అగ్రరాజ్యం ఆగింది | America’s federal government shuts down | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యం ఆగింది

Published Sun, Jan 21 2018 1:46 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

America’s federal government shuts down - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. అమెరికా పాలనా యంత్రాంగాన్ని నడిపేందుకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్‌ తిరస్కరించటంతో షట్‌డౌన్‌ మొదలైంది. అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. సెనెట్‌లో డెమొక్రాట్లకు కొందరు రిపబ్లికన్‌ ప్రతినిధులు తోడవటంతో ఈ బిల్లు వీగిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి 12.01 నిమిషం (స్థానిక కాలమానం)తో షట్‌డౌన్‌ మొదలైంది. దీంతో పెంటగాన్, ఇతర కేంద్ర సంస్థలు పనిచేసేందుకు అవసరమైన నిధులు తాత్కాలికంగా ఆగిపోతాయి. గతంలో 2013 అక్టోబర్‌లో 16 రోజుల పాటు, 1996లో 21 రోజుల పాటు షట్‌డౌన్‌ కొనసాగింది. అయితే.. సెనెట్, వైట్‌హౌస్‌ ఒకే పార్టీ ఆధిపత్యంలో ఉన్న సమయంలో షట్‌డౌన్‌ కావటం మాత్రం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం.

50–48తో వీగిపోయిన బిల్లు
డెమొక్రాట్లు కావాలనే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని ట్రంప్‌ విమర్శించారు. పన్ను తగ్గింపు విజయాన్ని తగ్గించి చూపేందుకే డెమొక్రాట్లు కుట్ర పన్నారన్నారు. ఫిబ్రవరి 16 వరకు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు ఇచ్చే ఈ బిల్లు 50–48 తేడాతో వీగిపోయింది.   సోమవారం నుంచి తీవ్ర ఇబ్బందులు తప్పవు. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు వేతనాల్లేకుండానే సెలవులో ఉంటారు. వైద్యం, పోలీసు వంటి అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి. 2013 కన్నా తక్కువ ప్రభావం ఉండేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బడ్జెట్‌ నిర్వహణ కార్యాలయం తెలిపింది. ‘ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులేమీ చేయం. మిలటరీ సరిహద్దులను కాపలాకాస్తుంది. పార్కులు, పోస్టాఫీస్‌లు తెరిచే ఉంటాయి. ఎక్కడా ప్రజలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండబోదు’ అని బడ్జెట్‌ నిర్వహణ కార్యాలయం డైరెక్టర్‌ మిక్‌ ముల్వనే పేర్కొన్నారు.  

ట్రంప్‌ దావోస్‌ పర్యటనకు నో ప్రాబ్లమ్‌
వినియమ బిల్లును సెనెట్‌ తిరస్కరించిన నేపథ్యంలో ఫ్లోరిడాలోని మారాలాగోలో నిర్ణయించిన వారాంతపు పర్యటనను ట్రంప్‌ విరమించుకున్నారు. అయితే వచ్చేవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో మాత్రం ఆయన పాల్గొంటారని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. ‘పుంజుకుంటున్న అమెరికా ఆర్థికాభివృద్ధిని డెమొక్రాట్లు అడ్డుకోలేకపోతున్నారు. అందుకే షట్‌డౌన్‌ ద్వారా ప్రభుత్వం జోరుకు సంకెళ్లు వేద్దామనుకుంటున్నారు’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమంగా అమెరికాలో నివాసముంటున్న తల్లిదండ్రుల వెంట అమెరికా వచ్చిన పిల్లల (స్వాప్నికులు) విషయంలో పునరాలోచించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. సెనెట్‌లో డెమొక్రాట్ల పక్ష నేత చెక్‌ షుమర్‌ పేరుతో ఈ షట్‌డౌన్‌ను రిపబ్లికన్లు ‘షుమర్‌ షట్‌డౌన్‌’ అని పిలుస్తున్నారు.

షట్‌డౌన్‌ ప్రభావమెంత?
అత్యవసరసేవలు మినహా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే షట్‌డౌన్‌ ప్రారంభమైంది. దీని కారణంగా వివిధ శాఖల్లో పనిచేసే దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను అత్యవసరం కాని కార్మికులుగా పరిగణించి వారికి వేతనంలేని సెలవులు సోమవారం నుంచి మంజూరుచేయడంతో ఉత్పాదకత పడిపోతుంది. రక్షణశాఖలోని 7,40,000 మంది కార్మికులకు ఈ షట్‌డౌన్‌ వర్తిస్తుంది. సైనికసిబ్బంది వేతనాలకు కాంగ్రెస్‌ ఆమోదముద్ర అవసరం. అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగానికి కాంగ్రెస్‌ నుంచి నిధుల ప్రవాహం ఉండనందున ప్రభుత్వ మూసివేత ప్రభావం ఉండదు. సిబ్బందికి వీసాల మంజూరు కోరే కంపెనీలకు దీని వల్ల ఇబ్బందులు తప్పవు.

కాన్సులేట్లకూ ఇబ్బందే
షట్‌డౌన్‌ దీర్ఘ కాలం కొనసాగితే విదేశాల్లోని అమెరికా కాన్సులేట్ల నిర్వహణ కష్టమౌతుంది. షట్‌డౌన్‌ ముగిసేంత వరకు వివిధ వీసాలపై అమెరికా వెళ్లేవారు తమ ప్రయత్నాన్ని మానుకోక తప్పదు. లక్షా 15వేల మంది పనిచేసే న్యాయశాఖ అత్యవసర సర్వీసు కావడంతో ఇందులోని 20,000 మందికి సెలవిచ్చారు. స్టాక్‌మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చ్సేంజ్‌ కమిషన్‌ కొన్ని రోజులే పనిచేయగలదు. పన్ను వసూలు చేసే ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ నుంచి ప్రజలు, సంస్థలకు పన్ను రిఫండ్‌ నిలిచిపోతుంది.

పార్కులు, మ్యూజియంలూ బంద్‌
రోజూ పది లక్షల మంది సందర్శించే 417 జాతీయ పార్కులు, ప్రపంచ ప్రసిద్ధిపొందిన 19 స్మిత్‌సానియన్‌ మ్యూజియంల గేట్లకూ తాళాలు వేశారు. ఫలితంగా వీటినుంచి వచ్చే కోట్లాది డాలర్ల ఆదాయం కోల్పోయినట్లే. 2020 జనాభా లెక్కల సేకరణలో ఇప్పటికే నత్తనడక నడుస్తున్న అమెరికా సెన్సస్‌ బ్యూరో కార్యకలాపాలు ఇక ముందుకు సాగవు. బాలల ఆరోగ్య బీమా పథకం వర్తించే దాదాపు కోటి మంది పిల్లల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం కూడా గందరగోళంలో పడుతుంది. అదనపు నిధులు లేకుండా సుప్రీంకోర్టు సహా ఫెడరల్‌ కోర్టులు మూడు వారాల వరకూ పనిచేయగలవు. ఈ లోగా సమస్య పరిష్కారం కాకుంటే కోర్టుల కార్యకలాపాలూ ఆగిపోతాయి. ఆదాయ, సామాజిక భద్రతా నంబర్ల ధ్రువీకరణ వంటి ప్రభుత్వ సేవలు లభ్యంకాకపోతే సాధారణ రుణాలు, గృహరుణాల మంజూరు సాధ్యంకాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement