Dr YSR Aarogyasri
-
ఆరోగ్య శ్రీ సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు
సాక్షి, విజయవాడ: మంగళగిరి(గుంటూరు)లోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందంటూ వస్తున్న కథనాలపై ట్రస్ట్ స్పందించింది. జరిగింది స్వల్ప ప్రమాదమేనని, ఆ ఘటనతో ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రి హెల్త్ కేర్ ట్రస్ట్. మంగళగిరి డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కాలి పొగలు వ్యాపించడంతో ఉద్యోగులని బయటకి పంపించాం. దీని వలన ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. సేవలకి ఎక్కడా అంతరాయం కలగలేదు అని ఆ ప్రకటనలో పేర్కొంది. -
YSR Aarogyasri: 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు
శ్రీకాకుళం: ఆరోగ్య శ్రీ.. వేలాది ప్రాణాలకు కాపలా. లక్షలాది మంది సామాన్యులకు సంజీవని. వైఎస్సార్ నుంచి వైఎస్సార్ సీపీ ప్రభు త్వం వరకు అందరికీ మానస పుత్రిక. ఈ పథకం ఎందుకంత కీర్తి సంపాదించిందో మరో మారు నిరూపితమైంది. దీంతో పాటు ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా అందరికీ తెలిసింది. ఇచ్ఛాపురం పట్టణం ఫకీరుపేట వార్డు సచి వాలయానికి చెందిన వలంటీర్ వర్రి సింహాచలం సోమవారం ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిపై వెళ్తుండగా, మందస హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యు లు సింహాచలంను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సింహాచలంకు అంతవరకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ఉచితంగా చికిత్స చేయడం కుదరలేదు. అసలే వారిది పేద కుటుంబం.. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడంతో బాధితుడి బంధువులు ఈ విషయాన్ని సీడాప్ చైర్మన్ సాడి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి దృష్టికి తెచ్చారు. యన తక్షణమే స్పందించి బాధితుని వివరాలు నమోదు చేసుకుని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అడిషనల్ సీఈఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. వెంటనే హెల్త్ కార్డు మంజూ రు చేయాలనికోరారు. మధ్యాహ్నం 1.53కు ఆయ న ఫోన్ చేస్తే కేవలం 39నిమిషాల్లో అంటే మధ్యా హ్నం 2.32కు ఆరోగ్య శ్రీ కార్డు రెడీ అయిపోయింది. ఆ కార్డు సాయంతో సింహాచలంకు సకాలంలో ఉచితంగానే కార్పొరేట్ వైద్యం చేయగలిగారు. సకాలంలో స్పందించి తమకు సాయం చేసిన ప్రభుత్వానికి సింహాచలం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం పేదలకు సంజీవని అని కొనియాడారు. -
ఆంధ్రజ్యోతి కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు సరిగా జరగడంలేదంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనం అవాస్తవమని ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు క్లెయిమ్స్ చెల్లించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరానికి విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధుల్ని నెట్వర్క్ ఆస్పత్రులకు వినియోగించారనేది సత్యదూరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు నేషనల్ హెల్త్ ఏజెన్సీ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,790 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఈహెచ్ఎస్కు సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.199.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈహెచ్ఎస్ కింద ఈ ఏడాది ఇప్పటివరకు 3,25,390 మంది చికిత్స పొందారని వివరించారు. చదవండి: (గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్) -
వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష
సాక్షి, అమరావతి: సీజనల్ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది. 7,032 మందికి చికిత్స ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్ కిట్‌లో పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు. పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్‌మ్యారో సప్రెషన్)తో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ జ్వరాల బారినపడి.. ప్లేట్లెట్స్ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు -
ఆరోగ్యశ్రీ కేసు.. తిరకాసు
కంట్లో నలుసు పడినా, కాలుకు ఆపరేషన్ అవసరమైనా కాసుల ఊసులు లేకుండా కార్పొరేట్ గుమ్మం తొక్కేందుకు ఆరోగ్యశ్రీనే ఎర్రతివాచీ పరిచింది. ఎందరో అభాగ్యులకు ఆయువుపోసి సంజీవనిగా నిలిచింది. గత ఐదేళ్లలో టీడీపీ నిర్లక్ష్యం కారణంగా ఐసీయూలోకి చేరిన పథకానికి మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆయువు పోసింది. ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, అర్హత పరిధి పెంచి అందరి ఆరోగ్యాశ్రీకి అభయమిచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మంచి మనసుతో స్వాగతించి పేదలకు సేవ చేసే భాగ్యాన్ని సద్వినియోగ పరుచుకోవాల్సిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని వక్రమార్గంలో పయనిస్తున్నాయి. యాజమాన్యాలు కాసుల కక్కుర్తితో రోగులను కష్టాల సుడిగుండంలోకి నెడుతున్నాయి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత ఉన్న వ్యాధులకూ ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నత నిర్ణయానికి తూట్లు పొడుస్తూ పేదోడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. సాక్షి, గుంటూరు: పైసా ఖర్చు లేకుండా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఇతర రాష్ట్రాల్లో సైతం పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందే సౌకర్యాన్ని కల్పించారు. అయితే దేవుడు కరుణించినా.. పూజారి వరం ఇవ్వలేదన్న చందంగా.. ప్రభుత్వ లక్ష్యానికి కొన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. ఆరోశ్రీ అర్హత ఉన్న జబ్బులకు సైతం ఉచిత వైద్యం చేయకుండా చుక్కలు చూపిస్తున్నాయి. అత్యవసరాన్ని బట్టి ఆయా జబ్బులకు వైద్యం అందించి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇటీవల మెదడులో రక్తం గడ్డకట్టి చికిత్స నిమిత్తం మంగళరిలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఓ మహిళ చేరింది. సదరు మెదడు సంబంధిత జబ్బుఆరోగ్య శ్రీ కిందకు వస్తుంది. అయితే ఆస్పత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పింది. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండటంతో వైద్యం చేయించుకున్నారు. రోగి బంధువులు మరుసటి రోజు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌ను సంప్రదించగా మెదడు సంబంధిత జబ్బుకు ఆరోగ్య శ్రీ వర్తిసుందని, ఆస్పత్రికి ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ పథకం కిందకు కేసును బదలాయించాలని సూచించారు. అయితే కేసును ఆరోగ్యశ్రీ కిందకు బదలాయించకుండా ఫీజు రూ.4 లక్షలు కట్టాల్సిం దేనని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గుంటూరులో మరో ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ పథకంలో ఉన్న కొన్ని రకాల జబ్బులకు మాత్రమే చికిత్స అందిస్తోంది. అవీ అధిక మొత్తంలో నిధులు వచ్చే కేసులను మాత్రమే అడ్మిట్ చేసుకుంటోంది. తక్కువ మొత్తంలో ఆరోగ్య శ్రీ ప్యాకేజీ ఉండే కేసులను నిరాకరిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కో–ఆర్డీనేటర్‌కు ఫిర్యాదులు అందాయి. తొలగింపునకు సిఫార్సు చేస్తాం పథకం వర్తించదని రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే సంబం«ధిత ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటాం. ఈ తరహా వరుస ఫిర్యాదులు అందితే నెట్వర్క్ నుంచి ఆస్పత్రిని తొలగింపునకు సీఈవోకు సిఫార్సు చేస్తాం. పథకం వర్తించదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెడితే 8333814007 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.– డాక్టర్ అవినాష్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ -
ఆరోగ్యశ్రీ ఇక ‘సూపర్’
ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తాం. రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తాం. ఇదివరకెన్నడూ ఇలాంటి సౌకర్యం లేదు. పేదలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొన్నాళ్లు పనులకు వెళ్లలేరు. ఆ సమయంలో వారి ఇల్లు గడవడం కష్టం. అందుకే మానవతా దృక్పథంతో ఈ సాయం చేస్తాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నవంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో (ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది. సుమారు 100కు పైగా సిఫార్సులతో 182 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై సుమారు 3 గంటల పాటు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి కొత్త ప్రతిపాదనలతో కూడిన ఆరోగ్యశ్రీని పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తామని చెప్పారు. కొత్తగా అమలయ్యే ఆరోగ్యశ్రీ పథకంలో 2 వేల వ్యాధులకు వైద్యం అందిస్తామని, వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. అనంతరం లోటుపాట్లను సమీక్షించి 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు 1200 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందుతుందని, ఆ తర్వాత 2 వేల జబ్బులను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందాలన్న లక్ష్యం మేరకు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీ నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం వెల్లడించారు. పెన్షన్ పరిధిలోకి మరికొన్ని వ్యాధులు ప్రస్తుతం కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్నామని, ఇకపై మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికీ నెలకు రూ.5 వేలు పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తలసేమియా, కుష్టు, పోలియో, బోధకాలు, పుట్టుకతోనే వచ్చే హెచ్చ్వీ, పక్షవాతం బాధితులకు నెలకు రూ.5 వేలు పింఛన్ ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాధిగ్రస్తుల జాబితాను రూపొందించాలని, వీలైనంత త్వరగా ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు సంతృప్తికర వేతనాలు వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ, ప్రైవేట్ ప్రాక్టీసు నిర్వహించకూడదన్న విధానం పలు రాష్ట్రాల్లో అమల్లో ఉందని, ఇక్కడ కూడా అమలు చేస్తే బావుంటుందని నిపుణుల కమిటీ సీఎంకు సూచించింది. ఈ మేరకు వారికి సంతృప్తికరంగా వేతనాలు పెంచి, ఆ విధానాన్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు ఎంత మేరకు వేతనాలు పెంచాలో అధికారులు నివేదిక ఇస్తే, దాని ప్రకారం పెంచి, ప్రైవేట్ ప్రాక్టీసును రద్దు చేస్తామన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ కోసం తక్షణమే నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వాసుపత్రులు కొత్తకళను సంతరించుకునేలా మార్పులు తీసుకురావాలని చెప్పారు. 104, 108 వాహనాల నిర్వహణకు సమర్థ యంత్రాంగం ఉండాలని, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వాటి నిర్వహణ ముఖ్యమైనదని, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పీపీపీ ప్రాజెక్టుల్లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో లోపాలను కమిటీ ముఖ్యమంత్రికి వివరించగా.. వీటిపై చర్యలు తీసుకోవాలని, ఇకపై నాణ్యమైన మందులను కొనుగోలు చేయాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ చేపట్టాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలసి ఆరోగ్య శాఖలో సంస్కరణలపై నివేదిక అందజేస్తున్న నిపుణుల కమిటీ. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు మూడు కొత్త వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఇప్పటికే పాడేరు, గురజాల, విజయనగరంలలో కొత్త వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇవికాక పులివెందుల, మార్కాపురం, మచిలీపట్నంలో కొత్త వైద్య కళాశాలలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల కేంద్రం 75 కొత్త వైద్య కళాశాలలను ప్రకటించిందని, వాటిల్లో మనకు వచ్చే అవకాశం లేదని అధికారులు వివరించగా.. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘ఎందుకు ఇవ్వరు.. మనం వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి కళాశాలలు ఇవ్వాలని కోరదాం.. కచ్చితంగా ఇస్తారన్న నమ్మకముంది’ అని సీఎం అన్నారు. వీలైనంత త్వరలో ఆ ప్రాంతాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు సమగ్ర నివేదిక (డీపీఆర్)లు తయారు చేయాలని ఆదేశించారు. కొత్తగా స్విమ్స్ హెల్త్ యూనివర్శిటీ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మాత్రమే ఉంది. ఈ యూనివర్శిటీ పరిధిలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇకపై స్విమ్స్ ఆస్పత్రి కేంద్రంగా కొత్త హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వైద్య కళాశాలలన్నీ స్విమ్స్ యూనివర్శిటీ పరిధిలోకి, మిగతా జిల్లాల వైద్య కళాశాలలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల పర్యవేక్షణ, నిర్వహణ మరింత సులభంగా ఉంటుందని అధికారులకు సూచించారు. ఈ దిశగా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించారు. రోగి ప్రభుత్వాసుపత్రికి మాత్రమే వెళ్లేలా వాటి రూపు రేఖలు మార్చడంతో పాటు సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తేనే మంచి వైద్యం అందుతుందన్న నమ్మకం కలిగించాలి. ప్రతి వైద్య కళాశాలలోనూ నర్సింగ్ కళాశాల కూడా ఉండాలి. గ్రామీణ స్థాయిలో సరైన వైద్యసేవలు అందేలా ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఇటీవల రాజమండ్రి ఆస్పత్రికి వెళ్లా.. పాత పడకలు, తిరగని ఫ్యాన్లు, బూజుపట్టిన కిటికీలు.. చూడ్డానికి ఏమాత్రం బాగోలేదు. ఇలా ఉంటే రోగులు ఎలా వస్తారు? ఇలా కాదు..ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రులను మార్చండి. నిధుల కొరత రాకుండా చూస్తాము.