సాక్షి, అమరావతి: ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం సరికొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తోంది. విస్తరించిన ప్రయోజనాలు, సరికొత్త ఫీచర్‌లతో కూడిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా వేగంగా సాగుతోంది. ఇప్పటికే 42 శాతం లబ్ధిదారులకు కార్డులు అందాయి. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన 1.43 కోట్ల కుటుంబాలు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి.
వీరికి నూతన కార్డుల పంపిణీ డిసెంబరు నెలలో మొదలైంది. ఇప్పటివరకు 60,43,902 కుటుంబాలకు కార్డులను అందజేశారు. అత్యధికంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 7.16 లక్షల కార్డులు ఉండగా 3.45 లక్షలు, ప్రకాశం జిల్లాలో 6.45 లక్షలకు గాను 2.54 లక్షలు, కాకినాడ జిల్లాలో 4.67లక్షలకు గాను 4.67 లక్షల కార్డుల పంపిణీ పూర్తయింది. కొత్త కార్డులు అందజేయడంతోపాటు పథకం కింద ఉచితంగా పొందే వైద్య సేవలు, వాటిని ఎలా పొందాలో కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్విర్యం చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఈ పథకానికి ఊపిరిలూదారు. మరింత మెరుగ్గా, సమర్ధవంతంగా పని చేసేలా తీర్చిదిద్దారు. గతంలో కేవలం తెల్లరేషన్ కార్డుదారులు మాత్రమే పథకం పరిధిలోకి వస్తుండగా, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలను కూడా పథకం పరిధిలోకి తెచ్చారు.
అంతేకాకుండా పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. వందలాది చికిత్సలను కొత్తగా ఇందులో చేర్చారు. ఈ తరహా ప్రయోజనాలన్నింటితో కూడిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తోంది.
సిటిజెన్ యాప్‌పై అవగాహన
కార్డులు పంపిణీ సమయంలోనే ప్రతి కుటుంబానికి పథకం సేవలను సులువుగా ఎలా పొందాలో వివరిస్తూ బ్రోచర్‌ను అందజేస్తున్నారు. పథకం సమగ్ర సమాచారం ఈ బ్రోచర్‌లో ఉంది. ఇది ప్రజలకు ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లబ్దిదారుల మొబైల్ ఫోన్‌లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయిస్తున్నారు. అందులో లాగిన్ అయి ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తున్నారు.
వైద్య సేవలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ఉండే నెట్‌వర్క్ ఆస్పత్రులు, వాటిల్లో ఏ ప్రొసీజర్స్‌కు వైద్యం చేస్తారనే సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఏ ఆస్పత్రి ఉందో కూడా తెలుసుకోవచ్చు. అక్కడకు చేరుకోవడానికి జీపీఆర్‌ఎస్ సౌకర్యం కూడా ఉంది. ఇక గతంలో పథకం ద్వారా పొందిన చికిత్సలు, రిపోర్ట్‌లను ఒక్క క్లిక్‌తో పొందడానికి వీలుంటుంది.
కార్డులో ఉండేవివీ..
♦ కుటుంబ యజమాని పేరు, జిల్లా, మండలం, గ్రామ/వార్డు సచివాలయం వివరాలు
♦ కుటుంబ సభ్యుల ఫోటోలు, వారి పేర్లు, ఇతర వివరాలు
♦ యూనిక్ హెల్త్ ఐడెంటిటి నంబర్ (యూహెచ్‌ఐడీ)
♦ క్యూఆర్ కోడ్ (వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆరోగ్యమిత్ర, వైద్యులు సులువుగా కేస్ రిజిస్ట్రే షన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది.
♦ దీనివల్ల మరింత వేగంగా, సులభంగా వైద్య సేవలు అందుతాయి)
Comments
Please login to add a commentAdd a comment