కంట్లో నలుసు పడినా, కాలుకు ఆపరేషన్ అవసరమైనా కాసుల ఊసులు లేకుండా కార్పొరేట్ గుమ్మం తొక్కేందుకు ఆరోగ్యశ్రీనే ఎర్రతివాచీ పరిచింది. ఎందరో అభాగ్యులకు ఆయువుపోసి సంజీవనిగా నిలిచింది. గత ఐదేళ్లలో టీడీపీ నిర్లక్ష్యం కారణంగా ఐసీయూలోకి చేరిన పథకానికి మళ్లీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆయువు పోసింది. ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, అర్హత పరిధి పెంచి అందరి ఆరోగ్యాశ్రీకి అభయమిచ్చింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని మంచి మనసుతో స్వాగతించి పేదలకు సేవ చేసే భాగ్యాన్ని సద్వినియోగ పరుచుకోవాల్సిన ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని వక్రమార్గంలో పయనిస్తున్నాయి. యాజమాన్యాలు కాసుల కక్కుర్తితో రోగులను కష్టాల సుడిగుండంలోకి నెడుతున్నాయి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత ఉన్న వ్యాధులకూ ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నత నిర్ణయానికి తూట్లు పొడుస్తూ పేదోడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేస్తున్నాయి.
సాక్షి, గుంటూరు: పైసా ఖర్చు లేకుండా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించడం కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఇతర రాష్ట్రాల్లో సైతం పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందే సౌకర్యాన్ని కల్పించారు. అయితే దేవుడు కరుణించినా.. పూజారి వరం ఇవ్వలేదన్న చందంగా.. ప్రభుత్వ లక్ష్యానికి కొన్ని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. ఆరోశ్రీ అర్హత ఉన్న జబ్బులకు సైతం ఉచిత వైద్యం చేయకుండా చుక్కలు చూపిస్తున్నాయి. అత్యవసరాన్ని బట్టి ఆయా జబ్బులకు వైద్యం అందించి డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ఇటీవల మెదడులో రక్తం గడ్డకట్టి చికిత్స నిమిత్తం మంగళరిలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో ఓ మహిళ చేరింది. సదరు మెదడు సంబంధిత జబ్బుఆరోగ్య శ్రీ కిందకు వస్తుంది. అయితే ఆస్పత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పింది. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండటంతో వైద్యం చేయించుకున్నారు. రోగి బంధువులు మరుసటి రోజు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌ను సంప్రదించగా మెదడు సంబంధిత జబ్బుకు ఆరోగ్య శ్రీ వర్తిసుందని, ఆస్పత్రికి ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ పథకం కిందకు కేసును బదలాయించాలని సూచించారు. అయితే కేసును ఆరోగ్యశ్రీ కిందకు బదలాయించకుండా ఫీజు రూ.4 లక్షలు కట్టాల్సిం దేనని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
గుంటూరులో మరో ఆస్పత్రి
గుంటూరు జీజీహెచ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ పథకంలో ఉన్న కొన్ని రకాల జబ్బులకు మాత్రమే చికిత్స అందిస్తోంది. అవీ అధిక మొత్తంలో నిధులు వచ్చే కేసులను మాత్రమే అడ్మిట్ చేసుకుంటోంది. తక్కువ మొత్తంలో ఆరోగ్య శ్రీ ప్యాకేజీ ఉండే కేసులను నిరాకరిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కో–ఆర్డీనేటర్‌కు ఫిర్యాదులు అందాయి.
తొలగింపునకు సిఫార్సు చేస్తాం
పథకం వర్తించదని రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే సంబం«ధిత ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటాం. ఈ తరహా వరుస ఫిర్యాదులు అందితే నెట్‌వర్క్ నుంచి ఆస్పత్రిని తొలగింపునకు సీఈవోకు సిఫార్సు చేస్తాం. పథకం వర్తించదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెడితే 8333814007 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.– డాక్టర్ అవినాష్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment