
‘పింక్ లేడీస్ కప్’ తొలి మ్యాచ్‌లో జోర్డాన్‌పై గెలుపు
షార్జా: ‘పింక్ లేడీస్ కప్–2025’లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తమ తొలి పోరులో స్వీటీ దేవీ సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్ తేడాతో జోర్డాన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున ప్రియాంక దేవి (23వ నిమిషంలో), మనీషా (54వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కనబర్చింది.
తొలి అర్ధభాగంలో వచ్చిన అవకాశాన్ని ప్రియాంక దేవి సద్వినియోగ పర్చుకుంటూ... జోర్డాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి భారత్ ఖాతా తెరిచింది. కాసేపటికే స్కోరు పెంచే అవకాశం వచ్చినా... దాన్ని మనీషా సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. ద్వితీయార్థంలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా మనీషా గోల్ కొట్టి జట్టుకు విజయం ఖాయం చేసింది.
క్రిస్పిన్ ఛెత్రి భారత మహిళల కోచ్‌గా ఎంపికైన అనంతరం మన జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. జోర్డాన్ పదే పదే ప్రతి దాడులకు ప్రయత్నించినా... స్వీటీ దేవి, పుర్ణిమ కస్తూరితో కూడిన రక్షణ శ్రేణి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. తెలంగాణ అమ్మాయి గుగులోతు సౌమ్య ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత యంగ్‌ప్లేయర్ లిషమ్ బబీనా దేవి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. తదుపరి పోరులో ఆదివారం రష్యాతో భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment