వాషింగ్టన్ : వలసదారులను అడ్డుకునేందుకు అమెరికా- మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మాణానికి నిధుల విషయమై ప్రతిపక్ష డెమోక్రాట్లతో విభేదాల కారణంగా ప్రారంభమైన అమెరికా షట్‌డౌన్ 27వ రోజుకు చేరుకుంది. అమెరికా చరిత్రలో అత్యధిక రోజుల పాటు కొనసాగుతున్న షట్‌డౌన్ ఇదే. ఈ క్రమంలో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. ముఖ్యంగా 6 వేల మంది సీక్రెట్ సర్వీసు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో పే చెక్కులు లేకుండా నిరంతరం శ్రమిస్తున్న తన సిబ్బంది పట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కృతఙ్ఞత చాటుకున్నారు. శుక్రవారం వారి కోసం పిజ్జాలు స్వయంగా డెలివరీ చేసి ట్రంప్ ప్రభుత్వానికి, ప్రతిపక్ష డెమోక్రాట్ల తీరును పరోక్షంగా విమర్శించారు.
మీ అందరికీ ధన్యవాదాలు
‘వేతనం లేకుండా దేశం కోసం పనిచేస్తున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది(నాయకులకు భద్రతా సిబ్బంది)కి, ఫెడరల్ ఉద్యోగులకు నేను, లారా బుష్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారికి మద్దతుగా నిలుస్తున్న పౌరులకు కూడా. రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు షట్‌డౌన్‌కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’ అంటూ సొంత పార్టీకి చెందిన రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమోక్రాట్ల తీరును సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. కాగా బుష్ పాలనా కాలంలో(2001- 2009) అమెరికాలో ఒక్కసారి షట్‌డౌన్ కాకపోవడం విశేషం. ఇక1995-96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజుల పాటు కొనసాగిన షట్‌డౌన్ రికార్డును ట్రంప్ ప్రభుత్వం అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment