ఆరోగ్యశ్రీ ఇక ‘సూపర్‌’ | YS Jagan Says Aarogyasri in 150 super specialty hospitals in other states | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ఇక ‘సూపర్‌’

Published Thu, Sep 19 2019 3:49 AM | Last Updated on Sat, Oct 26 2019 6:41 PM

YS Jagan Says Aarogyasri in 150 super specialty hospitals in other states - Sakshi

ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తాం. రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తాం. ఇదివరకెన్నడూ ఇలాంటి సౌకర్యం లేదు. పేదలు ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కొన్నాళ్లు పనులకు వెళ్లలేరు. ఆ సమయంలో వారి ఇల్లు గడవడం కష్టం. అందుకే మానవతా దృక్పథంతో ఈ సాయం చేస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో (ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది. సుమారు 100కు పైగా సిఫార్సులతో 182 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై సుమారు 3 గంటల పాటు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు.


2020 జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో కూడిన ఆరోగ్యశ్రీని పైలెట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని చెప్పారు. కొత్తగా అమలయ్యే ఆరోగ్యశ్రీ పథకంలో 2 వేల వ్యాధులకు వైద్యం అందిస్తామని, వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. అనంతరం లోటుపాట్లను సమీక్షించి 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు 1200 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందని, ఆ తర్వాత 2 వేల జబ్బులను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందాలన్న లక్ష్యం మేరకు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్‌ 21వ తేదీ నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం వెల్లడించారు. 
 
పెన్షన్‌ పరిధిలోకి మరికొన్ని వ్యాధులు 
ప్రస్తుతం కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తున్నామని, ఇకపై మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికీ నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తలసేమియా, కుష్టు, పోలియో, బోధకాలు, పుట్టుకతోనే వచ్చే హెచ్‌చ్‌వీ, పక్షవాతం బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాధిగ్రస్తుల జాబితాను రూపొందించాలని, వీలైనంత త్వరగా ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని చెప్పారు. 
 
ప్రభుత్వ వైద్యులకు సంతృప్తికర వేతనాలు 
వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్‌ ప్రాక్టీసు నిర్వహించకూడదన్న విధానం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఇక్కడ కూడా అమలు చేస్తే బావుంటుందని నిపుణుల కమిటీ సీఎంకు సూచించింది. ఈ మేరకు వారికి సంతృప్తికరంగా వేతనాలు పెంచి, ఆ విధానాన్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు ఎంత మేరకు వేతనాలు పెంచాలో అధికారులు నివేదిక ఇస్తే, దాని ప్రకారం పెంచి, ప్రైవేట్‌ ప్రాక్టీసును రద్దు చేస్తామన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ కోసం తక్షణమే నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వాసుపత్రులు కొత్తకళను సంతరించుకునేలా మార్పులు తీసుకురావాలని చెప్పారు. 104, 108 వాహనాల నిర్వహణకు సమర్థ యంత్రాంగం ఉండాలని, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వాటి నిర్వహణ ముఖ్యమైనదని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పీపీపీ ప్రాజెక్టుల్లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో లోపాలను కమిటీ ముఖ్యమంత్రికి వివరించగా.. వీటిపై చర్యలు తీసుకోవాలని, ఇకపై నాణ్యమైన మందులను కొనుగోలు చేయాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ చేపట్టాలన్నారు. 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలసి ఆరోగ్య శాఖలో సంస్కరణలపై నివేదిక అందజేస్తున్న నిపుణుల కమిటీ. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు 
 
మూడు కొత్త వైద్య కళాశాలలు 
రాష్ట్రంలో ఇప్పటికే పాడేరు, గురజాల, విజయనగరంలలో కొత్త వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవికాక  పులివెందుల, మార్కాపురం, మచిలీపట్నంలో కొత్త వైద్య కళాశాలలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇటీవల కేంద్రం 75 కొత్త వైద్య కళాశాలలను ప్రకటించిందని, వాటిల్లో మనకు వచ్చే అవకాశం లేదని అధికారులు వివరించగా.. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘ఎందుకు ఇవ్వరు.. మనం వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి కళాశాలలు ఇవ్వాలని కోరదాం.. కచ్చితంగా ఇస్తారన్న నమ్మకముంది’ అని సీఎం అన్నారు. వీలైనంత త్వరలో ఆ ప్రాంతాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్‌)లు తయారు చేయాలని ఆదేశించారు. 
 
కొత్తగా స్విమ్స్‌ హెల్త్‌ యూనివర్శిటీ 
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ మాత్రమే ఉంది. ఈ యూనివర్శిటీ పరిధిలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 18 ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇకపై స్విమ్స్‌ ఆస్పత్రి కేంద్రంగా కొత్త హెల్త్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వైద్య కళాశాలలన్నీ స్విమ్స్‌ యూనివర్శిటీ పరిధిలోకి, మిగతా జిల్లాల వైద్య కళాశాలలు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల పర్యవేక్షణ, నిర్వహణ మరింత సులభంగా ఉంటుందని అధికారులకు సూచించారు. ఈ దిశగా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించారు.  

రోగి ప్రభుత్వాసుపత్రికి మాత్రమే వెళ్లేలా వాటి రూపు రేఖలు మార్చడంతో పాటు సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తేనే మంచి వైద్యం అందుతుందన్న నమ్మకం కలిగించాలి. ప్రతి వైద్య కళాశాలలోనూ నర్సింగ్‌ కళాశాల కూడా ఉండాలి. గ్రామీణ స్థాయిలో సరైన వైద్యసేవలు అందేలా ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. 
 
ఇటీవల రాజమండ్రి ఆస్పత్రికి వెళ్లా.. పాత పడకలు, తిరగని ఫ్యాన్లు, బూజుపట్టిన కిటికీలు.. చూడ్డానికి ఏమాత్రం బాగోలేదు. ఇలా ఉంటే రోగులు ఎలా వస్తారు? ఇలా కాదు..ప్రైవేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రులను మార్చండి. నిధుల కొరత రాకుండా చూస్తాము. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement