డెంగీ, మలేరియాకు ఆరోగ్యశ్రీ | Malaria And Dengue Fever Should Also Be Covered by The AArogyaSri | Sakshi
Sakshi News home page

డెంగీ, మలేరియాకు ఆరోగ్యశ్రీ

Published Fri, Sep 13 2019 4:28 AM | Last Updated on Fri, Sep 13 2019 9:09 AM

Malaria And Dengue Fever Should Also Be Covered by The  AArogyaSri  - Sakshi

సాక్షి, అమరావతి: మలేరియా, డెంగీ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని ఆరోగ్యశ్రీ అమలుపై ఏర్పాటైన నిపుణుల కమిటీ భావిస్తోంది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన గురువారం జరిగిన ఈ కమిటీ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కమిటీ రెండు నెలలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, గ్రామాలు, ఆస్పత్రులకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని తేల్చింది.

జ్వరాలే కాకుండా తరచూ వచ్చే జబ్బులు, వాటికి ఎంత వ్యయం అవుతోంది.. ఒకొక్కరికి సగటున ఎంత ఖర్చవుతోంది అన్న అంశాలను పరిశీలించి 161 జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తే పేద రోగులకు ఉపశమనం కలుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. కాగా, ప్రస్తుతం 944 రకాల జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలో వుండగా మరో వెయ్యి జబ్బులకు పైగా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సూచిస్తోంది. దీంతో రెండు వేల జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం లభించనుంది.

డే కేర్‌ సర్వీసులకు కూడా..
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ కనీసం 24 గంటల పాటు ఇన్‌పేషెంటుగా చేరితేనే ఆ కేసు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది. కానీ, వెయ్యి రూపాయల బిల్లు దాటే ప్రతి జబ్బుతోపాటు డే కేర్‌ సర్వీసులనూ పథకం పరిధిలోకి తీసుకురావాలని కమిటీ సూచిస్తోంది. కొత్తగా చేర్చిన జబ్బుల్లో సుమారు 800కు పైగా తరచూ వచ్చేవే అని.. వీటికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, వీటిని చేర్చితే పేదలకు భారీ లబ్ధి జరుగుతుందని కమిటీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో తాజాగా పెంచిన జబ్బుల ప్రకారం ఏడాదికి రూ.1,500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అలాగే, వెయ్యి రూపాయల బిల్లు దాటిన జబ్బులను కూడా పథకం పరిధిలోకి తెస్తే మరో రూ.1,500 కోట్లు వ్యయమవుతుందని.. మొత్తం రూ.3 వేల కోట్లు ఏడాదికి ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణుల కమిటీ భావించింది.

మరోవైపు.. ప్రస్తుతమున్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్త కార్డులు జారీచేయడం.. ఆరోగ్యమిత్రల వ్యవస్థను బలోపేతం చేయడం.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచడం.. బాధితులకు వైద్యసేవలు, బిల్లుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకోవడం వంటి వాటిని పకడ్బందీగా అమలుచేయాలని కమిటీలోని పలువురు నిపుణులు సూచనలిచ్చారు. పైలెట్‌ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పథకాన్ని అమలుచేసి, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ నివేదికను ఈనెల 18 లేదా 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవ్వనున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement