జోర్డాన్ | Jordan Topography | Sakshi
Sakshi News home page

జోర్డాన్

Published Sat, Dec 6 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

జోర్డాన్

జోర్డాన్

నైసర్గిక స్వరూపం
 
ఖండం: ఆసియా, వైశాల్యం: 89,342 చదరపు కిలోమీటర్లు, జనాభా: 66,55,000 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: అమ్మాన్, ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్‌స్టిట్యూషనల్ రిపబ్లిక్, కరెన్సీ: దీనార్, భాషలు: అరబ్బీ, ఇంగ్లిష్, మతం: 98 శాతం ముస్లిములు, ఒక శాతం క్రైస్తవులు, ఒక శాతం అమెరికన్స్, వాతావరణం: జనవరి ప్రాంతంలో 4 నుండి 12 డిగ్రీలు, ఆగస్ట్ ప్రాంతంలో 18 నుండి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది, సరిహద్దులు: సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు, సౌదీ అరేబియా, ఇరాక్, స్వాతంత్య్ర దినోత్సవం: 1946, మే 25.
 
పరిపాలనా పద్ధతి- ప్రజలు
 
జోర్డాన్ దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 12 భాగాలుగా విభజించారు. ఈ భాగాలను గవర్నరేట్‌లు అని అంటారు. అవి ఇర్బిడ్,అజ్‌లేన్, జెరాంశ్, మఫ్రాక్, బల్కా, అమ్మాన్, జర్కా, మడాబా, కరక్, తఫిలా, మాన్, అఖాబా, స్థానిక జోర్డానియన్‌లు గ్రామాల్లో ఉంటారు. వారిని బెడోయిన్‌లు అంటారు. వీళ్లు దేశ తూర్పు భాగంలో అధికంగా ఉంటారు. వీరు దేశమంతటా తిరుగుతూ ఉంటారు. మగవాళ్లు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చు. సాధారణంగా మగవాళ్లే పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటికే పరిమితమై ఉంటారు. ఇప్పుడు యువతులు కాలేజీ చదువులకు వెళ్లడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలో మత దూషణలు ఉండవు. అన్ని మతాలూ కలసికట్టుగా ఉంటాయి. ముస్లిములు విధిగా రోజుకు అయిదుసార్లు మసీదుల్లో ప్రార్థన చేస్తారు. రంజాన్ మాసంలో పగలు అసలు హోటళ్లే తెరిచి ఉంచరు.
 
చరిత్ర
 
ఈ ప్రాంతాన్ని క్రీస్తుపూర్వం 1300 నుండి టర్కీ దేశపు ఓట్టోమాన్ రాజవంశం పరిపాలిస్తూ వచ్చింది. దేశంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం కావడం వల్ల అప్పటి రాజులు  ఆ ఎడారిలోని రాతి గుట్టలు, పర్వతాలను చెక్కి భవనాలను నిర్మించారు. ప్రస్తుత పెట్రా ప్రాంతంలో రాతిని తొలచి భవంతులు కట్టిన అప్పటి శిథిలాలు నేటికీ చెక్కుచెదరని రీతిలో కనిపిస్తాయి. భూగర్భంలో విశాలమైన భవన సముదాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రదేశాలు విదేశీ పర్యాటకులకు, గత చరిత్ర ఆధారంగా తీసే అంతర్జాతీయ సినిమా షూటింగ్‌లకు చక్కని ప్రదేశంగా మారిపోయింది. 1923లో జోర్డాన్ దేశం ఏర్పడి, 1946 దాకా ఆంగ్లేయుల సంరక్షణలో ఉండింది. 1946లో పూర్తి స్వాతంత్య్రం పొంది జోర్డాన్ రాజ్యంగా ఆవిర్భవించింది. దాదాపు 30 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ‘కింగ్ హుస్సేన్’ ఆధ్వర్యంలో ఈ దేశం ఆధునిక జోర్డాన్‌గా రూపొందింది.
 
పంటలు- పరిశ్రమలు
: జోర్డాన్‌లో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. ముఖ్యంగా టమోటా, గుమ్మడి, నిమ్మ, అరటిపళ్లు అధికంగా పండిస్తారు. దేశంలో పొటాష్, ఫాస్పేట్ గనులు ప్రముఖమైనవి. వీటిని తవ్వి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. దేశ ఆదాయంలో 26 శాతం ఆదాయం ఈ ఎగుమతుల ద్వారా లభిస్తుంది. మందుల తయారీ, సిమెంటు, వస్త్రపరిశ్రమ, ఎరువుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. మఫ్రాక్ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు.  అయితే నీరు, విద్యుచ్ఛక్తి కొరత తీవ్రంగా ఉండడం వల్ల సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కావడం లేదు.

 సంస్కృతి-వస్త్రధారణ: జోర్డాన్ ముస్లిం దేశం. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ మిగతా దేశాల్లో ఉన్న ముస్లిముల మాదిరిగానే ఉంటుంది. బిగుతుగా ఉండే దుస్తులు, స్లీవ్‌లెస్, కురచ దుస్తులు ధరించడం నిషేధం. మహిళలు చీరలు, పంజాబీ డ్రస్సులు తొడిగినా పై నుండి కింది వరకు లిబిస్ లేదా జిల్‌బాబ్ అనే పేరున్న పొడవాటి పై తొడుగు వేసుకుంటారు. వెంట్రుకలు, తల కనబడకుండా స్కార్ఫ్ ధరిస్తారు. మగవాళ్ళు షర్టు, ప్యాంటు ధరిస్తారు. నమాజు వేళల్లో తలకు టోపీ ధరించడం తప్పనిసరి. తలపాగా చుట్టుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. మగవాళ్ళు తలకు ధరించే వస్త్రాన్ని కఫియ్యే అంటారు.
 
 ఆహారం: జోర్డానియన్లు తినే భోజనాన్ని మెజ్జె అంటారు. ఆహారంలో బ్రెడ్డు, సలాడ్ తప్పనిసరిగా తీసుకుంటారు. అలాగే పేస్ట్రీలు ఎక్కువగా తింటారు. దేశీయ భోజనాన్ని మస్సాఫ్ అంటారు. ఇది గొర్రెమాంసం, యోగర్ట్‌తో కూడి ఉంటుంది. కోడిమాంసం బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు కలిపి తయారుచేసే పదార్థాన్ని సనియత్ దజాజ్ అంటారు. బియ్యం, కూరగాయలు, మాంసంతో కాసరోత్ తయారు చేస్తారు. దీనిని మక్లుబా అంటారు. మొక్కజొన్న పిండితో కరదీశ్ అనే బ్రెడ్ తయారుచేస్తారు. దేశంలో మద్యపానం నిషేధం కాబట్టి ఇక్కడి ప్రజలు సాధారణంగా పాలు, కాఫీ, నిమ్మరసం, ఆప్రికాట్ రసం వంటి పానీయాలు తీసుకుంటారు.
 
చూడాల్సిన  ప్రదేశాలు
 
 
1. అమ్మాన్: ఏడు వేల సంవత్సరాల చరిత్ర గల ఈ నగరం ఏడుకొండల మీద నిర్మితమైంది. ఇక్కడ పూర్వం రాజభవనాలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే బైజాంటియన్‌బ్రాసిలికా అనే నిర్మాణం ఉంది. దీనిని 6వ శతాబ్దంలో నిర్మించారని అంచనా. ఆ కాలంలో ప్రజలకు ఇది హెర్క్యులస్ దేవుని మందిరం. ఇప్పుడు దీనిని గ్రేట్ టెంపుల్ ఆఫ్ అమ్మాన్ అంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే జోర్డాన్ పురాతన మ్యూజియం ఉంది. ఇక్కడికి కొద్దిదూరంలో రోమన్ ఆంఫిథియేటర్ (ఆరుబయలు రంగస్థలం) ఉంది. దీనిని ఒకటవ శతాబ్దంలో నిర్మించారు. ఈ నగరంలోనే 1924లో నిర్మించినకింగ్‌హుస్సేన్ మసీదు ఉంది. అమ్మాన్ నగరానికి సమీపంలో సాల్ట్ అనే పురాతన నగరం ఉంది. ఇక్కడికి సమీపంలో బానిసల భవనాలు, శిథిలమైన రాజ గృహాలు ఉన్నాయి.
 
 2. జోర్డాన్ వ్యాలీ: జోర్డాన్‌లోయ దేశంలోనే ఎంతో ప్రముఖమైంది. ఇది దేశానికి పశ్చిమభాగంలో ఉంది. గ్రేట్ రిఫ్ట్‌వ్యాలీలో ఇదొక భాగం. ఈ ప్రదేశంలో ఒక భాగాన్ని ఘోర్ అని అంటారు. ఇక్కడే జోర్డాన్ నది ప్రవహిస్తోంది. ఈ నది సిచేరియస్ సరస్సులో కలుస్తుంది. సముద్ర మట్టానికి 212 మీటర్ల దిగువన ఉండే ఈ సరస్సు మృతసముద్రం (ఈ్ఛ్చఛీ ్ఛ్చ)లో కలుస్తుంది. పదివేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని 1967 తర్వాత ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇదే వెస్ట్‌బ్యాంక్‌గా రూపాంతరం చెందింది.
 జీసస్ క్రీస్తు ఈ జోర్డాన్ నదీతీరంలో బెతాని అనే ప్రాంతంలోనే బాప్టిజమ్ తీసుకున్నాడని బైబిల్ చెబుతోంది. ప్రత్యేక సంరక్షణలో ఉన్న ఈ ప్రదేశాన్ని పర్యాటకులు చూడవచ్చు.

ఇక్కడ ఉన్న మృతసముద్రం 75 కిలోమీటర్ల పొడవు, 6 నుండి 16 కిలోమీటర్లు వెడల్పు ఉంది. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉండడం వల్ల వస్తువులు మునగవు, మనుషులు మునిగిపోరు.
 
 3. మడాబా: మడాబా ఒక పురాతన నగరం. ఇది రాజధాని అమ్మాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం గురించి బైబిల్‌లో వర్ణన ఉంది. ఆ కాలంలో దీనిని మెడాబా అనేవారు.

 బైజాంటియన్ రాజుల కాలంలో గొప్ప నిర్మాణాలు చేశారు. ముస్లిం, క్రైస్తవ మత సంబంధమైన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. పాలరాతి పలకలు ఇప్పటికీ నగరంలో అక్కడక్కడా దర్శనమిస్తాయి. క్రీస్తుశకం 747లో వచ్చిన భూకంపం కారణంగా ప్రజలంతా ఇతర ప్రదేశాలకు వలస పోయారు. ఇక్కడి సెయింట్ జార్జ్ చర్చి నగరం మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మడాబా మ్యూజియం ఈ చర్చ్ సమీపంలో ఉంది. చర్చ్ ఆఫ్ అపోసిల్స్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో మౌంట్‌నెబో ఉంది. బైబిల్ గ్రంథంలో దీనిపేరు పిస్గాత. ఈ పర్వతానికి రెండు శిఖరాలు ఉన్నాయి. ఒకదానిని సియాగా అని, రెండోదానిని ముఖాయట్ అంటారు. ఇక్కడి భవనాల ముందుభాగంలో ఉన్న సర్పిలాకార శిలువ ప్రత్యేక అకర్షణగా నిలుస్తుంది.
 
4. పెట్రా: మొత్తం దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం పెట్రా. మృత సముద్రానికి దక్షిణ ప్రాంతంలో నిర్మితమైన ఈ రాతినగరం ఇప్పటికీ నిర్మాణపరంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకప్పుడు నెబాటియన్లకు-అరబ్బులకు ఇది రాజధాని నగరం. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ రాతినగరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం ఒక గొప్ప విషయం. రాతి కొండలను తొలిచి భవనాలుగా మలిచిన తీరు ప్రశంసనీయం. ఈ భవనాలు దాదాపు 200 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. ఇటీవలి కాలం వరకూ ఈ రాతి భవనాలను బెడోయిన్‌లు నివాస భవనాలుగా ఉపయోగించుకున్నారు. ఇవి రాజధానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్రా చుట్టుపక్కల ఓ బలిస్క్ టోంచ్, అల్‌ఖజ్‌నే, రోమన్‌ల ఆంఫిథియేటర్, రాయల్ టోంచ్‌లు, టెమెనస్ గేట్ వే పెట్రాచర్చ్, అల్ దీర్, సిక్ అల్ బారెద్ ఇలా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. 1812లో ఈ ప్రాంతాన్ని జోహన్ లుడ్‌విగ్ అనే చరిత్రకారుడు నవీన ప్రపంచానికి పరిచయం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement