
సాక్షి, విజయవాడ: బస్సు యాత్రలో జరిగిన దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై తీవ్ర గాయమైందని, గాయానికి మూడు కుట్లు వేశామని జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. సీఎం జగన్ ముఖంపై వాపు ఉందని, విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు వైద్యులు సూచించారు.
సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్క్రైబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు.
ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు.
నేడు యాత్రకు విరామం
యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్‌కు లోకల్ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది.