అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం
విజయవాడ(లబ్బీపేట) :
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పరిపాలన దారితప్పింది. అత్యవసర పనులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిపాలనా విభాగం సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నించేందుకు ఆ విభాగంలో ఒక్క అధికారి కూడా లేరు. దీంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. మృతిచెందిన ఉద్యోగి కుటుంబానికి రావాల్సిన అలవెన్స్‌ల కోసం కూడా డబ్బులు తీసుకునే స్థాయికి అడ్మిస్ట్రేషన్ సిబ్బంది దిగజారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించిన నర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ఈ విషయంతో సంబంధం లేని ఓ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేయడం విశేషం.
అధికారులు లేని ‘అడ్మినిస్ట్రేషన్’
ప్రభుత్వాస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అధికారులు లేరు. ఈ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారితోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి. అనారోగ్యం కారణంగా అసిస్టెంట్ డైరెక్టర్ సెలవులో ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏ పని చెప్పినా రూల్‌పొజిషన్.. పేరుతో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అడ్డుతగులుతున్నారని తెలిసింది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నిర్ధారణ అయితే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోగులకు మరిన్ని కష్టాలు తప్పవని ఉద్యోగులే చెబుతున్నారు.
సూపరింటెండెంట్ లేఖ బుట్టదాఖలు
విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగంలో సీసీ కెమెరాలు పని చేయడంలేదని, రిపేరు చేయాలని అక్కడి అధికారులు సూపరింటెండెంట్‌కు కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు. సూపరింటెండెంట్ ఆ లేఖను అడ్మినిస్ట్రేషన్ విభాగానికి పంపారు. అయితే ఆ లేఖను అడ్మినిస్ట్రేషన్ విభాగం సిబ్బంది పక్కన పడేశారు. ఇటీవల ఎస్‌ఎన్‌సీయూలో శిశువు అపహరణకు గురైన తర్వాత సీసీ కెమెరాలను బాగుచేయించారు.
ఉద్యోగి కుటుంబంతో ఆటలు
ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని అలవెన్సులు రావాల్సి ఉంది. వాటి కోసం ఆ ఉద్యోగి భార్య పరిపాలనా విభాగం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సిబ్బంది స్పందించలేదు. ఆమె వద్ద లంచం తీసుకుని కూడా ధ్రువీకరణపత్రాలు సక్రమంగా లేవంటూ ఫైలును పక్కన పడేశారు. సహ ఉద్యోగి కుటుంబానికి సాయం చేయాలనే స్పృహ కూడా ఇక్కడి సిబ్బందికి లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
డబ్బులిస్తేనే జీతాల బిల్లులు
ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన 80 మంది స్టాఫ్‌నర్సులను నియమించారు. వారి నియామకాల సమయంలోనే డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కమిటీని నియమించారు. తాజాగా వారికి జీతాలు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. జీతాల బిల్లులకు సంబంధం లేని ఉద్యోగి వచ్చి డబ్బులు అడుగుతున్నారని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చెప్పారు. తమ సర్టిఫికెట్‌లు సైతం వారి వద్ద ఉంచుకుని డబ్బులు ఇస్తేనే ఇస్తామని బెదిరిస్తున్నారని పలువురు వాపోయారు.
చక్కదిద్దుతున్నాం
‘ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ విభాగ అధికారులైన ఏవో, ఏడీ ఇద్దరూ లేరు. రెండు పోస్టులు ఖాళీగా ఉండటంతో అడ్మినిస్ట్రేషన్ కష్టంగా ఉందని రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకులకు లేఖ రాశాం. అక్కడ ఫైల్ క్లియర్ అయినట్లు తెలిసింది. ఆ విభాగానికి అధికారులు రాగానే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తాం. పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా. కొంత వరకు మెరుగుపరిచాం. పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు కృషి చేస్తా.
– డాక్టర్ ఎం.జగన్మోనరావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, విజయవాడ.