vijayawada govt hospital
-
సీఎం జగన్‌కు తీవ్ర గాయం.. విశ్రాంతి అవసరం: వైద్యులు
సాక్షి, విజయవాడ: బస్సు యాత్రలో జరిగిన దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై తీవ్ర గాయమైందని, గాయానికి మూడు కుట్లు వేశామని జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. సీఎం జగన్ ముఖంపై వాపు ఉందని, విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు వైద్యులు సూచించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్‌కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్క్రైబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్‌తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్‌కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. నేడు యాత్రకు విరామం యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్‌కు లోకల్ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. -
Andhra Pradesh: మారుమూలైనా నిశ్చింత
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం వైఎస్ జగన్.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన 108, 104 సేవలకు ఊపిరిలూదినట్టుగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను మరింతగా మెరుగు పరిచారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించడమే కాక, సమర్థవంతంగా అమలు చేయిస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ వారికి రక్షగా నిలిచారు. సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా బొబ్బరపాలెంకు చెందిన మాండ్రుమాక రాణి అనే గర్భిణి మార్చి 26వ తేదీన విజయవాడ జీజీహెచ్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం బుధవారం ఆస్పత్రి నుంచి వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. సిజేరియన్ ప్రసవం కావడంతో 150 కిలోమీటర్ల దూరంలోని ఊరికి బస్సు, రైలులో పసికందుతో పాటు ఆమెను తీసుకెళ్లడం కష్టం. ప్రత్యేకంగా ఆటో లేదా ట్యాక్సీ కిరాయికి తీసుకుని వెళితే రూ.నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది. కూలి పని చేసుకుని జీవనం సాగించే ఈమె కుటుంబం అంత మొత్తం వెచ్చించలేదు. ఈ క్రమంలో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సిబ్బంది ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఉచితంగా బాలింతను, బిడ్డను ఇంటికి చేరుస్తుందని తెలిపారు. సిబ్బంది చెప్పినట్టుగానే బుధవారం సాయంత్రం 5.33 గంటలకు రాణి, ఆమె సహాయకులను విజయవాడ జీజీహెచ్‌లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఎక్కించుకుని రాత్రి 9.20 గంటలకు సొంత ఊరిలో వదిలి పెట్టారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ.. ‘108 అంబులెన్స్‌లో ఉచితంగా ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్య సేవలు అందించి ఆస్పత్రిలో కాన్పు చేశారు. డిశ్చార్జి అయిన నన్ను, నా బిడ్డను క్షేమంగా ఇంటి వద్దకు చేర్చారు. ప్రభుత్వం మాలాంటి వారి ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంత సాయం అందుతుందని నేను ఊహించలేదు. నిరుపేదలమైన మాపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. రాణి తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు రాష్ట్రంలో వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అండగా నిలుస్తున్నాయి. రోజుకు సగటున 631 మందికి సాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 183, జిల్లా ఆస్పత్రుల్లో 107, ఏరియా ఆస్పత్రుల్లో 98, సీహెచ్‌సీల్లో 67, పీహెచ్‌సీల్లో 45 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వాహనాలు ఆయా ఆస్పత్రుల్లో ప్రసవించిన బాలింతల్లో రోజుకు సగటున 631 మంది చొప్పున ఏడాదిగా క్షేమంగా ఇంటికి చేర్చాయి. ఈ లెక్కన ఏడాదిలో 2,30,505 బాలింతలు సేవలు పొందారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 22,315 మంది లబ్ధి పొందారు. కాకినాడలో 15,881, విశాఖపట్నంలో 13,320, అనంతపురంలో 11,646 మంది బాలింతలు ఉన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి.. గత ఏడాది ఏప్రిల్‌కు ముందు కేవలం 279 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో డిశ్చార్జిలకు అనుగుణంగా వాహనాలు అందుబాటులో ఉండేవి కాదు. బాలింతలు సొంత డబ్బు ఖర్చు పెట్టి బస్సు, ఆటోలు, ట్యాక్సీల్లో ఇళ్లకు వెళ్లేవారు. ఈ అంశాన్ని గమనించిన ప్రభుత్వం పేదలపై రవాణా ఖర్చుల భారం పడకుండా చర్యలు తీసుకుంది. అప్పటి వరకూ ఉన్న పాత వాహనాలను పూర్తిగా తొలగించి, ఏకంగా 500 ఎయిర్ కండీషన్డ్ బ్రాండ్ కొత్త వాహనాలతో సేవలను విస్తరించింది. సురక్షిత ప్రయాణం గతంలో ఒక్కో వాహనంలో ఇద్దరు, ముగ్గురు బాలింతలు, వారి సహాయకులను తరలించేవారు. దీంతో వాహనంలో స్థలం సరిపోక తీవ్ర అవస్థలు పడేవారు. ప్రస్తుతం ఒక్కో ట్రిప్‌లో ఒకే బాలింతను తరలిస్తున్నారు. 400, 500 కి.మీ సుదూర ప్రాంతాల్లో సొంతూళ్లు ఉన్న బాలింతలను సైతం ఉచితంగా తరలిస్తున్నారు. ఆస్పత్రి నుంచి తల్లీ బిడ్డను ఇంటికి తరలించే సమయంలో భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. ఒక ప్రత్యేక యాప్ సైతం తయారు చేశారు. ఈ యాప్‌లో డ్రైవర్ లాగిన్ అయ్యి, ఆస్పత్రి వద్ద బాలింతను ఎక్కించుకునే సమయంలో, సొంత ఊరిలో దించిన తర్వాత ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత డ్రైవర్ డబ్బులు డిమాండ్ చేశాడా? గమ్య స్థానంలోనే వదిలాడా? లేదా? ప్రవర్తన లోపాలపై ఇళ్లకు చేరిన బాలింతలకు ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై వైద్య శాఖ టోల్ ఫ్రీ నంబర్ 104 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. గర్భిణులకు అన్ని విధాలా భరోసా మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకునేంత వరకు అన్ని దశల్లో ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నెల నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం, పౌష్టికాహారం అందించడం వంటి చర్యలు చేపడుతోంది. నెలలు నిండిన గర్భిణులను ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి కాన్పుకు ఆసుపత్రిలో చేరుస్తున్నారు. ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందిస్తున్నారు. ప్రసవానంతరం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద తల్లికి విశ్రాంతి సమయానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో మార్పులు నాడు (2022 ఏప్రిల్‌కు ముందు వరకు) – 279 వాహనాలు – ఇరుకైన మారుతీ ఓమినీ వాహనం – ఏసీ సౌకర్యం ఉండదు – ట్రిప్‌కు ఇద్దరు ముగ్గురు బాలింతల తరలింపు నేడు (2022 ఏప్రిల్ తర్వాత) – 500 వాహనాలు – విశాలమైన మారుతీ ఈకో వాహనం – ఏసీ సౌకర్యం ఉంటుంది – ట్రిప్‌కు ఒక బాలింత మాత్రమే తరలింపు క్షేమంగా తీసుకొచ్చి.. తీసుకెళ్తున్నారు గత నెల 22న నాకు పురిటి నొప్పులు వచ్చాయి. ఇంట్లో వాళ్లు 108కు ఫోన్ చేశారు. నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. నన్ను హుఠాహుటిన విజయవాడ ఆస్పత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. అదే రోజు వైద్యులు నాకు కాన్పు చేశారు. బాబు పుట్టాడు. డిశ్చార్జి అయిన నన్ను ప్రత్యేక వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్షేమంగా ఆస్పత్రికి తీసుకుని రావడం.. ఉచితంగా వైద్యం అందించడం.. తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడం గొప్ప విషయం. – వి.తేజస్విని, బాలింత, మాదలవారిగూడెం, కృష్ణా జిల్లా రూ.నాలుగు వేలు ఆదా ఇటీవల గుంటూరు జీజీహెచ్‌లో బిడ్డకు జన్మనిచ్చాను. మా ఊరు గుంటూరు నుంచి 100 కి.మీ పైనే ఉంటుంది. డిశ్చార్జి అయ్యాక ప్రత్యేక వాహనంలో నన్ను, నా వెంట ఉన్న వారిని ఎక్కించుకుని ఇంటికి చేర్చారు. మేం ప్రత్యేక వాహనం మాట్లాడుకుని వెళ్లింటే రూ.నాలుగు వేల వరకు ఖర్చయ్యేది. ఆ మొత్తం మాకు ఆదా అయింది. – వి.సుజాత, బాలింత, మిరియాల, పల్నాడు జిల్లా -
గవర్నర్ దంపతులకు కరోనా టీకా
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు): గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం కరోనా టీకా వేయించుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.శివశంకర్ పర్యవేక్షణలో నర్సు ఝాన్సీ.. గవర్నర్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లకు టీకా మొదటి డోసు వేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని, ఎలాంటి అనుమానం లేకుండా అందరూ టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ నెల 30న రెండో డోసు తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ఇంత త్వరగా టీకా కనుగొనడం ద్వారా భారత శాస్త్రవేత్తలు మన దేశ వైజ్ఞానిక ఘనతను ప్రపంచానికి చాటిచెప్పారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేశారని అభినందించారు. ఆయన వెంట గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జేసీ ఎల్.శివశంకర్, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ శ్యామ్ ప్రసాద్, డీఎంహెచ్‌వో సుహాసిని తదితరులున్నారు. -
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత
-
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పేషంట్ బంధువులు, డాక్టర్ల మధ్య గొడవ చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యం అందడం లేదని పేషంట్ తరపు బంధువులు డాక్టర్లను ప్రశ్నించడంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పేషంట్ బంధువులు తమపై దాడి చేస్తున్నారని డ్యూటీ డాక్టర్లు సమాచారం ఇవ్వడంతో హాస్టల్లో ఉంటున్న మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.దీంతో వివాదం మరింత ముదిరింది. మెడికల్ కాలేజీ విద్యార్థులతో కలిసి డ్యూటీ డాక్టర్లు రోగి బంధువులపై దాడికి దిగారు. అంతేకాకుండా.. తమపైనే దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఇక పేషంట్ బంధువులు కూడా పోలీసులను కలిశారు. ట్రీట్మెంట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించినందుకు తమపై డ్యూటీ డాక్టర్లు, మెడికల్ కాలేజీ విద్యార్థులు దాడికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాక్సిడెంట్లో గాయాలపాలైన వ్యక్తికి వైద్యం అందించడంలో ఆలస్యం చేశారని ఆరోపించారు. ఇరు వర్గాల ఫిర్యాదుల్ని స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
శిశువును అపహరించిన ఆస్పత్రి సిబ్బంది
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): పుట్టిన శిశువు మగబిడ్డ కావడంతో జన్మనిచ్చిన తల్లికి సైతం ఆ శిశువును చూపించకుండా ఓ వైద్యురాలు ఆడిన నాటకం.. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. పుట్టిన బిడ్డను తనివితీరా చూసుకోవాలన్న ఆ తల్లి తాపత్రయాన్ని సైతం పట్టించుకోని ఆ వైద్యురాలు బిడ్డను అప్పటికపుడు వేరే ప్రాంతానికి తరలించేసింది. గత్యంతరం లేని ఆ అభాగ్యురాలి తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ అమానవీయ ఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం చోటు చేసుకుంది. బందరు మండలం సత్రవపాలెంకు చెందిన చిన్నం వెంకటనరసమ్మ కూలి పనులు చేస్తుంటుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా కనకదుర్గ పుట్టుకతోనే వికలాంగురాలు. అంగవైకల్యంతో ఉన్న ఆమెకు సంబంధాలు రాకపోవడంతో తల్లితోనే కలసి ఉంటుంది. ఇదిలా ఉండగా కనకదుర్గ అక్క మొగుడు రమణ తరచూ అత్తింటికి వస్తూ కనకదుర్గతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అనేక మార్లు ఆమెపై లైంగికదాడి చేయడంతో గర్భం దాల్చింది. విషయం కాస్తా చేయి దాటిపోవడంతో ఈ నెల 3వ తేదీన ప్రసవం నిమిత్తం రాజుపేటలోని వాణికుసుమ ఆస్పత్రి వైద్యురాలు వాణికుసుమను తల్లి నరసమ్మ కలిసింది. విషయం వివరంగా చెప్పి ఆపరేషన్ చేయాలని కోరింది. అందుకోసం వైద్యురాలు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయగా నరసమ్మ తగిన మొత్తంలో ముట్టజెప్పింది. ఆదివారం కనకదుర్గను ఆస్ప త్రిలో చేర్చగా సోమవారం ఆమెకు ఆపరేషన్ చేశారు. కనకదుర్గ మగబిడ్డకు జన్మనిచ్చింది.పుట్టిన బిడ్డను సదరు వైద్యురాలు తల్లికి చూపించకుండా ఉంచింది. అలా రోజు, రెండు రోజులు, మూడు రోజులు గడవగా అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి నరసమ్మ వైద్యురాలిని కలిసి పుట్టిన బిడ్డను చూపించాలంటూ వేడుకుంది. పుట్టింది బిడ్డ కాదు గడ్డ మాత్రమే అంటూ వైద్యురాలు బుకాయించింది. గత్యం తరం లేని నరసమ్మ చివరికి పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్సీషియనే బిడ్డను అపహరించి మచిలీపట్నం దాటించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం శిశువు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ తతంగాన్ని తప్పుదారి పట్టించేందుకు పలువురు టీడీపీ నేతలు తెర వెనుక కథ నడిపినట్టు విమర్శలు వస్తున్నాయి. -
బెడ్‌పై నుంచి పడి బాలింత మృతి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): పండంటి మగబిడ్డ పుట్టాడని ఆనందంలో ఉన్న ఓ కుటుంబాన్ని.. గంటల వ్యవధిలోనే విషాదం ముంచెత్తింది. ప్రభుత్వ, సిబ్బంది నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలను బలితీసుకుంది. పురిటినొప్పులను భరించి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు.. మరో బాలింతతో కలిపి ఓకే మంచం కేటాయించారు. రాత్రంతా పంటి బిగువున బాధను ఓర్చుకొని పడుకున్న ఆమె.. తెల్లారేసరికి మంచంపై నుంచి పడి స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మంగళవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. విజయవాడలోని కొత్తపేట శ్రీనివాస మహల్ సెంటర్‌కు చెందిన పి.స్వాతికి పురిటినొప్పులు రావడంతో సోమవారం మధ్యాహ్నం ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి 8.50 గంటల సమయంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉమ్మ నీరు తాగాడని శిశువును ప్రత్యేక విభాగానికి తరలించిన సిబ్బంది.. స్వాతిని ప్రసూతి వార్డుకు పంపించారు. అక్కడ పడకలు ఖాళీ లేకపోవడంతో.. మరో బాలింత ఉన్న మంచాన్నే స్వాతికి కూడా కేటాయించారు. రాత్రంతా సర్దుకొని పడుకున్న స్వాతి.. మంగళవారం ఉదయం ఉన్నట్లుండి మంచంపై నుంచి కిందపడిపోయింది. తీవ్ర బాధతో కొద్దిసేపు కాళ్లు, చేతులు కొట్టుకుంది. దీంతో సిబ్బంది ఆమెను లేబర్ వార్డుకు తరలించారు. చికిత్స అందిస్తుండగా స్వాతి మృతి చెందింది. ఈ సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్–2 బాబూరావు, అర్బన్ తహశీల్దారు అబ్దుల్ రెహ్మాన్ మస్తాన్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకొని బాధితులు, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు బాలింతలకు కలిపి ఒకే మంచం కేటాయించారని, దీని వల్లే స్వాతి కిందపడిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. తీవ్ర బాధతో అల్లాడిపోతున్నా కూడా సిబ్బంది పట్టించుకోలేదని బాధితురాలి మరిది నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము గట్టిగా నిలదీయడంతో చాలాసేపటి తర్వాత చికిత్స కోసమంటూ తీసుకెళ్లారని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి స్వాతి మృతి చెందిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితురాలి భర్త కామేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారని, పోస్టుమార్టం అనంతరం చర్యలు తీసుకుంటామని జేసీ బాబూరావు చెప్పారు. ఫిట్స్ రావడంతోనే: స్వాతి ఫిట్స్ వల్లే మృతి చెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. మంగళవారం ఫిట్స్ రావడంతో బెడ్‌పై నుంచి కిందపడిపోయిందని చెప్పారు. సిబ్బంది ఆమెను లేబర్‌వార్డుకు తరలించారని, సిబ్బంది నిర్లక్ష్యమేమీ లేదన్నారు. ఉమ్మనీరు రక్తంలోకి చేరడం వల్లే.. సాక్షి, అమరావతి: ఉమ్మ నీరు రక్తంలోకి చేరడం వల్లే సమస్య తలెత్తి బాలింత మృతి చెందిందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ బాబ్జీ తెలిపారు. ఆమె రక్తహీనతతో బాధపడుతోందని, డాక్టర్లు సాధారణ ప్రసవమే చేశారని చెప్పారు. అయితే మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఆమె స్పృహ తప్పి బెడ్ మీద నుంచి కింద పడిందని చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రిలో సామాన్యుల ఆకలి తీరుస్తున్న సంస్థ
-
విజయవాడలో శిశువు మార్పిడి వివాదం
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మార్పిడిపై వివాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో ఓ మహిళ ప్రసవించగా, ఆమెకు మగబిడ్డ పుడితే.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆడపిల్ల పుట్టిందని చెప్పారంటూ మహిళ కుటుంబ సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బందిని గట్టిగా నిలదీస్తే చనిపోయిన మగశిశువును తమకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం
విజయవాడ(లబ్బీపేట) : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పరిపాలన దారితప్పింది. అత్యవసర పనులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిపాలనా విభాగం సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నించేందుకు ఆ విభాగంలో ఒక్క అధికారి కూడా లేరు. దీంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. మృతిచెందిన ఉద్యోగి కుటుంబానికి రావాల్సిన అలవెన్స్‌ల కోసం కూడా డబ్బులు తీసుకునే స్థాయికి అడ్మిస్ట్రేషన్ సిబ్బంది దిగజారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించిన నర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ఈ విషయంతో సంబంధం లేని ఓ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేయడం విశేషం. అధికారులు లేని ‘అడ్మినిస్ట్రేషన్’ ప్రభుత్వాస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అధికారులు లేరు. ఈ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారితోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి. అనారోగ్యం కారణంగా అసిస్టెంట్ డైరెక్టర్ సెలవులో ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏ పని చెప్పినా రూల్పొజిషన్.. పేరుతో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అడ్డుతగులుతున్నారని తెలిసింది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నిర్ధారణ అయితే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోగులకు మరిన్ని కష్టాలు తప్పవని ఉద్యోగులే చెబుతున్నారు. సూపరింటెండెంట్ లేఖ బుట్టదాఖలు విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగంలో సీసీ కెమెరాలు పని చేయడంలేదని, రిపేరు చేయాలని అక్కడి అధికారులు సూపరింటెండెంట్‌కు కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు. సూపరింటెండెంట్ ఆ లేఖను అడ్మినిస్ట్రేషన్ విభాగానికి పంపారు. అయితే ఆ లేఖను అడ్మినిస్ట్రేషన్ విభాగం సిబ్బంది పక్కన పడేశారు. ఇటీవల ఎస్‌ఎన్‌సీయూలో శిశువు అపహరణకు గురైన తర్వాత సీసీ కెమెరాలను బాగుచేయించారు. ఉద్యోగి కుటుంబంతో ఆటలు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని అలవెన్సులు రావాల్సి ఉంది. వాటి కోసం ఆ ఉద్యోగి భార్య పరిపాలనా విభాగం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సిబ్బంది స్పందించలేదు. ఆమె వద్ద లంచం తీసుకుని కూడా ధ్రువీకరణపత్రాలు సక్రమంగా లేవంటూ ఫైలును పక్కన పడేశారు. సహ ఉద్యోగి కుటుంబానికి సాయం చేయాలనే స్పృహ కూడా ఇక్కడి సిబ్బందికి లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులిస్తేనే జీతాల బిల్లులు ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన 80 మంది స్టాఫ్‌నర్సులను నియమించారు. వారి నియామకాల సమయంలోనే డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కమిటీని నియమించారు. తాజాగా వారికి జీతాలు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. జీతాల బిల్లులకు సంబంధం లేని ఉద్యోగి వచ్చి డబ్బులు అడుగుతున్నారని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చెప్పారు. తమ సర్టిఫికెట్లు సైతం వారి వద్ద ఉంచుకుని డబ్బులు ఇస్తేనే ఇస్తామని బెదిరిస్తున్నారని పలువురు వాపోయారు. చక్కదిద్దుతున్నాం ‘ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ విభాగ అధికారులైన ఏవో, ఏడీ ఇద్దరూ లేరు. రెండు పోస్టులు ఖాళీగా ఉండటంతో అడ్మినిస్ట్రేషన్ కష్టంగా ఉందని రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకులకు లేఖ రాశాం. అక్కడ ఫైల్ క్లియర్ అయినట్లు తెలిసింది. ఆ విభాగానికి అధికారులు రాగానే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తాం. పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా. కొంత వరకు మెరుగుపరిచాం. పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు కృషి చేస్తా. – డాక్టర్ ఎం.జగన్మోనరావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, విజయవాడ. -
బెజవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద కలకలం
-
శిశువు అదృశ్యం కేసులో కీలక ఆదారలు
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన
-
విచారణకు ఆదేశించని.. కామినేని
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కోరికి నవజాత శిశువు మృతి చెందిన ఘటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ ఘటనపై విచారణకు సర్కార్ ముందుకు రాలేదు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి ఈ ఘటనపై ఇంకా విచారణకు ఆదేశాలు వెలువడలేదు. కాగా ఈ ఘటనపై విచారణ జరపాలన్న తమ డిమాండ్‌ను ఏపీ సర్కార్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే సదరు శిశువు సహజ మరణంగానే భావిస్తున్నట్లు వైద్యుల అభిప్రాయాన్ని మంత్రి పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అందువల్లే ఈ ఘటనపై విచారణకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిసింది. -
రేడియాలజిస్ట్ రత్నాకర్ సస్పెన్షన్
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రేడియాలజిస్ట్ రత్నాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేడు ఆసుపత్రిలో విచారణ చేయనున్నారు. దీనిపై ఆయన ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన మహిళాల పట్ల వైద్యులు, సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా రేడియాలజిస్ట్ రత్నాకర్‌ను సస్పెండ్ చేశారు. -
ప్రభుత్వాసుపత్రిలో మహిళపై కీచకపర్వం
-
ఆసుపత్రిలో కీచకపర్వం : కామినేని ఆగ్రహం
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మహిళపై ఆసుపత్రి వైద్యుడు, రేడియాలజిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆసుపత్రికి వచ్చే మహిళలపై వారు తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విషయం తెలియడంతో ఆసుపత్రి వర్గాలు రంగంలోకి దిగి... ఆ అంశం బయటకు రాకుండా బాధితురాలతో రాజీ కుదిర్చారు. అయితే ఆ విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కి తెలిసింది. దీంతో ఆయన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కామినేని ఆదేశించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కామినేని గురువారం స్పష్టం చేశారు. -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురికి గాయాలు
కంకిపాడు(కృష్ణా జిల్లా): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు క్రాస్ రోడ్డు సమీపంలో జరిగింది. వివరాలు.. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వెంటనే 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఎదురుగా వస్తున వాహనాన్ని తప్పించే క్రమంలోనే బస్సు అదుపుతప్పి వెళ్లి చెట్టును ఢీకొట్టిందని డ్రైవర్ తెలిపాడు. -
సిలిండర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
కృష్ణాజిల్లా కైకలూరులో ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో ముగ్గురు ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తోట నాగరాజు, అడపా సుబ్బలక్ష్మీ, సరోజినిలు మృతి చెందారు. ఈ నెల11వ తేదీన కైకలూరులో వంట వండుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి సిలండర్ పేలింది. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలన నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో వారిని వైద్య సహయం కోసం విజయవాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతు మంగళవారం తెల్లవారుజామున మరణించారు.