
న్యూఢిల్లీ: తాము ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నిస్తున్నామంటూ వస్తున్న విమర్శ లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కార్యనిర్వాహక వ్యవస్థ తన పని సక్రమంగా చేయడం లేదని, ఈ విషయాన్ని న్యాయ వ్యవస్థ ఎత్తిచూపితే తమపై విమర్శలకు దిగుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని వివిధ పట్టణాల్లోని పేదలకు నివాసయోగ్యత కల్పించే అంశానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
పట్టణ పేదలకు నివాసయోగ్యత కల్పించే అంశంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందినట్టు కనిపిస్తోందని న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ‘మాది కార్యనిర్వాహక వ్యవస్థ కాదు. మీరు మీ పనిని సక్రమంగా చేయడం లేదు. దీనిపై ఏమైనా అంటే మేము దేశాన్ని నడిపించ డానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తున్నామంటూ అందరూ మాపై విమర్శలు గుప్పిస్తున్నారు’’అని పేర్కొంది.
దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన–నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్‌యూఎల్‌ఎం) పథకం 2014లో ప్రారంభమైందని, అయితే యూపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసింది శూన్యమని చెప్పింది. ఇది మనుషులకు సంబంధించిన విషయమని అధికారులు గుర్తుంచుకోవాలని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) తుషార్‌మెహతాకు స్పష్టం చేసింది. దీనికి ఏఎస్‌జీ స్పందిస్తూ.. ఈ అంశంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, పట్టణ పేదలకు నివాస వసతి కల్పించే ప్రయత్నాలు చేస్తోంద న్నారు.
పట్టణ పేదలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రతి రాష్ట్రంలో ఇద్దరు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం సుప్రీంకు తెలిపింది. దీనికి స్పందించిన సుప్రీం రాష్ట్రాలతో సమన్వ యం చేసుకుని, కమిటీ సభ్యుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించేలా చేయాలని సూచించింది. కేంద్రంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి, పట్టణాభివృద్ధి శాఖలోని సీనియర్ అధికారి, పౌరసమాజం నుంచి ఒకరిని ఈ కమిటీలోకి ఎంపిక చేయాలంది.
పట్టణ నిరాశ్రయులకు ఆధార్ ఎలా?
పట్టణాల్లో నిరాశ్రయులైన పేదలకు ఆధార్ కార్డులను ఎలా జారీచేస్తున్నారని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పట్టణాల్లో నిరాశ్రయులకు ఆవాసం కల్పించడంపై జరిగిన విచారణ సందర్భంగా బుధవారం ఈ అంశాన్ని లేవనెత్తింది.
ఇల్లు లేని వ్యక్తి ఆధార్ కార్డులో ఏ చిరునామా చేరుస్తారని కోర్టు ప్రశ్నించగా, యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ...అలాంటి వారికి ఆధార్ జారీచేసే అవకాశాలు లేవని అన్నారు. మరి ఆధార్ కార్డులేని వారు భారత్‌లో, యూపీలో లేరా? ఉంటే వారికి షెల్టర్ హోంలలో నీడ కల్పించరా? అని కోర్టు తిరిగి ప్రశ్నించగా...వారికి ఓటరు ఐడీ లాంటి ఇతర గుర్తింపు కార్డులున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment