పాలస్తీనియన్లకు ఆశ్రయం కోసం జోర్డాన్‌పై ట్రంప్‌ ఒత్తిడి | Donald Trump pushes Gaza plan in meeting with Jordan King Abdullah II | Sakshi
Sakshi News home page

పాలస్తీనియన్లకు ఆశ్రయం కోసం జోర్డాన్‌పై ట్రంప్‌ ఒత్తిడి

Feb 13 2025 6:10 AM | Updated on Feb 13 2025 6:10 AM

Donald Trump pushes Gaza plan in meeting with Jordan King Abdullah II

వ్యతిరేకించిన జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 

2,000 మంది చిన్నారులను వైద్యానికి తీసుకెళ్లడానికి అంగీకారం 

వాషింగ్టన్‌: గాజా స్ట్రిప్‌ స్వాదీనం ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరింత వేగవంతం చేశారు. గాజా స్ట్రిప్‌ నుంచి పంపేయడంతో శాశ్వతంగా నిర్వాసితులయ్యే పాలస్తీనియన్లకు మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని జోర్డాన్‌ రాజు అబ్దుల్లాపై ట్రంప్‌ ఒత్తిడి పెంచారు. మంగళవారం శ్వేతసౌధంలో అబ్దుల్లాతో ట్రంప్‌ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. నివాసితు లను తరలించడంతోపాటు యుద్ధంతో దెబ్బతిన్న గాజాను పశ్చిమాసియాలో అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న తన ఆలోచనను వదలుకోబోనని ట్రంప్‌ సంకేతం ఇచ్చారు. 

గాజాను కొనడం లేదని, ఏకంగా స్వా«దీనం చేసుకుంటున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ‘‘గాజా స్ట్రిప్‌ను తీసుకుంటాం. పశి్చమాసియాలో ప్రజలకు చాలా ఉద్యోగాలు కల్పించబోతున్నాం’’అని ట్రంప్‌ పేర్కొన్నారు. గాజా నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి జోర్డాన్, ఈజిప్ట్‌ లు అంగీకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘జోర్డాన్‌లో మాకు కొంత భూమి ఉంటుందని నేను నమ్ముతున్నాను. చర్చలు పూర్తయిన అనంతరం పాలస్తీనియన్లు సంతోషంగా, సురక్షితంగా జీవించడానికి చోటు లభిస్తుందని అనుకుంటున్నా’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికాపై జోర్డాన్, ఈజిప్ట్‌ ఆధారపడటమే ట్రంప్‌ అంత బలంగా చెప్పడానికి కారణం. అయితే... జోర్డాన్‌కు సహాయాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్‌ అన్నారు. మద్దతు ఇస్తున్నామన్న వంకతో ఈ దేశాలను బెదిరించాలని భావించట్లేమని చెప్పారు. ‘‘మేము జోర్డాన్‌కు, ఈజిప్టుకు సహాయాన్ని అందిస్తాం. ఆ సాకుతో బెదిరించాల్సిన అవసరం లేదు. మేం అలాంటి భావజాలానికి అతీతులం అనే అనుకుంటున్నాం’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అయితే పాలస్తీనియన్లను తమ భూభాగంలోకి తరలించే ప్రక్రియకు రాజు అబ్దుల్లా సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు.

 ట్రంప్‌ ప్రణాళికను సమరి్థంచకుండా, వ్యతిరేకించకుండా అసౌకర్యంగా కనిపించారు. తన దేశానికి ఏది మంచిదో అది చేస్తానని అబ్దుల్లా అన్నారు. గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2,000 మంది చిన్నారులను మాత్రం చికిత్సచేయించేందుకు జోర్డాన్‌కు తీసుకెళ్తామని రాజు చెప్పారు. రాజు నిర్ణయంపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. పాలస్తీనియన్లను నిర్వాసితులను చేసే ప్రయత్నాలను తాను వ్యతిరేకినని రాజు అబ్దుల్లా గతంలోనూ వ్యాఖ్యానించారు.

 ‘‘ఇది ఏకీకృత అరబ్‌ వైఖరి’’అని తన ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ చేశారు. ‘‘పాలస్తీనియన్లను ఇంకెక్కడికీ పంపేయకుండానే గాజా స్ట్రిప్‌ను పునర్‌ నిర్మించాలి. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి’’అని ఆయన అన్నారు. గాజా అంశంలో అమెరికా కొత్త అధ్యక్షుడు తన ప్రణాళికలను వెల్లడించాక అగ్రరాజ్య అధ్యక్షుడితో భేటీ అయిన తొలి అరబ్‌ నేత అబ్దుల్లా కావడం గమనార్హం. ఇరువురు నాయకులు ఇతరత్రా అంశాల్లో ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెలిగారు. అయితే గాజా గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు రాజు అబ్దుల్లాను ఇబ్బందికర స్థితిలోకి నెట్టాయి.  

డోలాయమానంలో కాల్పుల విరమణ 
ట్రంప్‌ గాజా ప్రతిపాదన ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపులో కొత్త సమస్యను తీసుకొచ్చింది. గాజాపై దాడులను నిలిపివేసే ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘిస్తోందని, తదుపరి నోటీసు వచ్చే వరకు బందీలను విడుదల చేయడం నిలిపివేస్తున్నట్లు హమాస్‌ సోమవారం తెలిపింది. బందీలందరినీ శనివారం మధ్యాహ్నంలోగా విడుదల చేయకపోతే మీ అంతు చూస్తానని ఇప్పటికే ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమాస్‌ ఏ విధంగా స్పందిస్తుంది, దానికి ఇజ్రాయెల్‌ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?. అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు ఏమిటనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి.  

సర్వత్రా వ్యతిరేకత 
గాజా స్వా«దీనం, పాలస్తీనియన్లను తిరిగి గాజాకు అనుమతించబోమంటూ ట్రంప్‌ చేసిన ప్రకటనపై అరబ్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజాను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందన కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి 9 తేదీలలో రాయిటర్స్‌/ఇప్సోస్‌ అమెరికాలో ఒక సర్వే నిర్వహించింది. గాజాను అమెరికా స్వా«దీనం చేసుకుని అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్లను తరలించే ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు చెప్పారు. అంటే.. 74 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం ఇదే. ఈ అంశంపై రిపబ్లికన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాజా స్వా«దీన ప్రకటనను 55 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. 43 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement