
గ్రేటర్ ఓటర్లు 6,01,840
ఎన్నికల సెల్ రెడీ
మహా నగర పాలక సంస్థలో ఎన్నికల సెల్ ఏర్పాటు చేస్తూ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సెల్‌లో బల్దియా ఇన్‌చార్జ్ సీపీ ఎ.కోదండరెడ్డి, సూపరింటెండెంట్ సమ్మయ్య, సీనియర్ అసిస్టెంట్లు సుదర్శన్, అనిల్ బాబు, జూనియర్ అసిస్టెంట్ సమీద్, ఇద్దరు అటెండర్లను నియమించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వీరు ఎన్నికలకు సంబంధించివిధులు నిర్వర్తించనున్నారు.
వరంగల్ అర్బన్: హైకోర్టు ఆదేశంతో గ్రేటర్ అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మహా నగరపాలక సంస్థ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. 58 డివిజన్లవారీగా ఓటర్ల జాబితా సిద్ధమైంది. డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సోమవారం బల్దియూ అధికారులు ఓటర్ల జాబితా వెల్లడించారు. కమిషన ర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశానుసారం బల్దియూ కౌన్సిల్ హాల్‌లో మహా నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్ల సంఖ్యను సీపీ ఎ.కొండారెడ్డి, టీపీవో మహేందర్ వెల్లడించారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలను కలెక్టర్ కార్యాలయం, గ్రేటర్ ప్రధాన కార్యాలయం, కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయూలు, వరంగల్ ఆర్‌డీవో కార్యాలయం, వరంగల్ తహశీల్దార్, గీసుకొండ, సంగెం, హసన్‌పర్తి, హన్మకొండ, స్టేషన్ ఘన్‌పూర్ తహశీల్దార్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
తదుపరి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, మలి దఫా బీసీ ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఆమేరకు డివిజన్లవారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. గుర్తింపు పొందిన 14 పార్టీలకు జాబితా అందజేస్తామన్నారు.
పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ షూరూ
మహానగరంలో పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఓటర్లను డివిజన్లవారీగా ప్రకటించిన అధికారులు ఇక పోలింగ్ స్టేషన్ల ఖరారు, ముసాయిదా వెల్లడి, అభ్యంతరాల స్వీకరణ తర్వాత కలెక్టర్‌కు నివేదించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.
ప్రక్రియ ఇలా..
- ఈనెల 31న పోలింగ్ స్టేషన్ గుర్తింపు ప్రారంభం
- ఆగస్టు 4న పోలింగ్ స్టేషన్ ముసాయిదా విడుదల
- ఆగస్టు 11న పోలింగ్ స్టేషన్లపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో అధికారుల సమావేశం
- ఆగస్టు 13న మార్పులు, చేర్పులతో కలెక్టర్‌కు తుది పోలింగ్ స్టేషన్ల జాబితా.ఆగస్టు 18న పోలింగ్ స్టేషన్ల ఫైనల్ నోటిఫికేషన్
- ఎన్నికల సంఘానికి పోలింగ్ స్టేషన్ల జబితా అందచేత
ఇదీ లెక్క..
అధికారులు వెల్లడించిన ఓటర్ల జాబితా ప్రకారం మహా నగరంలో మొత్తం జనాభా 8,19,406 మంది ఉన్నారు. వీరిలో 4,10,771 మంది పురుషులు, 4,08,635 మంది మహిళలు. ఎస్సీలు 1,32,775 మంది ఉండగా, వీరిలో పురుషులు 65,762 మంది, మహిళలు 67,013 మంది ఉన్నారు. ఎస్టీలు 25,480 మంది ఉండగా, వీరిలో 13,271 మంది పురుషులు, 12,209 మంది మహిళలు ఉన్నారు. 58 డివిజన్ల మొత్తం ఓటర్లు 6,01,840 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 3,02,482 మంది ఉండగా, మహిళ ఓటర్లు 2,99,267 మంది, ఇతరులు 91 మంది ఉన్నారు.