగీ, మలేరియా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క నిలోఫర్‌లోనే ప్రతీ రోజూ రెండు మూడు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో డెంగీ, మలేరియా బాధితులు వస్తున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనైతే మలేరియా వ్యాప్తి పెరిగింది. ఎన్నికల కోడ్‌తో ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోగా, దీన్నే సాకుగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు... మూడు నాలుగేళ్ల క్రితం వరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు కొడుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండేళ్ల డెంగీ కేసులను పరిశీలిస్తే సగం వరకు అన్సీజన్లోనే నమోదయ్యాయి. గతేడాది జనవరి–ఏప్రిల్‌ల్లో 237 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 457 కేసులు నమోదయ్యాయి. 2018లో అదే 4 నెలల కాలంలో 289 మలేరియా కేసులు నమోదైతే, ఈ ఏడాది 437 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలానికి చికున్ గున్యా కేసులు 21 నమోదు కాగా, ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమైన దోమ పగలే కుడుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో రాత్రిళ్లు అదిరిపోయే కాంతులు ఉంటుండటంతో దోమ కూడా రూటు మార్చింద ని డాక్టర్ కమల్‌నాథ్ అంటున్నారు. డెంగీ కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమే అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ: గత అంచనాల ప్రకారం మలేరియా పీడిత గ్రామాలు 2,067 కాగా.. డెంగీ ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు 1,414గా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. మన దేశంలో గతేడాది జికా వ్యాధిగ్రస్థులను గుర్తించారు. ఈ వ్యాధి కారక దోమ, డెంగీ కారక దోమ ఒక్కటే కావడం గమనార్హం. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్ల సంఖ్య సాధారణమే ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్స పేరు తో వేల వేలకు గుంజుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల్లేక ‘ప్రైవేట్’ను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్లేట్లెట్లు పడిపోయిన తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. -
దూది, సూది మందుల్లేవు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రికి వెళితే.. రోగికి ఇంజెక్షన్ వేయాలంటే సిరంజీని బంధువులే కొని తేవాలి. అప్పుడే ఇంజెక్షన్ ఇస్తారు. కాలికి గాయమైతే దూది, మందు రోగులే కొనుక్కోవాలి. లేకుంటే ఏదైనా మందు రాసి పంపుతారు. సెలైన్ పెట్టాల్సి వస్తే రోగులు వాటిని కొనుక్కొచ్చి ఇవ్వాలి. జ్వరం వస్తే కనీసం ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉండవు. ఇదీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి. అందుకే ఆయా ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఏదో గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో ఉండే ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లోనే కాదు, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ప్రధాన బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అందుకే వైద్యులపై రోగుల బంధువులు దాడులు చేసే పరిస్థితి నెలకొంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రులకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నా అధికారులు మాత్రం వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కేటాయింపులే ఘనం.. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, ప్రజారోగ్య ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు అవసరమైన మందులు, సర్జికల్ ఐటమ్స్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. సిరంజీలు, గ్లౌవ్స్, దూది, బ్లేడ్లు, బ్యాండేజీ, కత్తెరలు ఇలా వందలాది సర్జికల్ ఐటమ్స్ ఆసుపత్రులకు చాలా అవసరం. ఇవి లేకుండా కనీస ప్రాథమిక వైద్యం చేయడం కష్టం. ఇలాంటి వాటిని కూడా కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాసుపత్రులు ఇచ్చే ఇండెంట్ ప్రకారం రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) వాటిని సరఫరా చేయాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మందుల కోసం ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. సర్జికల్ ఐటమ్స్ కోసం రూ.75 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది మొత్తం నిధులను ఖర్చు చేశారు. ఆ ప్రకారం ఆసుపత్రులకు మందులు, సర్జికల్ ఐటమ్స్ సరఫరా జరిగాయి. అయినా అక్కడక్కడ కొరత ఉండనే ఉంది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మందులు, సర్జికల్ ఐటమ్స్ కోసం బడెట్లో నిధులు భారీగానే కేటాయించింది. మందుల కోసం రూ.320 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.210 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సర్జికల్ ఐటమ్స్ కోసం ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయిస్తే రూ.55 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో రూ.90 కోట్లకు ఇండెంట్ పిలిచారు. బోధనాసుపత్రుల నుంచి రూ.45 కోట్లకు ఇండెంట్ వచ్చింది. మిగిలిన ఆసుపత్రుల నుంచి కూడా ఇండెంట్ పంపుతున్నారు. కానీ అధికారులు ఈ ఇండెంట్ ప్రకారం సర్జికల్ ఐటమ్స్ సరఫరా చేసేందుకు ససేమిరా అంటున్నారని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు కన్నా ఈసారి ఎందుకు ఎక్కువ అవసరమన్న వింత వాదనను టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు తెస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. పాత వాడకం ప్రకారమే ఈసారి కూడా నిధులు ఇస్తామన్న వైఖరి సమంజసం కాదంటున్నారు. ప్రభుత్వం బడ్జెట్ పెంచడమే నేరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వీరికి వచ్చిన నష్టమేంటని నిలదీస్తున్నారు. అవసరం మేరకు కేటాయింపులు సర్జికల్ ఐటమ్స్ కోసం అవసరమైన కేటాయింపులు చేస్తూనే ఉన్నాం. ఎక్కడా ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ కొరత ఉన్నాయో ఆన్లైన్ ద్వారా తెలుస్తుంది. ఆ ప్రకారం కేటాయింపులు చేసి కొనుగోలు చేస్తాం. అనవసరంగా ఎవరి కోసమో కొనుగోలు చేయబోం. ప్రస్తుతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏమేరకు ఇండెంట్లు కావాలన్న దానిపై చర్చిస్తున్నాం. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
తల్లీబిడ్డలకు భరోసా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్ సేవలు అందుతున్నాయి. ఈ విభాగాలన్నింటికీ రెండు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. సిజేరియన్లు కూడా ఈ థియేటర్లోనే చేస్తున్నారు. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం మంజూరుతో.. తల్లీబిడ్డలకు వైద్య సేవల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ విభాగానికి విడిగా రెండు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. శుభపరిణామం.. కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈక్రమంలో వంద నుంచి 250 పడకలకు ఆస్పత్రి సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. ఇది ఇంతవరకు అమలు కాలేదు. వంద పడకల్లోనే గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలకు 25– 30 బెడ్లను వినియోగిస్తున్నారు. మిగిలిన పడకలను ఇతర విభాగాల పేషెంట్లకు కేటాయిస్తున్నారు. గైనిక్, పీడియాట్రిక్ విభాగాలకు ఆ పడకలు ఏమాత్రం చాలడం లేవు. కేసీఆర్ కిట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి జిల్లా ఆస్పత్రికి గైనిక్ పేషెంట్లు రాక పెరిగింది. నెలకు సగటున 200లకుపైగా సాధారణ కాన్పులు, సిజేరియన్లు జరుగుతున్నాయి. నిత్యం ఓపీ సంఖ్య 250కి తగ్గడం లేదు. రోజు పది మంది ఇన్‌పేషంట్లు డిశ్చార్జ్ అవుతుండగా.. అంతే మొత్తంలో ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు కానుండడం శుభపరిణామం. ఫలితంగా విస్తృత స్థాయిలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు వైద్య సేవలు అందనున్నాయి. మరిన్ని పోస్టులు మంజూరు పీడియాట్రిక్, గైనిక్ విభాగాల్లో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేరు. ప్రస్తుతం ఆరుగురు రెగ్యులర్ గైనిక్ వైద్యులు, మరో ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు ఉన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం రాకతో మరిన్ని పోస్టులు వచ్చే వీలుంది. అదనంగా గైనిక్ వైద్యులు, సిజేరియన్లలో కీలకమైన అనస్థిషియన్, చిన్న పిల్లల వైద్య నిపుణులు నాలుగు చొప్పున మంజూరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వీటితోపాటు నర్సు ఇతర పారామెడికల్ పోస్టులు కూడా వచ్చే వీలుందని పేర్కొంటున్నాయి. స్థలం ఎక్కడ? ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జీ+2 అంతస్తుల్లో కొనసాగుతోంది. ఇదే భవనంపై మరో అంతస్తు నిర్మించి అక్కడ మాతాశిశు సంరక్షణ కేంద్ర ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా ఆస్పత్రి అధికార వర్గాలు భావిస్తున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని, తద్వారా రోగులకు వ్యయప్రయాసాలకు తప్పుతాయని చెబుతున్నారు. అయితే, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కనీసం అర ఎకరం స్థలం కావాలని వైద్యవిధాన పరిషత్ డైరెక్టరేట్ పేర్కొంటోంది. భూముల ధరలు చుక్కలనంటుతున్న శేరిలింగంపల్లిలో ఆమేరకు భూమి అందుబాటులో లేదని అధికారులు పేర్కొంటున్నారు. స్థలం విషయమై త్వరలో కలెక్టర్‌ను సంప్రదించనున్నట్లు సమాచారం. ఒకవేళ స్థలం లభిస్తే మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తారు. స్థల లభ్యత లేకుంటే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవనంపైనే ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. -
‘అర్బన్’లో కాన్పులేవి?
కరీంనగర్‌హెల్త్: జిల్లా కేంద్రంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటివరకు ఒక ప్రసవం కూడా నిర్వహించలేదు. జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో రోగుల తాకిడి తగ్గించి స్థానికంగా మెరుగైన చికిత్స అందుబాటులోకి తేవాలనే ఉద్ధేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ఆరు యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. మాతా శిశు మరణాలు తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే నగరంలోని మూడు పాత అర్బన్ పీహెచ్‌సీలకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేసింది. ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా అన్ని రకాల చికిత్స అందించేందుకు 10 పడకలతో సౌకర్యాలు కల్పించింది. అర్బన్ పీహెచ్సీ పరిధిలో నమోదైన గర్భిణులకు అక్కడే సాధారణ ప్రసవాలు జరిపించాలని లేబర్ రూంలను సైతం ఏర్పాటు చేసి సామగ్రి, సౌకర్యాలు కల్పించింది. అదేస్థాయిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని కూడా నియమించింది. అయినా ఇప్పటివరకు ఒక సాధారణ ప్రసవం కూడా జరగలేదు. ఎంసీహెచ్సీపై ప్రభావం పీహెచ్‌సీల మాదిరిగానే నగరంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించకపోవడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంపై విపరీతమైన ప్రభావం పడుతోంది. ఎక్కడి వారికి అక్కడే ప్రసవాలు జరిపించాలని, ప్రసవం ప్రమాదకరంగా మారిన గర్భిణులు, హైరిస్క్ కేసులను మాత్రమే ఇక్కడకు తీసుకురావాల్సి ఉంది. అయితే సాధారణ ప్రసవాలు కూడా జరుపకుండా ఎసీహెచ్సీకి రెఫర్ చేయడంతో వైద్యసేవలు అందించడం ఇబ్బందికరంగా మారుతోందని, రిస్కు కేసులపై దృష్టి సారించలేక పోతున్నామని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో పెరుగుతున్న కేసులు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2018 ఏప్రిల్ నుంచి 2019 జనవరి వరకు 8554 ప్రసవాలు నిర్వహించారు. 2019 జనవరిలోనే 762 ప్రసవాలు జరిగాయి. మాతా శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశ్యంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించేందుకు చర్యలు చేపట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇంటింటికీ సర్వేలు నిర్వహించి గర్భిణుల పేరు నమోదు చేసుకొని ప్రత్యేక వైద్య సేవలు అందిస్తోంది. గర్బం దాల్చి పేరు నమోదు అయినప్పటి నుంచి ప్రసూతి జరిపించి తల్లితోపాటు శిశువును కూడా ఆరోగ్యంగా ఇంటికి చేర్చుతున్నారు. ఇంటికి చేరిన శిశువుకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతినెలా వ్యాధి నిరోధక టీకాలు వేయడం వంటివి పకడ్బందీగా చేపడుతోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ వంటి ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపయింది. 2018లో 9185 ప్రసవాలు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులతోపాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో 2018లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 9185 ప్రసవాలు నిర్వహించారు. 2016లో 3762 ప్రసవాలు నిర్వహించగా, 2017లో దాదాపు సంఖ్య రెట్టింపై 6945కు చేరింది. 2019 జనవరిలో 762 ప్రసవాలు నిర్వహించారు. వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసవాలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో డాక్టర్లు, సిబ్బందికి వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆయా కేంద్రాల్లో జరుగుతున్న గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందుతున్న వైద్యసేవలపై ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. గర్భిణుల పేరు నమోదు, వారికి అందుతున్న వైద్య సేవలపై దృష్టి సారిస్తోంది. పేరు నమోదు నుంచి డెలివరీ అయ్యే వరకు ప్రతీవారం ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. తొమ్మిది నెలలు నిండే సమయానికి ముందుగానే పరీక్షలు చేసి సుఖప్రసవం కావడానికి చర్యలు చేపడుతుండంతో ప్రసవాలసంఖ్య రెట్టింపు అవుతోంది.