సర్కారీ డాక్టర్ల డబుల్‌ దందా! | Govt Doctors business with Arogya sree | Sakshi
Sakshi News home page

సర్కారీ డాక్టర్ల డబుల్‌ దందా!

Published Sun, Feb 18 2018 3:39 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

Govt Doctors business with Arogya sree - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ పథకంలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. పేదల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోన్న సొ మ్మును కొందరు వైద్యులు అప్పనంగా నొక్కేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కోసం ప్రభుత్వం మం జూరు చేసే నిధుల్లో ప్రభుత్వ వైద్యులకు కేటాయింపులు ఉంటాయి. ఈ చెల్లింపులలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రెండు చోట్లా అధికారికంగా వైద్యులకు ఇచ్చే నిధులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు, పర్యవేక్షణ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులతో సంబంధమున్న వారే కావడంతో ఈ అక్రమాలకు అడ్డులేకుండా పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా అంకితభావంతో కేవలం ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే పని చేసే వైద్యులు నష్టపోతున్నారు.
 
35 శాతం ప్రభుత్వ వైద్యులకు.. 
ఆరోగ్యశ్రీ కింద పేదల వైద్యం కోసం ఏటా రూ.500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 85 లక్షల పేద కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లోని 2.75 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. వీరికి వైద్యం అందించిన ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో అయితే శస్త్ర చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ఆయా ఆస్పత్రి యాజమాన్యాలకు చెల్లిస్తుంది. ప్రభుత్వాసుపత్రుల్లో శస్త్రచికిత్స జరిగితే.. దీనికయ్యే ఖర్చులో 20 శాతం మొత్తాన్ని రివాల్వింగ్‌ ఫండ్‌గా పక్కనబెడతారు. మిగిలిన 80 శాతం మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు సదరు ఆస్పత్రికి విడుదల చేస్తుంది. ఈ 80 శాతంలో 35 శాతం శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యులకు, వైద్య సహాయ సిబ్బందికి ఇస్తారు. మిగిలిన 45 శాతాన్ని ఆస్పత్రి అభివృద్ధి నిధి కింద జమ చేస్తారు.

శస్త్రచికిత్సల్లో పాల్గొనకున్నా
వైద్య సిబ్బందికి చెల్లించే ఈ 35 శాతం నిధుల విషయంలోనే అవకతవకలు జరుగుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులలోని చాలా మంది వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులలో భాగస్వాములుగా ఉంటున్నారు. వీరు డ్యూటీ సమయంలో ప్రభుత్వాసుపత్రులలో లేకున్నా... కొందరి చలవతో శస్త్ర చికిత్స చేసిన వైద్య సిబ్బంది బృందంలో సభ్యులుగా నమోదవుతున్నారు. ఆరోగ్యశ్రీ నిధులలో వాటా తీసుకుంటున్నారు. ఆయా ఆస్పత్రులలోని తమ విభాగం పరిధిలోని ఇతర వైద్యుడు చేసే శస్త్ర చికిత్సకు, రెసిడెంట్‌ వైద్యులు చేసే చికిత్సలకు సైతం విధి నిర్వహణలో లేని వారి ఖాతాల్లో సైతం డబ్బులు జమ అవుతున్నాయి. ఇలా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసేది ఎవరు, గైర్హాజరయ్యేది ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా చెల్లింపులు జరుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. పర్యవేక్షణ లేమి, చెల్లింపులపై సరైన సాంకేతిక వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఉన్నతాధికారులు గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement