Administration
-
విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం నుంచి పరిపాలనకు కీలక అడుగు పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమతుల అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు, పర్యవేక్షణ చేయాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ఆ జిల్లాల్లో పర్యటించడంతో పాటు విశాఖపట్నంలో రాత్రి పూట బస చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో మంత్రులు, సచివాలయాల శాఖలు, సీనియర్ అధికారులకు కార్యాలయాల వసతిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో మంత్రులు, సచివాలయ, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలకు భవనాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మంత్రులు, సచివాలయ శాఖల కార్యాలయాల వసతికి ప్రభుత్వ భవనాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, సీనియర్ అధికారుల సమీక్ష సమావేశాలకు రుషికొండలోని మిలీనియం టవర్స్ ఎ, బిని క్యాంపు కార్యాలయాలుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సొంత భవనాల్లేని ప్రధాన శాఖలకు కూడా ఈ టవర్లలో వసతి కేటాయించనున్నట్లు తెలిపారు. ఇక్కడ 1.75 లక్షల చదరపు అడుగుల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా శాఖలకు నగరంలోని వివిధ ప్రభుత్వ భవనాల్లో మొత్తం 2.27 లక్షల చదరపు అడుగులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 35 శాఖల్లో 16 శాఖలకు మాత్రమే ప్రస్తుతానికి విశాఖలో వసతి కేటాయించారు. వీటికి ఎండాడ, హనుమంతవాక, దయాళ్ నగర్, మహారాణి పేట, కంచరపాలెం, దుర్గానగర్, రాంనగర్, ఎంవిపీ కాలనీ, పెందుర్తి, మద్దిలపాలెం, సిరిపురం సర్కిల్, భీమునిపట్నం, మర్రిపాలెం, ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతాల్లో భవనాలు కేటాయించారు. మిగతా 19 శాఖలకు భవనాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఆర్టీజీఎస్, సాంఘిక సంక్షేమం, ఆర్థిక, సాధారణ పరిపాలన, గ్రామ, వార్డు సచివాయాలు, ఉన్నత విద్య, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఐటీ, కార్మిక, న్యాయ, మైనారిటీ సంక్షేమం తదితర శాఖలకు వసతి గుర్తించాల్సి ఉందన్నారు. ఏ శాఖకైనా విశాఖలో సొంత భవనాలు ఉంటే వాటిలో కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీనియర్ అధికారుల గృహ వసతి కోసం ముందుగా సొంత భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. మిలీనియం టవర్లలో వసతి కేటాయింపులపై ఐటీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర్వులకు అనుగుణంగా సచివాలయానికి సంబంధించిన అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘ప్రగతి’ బాటలో పొదుపు మహిళ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా స్వయంశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన నిధులతో అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అండగా నిలిచి ‘పొదుపు’ మహిళలకు దిశానిర్దేశం చేస్తోంది. మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చి విజయం దిశగా ప్రోత్సహిస్తున్నారు గత నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా 25 లక్షల మంది పట్టణ ప్రాంత పొదుపు సంఘాల్లోని మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లను నెలకొల్పి అద్భుత ఫలితాలను సాధించారు. దీంతోపాటు మహిళలు తయారు చేసే చేతి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పొదుపు మహిళలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ‘మెప్మా’ ముందడుగు వేసింది. పర్యావరణహితంగా సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ మహిళలతో ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టారు. ఏ పరిశ్రమ స్థాపించాలి? మూలధనం, శిక్షణ లాంటి అంశాలపై చర్చించేందుకు మెప్మా ఎండీ తాజాగా సంఘాల లీడర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 25 లక్షల మంది సభ్యులుగా ఉన్న పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ఆఫీస్ బేరర్స్) దాదాపు 700 మంది పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లోని పట్టణ మహిళా సంఘాలు సంఘటితంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఎండీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 9 పట్టణాల్లోని జగనన్న మహిళా మార్టుల ద్వారా ఆగస్టు వరకు రూ.25 కోట్ల వ్యాపారం చేసినట్లు లబ్ధిదారులు వివరించారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా ఒకరోజు ఏర్పాటు చేసే అర్బన్ మార్కెట్ ద్వారా ఒక్కోచోట సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 మెప్మా ఆహా క్యాంటీన్ల ద్వారా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతున్న తీరును, వాటికున్న డిమాండ్‌ను సదస్సులో పంచుకున్నారు. వ్యాపారం చేసుకుంటున్నాం గతంలో బ్యాంకు రుణం వస్తే డబ్బులు పంచుకుని ఇంట్లో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇప్పించడంతోపాటు వ్యాపారం దిశగా ‘మెప్మా’ ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకులు మాకు పిలిచి మరీ రుణాలు ఇస్తు న్నాయి. ఈ డబ్బులతో సంఘాల్లోని సభ్యులు తమకు నైపుణ్యం ఉన్న అంశంలో వ్యాపారం చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం వస్తోంది. వ్యాపార ఆలోచన ఉంటే మెప్మా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తోంది. – పి.కృష్ణకుమారి, నరసరావుపేట మహిళలకు అండగా సీఎం మహిళా సాధికారత అంటే ఇన్నాళ్లూ మాకు తెలియదు. ఇంటికే పరిమితమైన మమ్మల్ని సీఎం జగన్ ప్రగతి వైపు అడుగులు వేయించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదుగుతున్నాం. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపెద్ద మార్ట్లతో పోటీ పడి వ్యాపారంలో లాభాలు పొందుతున్నాం. నవరత్నాల పథకాలను ప్రధానంగా మహిళల కోసమే అమలు చేస్తున్నారు. – ప్రతిమారెడ్డి, తిరుపతి ఆహా క్యాంటీన్‌తో ఉపాధి గతంలోనూ పట్టణ మహిళా పొదుపు సంఘాలు ఉన్నా పావలా వడ్డీ రుణాలు తప్ప మిగతావి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు మంజూరు చేయడంతో పాటు అవగాహన ఉన్న రంగంలో వ్యాపారం దిశగా ప్రోత్సహించి ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. మెప్మా ప్రోత్సాహంతో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కపూటకు అన్ని ఖర్చులు పోను రూ.1,000 లాభం వస్తోంది. – శ్యామల, అమలాపురం గత ప్రభుత్వంలో మోసపోయాం ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నా ఏనాడు ఆర్థికంగా బాగున్నది లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సభ్యులు ఎంతో ఆశతో రుణాలు చెల్లించడం ఆపేశారు. దాంతో బ్యాంకు మా సంఘాన్ని డిఫాల్టర్‌గా ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లిస్తూ వ్యాపారం దిశగా ప్రోత్సహించింది. ఇప్పుడు బ్యాంకులు పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. – షేక్ ఫాతిమా, నరసరావుపేట ప్రతి రూపాయీ మాకే.. గత ప్రభుత్వంలో పట్టణ మహిళా పొదుపు సంఘాల పేరుతో చాలా వరకు బోగస్ సంఘాలు ఉండేవి. మాకు రావాల్సిన నిధులు వారికే పోయేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్లైన్ చేశారు. దీంతో బోగస్ సంఘాలు పోయాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నేరుగా సంఘాలకే అందుతోంది. శిక్షణనిచ్చి మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు పెట్టిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. – మీనాక్షి, విజయవాడ మహిళా సాధికారతే లక్ష్యం మెప్మాలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్ల నిర్వహణతో మహిళలు విజయం సాధించారు. అనుకున్న దానికంటే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ఎంతో ఆలోచించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల్లో అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది. వారు తయారు చేసే చేతి వస్తువులు, ఆహార పదార్థాలను ఈ–కామర్స్ సైట్ల ద్వారా విక్రయించేలా ప్రణాళిక రూపొందించాం. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిని మరో మెట్టు ఎక్కించేందుకు మెప్మా ద్వారా తయారీ యూనిట్లు కూడా నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా శిక్షణనిచ్చి ఆర్థిక సాయం చేసి వ్యాపార యూనిట్లు పెట్టిస్తాం. పట్టణ ప్రగతి యూనిట్లు నెలకొల్పే దిశగా సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
విశాఖలో పాలన చేయొద్దని ఏ వ్యవస్థ చెప్పలేదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విజయవాడ: దసరా నుంచి విశాఖలో సీఎం పరిపాలన మొదలవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నేటి కేబినెట్ మీటింగ్‌లోనూ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ విషయం ఉద్ఘాటించారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. సీఎం ఎక్కడ నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక అధికారులతో ఓ కమిటీ వేయాలని కూడా సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. సీఎంని విశాఖలో పాలన చేయొద్దని ఏ వ్యవస్థ చెప్పలేదని అన్నారు. చంద్రబాబు అవినీతి చేసి జైలుకి వెళ్లారని చెప్పారు. చంద్రబాబు అరెస్టుని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయనపై ప్రజలకు ఎలాంటి సానుభూతి లేదని చెప్పారు. కోట్ల రూపాయలు పెట్టి లాయర్లను తీసుకువచ్చిన చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు. ఆధారాలు లేకుంటే న్యాయస్థానం రిమాండ్ ఎందుకు ఇస్తుందని అన్నారు. ఇదీ చదవండి: రాజ్యసభలో చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు -
కేంద్ర ఆర్డినెన్స్‌పై ఆప్‌కు జేఎంఎం మద్దతు
రాంచీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పాలనా యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆప్‌కు మద్దతిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్, మాన్, సోరెన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును తప్పకుండా ఓడించాలన్నారు. కేంద్ర ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కు జేఎంఎం మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ చీఫ్, సీఎం సోరెన్ చెప్పారు. ఆర్డినెన్స్‌పై మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. -
బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు. అమెరికా జనాభాలో దాదాపు ఒక్క శాతం ఉన్న భారత సంతతి వ్యక్తులకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే భారత సంతతి వ్యక్తులకు సముచిత స్థానం కల్పిస్తామని హమీ ఇచ్చారు బైడెన్. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నిలబెట్టుకున్నారు. అంతేకాదు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగంలో 80 మంది భారత సంతతి వ్యక్తులు ఉండేవారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంఖ్య 60గా ఉంది. బైడెన్ మాత్రం గత ప్రభుత్వాలతో పోల్చితే రికార్డు స్థాయిలో 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. దీంతో శ్వేతసౌధంలో ఏ సమావేశం జరిగినా అందులో తప్పనిసరిగా భారత సంతతి వ్యక్తులుంటారు. వీరు లేకుండా సమావేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అంతేకాదు ప్రతినిధుల సభలో నలుగురు సభ్యులు సహా మొత్తం 40 మంది భారత సంతతి వ్యక్తులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అమెరికాలోని 20 టాప్ కంపెనీలకు కూడా సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులే ఉండటం గమనార్హం. బైడెన్ పాలనాయంత్రాంగంలో ఉన్న భారత సంతతి వ్యక్తుల్లో ఆయన స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డి, కోవిడ్-19 ముఖ్య సలహాదారు డా.ఆశిష్ రెడ్డి, క్లైమేట్ పాలసీ సలహాదారు సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్ ప్రత్యేక సలహాదారు చిరాగ్ బైన్స్, పర్సనల్ మేనెజ్మెంట్ ఆఫీస్ హెడ్ కిరణ్ అహుజా, సీనియర్ అడ్వైజర్ నీర టాండెన్, డ్రగ్ కంట్రోల్ పాలసీ అడ్వైజర్ రాహుల్ గుప్తా వంటి వారు ఉన్నారు. చదవండి: ఉక్రెయిన్‌కి ఇది పునర్జన్మ! ఇక రాజీపడేదే లే!: జెలనెన్ స్కీ -
శ్రీలంకలో అఖిపక్ష ప్రభుత్వం ఏర్పాటు....ప్రతిపక్షాలతో మంతనాలు
కొలంబో: శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తరుణంలో ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని పొడిగించింది కూడా. ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుపోతున్న శ్రీలంకను సరైన గాడీలో పెట్టేందుకు అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతుంది. అంతేకాదు ప్రతిపక్షాలతో చర్చలు జరిపి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో విక్రమసింఘే చర్చలు జరిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ(ఎస్‌జేబీ) పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పింది. కానీ ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు అధికార పక్షంలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా...ఎంపీ విమల్ వీరవన్స నేతృత్వంలోని నేషనల్ ఫ్రీడమ్ ఫ్రంట్(ఎస్ఎఫ్ఎఫ్) విక్రమసింఘేకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వీరవన్స మాట్లాడుతూ...మన ముందు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయ్నారు. దేశాన్ని ఆరాచక పరిస్థితి నుంచి బయటపడేసి సరైన దారిలో నడిపించడం లేదా ఏకాభిప్రాయంతో ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రీక్త పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడం అని అన్నారు. ప్రస్తుత అగాధం నుంచి దేశాన్ని పునరుత్థానం చేయడానికి అధ్యక్షుడు విక్రమసింఘే సరైన చర్యలు తీసుకుంటున్నారని, అందువల్ల గత రాజకీయ విభేదాలు లేదా శత్రుత్వాలకు అతీతంగా వారి నిర్ణయాలకు మద్దతిస్తూ..మార్గనిర్దేశం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. (చదవండి: దురాక్రమణే లక్ష్యంగా...కిరాయి సైనికులను దింపిన రష్యా) -
గొటబయ ప్రభుత్వంపై అవిశ్వాసం
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్‌జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్‌జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్‌జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్‌ను గొటబయ తోసిపుచ్చారు. పరిష్కారం దొరకలేదు దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది. -
పాజిటీవ్ రెస్పాన్స్.. పాలన వికేంద్రీకరణ చాలా బాగుంది: సజ్జల
సాక్షి, అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ అనేది పూర్తిగా జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుకున్న దాని కంటే ఎక్కువ పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చాలా బావుందని.. మిడిల్ లెవల్ అడ్మినిస్ట్రేషన్ సమూలంగా సంస్కరించబడిందన్నారు. వికేంద్రీకరణ ఫలాలు కూడా వచ్చే ఐదారు నెలల్లో వస్తాయన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలా ఇది కూడా విజయవంతమవుతుందన్నారు. చదవండి: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్ అభినందనలు ‘‘పార్లమెంట్ నియోజకవర్గాన్ని కొలమానంగా తీసుకోవడం వల్ల సమస్యలు లేవు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేయడం వల్లే జిల్లాల పునర్విభజన సజావుగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రెవెన్యూ డివిజన్‌పై కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. 7న కేబినెట్లో పెట్టి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారని సజ్జల తెలిపారు. -
Yass Cyclone: ముందు పొగిడారు.. ఒక్క రోజులోనే మాట మార్చారు
కోల్‌కతా: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన 'యాస్' పశ్చిమ బెంగాల్లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అయితే ముందు జాగ్రత్త చర్యలతో మమతా బెనర్జీ ప్రభుత్వం లక్షలాది మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది.ఈ నేపథ్యంలో బీజేపీ నేత.. ఎంపీ దిలీప్ ఘోష్ బుధవారం బెంగాలీ దినపత్రిక సంగబాద్ ప్రతిదిన్తో మాట్లాడుతూ మమతా ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. ''యాస్ తుఫాను విధ్వంసాన్ని ముందే ఊహించి ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న ముందు చర్య నాకు నచ్చింది. గతంలో 'అంఫన్' తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి పాఠాలు నేర్చుకున్న మమతా ప్రభుత్వం ఈసారి మంచి పని చేసింది. తీరప్రాంతాల్లోని ప్రజలకు తుఫాను గురించి ముందే అవగాహన కల్పించి వారని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నారు. ప్రస్తుతం తుఫాను ప్రభావంతో రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని.. పరిస్థితి మాములుకు వచ్చిన తరువాత నష్టం విలువ తెలుస్తుంది. అయితే మమతా ముందు చూపుతో నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది'' అని పేర్కొన్నారు. అయితే ఒక్క రోజు తేడాతోనే దిలీప్ ఘోష్ మాట మార్చారు. తుఫాను కట్టడిలో ముందస్తు చర్యలు బాగానే ఉన్నా ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదన్నారు. . '' రాష్ట్రంలో 134 నదీ తీరాలు తుఫాను కారణంగా కొట్టుకుపోయాయని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుంది. వారు ఈ నంబర్ ఎక్కడ నుంచి పొందారో నాకు తెలియదు. రానున్న తుఫాను ముందే పసిగట్టిన మమత ప్రభుత్వం సంఖ్యలను ముందే నిర్థారించారించింది'' అని చురకలంటించారు కాగా అంతకముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తుఫాను ప్రభావంపై స్పందించారు. రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామని తెలిపారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్ దిశగా వెళ్లింది. చదవండి: తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా! -
‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: గతంలో నిరుపేద అవ్వకు పెన్షన్ కావాలన్నా.. కూలీనాలీ చేసుకుంటే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు కావాలన్నా.. రైతు తన వ్యవసాయ భూమి వివరాలు పట్టాదార్ పాస్ పుస్తకంలో నమోదు చేయించుకోవాలన్నా.. అధికారులు లేదా రాజకీయ నాయకుల చుట్టూ రోజుల తరబడి తిరిగితే గాని పనులు జరగని పరిస్థితి. ఒక్కొక్కసారి రూ.వేలు, రూ.లక్షలు ఖర్చు పెట్టినా పని పూర్తికాక ఇబ్బందులు పడిన వారున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకానికి అర్హులై ఉంటే చాలు.. చిన్న కష్టం కూడా పడకుండా దరఖాస్తు చేసుకుంటే.. రేషన్ కార్డు, పింఛన్లు, మంజూరు పత్రాలను వలంటీర్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారులు ఎవరన్నది గ్రామస్తులందరికీ తెలిసేలా గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు. గ్రామ సభ నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించాకే లబ్ధిదారుల తుది జాబితాలను ఖరారు చేస్తున్నారు. అవ్వాతాతలకు ప్రతి నెలా 1నే పింఛను డబ్బులు వలంటీర్లు ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నారు. రేషన్ సరుకులు సైతం ప్రతి ఒక్కరికీ ఇంటివద్దే అందుతున్నాయి. ఈ సేవలు అందించడం వల్లే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన అవార్డుల్లో ఏకంగా ఏపీ 17 జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది. కోటిన్నరకు పైగా సమస్యల పరిష్కారం ఒకప్పుడు గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయి గ్రామ కార్యదర్శి కూడా ఉండే వారు కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ఇప్పుడు కనీసం 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారికి అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ సేవలందిస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ వంటివి 70 వేలకు పైబడి భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కొన్ని పూర్తయ్యాయి. ప్రతి గ్రామ సచివాలయంలో రెండు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. కుగ్రామంలో ఉండే గ్రామ సచివాలయంలోనూ డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. సచివాలయాల ఏర్పాటు తర్వాత 2020 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 2.18 కోట్లు వినతులందగా.. 2.11 కోట్ల వినతులను అధికారులు పరిష్కరించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 1.62 కోట్ల వినతులకు గానూ, 1.57కోట్ల వినతులను పరిష్కరించారు. ప్రభుత్వ యంత్రాంగంతో ఏ పని ఉన్నా ఆ ఊరిలోనే పరిష్కరించేలా గ్రామ సచివాలయాల్లో 545 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నిధులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,625 కోట్లను 70–15–15 నిష్పత్తిలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ప్రభుత్వం కేటాయించింది. 2021–22లో రూ.1,939 కోట్ల నిధులు అందుబాటులోకి రానున్నాయి. చదవండి: రికవరీలో ఏపీ బెస్ట్ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు -
హెచ్1బీ కొత్త విధానంతో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థకి కీడు చేస్తుందని అక్కడి పలు సంస్థలు అభిప్రాయపడ్డాయి. కొత్త వీసా విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చర్స్‌తో సహా 17 వరకు సంస్థలు న్యాయస్థానంలో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉత్తర కొలంబియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ కొత్త విధానం వల్ల నైపుణ్యం కలిగిన వారు దేశానికి రారని, అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఈ వీసా విధానం అవరోధంగా మారుతోందని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళుతున్న ట్రంప్ ఈ నెల మొదట్లో హెచ్1బీ వీసా కార్యక్రమంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ వర్కర్లకి అధికంగా ఉద్యోగాలు లభించేలా, అత్యధిక స్కిల్ ఉన్న విదేశీ నిపుణులకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ వీసా విధానంలో మార్పులు చేశారు. దీనిని సవాల్ చేసిన వారిలో ఆర్థిక, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. కొత్త వీసా విధానం అమెరికాలోని ప్రతీ రంగంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
హెచ్1 బీ వీసా : టెకీలకు మరో షాక్
వాషింగ్టన్ : ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ కార్యక్రమాన్ని మరింత కఠినతరం చేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దృష్టిపెట్టారు. హెచ్1బీ వీసాలను పరిమితం చేసే లక్ష్యంలో భాగంగా ట్రంప్ సరికొత్త ఆదేశాలతో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి చట్టబద్దమైన వలసలను అరికట్టడం స్థానికీకరణ, అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసారు. యుఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు చర్యలు తీసుకుంటుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్1బీ వీసా కు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన ముఖ్యమైన సంస్కరణ ఇది అని లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ పిజ్జెల్లా వెల్లడించారు. ఈ ఆంక్షలు త్వరలోనే (గురువారం ఉదయం) అమలులోకి వచ్చే అవకాశం ఉందనీ, ఈ నిర్ణయం హెచ్1 బీ వీసాల పిటీషన్లలో మూడవ వంతు ప్రభావితం చేయనుందని విశ్లేషకుల అంచనా. కొత్త ఆంక్షల్లో మూడు ప్రధాన అంశాలు ఇది స్పెషాల్టీ నిర్వచనాన్ని తగ్గిస్తుంది. అమెరికన్ల స్థానంలో ఇతర ఐటీ నిపుణులు అవసరమని నిరూపించేందుకు, హెచ్1బీ వీసా జారీ చేసేందుకు అదనపు డాక్యుమెంటేషన్ అవసరం.ఐటీ నిపుణుల నియామాలకోసం ఆధారపడే థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ కంపెనీలపై స్క్రూట్నీ మరింత పెంపు హెచ్1బీ వీసా జారీ ముందు, ఆ తరువాత వర్క్‌సైట్ తనిఖీకి, సమ్మతికి డీహచ్ఎస్ కు ఎక్కువ అధికారాలు అంతేకాదు ఈ తాజా రూల్ ఈ నియమం హెచ్1బీ వీసా ఉద్యోగాలను కనీస వేతన స్థాయిలను కూడా మార్చే అవకాశం ఉంది. ఇది భారతీయ టెక్ నిపుణులను, టెక్ సంస్థలను భారీగా ప్రభావితం చేస్తుందని, హెచ్1బీ వీసా పొందడం మరింత కఠినం చేస్తుందని అంచనా. అయితే తాజా నిబంధనలపై టెక్ సంస్థలనుంచి వ్యాజ్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్1 బీ వీసాలను పరిమితం చేసే గతంలో ట్రంప్ సర్కార్ ఆంక్షల అమలును నిలిపివేస్తూ ఫెడరల్ కోర్టులు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి
న్యూఢిల్లీ: శ్రీలంకలో మైనార్టీ వర్గమైన తమిళ ప్రజలకు మరిన్ని పాలనాధికారాలు కల్పించేందుకు ఉద్దేశించిన 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సకు భారత ప్రధాని మోదీ సూచించారు. తమిళులు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం కోరుకుంటున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాలని మోదీ చెప్పారు. మోదీ, రాజపక్స శనివారం వర్చువల్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. తమిళులకు అధికారాలను బదిలీ చేయాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. లంకలో శాంతి, తమిళ వర్గంతో సయోధ్య కోసం 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మోదీ పేర్కొన్నారు. 1987లో ఇండో–శ్రీలంక ఒప్పందం తర్వాత 13వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే, ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ద్వైపాక్షిక సదస్సులో మోదీ, రాజపక్స పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లంకతో బౌద్ధపరమైన సంబంధాలను ప్రోత్సహించడానికి 15 మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహీందా రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ అన్నారు. -
అమెరికాలో ట్రంప్ సర్కార్ కొత్త నిబంధన
-
ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన
-
అవినీతి రహిత పాలనే లక్ష్యం: కేటీఆర్
సాక్షి, కొండమల్లేపల్లి: రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో పర్యటించారు. అనంతరం వార్డు కమిటీల సమావేశంలో మాట్లా డారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పని లేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో 75 గజాల సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారు అనుమతికోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, 75 నుంచి 600 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారు ము న్సిపాలిటీకి ఒక్క దర ఖాస్తు ఇస్తే 21 రోజుల్లో అధికారులు అనుమతులు ఇచ్చేలా చట్టం వచ్చిందని గుర్తు చేశారు. 21 రోజుల్లో ఇవ్వకపోతే 22వ రోజు అనుమతుల పత్రం మీకు వచ్చి చేరుతుందన్నారు. ఇందుకోసం టీఎస్‌బీపాస్ విధానాన్ని ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటి పన్ను ఎంత చెల్లించాలో ప్రజలే నిర్ణయించుకోవచ్చునని, ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే వారికి 25 రెట్ల జరిమానా విధిస్తారని మంత్రి తెలిపారు. నూతన పంచాయితీరాజ్ చట్టంలోని ముఖ్యంశాలు ప్రజలకు తెలియజేసేందుకు కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో గతంలో వక్ఫ్‌బోర్డు స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు అందించే విషయంలో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ను కోరారు. పట్టణ ప్రగతిలో వార్డుల ప్రత్యేక అధికారులు, కమిటీ సభ్యులతోపాటు వార్డు కౌన్సిలర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, తేరా చినపరెడ్డి తదితరులున్నారు. కాగా, పట్టణ ప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ, అధికారులతో కలసి మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి పట్టణ ప్రగతిలో ఒక్కో వార్డు కౌన్సిలర్ వారి వార్డు కు ఒక్కో కేసీఆర్‌లా వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో వార్డు కౌన్సిలర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అక్రమ లే ఔట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అలాం టి వాటిని గుర్తించి అక్రమార్కుల తాట తీస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే లు జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అవ్వా పెన్షన్ వస్తోంది ‘అవ్వా పెన్షన్ వస్తోందా’అంటూ మంత్రి కేటీఆర్ ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. దేవరకొండ పట్టణంలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10వ వార్డులో ఆయన పర్యటించారు. వీధిలో కూర్చున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.. కేటీఆర్: అవ్వా నీ పేరేంది..బాగున్నావా.. రుద్రాక్షి ముత్తమ్మ, బాగున్న.. కేటీఆర్: నీకు పెన్షన్ వస్తుందా..ఎంత వస్తుంది ముత్తమ్మ: వస్తుంది అయ్యా.. రూ.రెండు వేలు ఇస్తున్నరు కేటీఆర్: కంటి ఆపరేషన్ చేయించుకున్నట్లుంది..ఎక్కడ, ఎవరు చేశారు? ముత్తమ్మ: అవునయ్య..కళ్లు సరిగా కనపడడం లేదు. కంటివెలుగులో చూయించుకున్నా. పరీక్షలు చేసిండ్రు. నల్లగొండకు పంపితే అక్కడ ఆపరేషన్ చేసిండ్రు. కేటీఆర్: అద్దాలు బాగున్నయ్ ముత్తమ్మ: ఆపరేషన్ చేసినంక వారే ఇచ్చారు. అయ్యా.. నాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించు నాయనా.. ఢిల్లీ హింస బాధాకరం: కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస చాలా బాధాకరమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘భారతీయులంతా అత్యంత సున్నిత మనస్కులని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తలెత్తిన భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరముంది’అని మంగళవారం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన
సాక్షి, వనపర్తి: ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలని ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి సరిగ్గా శుక్రవారానికి ఏడాది పూర్తయ్యింది. కొత్త పంచాయతీల ఏర్పాటు చేసిన ఆరు మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల విషయంలో ఉదాసీనత వహిస్తోంది. పాత, కొత్త మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు. ఫలితంగా ఏడాది కాలంగా అధికారుల పాలనే సాగుతోంది. జిల్లా ఏర్పాటు అనంతరం.. 2016 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 14 మండలాలతో వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేసింది. నాడు ఒకే మున్సిపాలిటీతో ఏర్పాటు చేసిన జిల్లాలో రెండేళ్ల పూర్తికావస్తున్న తరుణం 2018 ఆగస్టు 2వ తేదీన 15 వేల జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య ఐదుకు చేరింది. పాత మున్సిపాలిటీ వనపర్తి సరసన కొత్తగా పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట పట్టణాలు మున్సిపాలిటీలుగా చేరాయి. కానీ మున్సిపాలిటీల్లో అందించాల్సిన సేవలుగాని, ఏర్పాటు చేయాల్సిన సేవలుగాని పూర్తిస్థాయిలో అమలుచేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మండల ఎంపీడీఓలకే, ఆయా మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను అప్పగించి పాలన నెట్టుకొస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి సైతం అనుమతులు ఇవ్వకుండా అధికారులు ఎనిమిది నెలల పాటు ఆయా మున్సిపాలిటీల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో నెమ్మదిగా ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా 79 పంచాయితీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా ఉన్న తండాలను, ఆవాస ప్రాంతాలను ప్రభుత్వం పంచాయతీలుగా గుర్తించింది. జిల్లాలో మునుపు 185 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు తొమ్మిది గ్రామపంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. కొత్తగా 33 గిరిజన తండాలను, 46 ఆవాస ప్రాంతాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 2019 జనవరి కొత్త పాత పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఆరు నెలల తర్వాత సర్పంచులకు చెక్‌పవర్ ఇచ్చారు. కొద్దోగొప్పో పాలన గాడిన పడుతోంది. కానీ కొత్త మున్సిపాలిటీల విషయంలోనే.. ప్రజల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 255కు చేరింది. పెరిగిన పన్నులు కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించటం పక్కన పెడితే పంచాయితీ ఉన్నప్పటికంటే ఎక్కువగా ఇంటి టాక్సీలు వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీగా ఎందుకు అప్‌గ్రేడ్ చేశారోనని అసంతృప్తి వాదనలు లేకపోలేదు. వేల మందికి ఉపాధి కరువు జిల్లాలో నాలుగు పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయటంతో జిల్లా సుమారు 9084 మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. వారికి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు పని లభించలేదు. చేసేది లేక కూలీలు ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేసింది కానీ నేటికీ ఎన్ఆర్ఈజీఎస్ పనులు ఉమ్మడి పంచాయతీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, సంక్షేమ పథకాలు ఉమ్మడి పంచాయతీ లెక్కనే వర్తింప జేస్తున్నారు. పారిశుద్ధ్య సేవలు అంతంతే.. మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన పట్టణాల్లో గతంలో కంటే పారిశుధ్య నివారణ చర్యలు ఎలాంటి పురోగతిని సాధించలేదు. నాటి పంచాయతీలో ఉన్న సిబ్బందితోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఏర్పాటు కాని పాలనా విభాగాలు కొత్త మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగాలను ఏర్పాటు నేటికీ ఏర్పాటు కాలేదు. అన్ని పనులను ఇన్చార్జ్ కమిషనర్ మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. నూతన మున్సిపాలిటీలకు పాలకవర్గాలు వస్తేగాని పాలన గాడిలో పడే పరిస్థితులు కనిపించటం లేదు. -
తీరుమారనున్న పంచాయతీ పాలన
సాక్షి, అచ్చంపేట : గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈసారి పంచాయతీ పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీలకు వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పటిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకద్బందీగా అమలు చేయనున్నారు. సర్పంచ్‌లకు సవాలే గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి పరిస్థితులు లేవు. అభివృద్ధి పనులను చేయాలంటే మొదటగా ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. గ్రామంలో ఏ పనులు చేయాలన్నా సమావేశంలో తీర్మాణాలు చేసి వారి సమక్షంలో నిధులు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతి సారి పంచాయతీకి మంజూరయ్యే నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తీర్మానం తప్పనిసరి గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటుగా వారిపై వేటుపడే అవకాశం ఉంది. గత సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బు ఖర్చు చేసి గ్రామాల్లో పనులు చేసి ఆతర్వాత వచ్చిన నిధులను తీర్మాణాలు చేయకుండానే పనులు చేశామని పంచాయతీ నుంచి డబ్బు తీసుకునేవాళ్లు. ఈసారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మాణం చేసుకుని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవినీతికి పాల్పడే సర్పంచ్ల పదవికి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. అందుబాటులో వివిధ యాప్‌లు ప్రియా సాఫ్ట్‌వేర్‌తో అక్రమాలకు చెక్ పడనుంది. పంచాయతీరాజ్ ఇనిస్టిషన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. పంచాయతీలకు ఎంత బడ్జెట్ మంజూరైంది. మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చు చేశారు. శానిటేషన్, వైద్యం, నీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణం, సిబ్బంది వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామజ్యోతి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వార్షిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపు, నిధుల ఖర్చు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ప్లాన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా సమాచారాన్ని నేషనల్ పంచాయతీ పోర్టల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జనాభా సామాజిక వివరాలు, భౌతిక వనరలు, మౌలిక వసతులు, సాంఘిక ఆర్థిక సహజ వనరులను యాక్షన్ ప్లాన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పారదర్శక పాలన నూతనంగా అమలు చేయనున్న పంచాయతీరాజ్ చట్టాలతో గ్రామాల్లో పారదర్శక పాలన అందనుంది. అందుబాటులోకి యాప్‌లు రావడంతో ఎలాంటి అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతాయి. అవినీతికి పాల్పడే సర్పంచ్‌లపై వేటు పడే అవకాశాలు ఉన్నందున తప్పులకు తావివ్వరు. యాప్‌లపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – సురేష్‌కుమార్, ఎంపీడీఓ, అచ్చంపేట -
నాలుగు ఫిర్యాదులు
ఖలీఫా ఉమర్ (రజి) పరిపాలనా కాలమది. అరబ్బు సామ్రాజ్యంలోని ఒక ప్రాంతానికి సయీద్ ఆమిర్‌ను గవర్నర్‌గా నియమించారాయన. కొన్ని నెలల తరువాత గవర్నర్ల పాలనా తీరును పరిశీలించే క్రమంలో ఖలీఫా ఉమర్ (రజి) సయీద్ ఆమిర్ (రజి) ప్రాంతానికి వెళ్లారు. ఖలీఫా తనిఖీ చేయడానికి వచ్చారని తెలిసి ప్రజలంతా మస్జిదులో హాజరయ్యారు. ఖలీఫా... పక్కనే ఉన్న గవర్నర్ సయీద్ బిన్ ఆమిర్ గురించి ఏమైనా ఫిర్యాదులున్నాయా? అని ప్రజలనుద్దేశించి అడిగారు. కొంతమంది కలగజేసుకుని గవర్నర్ గురించి నాలుగు ఫిర్యాదులు చేశారు. ‘‘గవర్నర్ గారు ఫజర్ నమాజు తరువాత కలవరు’’ అన్న ఫిర్యాదుకు సంజాయిషీ ఇవ్వమని కోరారు. అందుకు సయీద్ బిన్ ఆమిర్ ‘‘అయ్యా, మా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంటి పనులన్నీ నేనే స్వయంగా చేయాలి. ఉదయాన్నే నమాజు తరువాత ఇల్లు ఊడ్చి, అంట్లు కడిగి, రొట్టెల పిండి కలిపి రొట్టెలు చేస్తున్నాను. మంచానికే పరిమితమైన నా భార్య అవసరాలు తీరుస్తున్నాను. బట్టలు ఉతుకుతున్నాను. ఇంటిపనులన్నీ చేస్తున్నాను కాబట్టి ఆ వేళలో ప్రజలకోసం సమయం కేటాయించలేకపోతున్నాను. నౌకరును పెట్టుకునేంత స్థోమత నాకు లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘వారంలో ఒకరోజు ప్రజలను కలవరు’ అన్నది మరో ఫిర్యాదు. దానికి సయీద్ బిన్ ఆమిర్ ‘‘ఈ విషయం నేనెంతో రహస్యంగా ఉంచదలుచుకున్నాను. ప్రజలు మీముందు ఫిర్యాదు చేశారు కాబట్టి చెప్పక తప్పడం లేదు. నాకున్నది ఒకే ఒక్క జత బట్టలు. వాటిని వారానికోసారి ఉతికి ఆరేస్తాను. అవి ఆరేదాకా నా భార్య బట్టలు తొడుక్కుంటాను. అందుకే వారంలో ఒకరోజు బయటికి రాను’ అని చెప్పారు. ‘నువ్వు రాత్రుళ్లు ఎవ్వరినీ కలవవు’ అన్నది మూడో ఫిర్యాదు. ‘‘నా తల వెంట్రుకలు, గెడ్డం అన్నీ నెరసిపోయాయి. ప్రభువు పిలుపు ఎప్పుడొస్తుందో తెలియదు. నా పాపాల చిట్టా చాంతాడంత ఉంది. పగలంతా ప్రజాసేవలో గడపడం మూలాన దైవారాధనకు తీరిక దొరకడం లేదు కాబట్టి రాత్రుళ్లు అల్లాహ్ ఆరాధనలో లీనమవుతాను’ అని చెప్పాడు. ‘ఒక్కోసారి స్పృహతప్పి పడిపోతాడు’ అన్నది నాలుగో ఫిర్యాదు‘నేను నలభై ఏళ్ల వయస్సులో కలిమా చదివి విశ్వాసినయ్యాను. నలభై ఏళ్ల వరకూ నేను చేసిన పాపాలు గుర్తుకొచ్చినప్పుడల్లా స్పృహ తప్పిపడిపోతున్నాను. ప్రళయం రోజు నా పాపాల గురించి అల్లాహ్ నిలదీస్తే నేనేం జవాబు చెప్పాలన్నదే నా భయమంతా. నాకోసం ప్రార్థించండి’’ అని అన్నాడు. అలాగే, ‘ఖలీఫా గారూ ఈ నాలుగు ఫిర్యాదులకు మీరేం శిక్ష వేసినా నేను భరించేందుకు సిద్ధమే’ అని చెప్పాడు. ‘‘ఓ అల్లాహ్ ఇలాంటి మరింతమంది గవర్నర్లను నాకివ్వు’’ అంటూ రోదిస్తూ ఖలీఫా ఉమర్ తన రెండు చేతుల్ని పైకెత్తి అల్లాహ్‌ను వేడుకున్నారు. – ముహమ్మద్ ముజాహిద్ -
నరేంద్రమోదీ ధైర్యం.. ప్రభుత్వం కొత్త ప్రయోగం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాలనా వ్యవస్థను మరింత మెరగు పర్చేందుకు ఐఏఎస్‌ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ ఎంతో కాలంగా ప్రతిపాదనలు వస్తున్నా గత ప్రభుత్వాలు అందుకు ధైర్యం చేయలేక పోయాయి. ఉన్నతాధికార పాలనా వ్యవస్థలోకి బయటి వారిని ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఇక్కడ బయటి వారంటే దేశ, విదేశాల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నత చదువులు చదవడమే కాకుండా దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన కలిగిన విద్యావేత్తలు. భారతీయ అధికార వ్యవస్థను మనం ‘ఉక్కు కవచంగా’ వర్ణిస్తాం. ‘అసియాస్ మోస్ట్ ఇనెఫిషెంట్ (ఆసియాలోనే అత్యంత అసమర్థ వ్యవస్థ)’గా హాంకాంగ్‌లోని ‘పొలిటికల్ అండ్ ఎకనామిక్ రిస్ట్ కన్సల్టెన్సీ’ అభివర్ణిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ ఉన్నతాధికార యంత్రాంగంలోకి బయటి వారిని ఆహ్వానించడం సముచిత నిర్ణయమే. కాని దాన్ని అమలు చేసే విధానంలోని దాని జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఎలాంటి విధానం అమలు చేయాలో తెలియాలంటే ముందుగా ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను గ్రహించాలి. ఐఏఎస్‌లకు వృత్తిరీత్యా, ఆర్థికంగా సరైన రాయతీలు కల్పించక పోవడం ప్రధాన లోపం. సీనియారిటీ పరంగా కాకుండా నైపుణ్యం, పోటీతత్వం ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలి. ఆర్థిక రాయతీలు కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. భారతీయ అమెరికన్ సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థకు 43వ ఏటనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా నియమితులయ్యారంటే అమెరికాలో అలాంటి వ్యవస్థ ఉండడమే కారణం. ఆయనే కనుక భారత్‌లో ఉండి ఉంటే మన అధికార యంత్రాంగంలో మధ్యస్థాయి జాయింట్ సెక్రటరీ అయ్యేవారు. సివిల్స్‌లో దేశమంతా సీనియర్లకు పదోన్నతి అవకాశాలను మెరగుపరుస్తూనే వారే తమ జూనియర్లను ప్రోత్సహించే విధంగా రాయతీలు ఉండాలి. మంచి సమర్థత కలిగిన, ఐఏఎస్ కాని అధికారులను కూడా ఐఏఎస్ క్యాటగిరీలోకి తీసుకోవాలి. అలా కూడా అధికారుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. ఐఏఎస్‌ల విధుల నిర్వహణలో రాజకీయ జోక్యం అసలు ఉండకూడదు. రాజకీయ జోక్యాన్ని కూడా పట్టించుకోకుండా నిజాయితీయిగా, సమర్థంగా అక్కడక్కడా పని చేస్తున్న జిల్లా కలెక్టర్ల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. వారి ప్రమోషన్ల కోసం జిల్లా వార్షికాభివృద్ధి సూచికలను పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి సూచికల పరిధిలోకి సామాజిక, ఆర్థికాభివృద్ధి అంశాలు వస్తాయన్న విషయం తెల్సిందే. ఐఏఎస్‌లోకి అభ్యర్థులను ఆకర్షించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తరహాలోనే ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ కాలేజీలు ఉండాలి. వారికి అమెరికాలోని ‘కొలంబియా యూనివర్శిటీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’లో మాస్టర్ డిగ్రీ చేసే అవకాశం ఉండాలి. మన ఐఏఎస్‌లకు సాధారణ శిక్షణకు పరిమితమైన ‘లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ను అన్ని విధాల లోతుగా అధ్యయనం చేసే అకాడమీగా తీర్చిదిద్దాలి. -
అగ్రరాజ్యం ఆగింది
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. అమెరికా పాలనా యంత్రాంగాన్ని నడిపేందుకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్ తిరస్కరించటంతో షట్‌డౌన్ మొదలైంది. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. సెనెట్‌లో డెమొక్రాట్లకు కొందరు రిపబ్లికన్ ప్రతినిధులు తోడవటంతో ఈ బిల్లు వీగిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి 12.01 నిమిషం (స్థానిక కాలమానం)తో షట్‌డౌన్ మొదలైంది. దీంతో పెంటగాన్, ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు తాత్కాలికంగా ఆగిపోతాయి. గతంలో 2013 అక్టోబర్‌లో 16 రోజుల పాటు, 1996లో 21 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. అయితే.. సెనెట్, వైట్‌హౌస్ ఒకే పార్టీ ఆధిపత్యంలో ఉన్న సమయంలో షట్‌డౌన్ కావటం మాత్రం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. 50–48తో వీగిపోయిన బిల్లు డెమొక్రాట్లు కావాలనే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని ట్రంప్ విమర్శించారు. పన్ను తగ్గింపు విజయాన్ని తగ్గించి చూపేందుకే డెమొక్రాట్లు కుట్ర పన్నారన్నారు. ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు 50–48 తేడాతో వీగిపోయింది. సోమవారం నుంచి తీవ్ర ఇబ్బందులు తప్పవు. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండానే సెలవులో ఉంటారు. వైద్యం, పోలీసు వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. 2013 కన్నా తక్కువ ప్రభావం ఉండేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బడ్జెట్ నిర్వహణ కార్యాలయం తెలిపింది. ‘ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులేమీ చేయం. మిలటరీ సరిహద్దులను కాపలాకాస్తుంది. పార్కులు, పోస్టాఫీస్‌లు తెరిచే ఉంటాయి. ఎక్కడా ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండబోదు’ అని బడ్జెట్ నిర్వహణ కార్యాలయం డైరెక్టర్ మిక్ ముల్వనే పేర్కొన్నారు. ట్రంప్ దావోస్ పర్యటనకు నో ప్రాబ్లమ్ వినియమ బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో ఫ్లోరిడాలోని మారాలాగోలో నిర్ణయించిన వారాంతపు పర్యటనను ట్రంప్ విరమించుకున్నారు. అయితే వచ్చేవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో మాత్రం ఆయన పాల్గొంటారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ‘పుంజుకుంటున్న అమెరికా ఆర్థికాభివృద్ధిని డెమొక్రాట్లు అడ్డుకోలేకపోతున్నారు. అందుకే షట్‌డౌన్ ద్వారా ప్రభుత్వం జోరుకు సంకెళ్లు వేద్దామనుకుంటున్నారు’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమంగా అమెరికాలో నివాసముంటున్న తల్లిదండ్రుల వెంట అమెరికా వచ్చిన పిల్లల (స్వాప్నికులు) విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. సెనెట్‌లో డెమొక్రాట్ల పక్ష నేత చెక్ షుమర్ పేరుతో ఈ షట్‌డౌన్‌ను రిపబ్లికన్లు ‘షుమర్ షట్‌డౌన్’ అని పిలుస్తున్నారు. షట్‌డౌన్ ప్రభావమెంత? అత్యవసరసేవలు మినహా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే షట్‌డౌన్ ప్రారంభమైంది. దీని కారణంగా వివిధ శాఖల్లో పనిచేసే దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను అత్యవసరం కాని కార్మికులుగా పరిగణించి వారికి వేతనంలేని సెలవులు సోమవారం నుంచి మంజూరుచేయడంతో ఉత్పాదకత పడిపోతుంది. రక్షణశాఖలోని 7,40,000 మంది కార్మికులకు ఈ షట్‌డౌన్ వర్తిస్తుంది. సైనికసిబ్బంది వేతనాలకు కాంగ్రెస్ ఆమోదముద్ర అవసరం. అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగానికి కాంగ్రెస్ నుంచి నిధుల ప్రవాహం ఉండనందున ప్రభుత్వ మూసివేత ప్రభావం ఉండదు. సిబ్బందికి వీసాల మంజూరు కోరే కంపెనీలకు దీని వల్ల ఇబ్బందులు తప్పవు. కాన్సులేట్లకూ ఇబ్బందే షట్‌డౌన్ దీర్ఘ కాలం కొనసాగితే విదేశాల్లోని అమెరికా కాన్సులేట్ల నిర్వహణ కష్టమౌతుంది. షట్‌డౌన్ ముగిసేంత వరకు వివిధ వీసాలపై అమెరికా వెళ్లేవారు తమ ప్రయత్నాన్ని మానుకోక తప్పదు. లక్షా 15వేల మంది పనిచేసే న్యాయశాఖ అత్యవసర సర్వీసు కావడంతో ఇందులోని 20,000 మందికి సెలవిచ్చారు. స్టాక్‌మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్చ్సేంజ్ కమిషన్ కొన్ని రోజులే పనిచేయగలదు. పన్ను వసూలు చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ నుంచి ప్రజలు, సంస్థలకు పన్ను రిఫండ్ నిలిచిపోతుంది. పార్కులు, మ్యూజియంలూ బంద్ రోజూ పది లక్షల మంది సందర్శించే 417 జాతీయ పార్కులు, ప్రపంచ ప్రసిద్ధిపొందిన 19 స్మిత్సానియన్ మ్యూజియంల గేట్లకూ తాళాలు వేశారు. ఫలితంగా వీటినుంచి వచ్చే కోట్లాది డాలర్ల ఆదాయం కోల్పోయినట్లే. 2020 జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే నత్తనడక నడుస్తున్న అమెరికా సెన్సస్ బ్యూరో కార్యకలాపాలు ఇక ముందుకు సాగవు. బాలల ఆరోగ్య బీమా పథకం వర్తించే దాదాపు కోటి మంది పిల్లల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం కూడా గందరగోళంలో పడుతుంది. అదనపు నిధులు లేకుండా సుప్రీంకోర్టు సహా ఫెడరల్ కోర్టులు మూడు వారాల వరకూ పనిచేయగలవు. ఈ లోగా సమస్య పరిష్కారం కాకుంటే కోర్టుల కార్యకలాపాలూ ఆగిపోతాయి. ఆదాయ, సామాజిక భద్రతా నంబర్ల ధ్రువీకరణ వంటి ప్రభుత్వ సేవలు లభ్యంకాకపోతే సాధారణ రుణాలు, గృహరుణాల మంజూరు సాధ్యంకాదు. -
ప్రభుత్వాన్ని నడపాలనుకోవట్లేదు
న్యూఢిల్లీ: తాము ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వస్తున్న విమర్శ లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కార్యనిర్వాహక వ్యవస్థ తన పని సక్రమంగా చేయడం లేదని, ఈ విషయాన్ని న్యాయ వ్యవస్థ ఎత్తిచూపితే తమపై విమర్శలకు దిగుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని వివిధ పట్టణాల్లోని పేదలకు నివాసయోగ్యత కల్పించే అంశానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. పట్టణ పేదలకు నివాసయోగ్యత కల్పించే అంశంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందినట్టు కనిపిస్తోందని న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ‘మాది కార్యనిర్వాహక వ్యవస్థ కాదు. మీరు మీ పనిని సక్రమంగా చేయడం లేదు. దీనిపై ఏమైనా అంటే మేము దేశాన్ని నడిపించ డానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నామంటూ అందరూ మాపై విమర్శలు గుప్పిస్తున్నారు’’అని పేర్కొంది. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్యూఎల్ఎం) పథకం 2014లో ప్రారంభమైందని, అయితే యూపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసింది శూన్యమని చెప్పింది. ఇది మనుషులకు సంబంధించిన విషయమని అధికారులు గుర్తుంచుకోవాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తుషార్‌మెహతాకు స్పష్టం చేసింది. దీనికి ఏఎస్జీ స్పందిస్తూ.. ఈ అంశంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, పట్టణ పేదలకు నివాస వసతి కల్పించే ప్రయత్నాలు చేస్తోంద న్నారు. పట్టణ పేదలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రతి రాష్ట్రంలో ఇద్దరు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం సుప్రీంకు తెలిపింది. దీనికి స్పందించిన సుప్రీం రాష్ట్రాలతో సమన్వ యం చేసుకుని, కమిటీ సభ్యుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించేలా చేయాలని సూచించింది. కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి, పట్టణాభివృద్ధి శాఖలోని సీనియర్ అధికారి, పౌరసమాజం నుంచి ఒకరిని ఈ కమిటీలోకి ఎంపిక చేయాలంది. పట్టణ నిరాశ్రయులకు ఆధార్ ఎలా? పట్టణాల్లో నిరాశ్రయులైన పేదలకు ఆధార్ కార్డులను ఎలా జారీచేస్తున్నారని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పట్టణాల్లో నిరాశ్రయులకు ఆవాసం కల్పించడంపై జరిగిన విచారణ సందర్భంగా బుధవారం ఈ అంశాన్ని లేవనెత్తింది. ఇల్లు లేని వ్యక్తి ఆధార్ కార్డులో ఏ చిరునామా చేరుస్తారని కోర్టు ప్రశ్నించగా, యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ...అలాంటి వారికి ఆధార్ జారీచేసే అవకాశాలు లేవని అన్నారు. మరి ఆధార్ కార్డులేని వారు భారత్‌లో, యూపీలో లేరా? ఉంటే వారికి షెల్టర్ హోంలలో నీడ కల్పించరా? అని కోర్టు తిరిగి ప్రశ్నించగా...వారికి ఓటరు ఐడీ లాంటి ఇతర గుర్తింపు కార్డులున్నాయన్నారు. -
మీవల్లే ఫెయిలయ్యాం
-
మీవల్లే ఫెయిలయ్యాం
►కలెక్టర్లు, అధికారుల సదస్సులో సీఎం చంద్రబాబు ఆగ్రహం ►అధికారుల తీరువల్లే మిషన్ల అమల్లో వైఫల్యం ►పాఠశాల విద్యకు నిధులిచ్చినా పనులు కావడంలేదు ►అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే ఏమి చేస్తాం? ►సీఎం తీరుపై అధికార వర్గాల మండిపాటు సాక్షి, అమరావతి: సామాజిక సాధికారత, సేవారంగ మిషన్ల అమలులో ఫెయిలయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మిషన్లపై గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సు నుంచి ఇప్పటి వరకు ఒక్క అధికారైనా సమావేశం పెట్టారా? కనీసం కూర్చున్నారా? కూర్చుంటే కదా మాట్లాడేది.. అంటూ కలెక్టర్లు, ఇతర ఐఏఎస్‌లను ప్రశ్నించారు. గురువారం రెండో రోజు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఏడు మిషన్లలోని సామాజిక సాధికారత, సేవారంగ మిషన్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పకపోవడంతో సీఎం కాస్త ఘాటుగా మాట్లాడారు. అధికారుల తీరు వల్లే ఆ మిషన్ల అమలులో ఫెయిలయ్యాం అని అన్నారు. ప్రాథమిక విద్యపై కనీస బాధ్యత లేకుండా ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యను ఫెయిల్ చేయటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ చేస్తున్నారని ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను ఉద్దేశించి సీఎం వ్యంగ్యంగా మాట్లాడారు. గ్యాస్ తెప్పించు కోలేరా? బయోమెట్రిక్ పెట్టించుకోలేరా? అంటూ విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ ఆన్సర్ సరిగాలేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే ఏమి చేస్తాం, యాన్యుటీ కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చాం, ఏమి చేస్తున్నారు’ అంటూ ప్రిన్సిపల్ కార్యదర్శిపై మండిపడ్డారు. రాష్ట్రంలో 47 శాతం విశ్వవిద్యాలయాలు నాక్ అక్రెడిటేషన్ పొందాయని, 13 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్నాయన్నారు. లక్షా 62 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రూ. 15,800 కోట్లతో కొత్తగా రాష్ట్రంలో 11 వర్సిటీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఆ శాఖల మధ్య సమన్వయం లేదు గర్భిణులకు సరైన పోషకాహరం ఇవ్వాలని, ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని సీఎం చెప్పారు. అయితే ఈ విషయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖలకు పడటంలేదన్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రక్తహీనత, నియంత్రణలేని రక్తపోటు కారణంగా పెద్దసంఖ్యలో మహిళలు మృతి చెందుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. శాఖల మధ్య సమన్వయం లేక పౌష్టికాహారం అందకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఉద్దేశించి సీఎం అన్నారు. సీఎం నవరాత్రి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాల్లోని తెలుగు వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ఈ ఉత్సవాలు ఆరంభసూచకమన్నారు. మీడియా కథనాలపై స్పందించండి ప్రజా సమస్యలపై మీడియాలో వచ్చే కథనాలపై స్పందించాలని అధికారులకు సీఎం సూచించారు. సమస్యలపై ప్రజలు ఫోన్ చేస్తే తక్షణం స్పందించి పరిష్కారం చూపాలన్నారు. మీడియా కథనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. పంచాయతీ కార్యాల యాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కాగా, సీఎం తీరుపై అధికార వర్గాలు మండిపడుతున్నాయి. నేతల వైఫల్యాలను తమపైకి నెట్టడానికి సీఎం ప్రయత్నించారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల లేమితో పాటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పాలన కుంటుపడుతోందని విమర్శించారు. -
పడకేసిన పల్లె పాలన
- జిల్లాలో గ్రామ కార్యదర్శులకు కొరత - మొత్తం పంచాయతీలు 1069.. ఉన్న కార్యదర్శులు 524 మంది - సగానికి పైగా ఇన్చార్జిల ఏలుబడిలోనే.. - క్లస్టర్ పంచాయతీల్లోనూ ఖాళీలే.. - అదనపు భారంతో సిబ్బంది ఇక్కట్లు బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా.. చేతిపంపు మరమ్మతు చేయించుకోవాలన్నా.. డ్రైన్లు శుభ్రం చేయించుకోవాలన్నా.. రోజుల తరబడి పేరుకుపోయే చెత్తను తొలగించాలన్నా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాల్సిందే. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీ పాలనలో కార్యదర్శులదే కీలకపాత్ర. ధ్రువపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామసభల నిర్వహణ, ఉపాధి హామీ సేవలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు, ఇతర పరిపాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. అంతటి కీలకమైన గ్రామ కార్యదర్శుల పోస్టులు జిల్లాలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో పల్లెల్లో పాలన పడకేస్తోంది. మండపేట : జిల్లాలోని పంచాయతీల్లో కార్యదర్శులకు కొరత వచ్చింది. సగానికి పైగా పంచాయతీలు ఇన్చార్జిల ఏలుబడిలోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బంది అదనపు భారంతో సతమతమవుతున్నారు. దీంతో గ్రామ పాలన గాడి తప్పుతోంది. కార్యదర్శులు లేకపోవడంతో వివిధ పనులు, సమస్యల పరిష్కారానికి వస్తున్న ప్రజలు.. పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 1,069 పంచాయతీలకుగాను ప్రస్తుతం 524 మంది మాత్రమే కార్యదర్శులున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఊహించుకోవచ్చు. క్లస్టర్లకూ తప్పని కొరత సిబ్బంది కొరతను అధిగమించి, పాలనా సౌలభ్యం కోసం రెండు మూడు మైనర్ పంచాయతీలు లేదా మేజర్ పంచాయతీకి సమీపంలోని మైనర్ పంచాయతీని కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో కార్యదర్శి పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని 1,069 పంచాయతీలను 779 క్లస్టర్లుగా విభజించారు. ఇలా లెక్కేసుకున్నా కూడా పూర్తిస్థాయిలో కార్యదర్శులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 524 మంది కార్యదర్శులు మాత్రమే ఉండటంతో ఇంకా 255 క్లస్టర్ పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఫలితంగా ఒక్కో కార్యదర్శి రెండు లేదా మూడు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల నాలుగైదు పంచాయతీలకు సహితం ఒక్కరే విధులు నిర్వహించాల్సి వస్తోంది. అందని సేవలు ఇన్చార్జి బాధ్యతలను సాకుగా చూపి కొందరు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా అధిక శాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి నెలకొంటోంది. రామచంద్రపురం రూరల్ పరిధిలో 25 గ్రామ పంచాయతీలకు 10 మంది కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కరప మండలంలో 23 పంచాయతీలకుగాను కేవలం 11 మంది కార్యదర్శులే ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కపిలేశ్వరపురం మండలంలో 19 పంచాయతీలకు 13 పంచాయతీల్లోనే కార్యదర్శులు ఉన్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లావ్యాప్తంగా అధిక శాతం మండలాల్లో దాదాపు ఇదే దుస్థితి నెలకొని ఉంది. కార్యదర్శులు లేకపోవడంతో సకాలంలో పనులు జరగడం లేదని, చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని గ్రామీణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిపై పంచాయతీ కార్యాలయాలకు వెళుతుంటే అక్కడి సిబ్బంది ఆఫీసరుగారు లేరంటున్నారని ప్రజలు వాపోతున్నారు. పలు పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇతర సమస్యల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. కార్యదర్శుల కొరతను అధిగమించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు
కొవ్వూరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను గడువులోగా భవన క్రమబద్ధీకరణ (బీపీఎస్) పథకంలో క్రమబద్ధీకరించుకోవా లని, లేకుంటే అటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం రీజియన్ పట్టణ ప్రణాళిక శాఖ ఆర్జేడీ పీఎన్ఎస్ సాయిబాబా హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణాలు చేపట్టరాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేని కట్టడాల ఫొటోలను ఆయా పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏపీ మున్సిపల్ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించామన్నారు. 20,483 దరఖాస్తులు రాజమహేంద్రవరం రీజియన్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భవన క్రమబద్ధీకరణకు 20,483 దరఖాస్తులు వచ్చాయని ఆర్జేడీ సాయిబాబా తెలిపారు. వీటిలో 78 దరఖాస్తులను తిరస్కరించగా 6,104 పరిశీలనలో ఉన్నాయన్నారు. 14,286 మందికి భవన క్రమబద్ధీకరణ జరుపుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రం లో ఆన్లైన్ ద్వారా కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. సక్రమమైన బిల్డింగ్ ప్లాన్ ద్వారా గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చన్నారు. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్‌కు అప్రూవల్ వస్తే భవన యజమానికి ఎంత ఫీజు చెల్లించాలనేది మెసేజ్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్లాన్ ప్రకారమే నిర్మాణం ఉండాలి దరఖాస్తుదారుడు ఆన్లైన్లో నియమ నిబంధనలు తప్పక పాటించాలని, మం జూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి మెస్సర్స్ సాఫ్ట్ టెక్నాలజీ ఇంజినీరింగ్స్ సంస్థ ప్రతినిధులు శిక్షణ ఇస్తారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పోస్ట్ వెరిఫికేషన్ చేయాలని, నిబంధనలను అతిక్రమించి కట్టడాలు చేపడితే సంబం ధిత సిబ్బంది, ప్లాను వేసి లైసెస్డ్ సర్వేయర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవ్వూరు మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం కొవ్వూరు పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థించగా ప్రభుత్వం ఆమోదం తె లిపిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టెండర్ విధానం ద్వారా ఆన్ గ్రౌండ్ అభివృద్ధి, శాటిలైట్ చిత్రాల ద్వారా రివైజ్డ్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తామని ఆర్జేడీ సాయిబాబా పేర్కొన్నారు. -
మండల్ పాలన!
బాలారిష్టాల్లో కొత్త మండలాలు ► గాడిన పడని పాలనా వ్యవస్థ ► సిబ్బంది సరిపడా లేక అవస్థ ► ప్రతి పనికీ మాతృ మండలమే దిక్కు ► చుక్కలు చూపిస్తున్న ‘రెవెన్యూ పనులు’ ► తహసీల్దార్ మినహా మిగతా పోస్టులు ఖాళీ ► కూర్చోవడానికి కుర్చీలూ కరువే.. మండలస్థాయిలో పాలన ఇంకా గాడిన పడలేదు. కొత్త మండలాలు పురుడు పోసుకున్నా.. పరిపాలన మాత్రం పక్క మండలాల నుంచే సాగుతోంది. దసరా రోజున ఘనంగా ప్రారంభమైన నూతన మండలాల్లో ఇంకా పూర్తిస్థాయిలో యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో రెవెన్యూ రికార్డులన్నీ మాతృ మండలాల్లోనే భద్రపరచడంతో ప్రతి ఫైలుకు పాత మండలంపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. నందిగామ, చౌదరిగూడ, అబ్దుల్లాపూర్‌మెట్, గండిపేట, బాలాపూర్, కడ్తాలలు కొత్త మండలాలు. ఇవి అక్టోబర్ 11న విజయదశమి నాడు కొత్త జిల్లాలు ఆవిర్భవించిన రోజునే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అయితే, బాలారిష్టాలు మాత్రం ఇప్పటికీ అధిగవిుంచలేదు. – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి.. ♦ కడ్తాల్: డిప్యూటీ తహసీల్దార్ (డీటీ), సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వ్యవసాయ శాఖకు కార్యాలయం లేదు. తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగుతోంది. ♦ చౌదరిగూడెం: సర్వేయర్ పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన పోస్టులు భర్తీ అయ్యాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మండలాల్లో పూర్తిస్థాయిలో తహసీల్దార్లు కొలువుదీరినా.. మిగతా పోస్టులు మాత్రం దాదాపు అన్నిచోట్ల ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల పునర్విభజనకు ముందే ప్రతి ఫైలును జిల్లా యంత్రాంగం స్కానింగ్ చేసింది. ఈ రికార్డులని్నంటినీ మాతృ జిల్లా, మండలాల్లో భద్రపరిచింది. స్కాన్ చేసిన పహాణీ తదితర రికార్డులను చూసుకునే వెసులుబాటును రెవెన్యూ అధికారులకు కల్పించింది. ఇది ఒకింత మంచిదే అయినా.. అర్జీదారులకు మాత్రం చుక్కలు చూపుతోంది. ఏదైనా పనికి దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ ఉద్యోగులు పాత మండలాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్కాన్ కాపీలను చూసి ఫైలును ప్రతిపాదించలేమని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల కోసం పాత ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. దీంతో సమయమంతా వృథా కావడంతో అర్జీదారులు లబోదిబోమంటున్నారు. దీనికితోడు పరిపాలనాపరంగా సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. అరకొర సిబ్బంది.. ఇబ్బడిముబ్బడిగా నయా మండలాలు ఏర్పడడం.. తగినంత సిబ్బంది లేకపోవడంతో పరిపాలనపై తీవ్రప్రభావం చూపుతోంది. చాలావరకు కొత్త మండలాల్లో సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా.. పలు మండలాల్లో పూర్తిస్థాయి యంత్రాంగం కొలువుదీరలేదు. దీంతో నూతన మండలాల పరిధిలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా సర్వేయర్లు అందుబాటులో లేక భూముల సర్వే నిలిచిపోతోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో అరకొర సిబ్బంది ఉండగా.. ఇక ఎంఈఓ ఆఫీసులు మొదటి రోజుతోనే మూతపడ్డాయి. కొత్త మండలాల పరిధికి అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. ఇవి మాత్రం బాగానే పనిచేస్తున్నా.. కేసు నమోదు అధికారం మాత్రం పాత ఎస్హెచ్ఓల వద్దే ఉంది. వ్యవసాయ అధికారులు మాత్రం తహసీల్దార్ భవనంలోనే ఒక మూలకు విధులు నిర్వర్తిస్తున్నారు. అత్తెసరు ఫర్నిచర్.. కార్యాలయ నిర్వహణకు కొంతమేర నిధులు సర్దుబాటు చేసినా.. చాలా దఫ్తార్లలో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నీచర్ ఉండాలి. కానీ, ఆ పరిస్థితి ఆఫీసుల్లో కనిపించడంలేదు. ఎవరైనా వస్తే కూర్చోవడానికి కొన్ని కార్యాలయాల్లో కుర్చీలు సైతం లేవు. కొత్త మండలాల్లో ఇదీ పరిస్థితి.. ♦ నందిగామ: తహసీల్దార్, డిటీ, సీనియర్ అసిస్టెంట్ తప్ప రెండు ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్, టైపిస్ట్, మూడు సబార్డినేట్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ♦ బాలాపూర్ : మండలంలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. తహసీల్దార్, డీటీ, సర్వేయర్లు విధుల్లో కొనసాగుతున్నారు ♦ అబ్దుల్లాపూర్‌మెట్: మండలంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ. ♦ గండిపేట: మండలంలో సర్వేయర్, ఒక ఆర్ఐ పోస్టు ళాళీగా ఉంది. తహసీల్దార్ ఉన్నప్పటికీ రాజేంద్రనగర్‌కు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు మండలాలకు కలిపి ఒక సర్వేయర్ పనిచేస్తున్నాడు. గండిపేట మండలానికి సంబంధించిన రికార్డులన్నీ రాజేంద్రనగర్ కార్యాలయంలోనే ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నరేంద్ర + ఇందిరా =నరీంద్ర మోదీ
న్యూఢిల్లీ: ‘వో కహతే హై మోదీ హఠావో, మై కహతా హు కాలే ధన్ హఠావో’ సోమవారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నమాటలివి. ‘వో కహతే హై ఇందిరా హఠావో, మై కహతీ హు గరీబీ హఠావో’ అని 1971లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అన్నమాటలివి. నేడు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలపై మోదీ ఈ వ్యాఖ్యలు చేయగా, నాడు తమళనాడు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఇండియా (0–ఆర్గనైజేషన్) నాయకుడు కే. కామరాజ్ చేసిన విమర్శలపై ఇందిరా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు ఇందిరాగాంధీ చేసిన వ్యాఖ్యలనే నేడు నరేంద్ర మోదీ ఉచ్ఛరించడమే కాకుండా జాగ్రత్తగా గమనిస్తే ఆమె తరహాలోనే పరిపాలన సాగిస్తున్నారు. ఇందిర హయాంలో ప్రధాన మంత్రి పీఠమే అ«ధికార కేంద్రంగా పరిపాలన సాగగా, నేడు మోదీ హయాంలో కూడా అదే కొనసాగుతోంది. నాడు ప్రజాప్రతినిధులకన్నా అధికారులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండగా, మోదీ హయాంలో అదే కొనసాగుతోంది. ఇందిర హయాంలో తోటి మంత్రులకాన్న పీఎన్ హక్సర్, పీఎన్ ధర్, పీసీ అలెగ్జాండర్లే ఎక్కువ అధికారాలు చెలాయించారు. నాడు కశ్మీర్ నుంచి నేడు గుజరాత్ నుంచి.... నాడు అధికారుల సలహా మేరకే ఇందిరాగాంధీ 1969లో ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణకు చొరవ తీసుకుంటే నేడు నరేంద్ర మోదీ తోటి మంత్రులకు కూడా చెప్పకుండా గుజరాత్‌కు చెందిన హాస్ముఖ్ అధియా లాంటి అధికారుల సలహా మేరకు పెద్ద నోట్లను రద్దు చేశారు. నాడు ఇందిర కశ్మీరుకు చెందిన అధికారులనే ఎక్కువగా తన కొలువులో పెట్టుకోగా, నేడు గుజరాత్‌కు చెందిన అధికారులనే కేంద్ర క్యాడర్లోని ముఖ్యమైన పోస్టులకు తెచ్చుకుంటున్నారు. సమాఖ్య పాలన విస్మరణ.... ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన సమాఖ్య పాలనకు నాడు ఇందిరాగాంధీ చరమగీతం పాడగా, నేడు మోదీ కూడా అదే బాట అనుసరిస్తున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యంగా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు కేంద్రం చెప్పుచేతుల్లో ఉండేలా చూసుకోవడం. అందుకు కీలుబొమ్మ ముఖ్యమంత్రులను నియమించడం పరిపాటి. 1978 నుంచి 1983 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుగురు ముఖ్యమంత్రులను చూసింది. నాడు పాత వారిని తొలిగించడం, వారి స్థానంలో కొత్త వారిని నియమించడంలో కీలక పాత్ర ఇందిరాగాంధీదే. మోదీ కూడా ఆమె తరహాలోనే.... ఇప్పుడు గుజరాత్, గోవా ముఖ్యమంత్రులు డమ్మీలే. వారు మోదీ ఆశీస్సులతోనే సీఎంలు అయ్యారు. మహారాష్ట్ర, హర్యానాలో కూడా స్థానికంగా ప్రాబల్యంగల కులానికి చెందిన వారు కాకుండా తన మాట వినేవారినే సీఎం కుర్చీలో కూర్చునేలా మోదీ చేశారు. 1980లో మరాఠా లాబీని దెబ్బతీయడం కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏఆర్ అంతులేను ఇందిరాగాంధీ సీఎం చేసినట్లుగా మోదీ కూడా నడుచుకున్నారు. అందుకే ఇప్పుడు మోదీ సోషల్ మీడియా ‘నరీంద్ర’ మోదీగా అభివర్ణిస్తోంది. భవిష్యత్తు ఏమిటీ? ఏకఛత్రాధిపత్య పాలన సాగిస్తూ ఉక్కు మహిళగా గుర్తింపు పొందిన ఇందిరా గాంధీ 1984లో హత్యకు గురవడంతో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన సానుకూల పవనాలు వీచి కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 404 సీట్లు వచ్చాయి. వ్యక్తిగతంగా అంతటి గుర్తింపు తెచ్చుకోవాలని, విజయం సాధించాలని నరేంద్ర మోదీ కూడా అనుకున్నారేమో 2014 ఎన్నికల్లో అన్నీ తానై బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. నాడు ప్రైవేటు బ్యాంకుల జాతీయం, ‘గరీబీ హఠావో’ నినాదం ద్వారా నాడు(1971) ఎన్నికల్లో ఇందిరాగాంధీ పార్టీని గెలిపిస్తే స్తే నేడు ‘కాలా ధన్ హఠావో’ నినాదంతో మోదీ, రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని ఏం చేస్తారో!? -
శివాజీ పరిపాలన-రెవెన్యూ విధానం
1674, జూన్ 16న పట్టాభిషక్తుడైన శివాజీ.. ఛత్రపతి అనే బిరుదును స్వీకరించాడు. తన రాజ్యానికి ‘స్వరాజ్’ అని నామకరణం చేశాడు. సైన్యాన్ని నడపడంలోనూ, గెరిల్లా యుద్ధాలు చేయడంలోనూ శివాజీ అసమాన ప్రతిభను కనబరిచాడు. పరిపాలనలో ప్రజా సంక్షేమానికి బాటలు పరిచాడు. ఇందుకోసం మంచి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పరిపాలనలో తనకు సహకరించడానికి ఎనిమిది మంది మంత్రులను నియమించుకున్నాడు. వారిని ‘అష్ట ప్రధానులు’గా పిలిచేవారు. పీష్వా: అష్ట ప్రధాన వ్యవస్థలో పీష్వా అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఇతనిది ప్రధానమంత్రి హోదా. చక్రవర్తి తర్వాత స్థానం అతనిదే. రాజ శాసనాలపై పీష్వా అధికార ముద్ర ఉండేది. అమాత్య: ఇతడ్ని మజుందార్ అని కూడా వ్యవహరించేవారు. ఆర్థిక శాఖకు అధినేత. స్వరాజ్ ఆదాయ వ్యయాలన్నీ ఈయన అధీనంలోని ముఖ్య అధికారులు, ఉద్యోగులు చూసుకొనేవారు. మంత్రి: రాజ దర్బారుకు సంబంధించిన కార్యకలాపాలు, ఆస్థాన వ్యవహారాలను నిర్వహించడం, ముఖ్య సమావేశాలను ఏర్పాటు చేయడం ఇతని విధి. సచివ: చక్రవర్తి తరఫున ఉత్తరాలను, అధికార ప్రకటనలను రాసి రాష్ట్రాల అధికారులకు, సామంత రాజులకు అందజేయడం ఇతని విధి. సుమంత్: ఇతడు విదేశాంగ శాఖ అధినేత. ఇతర రాజ్యాలతో సంబంధాలు, యుద్ధాలు, ఒప్పందాలు తదితర అంశాల్లో చక్రవర్తికి సలహాలిచ్చేవారు. సేనాపతి: సైనిక బలగాల అధిపతి. సైనికుల నియామకం, శిక్షణ మొదలైన విధులు నిర్వర్తించేవారు. పండిత్ రావ్: మత వ్యవహారాల శాఖ మంత్రి. న్యాయాధీశ్: స్వరాజ్‌లో ఉన్నత న్యాయాధికారి. రెవెన్యూ విధానం రైతు సంక్షేమాన్ని, ప్రజాహితాన్ని దృష్ట్టిలో పెట్టుకొని శివాజీ భూమిశిస్తు, రెవెన్యూ విధానాన్ని రూపొందించాడు. భూమిశిస్తు శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు నగదు రూపంలో జీతభత్యాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. మొత్తం ఫలసాయంలో ఐదింట రెండో వంతును(2/5) భూమిశిస్తుగా నిర్ణయించాడు. భూమి శిస్తును ధన రూపంలో, ధాన్య రూపంలో చెల్లించవచ్చు. జాగీర్దారీ పద్ధతిని రద్దు చే శాడు. కరువు కాటకాల సమయంలో రైతులకు విత్తనాలు, పశువులను కొనడానికి రుణాలిచ్చేవారు. రైతాంగానికి సులభ వాయిదా పద్ధతిపై రుణాలిచ్చే సౌకర్యం కల్పించారు. మహారాష్ర్ట ప్రజలు దోపిడీ, దండయాత్రలకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో చౌత్ (1/4) అనే పన్నును విధించారు. ఇది జిల్లా ఆదాయంలో నాల్గో వంతు ఉండేది. శివాజీ గౌరవార్థం సర్దేశ్ముఖ్ అనే పన్ను విధించారు. ఇది జిల్లా ఆదాయంలో పదోవంతు ఉండేది. ప్రభుత్వ కోశాగారానికి వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ భాగం ప్రజాహితానికి వ్యయం చేసేవారు. లార్డ కారన్ వాలీస్ (1786-93) శాశ్వత భూమిశిస్తు విధానం: లార్డ కారన్ వాలీస్ 1786లో గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఇతడ్ని భారతదేశానికి పంపేటప్పుడు రాజ్య విస్తరణ జోలికి వెళ్లవద్దని, పరిపాలనా వ్యవస్థ మీద ముఖ్యంగా భూమిశిస్తు సంస్కరణలపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్ ప్రభుత్వం ఆదేశించింది. లార్డ కారన్ వాలీస్ గవర్నర్ జనరల్ అయ్యే నాటికి జమిందారులు భూమిశిస్తును వసూలు చేసి అందులో తమ వాటా పోగా మిగిలింది ప్రభుత్వానికి చెల్లించేవారు. ఈ పద్ధతిలో ఏ ఏడాదికి ఆ ఏడాదే శిస్తు నిర్ణయమయ్యేది. అందుకే దీన్ని తాత్కాలిక పద్ధతిగా పేర్కొనేవారు. ఈ రకమైన భూమిశిస్తు వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కచ్చితత్వం ఉండేది కాదు. ఈ లోపాలను సరిదిద్దడానికి 1793లో (జమిందారీ) శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టారు. వేలంపాటలో ఎక్కువ పాట పాడిన వ్యక్తులకు రైతుల నుంచి శిస్తు వసూలు చేసే అధికారం కల్పించారు. వీరినే జమిందారులుగా పేర్కొన్నారు. వేలం పాట వ్యవధి 25 నుంచి 30 సంవత్సరాలు ఉండేది. జమిందారీ పద్ధతి రూపశిల్పి అప్పటి రెవెన్యూ బోర్డు అధ్యక్షుడు సర్ జాన్ షోర్. భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కచ్చితంగా ఉండేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీన్ని మొదటగా బెంగాల్, బిహార్, ఒడిశా, వారణాసి తదితర ప్రాంతాలతోపాటు మద్రాస్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంతంలోనూ ప్రవేశపెట్టారు. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న బలమైన జమిందారీ వర్గం ప్రభుత్వానికి విధేయంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. జమిందార్ల ఆదాయం పెరగడంతో విలాస జీవితానికి, వ్యసనాలకు అలవాటుపడ్డారు. దీంతో రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని అశ్రద్ధ చేయడంతో రైతాంగం అనేక ఇబ్బందులకు గురైంది. విలియం బెంటింక్ (1828-35) విలియం బెంటింక్ గవర్నర్ జనరల్ పదవి చేపట్టే నాటికి అధిక వ్యయాల కారణంగా ప్రభుత్వం అప్పుల్లో ఉంది. దీంతో ఆయన ఖర్చులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాడు. సైనికుల భత్యాలను తగ్గించాడు. సైన్య, న్యాయ శాఖ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాడు. బెంగాల్, మద్రాస్, బొంబాయి రాష్ట్రాల్లోని అదనపు సైన్యాన్ని తగ్గించాడు. నల్ల మందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేశాడు. ఎక్కువ వేతనాలు పొందే ఇంగ్లండ్ వారికి బదులు తక్కువ వేతనాలకు భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించాడు. ఈ సంస్కరణల ఫలితంగా ఒక మిలియన్ పౌండ్ల్ల లోటు పూడ్చడమే కాకుండా, ఒక మిలియన్ పౌండ్ల మిగులును సాధించాడు. మహళ్వారీ పద్ధతి 1833లో విలియం బెంటింక్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని రూపకర్త హాల్డ్ మెకంజే. ఈ విధానం ప్రకారం ఒక గ్రామంలోని భూమి అంతా ఆ గ్రామస్తులకు చెందిన ఆస్తిగా భావించి భూమికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ గ్రామం మొత్తానికి ఉమ్మడిగా శిస్తు విధించేవారు. గ్రామపెద్ద లంబార్దార్ శిస్తును వసూలు చేసేవాడు. శిస్తును వసూలు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి 5 శాతం (పంచోత్రా) కమీషన్ ఇచ్చేది. ఈ పద్ధతి ఉత్తరప్రదేశ్, ఔద్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో అమల్లో ఉండేది. థామస్ మున్రో రైత్వారీ పద్ధతి 1792లో సేలం జిల్లాలోని బారామహల్ ప్రాంతంలో నాటి కలెక్టర్ కెప్టెన్ రీడ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కానీ ఇది ప్రచారంలోకి రాలేదు. కెప్టెన్ రీడ్‌కు సహాయ కలెక్టర్ అయిన థామస్ మున్రో 1800లో దత్త మండలాలకు కలెక్టర్ అయిన తర్వాత ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేశాడు. మద్రాసు, బొంబాయి, అస్సాం తదితర ప్రాంతాల్లో ఈ పద్ధతిని అమలు చేశాడు. ఈ విధానంలో ప్రభుత్వానికి, రైతులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మధ్యవర్తులు లేని విధానం కావడం వల్ల దీన్ని భూస్వామ్య పద్ధతుల్లో మేలైందిగా పేర్కొనవచ్చు. బ్రిటిష్ - ఆర్థిక విధానాలు ప్లాసీ యుద్ధం (1757) వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ కేవలం ఒక వర్తక సంఘంగా మాత్రమే వ్యవహరించేది. ఇంగ్లండ్‌లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులను మన దేశంలో అమ్మేవారు. మనదేశంలో కుటీర పరిశ్రమల్లో తయారైన కళాత్మక వస్తువులను ఇంగ్లండ్, ఐరోపా దేశాల్లో అధిక ధరలకు విక్రయించి మంచి లాభాలను గడించేవారు. ఈస్టిండియా కంపెనీ, వారి వ్యాపార కార్యకలాపాలు మనదేశ వస్తువుల ఉత్పత్తికి ఊతమిచ్చాయి. దీంతో బ్రిటిష్ ఉత్పత్తిదారులు కోపంతో రగిలిపోయారు. మనదేశ వస్తువుల దిగుమతులపై అనేక ఆంక్షలు విధించేందుకు వీలుగా బ్రిటిష్ పార్లమెంటులో అనేక చట్టాలు తీసుకువచ్చారు. అయినప్పటికీ మనదేశ వస్తువులకు 18వ శతాబ్దం మధ్యభాగం వరకు ఇంగ్లండ్‌లో మంచి గిరాకీ ఉండేది. ఈస్టిండియా కంపెనీ మనదేశంలో క్రమేపీ రాజ్య విస్తరణలో ఆసక్తి చూపడం వల్ల, 1757తర్వాత వారి వ్యాపార సరళిలో మార్పు వచ్చింది. కంపెనీ తన రాజకీయ, సైనిక శక్తిని ఉపయోగించి మన ఉత్పత్తులను తక్కువ ధరలకు బ్రిటిష్ వర్తకులకు మాత్రమే అమ్మేలా నిర్బంధ చర్యలకు పూనుకుంది. 18వ శతాబ్దం మధ్య భాగంలో ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం మూలంగా వస్తూత్పత్తిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మనదేశ వ్యాపారంలో ఈస్టిండియా కంపెనీకి మాత్రమే ఉన్న గుత్తాధిపత్య అధికారాన్ని 1813లోని చార్టర్ చట్టం ద్వారా తొలగించారు. దీంతో ప్రతి బ్రిటిష్ పౌరుడు మనదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. భారతదేశం.. ఇంగ్లండ్ పాలనలో ఉన్నందుకు వారి అవసరాలకు అనుగుణంగా మన ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకున్నారు. మనదేశాన్ని ఒక వలస రాజ్యంగా మార్చడం వల్ల, వారి ఆర్థిక విధానాల మూలంగా మన చేనేత, కళాత్మక చేతివృత్తులు ధ్వంసమయ్యాయి. మనదేశ సంపదను వీలైంత మేరకు ఇంగ్లండ్ కొల్లగొట్టింది. దాదాపు రెండు శతాబ్దాలపాటు తిరుగులేని రాజ్యాధికారం చెలాయించి, దేశ సంపదను కొల్లగొట్టి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. బ్రిటిష్ వారి కంటే ముందు మనదేశాన్ని ఆక్రమించి పాలించిన విదేశీయులు మనదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని గుర్తించారు. భారత, ఆర్థిక, రాజకీయ జీవన స్రవంతిలో భాగమై పరిపాలన కొనసాగించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నడూ మనదేశ జీవనంలో అంతర్భాగం కాలేదు. అక్కెనపల్లి మీనయ్య ఎకనామిక్స్ (హెచ్‌వోడీ)- రిటైర్డ్ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ -
'నాన్న పరిపాలిస్తాడు.. మేం బిజినెస్ చేస్తాం'
వాషింగ్టన్: తన తండ్రి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతామని వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వారసులు తోసిపుచ్చారు. అందుకు బదులుగా తాము రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటామని చెప్పారు. ఓ టీవీ చానెల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ కుమారుడు ఎరిక్, కుమార్తె ఇవాంక మాట్లాడుతూ తాము తమ తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటామని తెలిపారు. తాము ఇది తమ తండ్రికి సేవ చేసేందుకు వచ్చిన అదృష్టంగా భావిస్తామని చెప్పారు. న్యూయార్క్ లోనే ఉంటామని, బిజినెస్ చూసుకుంటూ తమ తండ్రి ట్రంప్ తలెత్తుకునేలా చేస్తామని చెప్పారు. తమకు అద్భుతమైన కంపెనీ ఉందన్నారు. తనకు మాత్రం వేతన సమానత్వం, పిల్లల సంరక్షణ అంశాలు చాలా ముఖ్యమైనవని ఇవాంక ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అలాగే తనకు విద్యారంగం అంటే అమితమైన ఆసక్తి అని, ఇందులో మహిళలను ఎక్కువగా ప్రమోట్ చేస్తానని తెలిపింది. దీంతోపాటు తాను దృష్టిపెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పింది. తమ దేశం చాలా బలహీన పరిస్థితుల్లో నడుస్తోందని, తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హోటల్ ఆక్యుపెన్సీ గురించి తాను పెద్దగా పట్టించుకోనని, మేం చేయబోయేదానితో పోలిస్తే ఇదొక చిన్న అంశమని పేర్కొంది. ప్రజా ఆరోగ్యం గురించి చూసుకుంటూ ప్రజలను మంచి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
పన్నీరుకే పగ్గాలు
జయ కోసం రోడ్డుపైనే పూజలు 21 రోజులుగా ఆసుపత్రిలోనే అమ్మ నేడు లండన్ వైద్యుల రాక అమ్మ కోసం ఆత్మాహుతి యత్నం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దశలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలను సీనియర్ మంత్రి పన్నీర్‌సెల్వం చేపట్టారు. సీఎం జయ పర్యవేక్షిస్తున్న శాఖలను పన్నీర్‌సెల్వంకు అప్పగిస్తూ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు మంగళవారం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అంతేగాక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంశానికి తెరపడింది. ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న హోం, ప్రజాపనులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర శాఖలను ఇక పన్నీర్‌సెల్వమే పర్యవేక్షిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఇకపై జరిగే కే బినెట్ సమావేశాలకు సైతం పన్నీర్‌సెల్వం అధ్యక్షత వహిస్తారు. గవర్నర్ ప్రకటన వెలువడగానే ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పన్నీర్‌సెల్వంను కలిశారు. ముఖ్యమంత్రిగా జయలలితనే కొనసాగుతారని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తూ పార్టీ శ్రేణులు జరుపుతున్న పూజలతో అపోలో ఆసుపత్రి పరిసరాలు ఆలయాలను తలపిస్తున్నాయి. జయ ఫొటో చేతపట్టుకుని ప్రార్థనల్లో మునిగి తేలుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరి బుధవారానికి 21 రోజులైంది. అమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ఆసుపత్రిలోనే మరికొంత కాలం గడపాలని అపోలో వైద్యులు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కొంతకాలం అనే మాటలతో గడువును పొడిగిస్తూ పోతున్నారు. అమ్మ నేడో రేపో విడుదల అవుతారనే ఆశలతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి రాత్రి వరకు ఆసుపత్రి వద్దనే పడిగాపులు కాస్తున్నారు. కొందరు నేతలు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద పూజలు, హారతులు ఇస్తూ అపోలో ఆలయ పరిసరాలను ఆలయ ప్రాంగణంలా మార్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కందన్ చెన్నై తిరువాన్మియూరు మరుందీశ్వరర్ ఆలయంలో అమ్మ కోసం మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి వలర్మతి ఎంజీఆర్ నగర్‌లోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కోవైలో 25 వేల పాలకలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే చెన్నైలోని ఐదు వేల పాలకలశాలతో ప్రార్థనలు చేశారు. అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించి అపోలోకు చేరుకున్న మాజీ మంత్రి గోకుల ఇందిరకు చేదు అనుభవం ఎదురైంది. ఆలయాల్లో పూజలు చేసిన ప్రసాదాన్ని జయకు అందజేస్తానని అపోలో ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. దీంతో చేసేదేమి లేక అక్కడి మహిళా నేతలతోనే ఉండిపోయారు. అపోలో వద్ద అరుణ్‌జైట్లీ, అమిత్‌షా: జయను పరామర్శించే నిమిత్తం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా బుధవారం అపోలోకు వచ్చారు. కొద్దిసేపు వైద్యులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. నేడు లండన్ వైద్యుల రాక: జయకు చికిత్స నిమిత్తం గతంలో రెండుసార్లు చెన్నైకి వచ్చిన అంతర్జాతీయ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్బీలే గురువారం మరోసారి లండన్ నుండి వస్తున్నారు. ఐదు రోజులపాటూ చెన్నైలోనే ఉండి జయకు చికిత్స అందిస్తారు. వదంతులపై పోలీస్ సీరియస్: జయ అనారోగ్యంపై సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు పుట్టిస్తున్న వారిపై పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది. ఇప్పటికే సతీష్‌కుమార్, మాడస్వామి అనే ఇద్దరు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెంగళూరుకు చెందిన మరో యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే 52 మందిపై కేసులు బనాయించగా, వారందరి సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైబర్ క్రైం పోలీసులు స్తంభిపజేస్తున్నారు. ఆత్మాహుతి యత్నం: అమ్మ ఆనారోగ్యానికి గురికావడాన్ని తట్టుకోలేక చెన్నై తాంబరం సమీపంలో సద్గుణం అనే యువ కార్యకర్త బుధవారం సాయంత్రం ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలకు గురైన అతడిని క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. -
పాలన మెరుగు పడాల్సిందే!
* అభిప్రాయం వ్యక్తం చేసిన త్రిసభ్య కమిటీ * పలు అంశాలపై ఏఎన్‌యూలో ముగిసిన విచారణ * దూరవిద్య నకిలీ చలానాలపైనా సమాచారం సేకరణ ఏఎన్‌యూ: యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉద్యోగులకు పదోన్నతులు, రోజువారీ, ఔట్ సోర్సింగ్ నియామకం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాల్లో వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ శుక్రవారంతో ముగిసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రపాణి, తిరుపతి ఎస్వీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తిలతో కూడిన కమిటీ నాలుగు రోజులపాటు 45 అంశాలపై ఆయా శాఖలు యూనివర్సిటీ అధికారులను విచారించింది. దానికి సంబంధించి ఆయా శాఖలు ఇచ్చిన వివరణను నోట్ చేసుకోవటంతోపాటు వాటా తాలూకా నోట్‌ఫైల్స్ జిరాక్స్ తదితర ఆధారాలను కూడా కమిటీ సేకరించింది. గతంలో ఫోస్ట్ఫ్యాక్టో అప్రూవల్ పేరుతో రోజువారీ ఉద్యోగులlవేతనాల చెల్లింపులపై సమాచారం సేకరించింది. ఫిర్యాదులో లేని అంశాలూ పరిశీలన ఆరోపణలు వచ్చిన 45 అంశాలతోపాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపైనా కమిటీ సమాచారం సేకరించింది. దూరవిద్యా కేంద్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం, రెగ్యులర్ పరీక్షల్లో మార్కుల తారుమారు తదితర అంశాలపై కమిటీ పరిశీలించింది. సంబంధించిన ఆధారాలు, పత్రికల్లో వచ్చిన కథనాలను సేకరించింది. మార్కుల తారుమారు కుంభకోణం, పరీక్షల వ్యవహారాలపై ఏఎన్‌యూ పరీక్షల విభాగం అధికారులను కమిటీ సభ్యులు శుక్రవారం క్షుణ్ణంగా విచారించింది. విచారణలో కోరిన సమాచారంతోపాటు అవసరం అనుకుంటే ఆయా అంశాల్లో యూనివర్సిటీ శాఖాపరమైన అభిప్రాయాన్ని కూడా లిఖితపూర్వకంగా చెప్పవచ్చని కమిటీ తెలిసింది. దర్యాప్తు చేసిన అంశాలపై సీబీసీఐడీ విచారణకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20వ తేదీ తర్వాత మళ్లీ వస్తాం.. పాలనాపరమైన అంశాల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి కీలకాంశాల్లో ఏఎన్యా మెరుగవ్వాల్సి ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. విచారణ అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. 45 అంశాలతోపాటు దూరవిద్య చలానాల కుంభకోణంపై సమాచారం సేకరించామన్నారు. ఇంకా కొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని భావిస్తుస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీ తరువాత ఏఎన్‌యూలో మరో విడత పర్యటించనున్నామన్నారు. దీనిపై నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. -
ప్రధాని మోదీ ఓ నియంత : సీఎం
గ్రామ స్వరాజ్య కార్యక్రమంలో సీఎం సిద్ధు ఆగ్రహం అభివృద్ధికి సహకరించలేదని ఆరోపణ బెంగళూరు: పాలన పరంగా ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఆదివారం విదురాశ్వత్థంలో జరిగిన గ్రామ స్వరాజ్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... గల్లి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సముచిత పాలన అందించాల్సిన ప్రధాని మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కులాలు, జాతుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ చట్టాన్ని తెచ్చినప్పటి నుంచి రైతులు, ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఫసల్ భీమా పథకానికి రూ.666 కోట్లు రిజర్వు చేశామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, రైతులు, ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు బీజేపీ నాయకులు అడ్డుపడుతూ రాష్ట్రాభివృద్ధికి సహకరించడం లేదని విమర్శించారు. కావేరి నదీ జలాల పంపిణీలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులు రాష్ట్రానికి,ప్రజలకు శరాఘాతాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, కె.హెచ్.మునియప్ప. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కేపీసీసీ కార్యదర్శి దినేశ్ గుండూరావ్, డిప్యూటీ స్పీకర్ శివశంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్లిక్ కొట్టు... ఫిర్యాదు పెట్టు
ప్రధాని దృష్టికి స్థానిక సమస్యలు అందుబాటులో కొత్త పోర్టల్ ఇంటర్నెట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం అన్ని వర్గాలకు చేరువలో మోదీ ప్రభుత్వం కాజీపేట : పరిపాలనలో పారదర్శకతను పాటించి అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవలందించాలనే సంకల్పంతో భారత ప్రధాని నరేంద్రమోదీ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా నూతన సంస్కరణల అమలుకు కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఎక్కడ నివసిస్తున్న వారైనా నేరుగా తమ సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని కొన్ని రోజుల క్రితం కల్పించారు. సామాన్యుడు, ఉన్నత వర్గాలనే భేదం లేకుండా పీఎం దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను వేగవంతం చేయడంతో పాటు అవినీతిని నిర్మూలించేలా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రధానికి సమస్యలను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇదీ పోర్టల్.. ఇంటర్నెట్లో ముందుగా పీఎం.ఇండియా.జీవోవీ.ఇన్ వెబ్సైట్లోకి లాగిన్ కావ్వాలి. తర్వాత వచ్చే పేజీలో ఇంటర్-ఆక్ట్ విత్ పీఎం దగ్గర క్లిక్ చేయాలి. అనంతరం వ్రైట్ టు ది ప్రైమినిష్టర్ వద్ద క్లిక్ చేస్తే పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయి. ఫిర్యాదు చేయడం ఇలా.. ఈ-పోర్టల్ ద్వారా ప్రధానమంత్రికి నేరుగా ఫిర్యాదు చేయాలంటే ముందుగా ఫిర్యాదుదారుడి పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఇందులో పేరు, స్త్రీ, పురుషులా, సంస్థ పేరు, దేశం, రాష్ట్రం, జిల్లా, పిన్‌కోడ్ వివరాలు అందజేయాలి. అనంతరం సమస్యను సంక్షిప్తంగా అర్థమయ్యే రీతిలో నమోదు చేయాలి. సమస్య పరిష్కారం వివరాలు తెలుసుకోవాలంటే ఫిర్యాదుదారుడు తప్పనిసరిగా సెల్ నంబర్, మెయిల్ ఐడీలను పొందుపర్చాలి. 19 అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు.. అవినీతి, విద్య, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల అమలు, వ్యవసాయం, పోలీసు, పట్టణాభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సమస్యలతోపాటు న్యాయ, భూ, కార్మిక గృహనిర్మాణాలు, ఇతర సమస్యలపై ప్రధానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. నాలుగు వేల అక్షరాల లోపే.. ఫిర్యాదుదారుడు పూర్తి వివరాలు నమోదు చేసే పేజీలోనే దిగువ భాగానా ఫిర్యాదు కోసం ప్రత్యేక బాక్స్ కేటాయించారు. ఈ గడీలో కేవలం నాలుగువేల అక్షరాలలోపే సమస్యను వివరించాలి. సమస్యను వివరించే క్రమంలో పదాలు, కామాలు, ఫుల్‌స్టాప్‌లు మాత్రమే వినియోగించాలి. కంప్యూటర్ కీ బోర్డులో ఉన్న ఇతర అక్షరాలు వాడకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. స్పందిస్తే ప్రయోజనం.. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి మన సమస్యలు విన్నవించాలంటే కంప్యూటర్, ఇంటర్నెట్పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. తమ ప్రాంతాల్లో పట్టి పీడిస్తున్న సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం యువత ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్నందున స్పందించి ఫిర్యాదులు చేస్తే పలు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సామాజిక రుగ్మతలు, అవినీతి, అక్రమాలపై పీఎంకు ఫిర్యాదు చేసి దస్త్రవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ఆర్ఐలకూ అవకాశం.. స్థానిక ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేయొచ్చు. వీరు ఆయా ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఈ-పోర్టల్ ద్వారా పీఎంకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. ఏ దేశంలో ఉంటున్నామో..ఆ ప్రాంతం పేరు, సమస్యపై ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో గాడితప్పిన పాలన
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. సమస్యలపై అవగాహన లేని వారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని విశాల్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించడంలేదని విమర్శించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో విఫలమవుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నామని, అందులో 80 శాతం ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని హామీ ఇవ్వడంతో వేలాది మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఏడాది గడిచినా రుణాలపై అతీగతీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన అభయహస్తం పింఛన్లను తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తంగా మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాకతీయ ఉత్సవాలకు ని«ధులు ఇస్తే.. తెలంగాణ అని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు ఇప్పుడు ఆ ఉత్సవాలను పట్టించుకోని కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ నుంచి జనగామ వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ఘనకార్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎంసెట్ నిర్వహణ లోపాలతో ర్యాంకులు పొందిన వారు ఇప్పుడు రాస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చి ఏడాది నష్టపోయారన్నారు. ప్రకటనలు చేయడమే తప్పా.. టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఒరగపెట్టింది ఏమి లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికి రుణాలు ఇవ్వకుంటే ఎస్సీ కార్పొరేషన్‌తో పాటు ఇతర కులాల సంక్షేమ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్ తొట్ల రాజు, కాంగ్రెస్ నేతలు ఈవీ శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాసరావు, రవీందర్, లక్ష్మారెడ్డి, మండల సమ్మయ్య, మనుపాటి శ్రీనివాస్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 28హెచ్‌ఎంకెడి401: మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నోట్ : ఫోటో సీఎస్ ఫోల్డర్లో ఉంటుంది -
‘చెర’వు..
ముంచుతున్నది ఆక్రమణలే.. - వాన నీరు వెళ్లిపోయే దారి లేకే మునుగుతున్న కాలనీలు - చెరువుల్లో, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలే కారణం - పలు చోట్ల చెరువులు, కుంటలు మాయం - చాలా చోట్ల సగానికిపైగా ఆక్రమణల పాలు - కాసుల కక్కుర్తితో చూసీ చూడనట్లు వదిలేసిన ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: గట్టిగా వాన పడగానే హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది.. కాలనీలు కాలనీలే నీళ్లలో మునిగిపోతున్నాయి.. మరి దీనికి కారణం భారీ వర్షాలు కురవడం ఒక్కటే కాదు.. అసలు కాలనీల్లోకి నీళ్లు రావడం కూడా కాదు.. నీళ్లుండాల్సిన చెరువుల్లో, నీరు పారాల్సిన చోట కాలనీలు కట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రాజకీయ నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు.. ఎవరికి వారు చేతనైన కాడికి చెరువులను చెరబట్టడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. చెరువులను, నాలాలను ఆక్రమించి అపార్ట్మెంట్లు, ఇళ్లు కట్టడంతో వాన నీరు వెళ్లే దారి లేకపోవడం పర్యవసానమే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 150కి పైగా అపార్ట్మెంట్లు జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణం. అడ్డగోలుగా వెలసిన నిర్మాణాల్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం.. కాసులకు కక్కుర్తి పడి కళ్లు మూసుకోవడంతో ఆక్రమణలు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. అడ్డగోలు ఆక్రమణలతోనే.. తొలినాళ్లలో వర్షాలు కురిసినప్పుడు నీళ్లన్నీ సాఫీగా వెళ్లేందుకు, చెరువులు నిండాక వాటి నుంచి కింద ఉన్న చెరువులకు నీళ్లు వెళ్లేందుకు ఏర్పాట్లు ఉండేవి. కానీ చెరువుల శిఖం భూముల్లో, చెరువుల్లోకి నీరు చేరే, నీరు వెళ్లిపోయే ప్రాంతాల్లో అడ్డగోలుగా ఆక్రమణలు వెలిశాయి. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోంది. కూకట్పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండాక అక్కడి నుంచి వచ్చే నీరు హుస్సేన్‌సాగర్‌లో కలిసేది. కానీ ఇప్పుడా చెరువుల్లో చాలాభాగం వివిధ నిర్మాణాలు, కాలనీలు వెలిశాయి. దాంతో వర్షం వచ్చినప్పుడు ఆ కాలనీలు మునుగుతున్నాయి. ప్రధాన ప్రాంతాల్లోనూ.. నివాసగృహాలు, వాణిజ్య సముదాయాలే కాక ప్రార్థనా మందిరాలు, పార్కులు వంటివి సైతం చెరువుల ఎఫ్టీఎల్ (చెరువులో పూర్తిస్థాయిలో నీరు చేరినప్పుడు మునిగిపోయే భూమి) పరిధిలో, చెరువుల్లోనే వెలియడం గమనార్హం. ఒకప్పుడు దుర్గం చెరువులో భాగంగా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు పలు వాణిజ్య నిర్మాణాలు, అపార్టుమెంట్లు ఉన్నాయి. హైటెక్‌సిటీలోని నెక్టార్ గార్డెన్లో బహుళ అంతస్తులు, విల్లాలు, స్విమ్మింగ్‌పూల్, జిమ్ వంటివి ఉన్న ప్రాంతం దుర్గం చెరువులో భాగంగా ఉండేది. ఇక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ సైతం తమ్మిడికుంట బఫర్‌జోన్ పరిధిలో ఉన్నట్లు అధికారుల పరిశీలనలోనే తేలింది. మల్కాజిగిరి రైతుబజార్ సైతం ముక్కిడిచెరువు ఎఫ్టీఎల్ లో ఉన్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైం ది. హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో సైతం దాదా పు 300 ఎకరాల్లో నిర్మాణాలు వెలిసినట్లు అంచనా. క్రమబద్ధీకరణల కారణంగా.. ఇక కాసుల కోసమే క్రమబద్ధీకరణ పథకాలు తెచ్చి సక్రమమైనవిగా మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆక్రమణల క్రమబద్ధీకరణ ఆశతోనే ఏడాదికేడాది ఆక్రమణలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లోనూ చాలా వరకు చెరువుల్లో, ఎఫ్టీఎల్ పరిధిలోవి కావడం గమనార్హం. ఒక్క బాలానగర్ మండలం పరిధిలోని చెరువులను పరిశీలిస్తే కబ్జాలు,ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది ► అలీతలాబ్ (హైదర్‌నగర్) చెరువు 17 ఎకరాలు ఉండేది.. ఇప్పుడు 10 ఎకరాలకు పరిమితమైంది. ఠి కింది కుంట (హైదర్‌నగర్) 18 ఎకరాల నుంచి 6 ఎకరాలకు తగ్గింది. ► అంబీర్‌చెరువు (ప్రగతినగర్) 156 ఎకరాలుండేది.. కూకట్పల్లి, ప్రగతినగర్, నిజాంపేట, శంషీగూడల పరివాహాక ప్రాంతం కలిగిన ఈ చెరువులో అన్ని వైపులా బహుళ అంతస్తుల భవనాలు, లే అవుట్లు వెలియడంతో సుమారు వంద ఎకరాలు మిగిలింది. ► భీమునికుంట (హెచ్ఎంటీ శాతవాహన నగర్) 10 ఎకరాలుండేది. నలువైపులా కాలనీలు ఏర్పడటంతో కుచించుకుపోరుు సుమారు 6 ఎకరాలకు పరిమితమైంది. ► ఎల్లమ్మ చెరువు (ఎల్లమ్మబండ) 46 ఎకరాలు ఉండాల్సింది.. కబ్జాలు, వెంచర్లతో కుచించుకుపోరుు ఇప్పుడు సుమారు 30 ఎకరాలే ఉంది. ► నల్లచెరువు (కూకట్పల్లి) విస్తీర్ణం 50 ఎకరాలు. చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు చొచ్చుకువచ్చి 25 ఎకరాలు మిగిలింది. ► ఖాజాకుంట విస్తీర్ణం (మెట్రో వెనకాల) 20 ఎకరాలు. ఆక్రమణలకుతోడు ప్రభుత్వం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించగా.. తాజాగా 5 ఎకరాలు మిగిలింది. ► రంగధాముని (ఐడీఎల్) చెరువు 40 ఎకరాలు ఉండేది. ప్రస్తుతం ఆక్రమణలతో 30 ఎకరాలకు చేరింది. ► కాముని చెరువు (ఖైత్లాపూర్) 100 ఎకరాలు. ఇందులో సగానికి పైగా మాయమైపోయింది. ► మైసమ్మ చెరువు (మూసాపేట) 100 ఎకరాలు. ఆక్రమణలతో సగమే మిగిలింది. ► సున్నం చెరువు (మోతీనగర్) 25 ఎకరాలు ఉండేది. ఆక్రమణలతో సుమారు 10 ఎకరాలకు చేరింది. ► బోరుున్ చెరువు (బోరుున్‌పల్లి) 100 ఎకరాలు. వెంచర్లతో సగానికి చేరింది. ► ముళ్లకత్వ చెరువు (కేపీహెచ్‌బీ) 30 ఎకరాలు ఉండేది. హైటెక్‌సిటీ బ్రిడ్జి నిర్మాణంతో కొంత కుచించుకుపోరుుంది. ► బందంకుంట (ఆల్విన్‌కాలనీ) 6 ఎకరాలు. ఇదైతే అసలు కన్పించడం లేదు. ఠి పరికిచెరువు (ఆల్విన్‌కాలనీ) 50 ఎకరాలు ఉండేది. అక్రమ వెంచర్లతో సుమారు 30 ఎకరాలు మిగిలింది. ఎన్నో చెరువులు మాయం ► పర్యాటక కేంద్రంగా పేర్కొనే మాదాపూర్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ 2002లో కబ్జాకు గురైంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎఫ్టీఎల్ పరిధిలో లేఅవుట్లకు అనుమతులివ్వడంతో కబ్జా పర్వానికి తెర లేచింది. అప్పటి హుడా యథేచ్ఛగా ఇంటి అనుమతులు ఇచ్చింది. నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలు అప్పడు వెలసినవే. దుర్గంచెరువు గరిష్ట నీటి మట్టానికి చేరితే అమర్ సొసైటీలో పడవలతో తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దాంతో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి దుర్గం చెరువు పూర్తిగా నిండి ఉండకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల కింద ఇరిగేషన్ అధికారులు ఈ చెరువు పూర్తిస్థారుు మట్టానికి చేరక ముందే నీటిని విడుదల చేశారు. ఇక గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు కబ్జాకోరల్లో చిక్కి ఉనికి కోల్పోరుుంది. గోపన్‌పల్లి చెరువు, నల్లగండ్ల చెరువుల్లో ఆక్రమణలు పెరిగాయి. మియాపూర్‌లోని కారుుదమ్మ కుంట, ఈర్లచెరువు, ప్రకాశ్‌నగర్ చెరువు, పటేల్ చెరువు, గురునాథం చెరువు, అమ్మమ్మ కుంట, మక్త చెరువు, గంగారం చెరువులు కబ్జాల పాలయ్యాయి. ► ఓల్డ్ బోరుున్‌పల్లి డివిజన్‌కు మణిహారంగా ఉన్న హస్మత్‌పేట చెరువు.. 67 ఎకరాల నుంచి 47 ఎకరాలకు కుచించుకుపోరుుంది. ఓ స్కూల్ నిర్వాహకులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఓ ఎకరం స్థలాన్ని ఆట స్థలంగా చేసుకోవడం గమనార్హం. ► తార్నాకలోని ఎర్రకుంట చెరువు కనుమరుగయ్యే దశకు చేరుకుంది. నిజాం హయాంలో తాగునీటి వనరుగా ఉన్న ఈ 25 ఎకరాల చెరువు ఇప్పు డు ఐదెకరాలే మిగిలింది. మిగిలిన ప్రాంతంలో మినీ ట్యాంక్‌బండ్ నిర్మించాలని నిర్ణయించినా అమలు కావడం లేదు. ఆక్రమణదారులు కోర్టు స్టేలు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ► మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడలోని ఎర్రకుంట చెరువు పరిధిలో రోజు రోజు కూ కబ్జాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. లోకాయుక్త ఆదేశించినా.. చెరువుల్లో నిర్మాణాలపై గతంలో కొన్ని సంస్థలు లోకాయుక్తకు ఫిర్యాదులు చేశాయి. వాటిపై స్పందించిన లోకాయుక్త హైదరాబాద్‌లోని అన్ని చెరువుల ఎఫ్టీఎల్లను గుర్తించి, రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాం తో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తూతూ మంత్రం గా చర్యలు చేపట్టి, వదిలేశాయి. లోకాయుక్త ఆదేశించి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ అన్ని చెరువుల ఎఫ్టీఎల్లనే నిర్ధారించకపోవడం గమనార్హం. -
అంతా మాఇష్టం
ట్రిపుల్‌ఐటీలో అనధికార ఉద్యోగులు ఈసీ నిర్ణయం బేఖాతరు ఇష్టారాజ్యంగా పరిపాలన ట్రిపుల్ ఐటీలో పాలన గడితప్పుతోంది. కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంట్రాక్టు పోస్టుల్లో ఇష్టారాజ్యంగా సిబ్బందితో నింపేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే సిబ్బంది పనిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నూజివీడు : ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులున్నారు. వెయ్యి మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం వివాదస్పదమవుతోంది. ఈసీ అనుమతి లేకుండానే రెండు నెలల క్రితం డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు దాదాపు వంద మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇంతమంది ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోవాలంటే తప్పనిసరిగా ఈసీ అనుమతి ఉండాలి. ఈసీ అనుమతినివ్వనప్పటికీ బేఖాతరు చేస్తూ నియామకాలు జరపడం సంచలనంగా మారింది. సిబ్బంది నియామకంపై.. ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు సరిపోయిన సిబ్బంది ఆరువేల మందికి తగ్గినప్పుడు ఎందుకు సరిపోరనే వాదనను పలువురు తెచ్చిన లెక్కచేయకుండా కొందరు అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సంతృప్తి పరచడానికి అత్యుత్సాహంతో ఈ నియామకాలకు తెరలేపినట్లు ట్రిపుల్‌ఐటీలో వినికిడి. ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఈ ప్రాంతంలోని వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి ఎలా ఇస్తారని నూజివీడు పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు డైరెక్టర్‌ను ప్రశ్నించారు. రెండు నెలలుగా జీతాలు లేవు.. ఈసీ నిర్ణయాలను బేఖాతరు చేస్తూ ట్రిపుల్‌ఐటీలో సొంతంగా నియమించుకున్న దాదాపు వంద మంది అనధికార వ్యక్తులకు రెండు నెలలు గడిచినా ఇంత వరకు జీతాలు చెల్లించలేదు. అసలు మా పోస్టులు ఉంటాయా, ఉండవా..? పనిచేసిన కాలానికైనా జీతాలు ఇస్తారా, ఇవ్వరా...? ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా దాదాపు రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని కేటాయిస్తున్న విద్యాసంస్థలో నియామకాలను ఒక పద్ధతి లేకుండా నియమించుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు: ఉన్నం వెంకయ్య, ఆర్జీయూకేటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు. నియమించుకున్న వారిని వెంటనే తొలగించమని కూడా చెప్పడం జరిగింది. -
అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం
విజయవాడ(లబ్బీపేట) : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పరిపాలన దారితప్పింది. అత్యవసర పనులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. పరిపాలనా విభాగం సిబ్బంది నిర్వాకాన్ని ప్రశ్నించేందుకు ఆ విభాగంలో ఒక్క అధికారి కూడా లేరు. దీంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. మృతిచెందిన ఉద్యోగి కుటుంబానికి రావాల్సిన అలవెన్స్‌ల కోసం కూడా డబ్బులు తీసుకునే స్థాయికి అడ్మిస్ట్రేషన్ సిబ్బంది దిగజారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించిన నర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు ఈ విషయంతో సంబంధం లేని ఓ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేయడం విశేషం. అధికారులు లేని ‘అడ్మినిస్ట్రేషన్’ ప్రభుత్వాస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అధికారులు లేరు. ఈ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారితోపాటు అసిస్టెంట్ డైరెక్టర్ ఉండాలి. అనారోగ్యం కారణంగా అసిస్టెంట్ డైరెక్టర్ సెలవులో ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏ పని చెప్పినా రూల్పొజిషన్.. పేరుతో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అడ్డుతగులుతున్నారని తెలిసింది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నిర్ధారణ అయితే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోగులకు మరిన్ని కష్టాలు తప్పవని ఉద్యోగులే చెబుతున్నారు. సూపరింటెండెంట్ లేఖ బుట్టదాఖలు విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగంలో సీసీ కెమెరాలు పని చేయడంలేదని, రిపేరు చేయాలని అక్కడి అధికారులు సూపరింటెండెంట్‌కు కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు. సూపరింటెండెంట్ ఆ లేఖను అడ్మినిస్ట్రేషన్ విభాగానికి పంపారు. అయితే ఆ లేఖను అడ్మినిస్ట్రేషన్ విభాగం సిబ్బంది పక్కన పడేశారు. ఇటీవల ఎస్‌ఎన్‌సీయూలో శిశువు అపహరణకు గురైన తర్వాత సీసీ కెమెరాలను బాగుచేయించారు. ఉద్యోగి కుటుంబంతో ఆటలు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఇటీవల మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని అలవెన్సులు రావాల్సి ఉంది. వాటి కోసం ఆ ఉద్యోగి భార్య పరిపాలనా విభాగం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సిబ్బంది స్పందించలేదు. ఆమె వద్ద లంచం తీసుకుని కూడా ధ్రువీకరణపత్రాలు సక్రమంగా లేవంటూ ఫైలును పక్కన పడేశారు. సహ ఉద్యోగి కుటుంబానికి సాయం చేయాలనే స్పృహ కూడా ఇక్కడి సిబ్బందికి లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులిస్తేనే జీతాల బిల్లులు ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన 80 మంది స్టాఫ్‌నర్సులను నియమించారు. వారి నియామకాల సమయంలోనే డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కమిటీని నియమించారు. తాజాగా వారికి జీతాలు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. జీతాల బిల్లులకు సంబంధం లేని ఉద్యోగి వచ్చి డబ్బులు అడుగుతున్నారని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చెప్పారు. తమ సర్టిఫికెట్లు సైతం వారి వద్ద ఉంచుకుని డబ్బులు ఇస్తేనే ఇస్తామని బెదిరిస్తున్నారని పలువురు వాపోయారు. చక్కదిద్దుతున్నాం ‘ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ విభాగ అధికారులైన ఏవో, ఏడీ ఇద్దరూ లేరు. రెండు పోస్టులు ఖాళీగా ఉండటంతో అడ్మినిస్ట్రేషన్ కష్టంగా ఉందని రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకులకు లేఖ రాశాం. అక్కడ ఫైల్ క్లియర్ అయినట్లు తెలిసింది. ఆ విభాగానికి అధికారులు రాగానే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తాం. పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా. కొంత వరకు మెరుగుపరిచాం. పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు కృషి చేస్తా. – డాక్టర్ ఎం.జగన్మోనరావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్, విజయవాడ. -
రెండేళ్ల బాబు పాలన ఘోరం
విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టినప్పటినుంచి రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతోందని, రెండేళ్ల పాలనలో ఘోరంగా విఫలమయినట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వాఖ్యానిం చారు. ఇవేమీ తాము చెప్పడంలేదని, తాము గడచిన పది రోజులుగా చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో జనమే చెబుతున్నారని అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా, ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకపోయినా కేవలం ప్రజల కష్టాలు తెలుసుకునేం దుకు బాధ్యతగల ప్రతిపక్షనేతగా జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం తలపెట్టారని చెప్పారు. జిల్లాలో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు ప్రతిపక్షంలో ఉన్న తమ వద్దకు వచ్చి సమస్యలు మొరపెట్టుకోవటం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజన్నరాజ్యంకోసం జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గమని తెలిపారు. నిరంతర ప్రజాహిత కార్యక్రమాలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే గాకుండా ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాజన్నరాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో నెలకొందన్నారు. పార్టీ జెండా తో గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నట్లు కోలగట్ల తెలిపారు. తాము చేసిన తప్పుకు భవిష్యత్తు ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవన్న భయంతో ఉన్నారని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే పార్టీ మారినా అక్కడ గడపగడపకు వైఎస్సార్ విజయవంతంగా జరుగుతోందని, రానున్న రెండునెలల్లో ఆ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామనీ తెలిపా రు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ టీడీపీ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి తలపెట్టిన గడప గడపకు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. పార్టీ నాయకులు 100 ప్రశ్నల ప్రజాబ్యాలెట్‌తో ప్రజల్లోకి వెళుతుంటే వారు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు ఇటుకలు.. రెం డు ఇసుక బస్తాలతో శంకుస్థాపన చేసి పదవి కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం అనంతర ప్రభుత్వాలు పనులు పూర్తి చేస్తే అదేదో తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. సమావేశంలో ఎస్‌కోట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెక్కల నాయుడుబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్లు పాల్గొన్నారు. -
పొలిటికల్ క్రికెటర్!
ఠాకూర్ ప్రస్థానం విభిన్నం చాలా మంది క్రికెటర్లు ముందు ఆటలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోకి దిగుతారు. కానీ అనురాగ్ ఠాకూర్ వారందరికంటే స్పెషల్. ఒక రాష్ట్ర క్రికెట్ సంఘంలో పరిపాలకుడిగా ఉంటూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ బరిలోకి దిగిన ఏకైక ‘ఆటగాడిగా’ ఆయన పేరు నిలిచిపోయింది. 2000లో హిమాచల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఠాకూర్ ఆడారు. జాతీయ జూనియర్ సెలక్టర్ అయ్యేందుకు ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలన్న నిబంధన పూర్తి చేసేందుకు అది పనికొచ్చింది. ఆ సమయంలో ఠాకూర్ తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి గత 15 ఏళ్లుగా క్రికెట్ పరిపాలనలో ఠాకూర్ చురుగ్గా ఉన్నారు. 2011లో తొలిసారి సంయుక్త కార్యదర్శి హోదాలో బీసీసీఐలో అడుగుపెట్టిన ఆయన ఐదేళ్లలో అధ్యక్ష స్థాయికి చేరుకున్నారు. ధర్మశాలలో అత్యుత్తమ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడంలో ఠాకూర్‌దే కీలక పాత్ర. 2008 నుంచి హమీర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా వ్యవహరిస్తున్న ఠాకూర్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఠాకూర్‌కు భార్య షెఫాలీ, ఇద్దరు కుమారులు జై ఆదిత్య, ఉదయ్‌వీర్ ఉన్నారు. సవాల్ ముందుంది... లోధా కమిటీ సిఫారసులలో సాధ్యమైన అంశాలను తాము అమలు చేస్తామని, ఇతర కొన్ని అంశాలపై మాత్రం మరింత ఆలోచించాల్సి ఉందని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. క్రికెట్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయన కొత్తగా పది రకాల ప్రతిపాదనలు చేశారు. కరవులాంటి సమయాల్లోనూ నీటి సమస్య లేకుండా మ్యాచ్‌లను నిర్వహించేందుకు సోలార్ ప్యానెల్స్ వినియోగం, బధిర క్రికెటర్లకు సహాయం, కొత్తగా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎంపిక వాటిలో కీలకమైనవి. అదే విధంగా ఐపీఎల్ మరో బోర్డు చేతికి వెళ్లే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ‘లోధా సిఫారసులను మేం ఒక అవకాశంగా కూడా భావిస్తున్నాం. వాటిలో కొన్ని ఇప్పటికే అమలు చేశాం కూడా. బోర్డులో కొన్ని లోపాలున్నా చాలా విషయాల్లో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమంగా ఉంది. ఐపీఎల్ అనేది బీసీసీఐ దేశవాళీ టోర్నీల్లో ఒకటి. కాబట్టి దానిని విదేశాలకు తరలించే అవకాశమే లేదు’ అన్న ఠాకూర్... రాబోయే రోజుల్లో బీసీసీఐ ప్రతిష్టను నిలబెడతానని ప్రకటించారు. - సాక్షి క్రీడా విభాగం -
ఇక లొల్లి అలహాబాద్ యూనివర్సిటీలో!
అలహాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా వార్తల్లో నిలుస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ, జాతి వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో ఢిల్లీలోని జేఎన్‌యూ పతాక శీర్షికలకు ఎక్కగా తాజాగా అలహాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్.. తనను యూనివర్సిటీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించింది. యూనివర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో తనను లక్ష్యంగా చేసుకొని యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని అలహాబాద్ యూనివర్సిటీ మొదటి మహిళా విద్యార్థి నాయకురాలు జ్యోతీ సింగ్ ఆరోపించింది. యూనివర్సిటీ అధికారులు తన అడ్మిషన్‌ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె మీడియాతో తెలిపారు. యూనివర్సిటీ పరిసరాల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ యోగి ఆదిత్యానంత్ నిర్వహించిన కార్యక్రమాన్ని తాను వ్యతిరేకించినప్పటి నుంచి.. తనపై దూషణలు పెరిగాయని ఆమె వెల్లడించింది. కాగా యూనివర్సిటీలో ఆమె ప్రవేశం పొందటంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చేపట్టిన విచారణలో యూనివర్సిటీ అధికారుల తప్పిదం వల్లనే జ్యోతీ సింగ్‌కు పరిశోధక విద్యార్థిగా సీటు లభించిందని తేలినట్లు సమాచారం. -
ఒబామా పాలనపై అసంతృప్తి, ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా చివరి ఏడాదిలో అడుగుపెట్టిన బరాక్ ఒబామా, దేశంలో సానుకూల మార్పులు తీసుకొచ్చారా లేక ప్రతికూల మార్పులు తీసుకొచ్చారా? అన్న అంశంపై ప్రజలు, పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సీఎన్ఎన్-ఓఆర్సీ నిర్వహించిన సర్వే ప్రకారం ఒబామా పాలనపై 75 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా, దేశంలో నెలకొన్న పరిస్థితుల పట్ల 69 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ 2014 కన్నా ఇప్పుడూ పరిస్థితి మరింత దిగజారిందన్నది మొత్తంగా ప్రజల భావన. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా దాదాపు ఇలాగే ఉంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల బరిలో డోనాల్డ్ ట్రంప్ నామినేషన్‌ను సమర్థిస్తున్న రిపబ్లికన్లలో 90 శాతం మంది ఒబామా పాలనపై అసంతృప్తి వ్యక్తం చేయగా, దేశంలో నెలకొన్న పరిస్థితుల పట్ల 91 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మార్పు తీసుకొస్తానన్న నినాదంతో 2008లో అధికారంలోకి వచ్చిన ఒబామా ఈ ఏడేళ్ల కాలంలో నిజంగా మార్పు తీసుకొచ్చారా? అని అడిగితే కూడా మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తున్నారు. సానుకూల మార్పులు తీసుకొచ్చారని 37 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, అంతేమంది ప్రజలు పరిస్థితులను మరింత దిగజార్చారని అభిప్రాయపడ్డారు. ఎలాంటి మార్పు తీసుకరాలేదని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఒబామా ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రట్లను ప్రశ్నించగా, 67 శాతం మంది సానుకూల మార్పులు తీసుకొచ్చారని సమాధానం ఇచ్చారు. పరిస్థితులను మరింత దిగజార్చారని 63 శాతం మంది రిపబ్లికన్లు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఒబామా పాలన ఎలా ఉందని ప్రశ్నించగా 48 శాతం మంది సానుకూలంగాను, 50 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఇదే విషయంలో గతంలో అనుకూలంగా 52 శాతం మంది సానుకూలంగా, 47 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఓ నెల రోజుల్లోనే ప్రజల అభిప్రాయంలో మార్పు కనిపిస్తోంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ఒబామాకు కొద్దిగా మెరుగైన మార్కులు పడ్డాయి. అదీ ఆశావహ దృక్పథంతో వ్యక్తం చేసిన అభిప్రాయల మేరకు మాత్రమే. ఇందులో ఆయనకు 52 శాతం మంది సానుకూలంగా స్పందించారు. 2009 నుంచి ఇప్పటికీ ఆయనకు ఆర్థిక రంగంలో 50 శాతానికి మంచి సానుకూల స్పందన లభించలేదు. ఇంతకు బాగుందా, లేదా? అంటూ కచ్చితమైన ప్రశ్నకు 49 శాతం మంది ఒబామా ఆధ్వర్యంలో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అభిప్రాయపడగా, 51 శాతం మంది ప్రతికూలంగా స్పందించారు. ఇప్పటి నుంచి వచ్చే ఏడాదిలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని 56 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలలో రేటింగ్స్కన్నా ఇప్పటి రేటింగ్స్ కొద్దిగా మెరుగ్గా ఉన్నాయి. దీనికి కారణం చమురు ధరలు పడిపోవడం కావచ్చు. పారిస్‌లో జరిగిన సమావేశంలో వాతావరణ మార్పులపై ఒప్పందం కుదరడంతో ఈ అంశంలో గత నెలలోకన్నా ఒబామాకు నాలుగు పాయింట్లు పెరిగాయి. ఈ విషయంలో 49 శాతం మంది సానుకూలంగా స్పందించారు. తుపాకుల సంస్కృతిని అరికట్టడంలో ఒబామా విఫలమయ్యారని 62 శాతం మంది ప్రజలు అభిప్రాయపడగా, కేవలం 35 శాతం మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. తుపాకి చట్టాలను కఠినతరం చేయడంలో ఒబామా విజయం సాధించారా? అన్న ప్రశ్నకు 48 శాతం మంది సానుకూలంగా స్పందించగా, 38 శాతం మంది ఇంకా ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 17 నుంచి 21వ తేదీల మధ్యన టెలిఫోన్ ద్వారా ర్యాండమ్‌గా నిర్వహించిన ఈ సర్వేను సోమవారం విడుదల చేశారు. -
పర్యాటకుల దిక్సూచీ... ‘కియోస్క్’!
తెలంగాణ టూరిజానికి మరిన్ని సొబగులు సాక్షి, హైదరాబాద్: పర్యాటకంగా తెలంగాణ రాష్ట్రం మరింత శోభను సంతరించుకునేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రాష్ర్టంలోని పురాతన కోటలు, శిల్పకళా సౌందర్యాలు, పర్యాటక ప్రాంతాలకు అద్దంపట్టే విశిష్ట ప్రాంతాల ప్రత్యేకతలు తెలుసుకునేలా సందర్శకుల కోసం వివిధ చోట్ల ‘కియోస్క్’ యంత్రాలను ఏర్పాటు చే స్తున్నారు. వీటి నుంచి పర్యాటక ప్రాంతాలు, ఆయా ప్రాంతాలకు వెళ్లే మార్గం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో అమలులో ఉన్న ప్యాకేజీలు వంటివన్నీ చిటికెలో తెలుసుకోవచ్చు. మహా నగరానికి ఇతర రాష్ట్రాలతో ప్రత్యేకించి విదేశీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలాంటి వారందరి కోసం ఆంగ్ల, హిందీ భాషల్లో ఈ ప్రాంత ప్రత్యేకతలు తెలిపే కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో శంషాబాద్, బేగంపేట్ విమానాశ్రయాలు, ఎంజీబీఎస్, ప్రధాన రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇటీవల ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తారామతి బారాదరిలో కియోస్క్‌ను ఆవిష్కరించారు. సింగపూర్, అమెరికా, జపాన్ తదితర ప్రాంతాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన పర్యాటకాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వీటిని రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఇప్పటికే బషీర్‌బాగ్ టూరిజం కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే నగరానికి కొత్త గా వచ్చే పర్యాటకుల కోసం విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ కాంప్లెక్స్, రవీంద్రభారతి తదితర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గాన్ని సూచించేలా నగరంలో పలుచోట్ల ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ఆలోచిస్తోంది. -
ఎవరికి ఫిర్యాదు చేయాలి..!
బాలల హక్కుల కమిషన్‌కు కష్టకాలం ♦ ఆఫీసులో వసతులు కరువు.. సిబ్బంది అసలే లేరు ♦ పది నెలలుగా సభ్యుల జీతాలు, నిధులు నిలిపివేత ♦ ఇప్పటికే ముగ్గురు సభ్యుల రాజీనామా ♦ కొత్త కమిషన్ ఏర్పాటుకు ‘టీ’ సర్కారు నోటిఫికేషన్ ♦ చెల్లదంటున్న ప్రస్తుత సభ్యులు సాక్షి,సిటీబ్యూరో : సమాజంలోని చిన్నారుల హక్కులకు అన్యాయం జరిగితే బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. కానీ అదే కమిషన్‌కు వచ్చిన కష్టాలను మాత్రం పట్టించుకున్నవారు లేరు. బాలల హక్కుల పరిరక్షణ కోసం 2014లో ఏర్పాటైన కమిషన్ నిధుల కొరత, అధికార యంత్రాంగం సహాయ నిరాకరణతో విలవిల్లాడుతోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో ఉమ్మడిగా ఉంటుందని పేర్కొన్నప్పటికీ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సిబ్బంది, నిధుల కేటాయింపు విషయంలో మొండికేశాయి. దీతో కమిషన్‌లోని మమతా రఘువీర్, రియాజుద్దీన్ ఇప్పటికే తమ పదవుల నుంచి తప్పుకున్నారు. మిగిలిన సభ్యుల్లో సుమిత్ర, బాలరాజు చాలా కాలంగా విధులకు దూరంగా ఉండగా చివరకు ఇద్దరు సభ్యులే మిగిలారు. జీఓ ఎంఎస్ నెంబర్ 11 (19.2.2014) మేరకు రిటైర్డ్ ఐఏఎస్ సుజాతారావు చైర్‌పర్సన్‌గా ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మరో ఆరుగురు సభ్యులతో బాలల కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే, కార్యాలయం, ఇతర వసతుల పరిస్థితి చూశాక సుజాతారావు విధుల్లోనే చేరలేదు. బాధ్యతలు తీసుకున్న ఆరుగురు సభ్యులు ఇక్కడి పరిస్థితిపై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తే కేవలం ఆర్నెల్లు మాత్రమే అరకొర నిధులు విదిల్చారు. 2014 నవంబర్ నుంచి ఒక్క పైసా విడుదల చేయకపోవటంతో సభ్యులు సొంత ఖర్చులతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాబోయ్.. ఆ పదవులు వద్దు.. ఈ కమిషన్‌లో ఏడుగురు సభ్యుల్లో ప్రస్తుతానికి సీరియస్‌గా పనిచేస్తున్నది కేవలం ఇద్దరే. మిగిలినవారు మనస్థాపంతో పదువులకు రాజీనామా చేయగా, కొందరు కార్యాలయం మెట్లెక్కడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే సామాజిక కార్యకర్త, కమిషన్ సభ్యురాలు మమతా రఘువీర్ జూలైలో రాజీనామా చేశారు. అంతకు ముందే మరో సభ్యులు రహీమొద్దీన్ కూడా పదవిని వదులుకున్నారు. మిగిలిన సభ్యులు మొక్కపాటి సుమిత్ర, బాలరాజు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సొంత ఖర్చులతో పోచంపల్లి అచ్యుతరావు, ఎస్.మురళీధర్‌రెడ్డి మాత్రమే విధుల్లో పాల్గొంటున్నారు. ఈ విషయమై మురళీధర్‌రెడ్డి స్పందిస్తూ ‘సొంత ఖర్చులతో పనిచేస్తున్నాం..ప్రభుత్వం సహకరించకపోయినా మా కర్తవ్యం మే నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు. వివాదాస్పదం అవుతోన్న ‘టీ’ నోటిఫికేషన్ తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఈనెల 17న టీ- ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే 10వ షెడ్యూల్లో పేర్కొన్న మేరకు.. ఈ కమిషన్ పదేళ్ల వరకు ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించడంతో పాటు, ప్రస్తుత కమిటీ సభ్యుల మూడేళ్ల పదవీ కాలం ముగిసేంత వరకు కొత్త కమిటీని నియమించడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. ఖాళీ అయిన పోస్టులను మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ తాజా నోటిఫికేషన్లో చైర్పర్సన్ సహా అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం న్యాయపరమైన చిక్కులు తలెత్తేందుకు ఆస్కారముంది. వేచి చూసి విసిగిపోయాం.. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఉత్సాహంగా పనిచేశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఐఏఎస్ మొదలుకుని ముఖ్యమంత్రి వరకు ముప్పై విజ్ఞాపన పత్రాలు అందజేశా. కానీ ఎలాంటి స్పందనా లేదు. అందుకే రాజీనామా చేసి, సొంతంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నా. - మమతా రఘువీర్, మాజీ సభ్యురాలు ఈ నోటిఫికేషన్ చెల్లదు.. 10వ షెడ్యూల్లో ఉన్న కమిషన్‌ను విభజించడం చెల్లదు. అంతే కాకుండా ప్రస్తుత సభ్యుల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ధారించారు. ఇంకా మాకు ఒకటిన్నర సంవత్సర కాలం మిగిలే ఉంది. గడువు పూర్తి కాకుండానే రాజీనామా చేస్తే తప్ప, మమ్మల్ని తొలగించే అధికారం లేదు. అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. - అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్ సభ్యుడు -
ఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై కమిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోఉద్యోగుల పరిపాలన సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం మంగళవారం కమిటీ నియమించింది. ఈ కమిటీ చైర్మన్‌గా మంత్రి నారామణ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోసభ్యులుగా ఐఏఎస్ అధికారులు ఎస్పీ టక్కర్, ముద్దాడ రవిచంద్రలతో పాటూ ఉద్యోగసంఘాల నేతలు అశోక్ బాబు, బొప్పరాజు, మురళీ కృష్ణలు నియమితులయ్యారు. -
మోదీ పాలనలో అన్నీ వైఫల్యాలే
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు పెట్టడం సరికాదు ఇకపై కాంగ్రెస్ మాట వినం సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15 నెలల పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యాలేనని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. సోమవారం రాత్రి మజ్లిస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత అబ్దుల్ వాహెద్ ఒవైసీ 40వ వర్థంతి సందర్భంగా పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని, ఎన్డీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. నిత్యావసర సరుకుల ధరలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, మోదీ విధానాలతో విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని విమర్శించారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అవమానించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని, ఔరంగజేబు రోడ్డు పేరును మార్చి కలాం పేరు పెట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కలాంపై ప్రేమ ఉంటే ఆయన పేరుతో స్కూల్ పిల్లలకు సైన్స్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్‌కు నోటీస్ పంపిస్తా.. బీజేపీకి లాభం చేకూర్చేలా మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ఆరోపించడం విడ్డూరంగా ఉందని అసదుద్దీన్ అన్నారు. మజ్లిస్ పార్టీపై అనుచిత వాఖ్యలు చేసిన దిగ్విజయ్‌కు లీగల్ నోటీసు పంపిస్తామని, ఆయన చేసిన వాఖ్యలను నిరూపించాలని సవాల్ చేశారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ చెప్పింది విన్నామని.. ఇకపై వినేది లేదని స్పష్టం చేశారు. యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తీరుతామన్నారు. బెంగళూర్ స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వలేదని, బస చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కట్లకు గురిచేశారన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో తడాఖా చూపిస్తామని ఒవైసీ హెచ్చరించారు. ఈ సభలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ ఓటర్లు 6,01,840
ఎన్నికల సెల్ రెడీ మహా నగర పాలక సంస్థలో ఎన్నికల సెల్ ఏర్పాటు చేస్తూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సెల్లో బల్దియా ఇన్చార్జ్ సీపీ ఎ.కోదండరెడ్డి, సూపరింటెండెంట్ సమ్మయ్య, సీనియర్ అసిస్టెంట్లు సుదర్శన్, అనిల్ బాబు, జూనియర్ అసిస్టెంట్ సమీద్, ఇద్దరు అటెండర్లను నియమించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీరు ఎన్నికలకు సంబంధించివిధులు నిర్వర్తించనున్నారు. వరంగల్ అర్బన్: హైకోర్టు ఆదేశంతో గ్రేటర్ అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మహా నగరపాలక సంస్థ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. 58 డివిజన్లవారీగా ఓటర్ల జాబితా సిద్ధమైంది. డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సోమవారం బల్దియూ అధికారులు ఓటర్ల జాబితా వెల్లడించారు. కమిషన ర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశానుసారం బల్దియూ కౌన్సిల్ హాల్లో మహా నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్ల సంఖ్యను సీపీ ఎ.కొండారెడ్డి, టీపీవో మహేందర్ వెల్లడించారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలను కలెక్టర్ కార్యాలయం, గ్రేటర్ ప్రధాన కార్యాలయం, కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయూలు, వరంగల్ ఆర్డీవో కార్యాలయం, వరంగల్ తహశీల్దార్, గీసుకొండ, సంగెం, హసన్‌పర్తి, హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్ తహశీల్దార్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. తదుపరి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మలి దఫా బీసీ ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఆమేరకు డివిజన్లవారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. గుర్తింపు పొందిన 14 పార్టీలకు జాబితా అందజేస్తామన్నారు. పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ షూరూ మహానగరంలో పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఓటర్లను డివిజన్లవారీగా ప్రకటించిన అధికారులు ఇక పోలింగ్ స్టేషన్ల ఖరారు, ముసాయిదా వెల్లడి, అభ్యంతరాల స్వీకరణ తర్వాత కలెక్టర్‌కు నివేదించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ప్రక్రియ ఇలా.. - ఈనెల 31న పోలింగ్ స్టేషన్ గుర్తింపు ప్రారంభం - ఆగస్టు 4న పోలింగ్ స్టేషన్ ముసాయిదా విడుదల - ఆగస్టు 11న పోలింగ్ స్టేషన్లపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో అధికారుల సమావేశం - ఆగస్టు 13న మార్పులు, చేర్పులతో కలెక్టర్‌కు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా.ఆగస్టు 18న పోలింగ్ స్టేషన్ల ఫైనల్ నోటిఫికేషన్ - ఎన్నికల సంఘానికి పోలింగ్ స్టేషన్ల జబితా అందచేత ఇదీ లెక్క.. అధికారులు వెల్లడించిన ఓటర్ల జాబితా ప్రకారం మహా నగరంలో మొత్తం జనాభా 8,19,406 మంది ఉన్నారు. వీరిలో 4,10,771 మంది పురుషులు, 4,08,635 మంది మహిళలు. ఎస్సీలు 1,32,775 మంది ఉండగా, వీరిలో పురుషులు 65,762 మంది, మహిళలు 67,013 మంది ఉన్నారు. ఎస్టీలు 25,480 మంది ఉండగా, వీరిలో 13,271 మంది పురుషులు, 12,209 మంది మహిళలు ఉన్నారు. 58 డివిజన్ల మొత్తం ఓటర్లు 6,01,840 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 3,02,482 మంది ఉండగా, మహిళ ఓటర్లు 2,99,267 మంది, ఇతరులు 91 మంది ఉన్నారు. -
అంతా హడావుడే !
సాక్షి, గుంటూరు : రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. జిల్లా ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చివరకు ఉసూరుమంటూ వెనుదిరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రోడ్డు మార్గాన వస్తున్నారని, కృష్ణా కరకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తారని సీఎం పేషీ నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికారులు పడిన హడావుడి ఇది. ముఖ్యమంత్రి విమానంలో విశాఖపట్నం నుంచి వస్తూ రాజధాని ప్రాంతంపై ఓ లుక్కేసి తిరుపతి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతంలో మంగళవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ఉంటుందని, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ఉంటారని సోమవారం ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో మంత్రులు, జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సీఎం రాజధాని ప్రాంతానికి రోడ్డు మార్గాన వస్తున్నట్లు సంక్రాంతి సంబరాల్లో ఉన్న జిల్లా కలెక్టర్‌కు సమాచారం వచ్చింది. వెంటనే ఆయన గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడును వెంటతీసుకొని హడావుడిగా వేదిక దిగివెళ్లి పోయారు. జిల్లా ఎస్పీలను, తుళ్లూరులో ఉన్న రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రకాశం బ్యారేజీ నుంచి వెంకటపాలెం కరకట్ట వరకు బందోబస్తు ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. కొద్దిసేపటికి సంక్రాంతి సంబరాల వేదికపై ఉన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు సమాచారం అందడంతో ఆయన కూడా హడావుడిగా కార్యక్రమాన్ని ముగించుకుని బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి వెంకటపాలెం చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సీఎం విశాఖపట్నం నుంచి విమానంలో వస్తూ రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి తిరుపతి వెళ్లిపోవడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని వెనుదిరిగారు. ఇదిలావుండగా, రాజధాని ప్రాంతంలో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలు ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఖరారు అవుతుండటంతో జిల్లా ఉన్న తాధికారులు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
మోక్షమేది..?
ఈ పంచాయతీలకు గ్రహణం సాక్షి, మహబూబ్‌నగర్: దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో పరిపాలన పారదర్శకంగా మార్చేందు కోసం తలపెట్టిన ఈ పంచాయతీలకు గ్రహణం పట్టింది. జిల్లాలోని 320 గ్రామాలను సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ పంచాయతీల ద్వారా పరిపాలనను మొత్తం ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించింది. ప్రభుత్వ నిధులు, మౌలిక సదుపాయాలు.. తదితర వివరాలు ఆన్లైన్లో పొందుపరచనున్నారు. అందుకు అనుగుణంగా గ్రామాల ఎంపిక, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆపరేటర్లు తదితర చర్యలన్నీ పూర్తయ్యాయి. అయితే రోజులు, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వీటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలూ లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలో మొత్తం 1310 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల ఎంపికకు గ్రామ పంచాయతీ పరిధిలోని జనాభా, ఆదాయం, ఇంటర్నెట్ సౌకర్యం తదితరాల ఆధారం చేసుకొని ఈ పంచాయతీలను ఎంపికచేశారు. వీటిలో మొదటి విడతగా నాలుగు డివిజన్ల పరిధిలోని 320 గ్రామ పంచాయతీలను ఈ కంప్యూటరీకరణ చేయాలని తెలంగాణ సర్కారు భావించింది. అందుకోసం కంప్యూటర్లు కూడా మంజూరయ్యాయి. జిల్లా అవసరాల నిమిత్తం మొత్తం 392 కంప్యూటర్లు వచ్చాయి. వీటిని గ్రామ పంచాయతీలతో పాటు పరిపాలన అవసరాల నిమిత్తం వినియోగించేలా ప్రణాళిక రచించారు. కంప్యూటర్లను కూడా పంచాయతీలకు పంపించారు. ఈ కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యం కోసం బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు జిల్లాలో 205 కంప్యూటర్లకు నెట్ సౌకర్యం కల్పించారు. మిగతా వాటికి బీఎస్ఎన్ఎల్ సదుపాయం కల్పించడం కోసం సర్వం సిద్ధం చేశారు. ఈ పంచాయతీల నిర్వాహణ కోసం రాష్ట్రస్థాయిలో కార్వి అనే కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. కంపెనీ కూడా బాధ్యత నిర్వహించడం కోసం ఆపరేటర్లకు శిక్షణనిచ్చింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పనులు ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు సర్కారు నుంచి ఆదేశాలు అందకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. అందనున్న సేవలు: ఈ పంచాయతీల సేవలు ప్రారంభమైతే సకల సమాచారాన్ని ఒక క్లిక్‌తో తెలుసుకునే వీలు కలుగుతుంది. అంతేకాదు సేవలు కూడా మరింత సరళతరంగా, పారదర్శకంగా అందుతాయి. పన్నుల వసూలు, వ్యాపార లెసైన్స్‌లు, లేఅవుట్ ఫీజులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ పత్రాలు, గ్రామంలోని భూములు, సరిహద్దులు, మన ఊరు- మన ప్రణాళికలతో పాటు పంచాయతీ పరిధిలో తీసుకునే పలు కీలక పనుల వివరాలు, వ్యయ నిర్వహణతో సహా సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ సేవ ద్వారా అందే సేవలన్నింటినీ అందజేయనున్నారు. అలాగే గ్రామసభల్లో చేసిన తీర్మానాలను కూడా పౌరులు తీసుకునేలా వీలు కల్పించనున్నారు. ఈ పంచాయతీకి ఎంపికైన గ్రామాలు డివిజన్ \u3149?ట్చఛగ్రామాలు మహబూబ్‌నగర్ 93 గద్వాల 81 నారాయణపేట 77 నాగర్‌కర్నూలు 69 మొత్తం 320 మంజూరైన కంప్యూటర్లు 392 -
ఎవరికి వారే..!
వెనుకబడిన, వలసల జిల్లాగా పేరొందిన పాలమూరులో సమస్యలు సవాలక్ష.. వాటిని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు.. కలెక్టర్, ఇతర విభాగాల మధ్య సమన్వయం లోపించింది. తక్షణ వాటిపైనే ఉరుకులు పరుగులు తీస్తూ.. పెండింగ్ సమస్యలు పట్టించుకోవడం లేదు. జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్షలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయి పర్యటనలు ముందుకు సాగడం లేదు.. వెరసి జిల్లా పాలనాయంత్రాంగం పనితీరు ఎవరికివారే.. యమునా తీరే..! అనే చందంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలనా యంత్రాంగం పనితీరు దిశా నిర్దేశం లేకుండా సాగుతుండటంతో జిల్లాలో చిన్నాచితక సమస్యలు దీర్ఘకాలంగా అలాగే ఉండిపోతున్నాయి. సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇతర సమస్యలపై దృష్టి సారించకపోవడంతో సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వశాఖల వారీగా సమీక్షలు కొరవడడంతో కొన్ని ప్రభుత్వ విభాగాల ఉనికి నామమాత్రంగా తయారైంది. కొన్ని విభాగాల సమీక్షలు అధికారులు సమర్పించే మొక్కుబడి నివేదికలతో ముగుస్తున్నాయి. పర్యవేక్షణ, సమీక్షల ద్వారా పనితీరుపై మదింపు జరగకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పాలనా యంత్రాంగానికి సారథ్యం వహించే కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బందికి నడుమ సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మధ్య పొంతన కుదరక పాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్‌ను కలెక్టర్ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని కలెక్టరేట్ సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పరిధిలోని ఇసుక అనుమతులు అంశాన్ని తప్పించి డీఆర్వో నేతృత్వంలోని ‘సాండ్ సెల్’కు అప్పగించడం ఇద్దరి మధ్య నెలకొన్న అగాథాన్ని సూచిస్తోంది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల గుర్తింపు వంటి విషయాల్లో రెవెన్యూ యంత్రాంగం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఆగిన క్షేత్రపర్యటనలు బాధ్యతలు స్వీకరించిన కొత్తలో క్షేత్రస్థాయి పర్యటనలతో తీరిక లేకుండా గడిపిన కలె క్టర్ ప్రస్తుతం కార్యాలయానికి ఎక్కువగా పరిమితమవుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే, రుణమాఫీ, సామాజిక పింఛన్ల లబ్ధిదారుల గుర్తింపు వంటి పనుల్లో కలెక్టర్ ఒత్తిడి చేయడంపై ఓ దశలో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పేరిట నిరసనకు దిగారు. జాబితాల పరిశీలన, కంప్యూటరీకరణ, వీడియో కాన్ఫరెన్స్‌లతో కుటుంబంతో గడిపే పరిస్థితి లేకుండా పోయిందని ఉద్యోగులు ఆక్షేపించారు. నవంబర్ 8న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్యోగులతో కలెక్టర్ రాజీకుదుర్చుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ‘తమకూ యూనియన్లు ఉన్నాయని’ ఆవేదన వ్యక్తంచేసిన కలెక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా తగ్గించారు. ‘అనేక అంశాలపై దిశా నిర్దేశం కోరేందుకు కలెక్టర్ వద్దకు వెళ్తున్నాం. కానీ పూర్తిస్థాయిలో చర్చించే పరిస్థితి లేక వెనుదిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి అందే తక్షణ ఆదేశాలపైనే అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఇతర శాఖల అంశాలపై పూర్తి స్థాయి సమీక్ష జరగడం లేదు’ అంటూ కొందరు అధికారులు లోలోన వ్యాఖ్యలు చేస్తున్నారు. -
జోర్డాన్
నైసర్గిక స్వరూపం ఖండం: ఆసియా, వైశాల్యం: 89,342 చదరపు కిలోమీటర్లు, జనాభా: 66,55,000 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: అమ్మాన్, ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, కరెన్సీ: దీనార్, భాషలు: అరబ్బీ, ఇంగ్లిష్, మతం: 98 శాతం ముస్లిములు, ఒక శాతం క్రైస్తవులు, ఒక శాతం అమెరికన్స్, వాతావరణం: జనవరి ప్రాంతంలో 4 నుండి 12 డిగ్రీలు, ఆగస్ట్ ప్రాంతంలో 18 నుండి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, సరిహద్దులు: సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాక్, స్వాతంత్య్ర దినోత్సవం: 1946, మే 25. పరిపాలనా పద్ధతి- ప్రజలు జోర్డాన్ దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 12 భాగాలుగా విభజించారు. ఈ భాగాలను గవర్నరేట్లు అని అంటారు. అవి ఇర్బిడ్,అజ్లేన్, జెరాంశ్, మఫ్రాక్, బల్కా, అమ్మాన్, జర్కా, మడాబా, కరక్, తఫిలా, మాన్, అఖాబా, స్థానిక జోర్డానియన్లు గ్రామాల్లో ఉంటారు. వారిని బెడోయిన్లు అంటారు. వీళ్లు దేశ తూర్పు భాగంలో అధికంగా ఉంటారు. వీరు దేశమంతటా తిరుగుతూ ఉంటారు. మగవాళ్లు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. సాధారణంగా మగవాళ్లే పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటికే పరిమితమై ఉంటారు. ఇప్పుడు యువతులు కాలేజీ చదువులకు వెళ్లడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలో మత దూషణలు ఉండవు. అన్ని మతాలూ కలసికట్టుగా ఉంటాయి. ముస్లిములు విధిగా రోజుకు అయిదుసార్లు మసీదుల్లో ప్రార్థన చేస్తారు. రంజాన్ మాసంలో పగలు అసలు హోటళ్లే తెరిచి ఉంచరు. చరిత్ర ఈ ప్రాంతాన్ని క్రీస్తుపూర్వం 1300 నుండి టర్కీ దేశపు ఓట్టోమాన్ రాజవంశం పరిపాలిస్తూ వచ్చింది. దేశంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం కావడం వల్ల అప్పటి రాజులు ఆ ఎడారిలోని రాతి గుట్టలు, పర్వతాలను చెక్కి భవనాలను నిర్మించారు. ప్రస్తుత పెట్రా ప్రాంతంలో రాతిని తొలచి భవంతులు కట్టిన అప్పటి శిథిలాలు నేటికీ చెక్కుచెదరని రీతిలో కనిపిస్తాయి. భూగర్భంలో విశాలమైన భవన సముదాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశాలు విదేశీ పర్యాటకులకు, గత చరిత్ర ఆధారంగా తీసే అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లకు చక్కని ప్రదేశంగా మారిపోయింది. 1923లో జోర్డాన్ దేశం ఏర్పడి, 1946 దాకా ఆంగ్లేయుల సంరక్షణలో ఉండింది. 1946లో పూర్తి స్వాతంత్య్రం పొంది జోర్డాన్ రాజ్యంగా ఆవిర్భవించింది. దాదాపు 30 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ‘కింగ్ హుస్సేన్’ ఆధ్వర్యంలో ఈ దేశం ఆధునిక జోర్డాన్‌గా రూపొందింది. పంటలు- పరిశ్రమలు: జోర్డాన్‌లో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. ముఖ్యంగా టమోటా, గుమ్మడి, నిమ్మ, అరటిపళ్లు అధికంగా పండిస్తారు. దేశంలో పొటాష్, ఫాస్పేట్ గనులు ప్రముఖమైనవి. వీటిని తవ్వి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. దేశ ఆదాయంలో 26 శాతం ఆదాయం ఈ ఎగుమతుల ద్వారా లభిస్తుంది. మందుల తయారీ, సిమెంటు, వస్త్రపరిశ్రమ, ఎరువుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. మఫ్రాక్ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. అయితే నీరు, విద్యుచ్ఛక్తి కొరత తీవ్రంగా ఉండడం వల్ల సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కావడం లేదు. సంస్కృతి-వస్త్రధారణ: జోర్డాన్ ముస్లిం దేశం. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ మిగతా దేశాల్లో ఉన్న ముస్లిముల మాదిరిగానే ఉంటుంది. బిగుతుగా ఉండే దుస్తులు, స్లీవ్‌లెస్, కురచ దుస్తులు ధరించడం నిషేధం. మహిళలు చీరలు, పంజాబీ డ్రస్సులు తొడిగినా పై నుండి కింది వరకు లిబిస్ లేదా జిల్బాబ్ అనే పేరున్న పొడవాటి పై తొడుగు వేసుకుంటారు. వెంట్రుకలు, తల కనబడకుండా స్కార్ఫ్ ధరిస్తారు. మగవాళ్ళు షర్టు, ప్యాంటు ధరిస్తారు. నమాజు వేళల్లో తలకు టోపీ ధరించడం తప్పనిసరి. తలపాగా చుట్టుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. మగవాళ్ళు తలకు ధరించే వస్త్రాన్ని కఫియ్యే అంటారు. ఆహారం: జోర్డానియన్లు తినే భోజనాన్ని మెజ్జె అంటారు. ఆహారంలో బ్రెడ్డు, సలాడ్ తప్పనిసరిగా తీసుకుంటారు. అలాగే పేస్ట్రీలు ఎక్కువగా తింటారు. దేశీయ భోజనాన్ని మస్సాఫ్ అంటారు. ఇది గొర్రెమాంసం, యోగర్ట్‌తో కూడి ఉంటుంది. కోడిమాంసం బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు కలిపి తయారుచేసే పదార్థాన్ని సనియత్ దజాజ్ అంటారు. బియ్యం, కూరగాయలు, మాంసంతో కాసరోత్ తయారు చేస్తారు. దీనిని మక్లుబా అంటారు. మొక్కజొన్న పిండితో కరదీశ్ అనే బ్రెడ్ తయారుచేస్తారు. దేశంలో మద్యపానం నిషేధం కాబట్టి ఇక్కడి ప్రజలు సాధారణంగా పాలు, కాఫీ, నిమ్మరసం, ఆప్రికాట్ రసం వంటి పానీయాలు తీసుకుంటారు. చూడాల్సిన ప్రదేశాలు 1. అమ్మాన్: ఏడు వేల సంవత్సరాల చరిత్ర గల ఈ నగరం ఏడుకొండల మీద నిర్మితమైంది. ఇక్కడ పూర్వం రాజభవనాలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే బైజాంటియన్బ్రాసిలికా అనే నిర్మాణం ఉంది. దీనిని 6వ శతాబ్దంలో నిర్మించారని అంచనా. ఆ కాలంలో ప్రజలకు ఇది హెర్క్యులస్ దేవుని మందిరం. ఇప్పుడు దీనిని గ్రేట్ టెంపుల్ ఆఫ్ అమ్మాన్ అంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే జోర్డాన్ పురాతన మ్యూజియం ఉంది. ఇక్కడికి కొద్దిదూరంలో రోమన్ ఆంఫిథియేటర్ (ఆరుబయలు రంగస్థలం) ఉంది. దీనిని ఒకటవ శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరంలోనే 1924లో నిర్మించినకింగ్హుస్సేన్ మసీదు ఉంది. అమ్మాన్ నగరానికి సమీపంలో సాల్ట్ అనే పురాతన నగరం ఉంది. ఇక్కడికి సమీపంలో బానిసల భవనాలు, శిథిలమైన రాజ గృహాలు ఉన్నాయి. 2. జోర్డాన్ వ్యాలీ: జోర్డాన్లోయ దేశంలోనే ఎంతో ప్రముఖమైంది. ఇది దేశానికి పశ్చిమభాగంలో ఉంది. గ్రేట్ రిఫ్ట్వ్యాలీలో ఇదొక భాగం. ఈ ప్రదేశంలో ఒక భాగాన్ని ఘోర్ అని అంటారు. ఇక్కడే జోర్డాన్ నది ప్రవహిస్తోంది. ఈ నది సిచేరియస్ సరస్సులో కలుస్తుంది. సముద్ర మట్టానికి 212 మీటర్ల దిగువన ఉండే ఈ సరస్సు మృతసముద్రం (ఈ్ఛ్చఛీ ్ఛ్చ)లో కలుస్తుంది. పదివేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 తర్వాత ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇదే వెస్ట్బ్యాంక్గా రూపాంతరం చెందింది. జీసస్ క్రీస్తు ఈ జోర్డాన్ నదీతీరంలో బెతాని అనే ప్రాంతంలోనే బాప్టిజమ్ తీసుకున్నాడని బైబిల్ చెబుతోంది. ప్రత్యేక సంరక్షణలో ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటకులు చూడవచ్చు. ఇక్కడ ఉన్న మృతసముద్రం 75 కిలోమీటర్ల పొడవు, 6 నుండి 16 కిలోమీటర్లు వెడల్పు ఉంది. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉండడం వల్ల వస్తువులు మునగవు, మనుషులు మునిగిపోరు. 3. మడాబా: మడాబా ఒక పురాతన నగరం. ఇది రాజధాని అమ్మాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం గురించి బైబిల్లో వర్ణన ఉంది. ఆ కాలంలో దీనిని మెడాబా అనేవారు. బైజాంటియన్ రాజుల కాలంలో గొప్ప నిర్మాణాలు చేశారు. ముస్లిం, క్రైస్తవ మత సంబంధమైన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. పాలరాతి పలకలు ఇప్పటికీ నగరంలో అక్కడక్కడా దర్శనమిస్తాయి. క్రీస్తుశకం 747లో వచ్చిన భూకంపం కారణంగా ప్రజలంతా ఇతర ప్రదేశాలకు వలస పోయారు. ఇక్కడి సెయింట్ జార్జ్ చర్చి నగరం మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మడాబా మ్యూజియం ఈ చర్చ్ సమీపంలో ఉంది. చర్చ్ ఆఫ్ అపోసిల్స్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో మౌంట్నెబో ఉంది. బైబిల్ గ్రంథంలో దీనిపేరు పిస్గాత. ఈ పర్వతానికి రెండు శిఖరాలు ఉన్నాయి. ఒకదానిని సియాగా అని, రెండోదానిని ముఖాయట్ అంటారు. ఇక్కడి భవనాల ముందుభాగంలో ఉన్న సర్పిలాకార శిలువ ప్రత్యేక అకర్షణగా నిలుస్తుంది. 4. పెట్రా: మొత్తం దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం పెట్రా. మృత సముద్రానికి దక్షిణ ప్రాంతంలో నిర్మితమైన ఈ రాతినగరం ఇప్పటికీ నిర్మాణపరంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు నెబాటియన్లకు-అరబ్బులకు ఇది రాజధాని నగరం. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ రాతినగరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం ఒక గొప్ప విషయం. రాతి కొండలను తొలిచి భవనాలుగా మలిచిన తీరు ప్రశంసనీయం. ఈ భవనాలు దాదాపు 200 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఇటీవలి కాలం వరకూ ఈ రాతి భవనాలను బెడోయిన్లు నివాస భవనాలుగా ఉపయోగించుకున్నారు. ఇవి రాజధానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్రా చుట్టుపక్కల ఓ బలిస్క్ టోంచ్, అల్ఖజ్నే, రోమన్ల ఆంఫిథియేటర్, రాయల్ టోంచ్లు, టెమెనస్ గేట్ వే పెట్రాచర్చ్, అల్ దీర్, సిక్ అల్ బారెద్ ఇలా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. 1812లో ఈ ప్రాంతాన్ని జోహన్ లుడ్విగ్ అనే చరిత్రకారుడు నవీన ప్రపంచానికి పరిచయం చేశాడు. -
ఐటీడీఏ ఖాళీ!
సీతంపేట:జిల్లాలోని గిరిజనుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉందో సీతంపేట ఐటీడీఏ(సమగ్ర గిరిజనాభ్యుదయ సంస్థ) పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించాల్సిన ఐటీడీఏ పాలనను గ్రూప్ వన్ అధికారితో సరిపెట్టిన ప్రభుత్వం, కీలక పోస్టుల భర్తీ విషయాన్నీ పట్టించుకోవడంలేదు. ఫలితంగా పరిపాలనతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతోంది. రాష్ట్రంలోనిమిగతా ఐటీడీఏలు అన్నింటికీ ఐఏఎస్ అధికారులను పీవోలుగా నియమించిన ప్రభుత్వం సీతంపేట ఐటీడీఏను మాత్రం గత కొన్నేళ్లుగా గ్రూప్ వన్ అధికారులతోనే నడిపిస్తోంది. దీంతో పాలనలో ప్రజాప్రతినిధుల జోక్యం పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 274 జీవో ప్రకారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కింద పాలన సాగించాలి. పూర్తిస్థాయిలో పథకాలు అమలు చేయాలన్నా, ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలన్నా వీరికి జిల్లా కలెక్టర్‌తో సమాన అధికారాలు ఉంటాయి. అయితే గ్రూప్ వన్ అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తగినట్లే ఇటీవలి కాలంలో అధికార పార్టీ ఒత్తిడి ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారి అయితే స్వయంగా నిర్ణయాలు తీసుకోగలరని, ఒత్తిళ్లను సైతం తలొగ్గే పరిస్థితి ఉండదని అంటున్నారు. మిగతా పోస్టుల పరిస్థితి దయనీయం కాగా ఐటీడీఏలో ఇతర కీలక పోస్టులన్నీ దాదాపు ఖాళీగా ఉన్నాయి. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులు ఇప్పట్లో భర్తీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో పథకాల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంది. ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. వీటిలో 1200కు పైగా గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు మౌలిక వసతుల కల్పన, పథకాాలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించడం ఆయా శాఖల అధికారుల బాధ్యత. అయితే చాలా శాఖలు ఇన్చార్జీల ఏలుబడిలో ఉండటంతో పర్యవేక్షణ అంతంతమాత్రంగా సాగుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడి(డీడీ) పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం వంశధార ఎస్డీటీ సుదర్శన దొర ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అలాగే మూడు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని సీనియర్ వార్డెన్లు అదనపు బాధ్యతగా నిర్వరిస్తున్నారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఈఈ పోస్టు ఖాళీగా ఉండగా విజయనగరం జిల్లా పార్వతీపురం డీఈ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఖాళీగా ఉన్న ఐకేపీ ఏపీడీ పోస్టును శ్రీకాకుళం ఏపీడీ సావిత్రి అదనపు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ఉపాధి హామీ ఏపీడీ పోస్టు సైతం ఖాళీగానే ఉంది. ప్రాజెక్టు హార్టీకల్చర్ ఆఫీసర్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏ ఏపీవో (అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి) నెలరోజులుగా సెలవులో ఉన్నారు. ప్రాజెక్టు అగ్రికల్చర్ అధికారి పోస్టులో ఏడీఏ రాజగోపాల్ (వ్యవసాయశాఖ) ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటీ డీఈవో పోస్టును కూడా సీనియర్ హెచ్ఎం మల్లయ్య అదనపు బాధ్యతగా మోస్తున్నారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పోస్టులో మర్రిపాడు వైద్యాధికారి రామ్మోహన్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. పోస్టుల ఖాళీ విషయమై ఇటీవల సీతంపేట పర్యటనకు వచ్చిన గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర కమిషనర్ ఉదయలక్ష్మి వద్ద ప్రస్తావించగా ఖాళీల భర్తీ ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. అయినా త్వరలో భర్తీ కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. -
గుట్టుగా కొల్లగొట్టు
మానవపాడు: మండలంలోని తుంగభద్ర నదీతీర ప్రాంతం నుంచి ఇసుక గుట్టుగా తరలిపోతోంది. ఇసుకాసురులు రాత్రివేళల్లో కర్నూలుకు చెందిన వే బిల్లులతో అక్రమమార్గం లో హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం మాత్రం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అలంపూర్ ఎ మ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ కర్నూలు నుంచి వచ్చిన ఏడు ఇ సుకలారీలను నిలిపి మానవపాడు స్టేషన్‌కు తరలించారు. సరిహద్దు చెక్‌పోస్టు ఉన్నా ఫలితం శూన్యమని, కమీషన్ల మత్తులో లారీలను వదిలేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యే హల్చల్ సృష్టించి ఇసుక లారీలను అడ్డుకోవడంతో అలంపూర్ చౌరస్తా నుండి పుల్లూర్ టోల్‌ప్లాజా వరకు ఇసుకలోడుతో ఉన్న వాహనాలు నిలిచిపోయాయి. డబ్బులు చెల్లించి సీమాంధ్ర వే బిల్లులు తీసుకున్న వాహనాలను వదలకపోవడంతో ముందుకు పోలేక రోడ్లపైనా నిలిపిఉంచారు. ఓ వైపు సీమాంధ్ర నేతలు వే బిల్లులు ఉన్నాయని, ఆ వాహనాలను వదిలేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వాహనాలను వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు. మాకెందుకులే..! తమకెందుకే అనుకున్నారేమో గాని రెవెన్యూ, పోలీసు అధికారులు రోజుకు వందల సంఖ్యలో ఇసుకలారీలు తరలిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ వాహనా ల దగ్గర వే బిల్లులు ఉన్నాయా.. లేదా? అని కూడా తని ఖీలు చేయడం లేదు. అక్రమంగా ఇసుకను తరలించే వారు అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకుని యథేచ్ఛగా ఇసుకవ్యాపారం చేస్తున్నారు. -
యలమంచిలికి మహర్దశ!
సమగ్రాభివృద్ధికి ఎంపిక నివేదిక రూపకల్పనలో యంత్రాంగం యలమంచిలి : యలమంచిలి పట్టణ సమగ్రాభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా యలమంచిలిని ఎంపిక చేసి మౌలిక వసతుల కల్పనపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ముఖ్య ప్రణాళికా విభాగం, గణాంకశాఖలు నివేదికలు రూపొందించే పనిని చేపట్టారు. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏఏ అంశాలతో నివేదిక సిద్ధం చేయాలో ప్రభుత్వం నిర్ణీత ఫార్మాట్‌ను పంపించింది. శనివారం యలమంచిలి వచ్చిన ముఖ్య ప్రణాళికా విభాగం, గణాంక శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఎస్. శ్రీనివాసరావు, యలమంచిలి ఎంపీడీవో బి.శ్రీనివాసరావుతో చర్చించారు. యలమంచిలి విస్తీర్ణం, భౌగోళిక స్థితిగతులు, విలీన గ్రామాల పరిస్థితులను బట్టి ఏ అభివృద్ధి పనులు చేపడితే ఉపయోగం ఉంటుందో ఆరా తీశారు. అనంతరం మండల పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి అధ్యక్షతన వార్డు సభ్యులు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులు, పట్టణ పేదరిక నిర్మూలనా విభాగం, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 8, 9 తేదీల్లో పెలైట్ ప్రాజెక్టు నివేదిక కోసం సర్వేకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వార్డు స్థాయిలో సమావేశాలు నిర్వహించి జనాభా, ఇళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారి వివరాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, విద్యాసంస్థలు, ఇతర మౌలిక వసతుల వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం వార్డు సభ్యుని అధ్యక్షతన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్వే పక్కాగా చేపట్టేందుకు ఈ బృందాల్లో సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. యలమంచిలిలో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపల్ పాలకవర్గం పెలైట్ ప్రాజెక్టును వినియోగించుకోవాలని భావిస్తోంది. నివేదికలు పూర్తయి కార్యరూపం దాల్చితే యలమంచిలి అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంది. -
రుణమాఫీలో.. నకిలీ బాగోతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 69 ప్రకారం రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు రుణమాఫీ కోరుతున్న రైతులు ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను అందజేయాల్సిందిగా రైతులను ఆదేశించారు. గ్రామాల వారీగా రుణమాఫీ కోరుతున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీ పేరిట బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో గ్రామాల వారీగా పరిశీలన పూర్తి చేయాలని నిర్ణయించారు. రుణమాఫీకి అర్హత కలిగిన ఏ ఒక్క రైతూ నష్టపోకుండా వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 349 వివిధ బ్యాంకుల శాఖల ద్వారా రూ.749 కోట్లు రైతులు రుణంగా పొందినట్లు గురించారు. తొలిరోజు పరిశీలనలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. బ్యాంకర్ల సహకారంతోనే.. బ్యాంకర్ల సహకారంతో రైతుల ముసుగులో నకిలీ రైతులు చెలరేగిపోయినట్లు గుర్తించారు. భూమి లేకున్నా పాసు పుస్తకాలు సృష్టించి కోట్లాది రూపాయలను పంట రుణం రూపం లో నొక్కేశారు. సామాన్యుడు రుణం కోసం బ్యాంకు మెట్లెక్కితే సవాలక్ష నిబంధనలతో బెదరగొట్టే బ్యాం కర్లు నకిలీలకు రుణ మంజూరులో మాత్రం ఉదారంగా వ్యవహరించారు. పాసు పుస్తకాల్లో ఆర్డీఓలు, తహశీల్దార్లు, గ్రా మ రెవెన్యూ అధికారుల సంతకాలను నకిలీ రాయుళ్లు యధేచ్ఛగా ఫోర్జరీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ వికాస బ్యాంకు శాఖల్లో ఈ రకమైన ‘నకిలీలలు’ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ ఆఫీసర్ల సహకారం లేనిదే ఈ రకమైన రుణ మంజూరు సాధ్యం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటపడుతున్న బాగోతం తొలిరోజు పరిశీలనలో నారాయణపేటలో 1321, మక్తల్‌లో 814, నాగర్‌కర్నూలులో 1894,కొల్లాపూర్‌లో 2276, మహబూబ్‌నగర్‌లో 714 మంది నకిలీ పాసుపుస్తకాలు తనఖా పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు. గద్వాల, వనపర్తి డివిజన్ పరిధిలో బ్యాంకర్లు రుణమాఫీ కోరుతున్న రైతుల జాబితాను ఇంకా అందజేయాల్సి ఉంది. మరో మూడు రోజుల పాటు తహశీల్దార్, ఎంపీడీఓ, వీఆర్ఓ, బ్యాంకుల ప్రతి నిధులతో కూడిన కమిటీ ఈ పరిశీలన మరింత ముమ్మరం చేయనుంది. పరిశీలన పూర్తయితే వందల కోట్ల రూపాయలు నకిలీలు కాజేసిన వైనం వెలుగు చూసే అవకాశముంది. తమ బాగో తం బయటపడుతుందనే భయంతో కొన్ని చోట్ల బ్యాంకర్లు రుణమాఫీ రైతుల జాబితా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ‘అర్హులకు అన్యా యం జరగకూడదనే ఉద్దేశంతో చేపట్టిన పరిశీలనలో నకిలీల వ్యవహారం వెలుగు చూడడం ఆశ్చర్యకరం. ఈ నెల 30వ తేదీలోగా అన్ని గ్రామాల్లో పాసుపుస్తకాల పరిశీలన పూర్తి చేయా లి. బ్యాంకర్లు గురువారంలోగా తప్పనిసరిగా రైతుల జాబితా ఇవ్వాలని’ కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంత రం బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో రుణమాఫీ అర్హత కలిగిన రైతుల వడపోతపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రియదర్శిని, రెవెన్యూ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
విలీన గ్రామాల్లో ‘ఉపాధి’కి గండి
పనులు నిలిపివేయాలంటూ తాజాగా ఉత్తర్వులు రెండు పురపాలకాల్లో 10 వేల మందికి అశనిపాతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో యంత్రాంగం విఫలం నర్సీపట్నం రూరల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం... గ్రామీణ కూలీలకు ఇదొక వరం... కానీ పురపాలకాల్లో విలీనమైన గ్రామాలకు చెందినవారికి మాత్రం దూరమైపోతోంది. పట్టణాల్లో ‘ఉపాధి’ పనులు నిలిపేయాలన్న ఆదేశాలు ఇప్పుడు వారికి అశనిపాతం అయ్యాయి. అలా ఉపాధి కోల్పోతున్నవారికి ప్రత్యామ్నాయం చూపించాలని గతంలో ఆదేశాలిచ్చినా ఆచరణలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా విలీన గ్రామాల్లోని ఉపాధి కూలీలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో రెండున్నర ఏళ్ల క్రితం ఏర్పాటైన నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లోని దాదాపు పది వేల మంది కూలీల జీవనంపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి నగర పంచాయతీలను రెండున్నర ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో విలీనమైన 15 గ్రామాల్లోని పేద కుటుంబాలన్నీ అప్పటికే ఏటా రూ. 2 కోట్ల మేర మంజూరవుతున్న ఉపాధి హామీ పథకం పనులపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలకు ఈ పథకం వర్తించదు. ఈ విషయమై ఈ రెండు మున్సిపాలిటీల్లోని పేదలు అప్పట్లో అందోళనలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం... ఆయా పేదల పేదల ఉపాధికి రెండేళ్లలోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అంతవరకు వారందరికీ విలీన గ్రామాలను గతంలాగే గ్రామీణ ప్రాంతాల్లా గుర్తించి ఉపాధి పనులు కల్పించాలని స్పష్టం చేసింది. ఈమేరకు ఈ రెండున్నరేళ్లగా అక్కడ ఉపాధి పనులు కల్పించారు. ఇక ఆ రెండు మున్సిపాలిటీల్లో కొత్తగా ఉపాధి పనులు చేపట్టవద్దని ఆదేశిస్తూ ప్రభుత్వం వారం రోజుల క్రితం నంబర్ 321 ఉత్తర్వులను జారీ చేయడంతో మళ్లీ కూలీల కష్టాలు మొదటికొచ్చాయి. అలాగే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎటువంటి పనుల ప్రతిపాదనలూ పంపవద్దని ప్రభుత్వం సిబ్బందిని ఆదేశించింది. ప్రస్తుతం మిగిలి ఉన్న పనులను మాత్రమే పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రకారం రెండు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పనులు మరో నెల రోజుల వరకే సరిపోతాయి. ఇవి పూర్తయిన తర్వాత అక్కడి కూలీలంతా ‘ఉపాధి’కి దూరం కావాల్సిందే. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో అరకొర నిర్మాణ పనులు మినహా వేరే దిక్కులేదు. ఇకపై తమ జీవనోపాధి ఎలా అంటూ వారంతా ఆందోళన చెందుతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, ఉపాధి హామీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్థానికుడే కావడంతో ఈ సమస్యను ఆయనే పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నారు. -
కూవం ప్రక్షాళన
రూ.3,833 కోట్లతో కార్యాచరణ సిద్ధం తీరవాసులతో చర్చలు సాక్షి, చెన్నై: కూవం నది ప్రక్షాళనకు మళ్లీ కార్యాచరణ సిద్ధం అయింది. రూ.3,833 కోట్లతో అంచనా రూపొందించా రు. తీరవాసులతో చర్చలు జరిపి ఆక్రమణల తొలగిం పునకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. అరక్కోణం సమీపంలోని తక్కోళం కేశవరం నుంచి మొదలయ్యే కూవం నది అనేక పాయలుగా చీలి కోయంబేడు వద్ద నగరంలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. ఈ కూవం పరివాహక ప్రాంతంలో 82 చెరువులు, 13,575,93 హెక్టార్ల ఆయకట్టు భూములు ఉండేవి. ఈ ప్రాంతాల్లో అరన్వెయిల్, కొరట్టూరు, కన్నన్ పాళెం, ఆయిల్చెడి, పర్తిపట్టుల వద్ద ఆనకట్టలు సైతం నిర్మిం చారు. తక్కోళం కేశవరం నుంచి 72 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. చెన్నై మహానగరంలో మాత్రం 17.98 కిలోమీటర్ల మేరకు ప్రవహించి చివరకు నేప్పియర్ వంతెన వద్ద సముద్రంలోకి కలుస్తున్నది. వర్షాకాలంలో అయితే, ఈ నది మరీ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండేది. అన్యాక్రాంతం: కాలక్రమేణా ఈ నది పరివాహక ప్రాం తాలు అన్యాక్రాంతం కావడంతో ప్రస్తుత నది వెడల్పు సగానికి సగం తగ్గిపోరుుంది. ఈ ప్రాంతాల్లో వెలసిన ఇళ్లు, కర్మాగారాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు, చెత్తా చెదారం నదిలో కలవడంతో కూవం కాస్త మురికి కూపంగా మారింది. ఈ మురుగునీరు ప్రవహిస్తుండడంతో నగరంలో అనేక ప్రాంతాలు దుర్గంధభరితంగా మారాయి. కూవం మురికి కూపం కారణంగా బకింగ్హామః కాల్వ, ఓట్టేరి కాల్వలు సైతం మురికి నీటి కాల్వలుగా మారాయి. స్వచ్ఛతను కోల్పోయిన ఈ నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఒకప్పుడు రాష్ర్టంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆ పథకాన్ని తమ భుజాన వేసుకునే పనిలో డీఎంకే పడింది. తేమ్స్ నదీ తరహాలో ఈ కూవంను తీర్చిదిద్దుతామని కార్యచరణ సిద్ధం చేశారు. సింగపూర్, లండన్‌లకు వెళ్లి మరీ అక్కడి నదుల అభివృద్ధిని పరిశీలించి వచ్చారు. పనులు ఆరంభించారు. కోట్లాది రూపాయల నిధులను వెచ్చించారు. అయితే, రాష్ట్రంలో అధికారం మారడంతో ఆ పథకాన్ని అన్నాడీఎంకే తుంగలో తొక్కింది. మళ్లీ ప్రక్షాళనకు కార్యాచరణ: కూవం నదిని తాము సుందరంగా తీర్చిదిద్దుతామంటూ అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం జయలలిత మాట్లాడుతూ, కూవం పనుల్ని సరి కొత్త తరహాలో చేపట్టనున్నామని, గత ప్రభుత్వం సిద్ధం చేసిన వాటిని పక్కన పెడుతున్నామని ప్రకటించారు. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్ వే పనులకు బ్రేక్ వేయడానికి నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కూవం ప్రక్షాళన నినాదాన్ని అందుకుంది. కూవం నదిని అభివృద్ధి పరచబోతున్నామని, ఈ తీరంలో ఆ ఎక్స్‌ప్రెస్ వే వద్దన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించి చివరకు కోర్టులో భంగపడాల్సి వచ్చింది. ఎలాగైనా కూవం నది ప్రక్షాళన చేపట్టాలన్న లక్ష్యానికి ప్రభుత్వం రావడంతో డీఎంకే పథకాన్ని పక్కన పెట్టి, కొత్త పథకానికి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో అధికారులు పడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ పనులను కాస్త పక్కన పెట్టారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో అధికారులు పనుల్లో బిజీగా ఉన్నారు. కూవం నది ప్రక్షాళన ఫైల్‌ను దుమ్ము దులిపేశారు. ప్రక్షాళన చేపట్టాల్సిన పనులతో కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నారు. రూ.3,833 కోట్లతో పనులు: రెండేళ్లలో ఈ నది ప్రక్షాళన లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందు కోసం రూ.3,833 కోట్లతో అంచనా వ్యయం సిద్ధం చేశారు. కూవం నదీ తీరంలో అక్కడక్కడ ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం, మరికొన్ని చోట్ల సుందరంగా తీర్చిదిద్దడం, తీరం వెంబడి చెట్లను పెంచడం, కూవం నదీ తీరంలో పూడిక తీత, మురికి నీరు శుద్ధీకరణ తదితర పనులకు నిర్ణయించారు. అన్యాక్రాంతమైన స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. చెన్నై నగరంలోని తీరం వెంబడి ఉన్న గుడిసెలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ స్థలాల్ని లేదా ఇళ్లను కేటాయించే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఫలితాల లెక్కింపు అనంతరం తీర వాసులతో చర్చలు, అభిప్రాయాల సేకరణకు ప్రజా పనుల శాఖ నిర్ణయించి ఉన్నది. -
డ్వామా పీడీగా వెంకటేశ్వర్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్ అధికారిగా డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు వస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో చేపట్టిన బదిలీల్లో భాగంగా జిల్లాలో డ్వామా పీడీగా పనిచేస్తున్న హైమవతిని హైదరాబాద్‌లోని విపత్తుల నివారణ సంస్థ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఆమె స్థానంలో వెంకటేశ్వర్లు రానున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఆర్డీఓగా పనిచేస్తున్న ఆయన నాలుగు నెలలుగా సెలవులో ఉన్నారు. అయితే వెంకటేశ్వర్లుకు పీఆర్ శాఖ నుంచి పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. పదోన్నతి జాబితా లో ఉన్న హైమవతి కొద్ది రోజుల క్రితమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు తీవ్ర ప్రయత్నాలు చేశారు. జిల్లాలో రెండున్నరేళ్లుగా తిరుగులేని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ ఆడిట్(సామాజిక తనిఖీ) లో బయట పడ్డ అక్రమాల ఆధారంగా సుమా రు 200 మంది వరకు వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగలను విధుల నుంచి తప్పించారు. శాఖ పనితీరు గాడిలో పెట్టేందుకు అన్నివిధాలా కృషిచేశారు. పీడీ తీరు కొందరికి ఇబ్బందిగా మారడంతో ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల జరిగిన డీఆర్సీలో పీడీ తీరుపై పలువురు నేతలు మండిపడ్డారు. అయినా తనపని తాను చేసుకుపోయారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మేడారం జాతర తర్వాతనే హైమవతి విధుల నుంచి రిలీవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. -
వైయస్ జగన్‌కు ఇంకా ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం
-
దేశాన్ని పాలించే అర్హత యూపీఏకు లేదు: బాబు
యూపీఏ ప్రభుత్వంపై తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం నిప్పులు చెరిగారు. ఆ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన ఆరోపించారు. దేశాన్ని పాలించే అర్హత ఆ ప్రభుత్వానికి లేదని చంద్రబాబు స్ఫష్టం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. భారత్‌లో 1991 నాటి ముందు పరిస్థితులు పునరావృతం కావని భారత ప్రధాని మన్మోహాన్ సింగ్ పేర్కొనడం హస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలో ఇంత నీచమైన పాలన ఇంతవరకు చూడలేదని అన్నారు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో యూపీఏ సర్కార్‌కు పక్షవాతం వచ్చిందన్నారు. ఉల్లిధరలు ఎప్పుడు తగ్గుతాయో వ్యవసాయ శాఖ మంత్రే చెప్పలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్,పాక్ సరిహద్దుల్లో పొరుగుదేశం పాక్ సైనికులు కాల్పులు జరిపితే, ఆ అంశంపై రక్షణ మంత్రి ఇచ్చిన వివరణ పొంత లేకుండా ఉందని చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించిన పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది స్వార్థం వల్ల దేశంలో నేడు ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన దస్త్రాలు గల్లంతుపై ఆయన మండిపడ్డారు. ఆ కుంభకోణంలో దేశ సంపదను దిగమింగిన విషయం బహిర్గతమవుతోందని, ఆ దస్త్రాలను గల్లంతు చేశారని ఆయన ఆరోపించారు. మరో వైపు రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ లబ్ధి పొందాలని భావిస్తోందని బాబు పేర్కొన్నారు.