refugee
-
షేక్ హసీనాకు బ్రిటన్ షాక్ ఇవ్వనుందా?
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి బ్రిటన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అనుమతులను ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం షేక్ హసీనా బ్రిటన్‌కు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశ హోంశాఖ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇతర దేశాల చెందిన వ్యక్తులు బిట్రన్‌లో ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించవు. కానీ, అత్యవసరమైన సమయంలో ఆశ్రయం కావాలనుకునేవారికి గతంలో భారీగా కల్పించిన రికార్డు బ్రిటన్ సొంతం. అంతర్జాతీయ రక్షణ అవసరం కావాలనుకునేవారికి.. వారు చేరుకునే దేశం సురక్షితమైనదై ఉండాలి. అప్పుడే వారు సురక్షితమైన భద్రతను పొందగలరు’ అని పేర్కొంది. బ్రిటన్ హోంమంత్రి శాఖ ఈ ప్రకటన చేసినప్పటికీ షేక్ హాసీనా అధికారిక ఆశ్రయానికి సంబంధించిన అభ్యర్థనపై అనుమతి ప్రక్రియ కొనసాగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. షేక్ హసీనా అసలు భారత్‌ను వదిలి బ్రిటన్‌కు వెళ్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.మరోవైపు.. గత నెలలో బ్రిటన్‌లో లేబర్ అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఆశ్రయం కోరే వ్యక్తులకు బ్రిటన్ మొదటి సరక్షితమైన దేశమని ఎన్నికల సమయంలో ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది’అని విదేశాంగ శాఖ మంత్రి జైశంక పేర్కొన్నారు. -
గూడు చెదిరి..గుండెలవిసి.. అంతర్గాంలో కాందిశీకుల దీనావస్థ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రాణభయంతో ఓ దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లే వారిని కాందిశీకులు అంటారు. ఇలాంటి వారికి పరాయిగడ్డపై ఆశ్రయం దొరకడమే గగనం. దొరికినా వారికి పెద్దగా హక్కులు ఉండవు. కానీ బ్రిటిష్ పాలనలో పని కోసం మన దేశం నుంచి పొరుగున ఉన్న బర్మా (మయన్మార్), శ్రీలంకలకు వలసవెళ్లి అక్కడ సైనిక నియంతల హెచ్చరికలు, అంతర్యుద్ధాల కారణంగా తిరిగి భారతదేశానికి వచ్చిన కాందిశీకులది మరో కథ. వెళ్లిన కొన్నేళ్ల తర్వాత మాతృ దేశంలో బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టిన వారిని భారత్ తల్లిలా అక్కున చేర్చుకుంది. వారికి పునరావాసం కల్పించింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాంలో వెలసిన శరణార్థుల కాలనీలో తెలుగు వారికి కేంద్రం పునరావాసం కల్పించింది. ఇలాంటి వారందరికీ దేశవ్యాప్తంగా..ఇళ్లు, వ్యవసాయ స్థలాలు పంపిణీ చేసినా అంతర్గాంలో మాత్రం ఇంకా ప్రభుత్వ హామీలు నెరవేరలేదు. తమకు కనీసం ఇళ్లైనా మంజూరు చేయాలని వారు దీనంగా వేడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? 19వ శతాబ్దంలో దేశంలో విపరీతమైన కరువు వచ్చింది. ఈ కరువును ఎదుర్కొనే ప్రయత్నాలు చేయకుండా మన దేశంలోని పేదలను బర్మా, శ్రీలంక, మలేసియా తదితర దేశాల్లో తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా పంపారు. అలా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర నుంచి వేలాదిమంది బర్మాకు వలస వెళ్లారు. అక్కడ వ్యాపారాలు, పనులు చేసి రూ.కోట్లు గడించారు. అయితే 1962లో బర్మాలో సైనిక నియంత నె విన్ తిరుగుబాటుతో ప్రభుత్వం కుప్పకూలింది. పగ్గాలు చేపట్టిన నె విన్ విదేశీయులు కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాలంటూ హుకూం జారీ చేశాడు. సైనికులు భారతీయుల ఇళ్లను దోచుకున్నారు. కనీసం మెడలో తాళిబొట్టును కూడా అనుమతించలేదు. అయితే అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు భారత సంతతి ప్రజలను దేశానికి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు. ఈ తరలింపు లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ హయాం వరకు పలు దఫాలుగా సాగింది. వీరితో పాటే శ్రీలంకలో జాతుల మధ్య పోరు వల్ల ఇండియాకు వచ్చిన తమిళులకూ చోటు ఇచ్చారు. ఇలా 1971 నాటికి అంతర్గాంలో దాదాపు 1,000 బర్మా, శ్రీలంక కుటుంబాలు ఆశ్రయం పొందాయి. 1989లో దేశవ్యాప్తంగా ఇలాంటి వారికి నాలుగెకరాల భూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇదే క్రమంలో అంతర్గాం కాందిశీకులకు కేంద్రం 502 ఎకరాల భూమి కేటాయించింది. ప్రత్యేకంగా వీవింగ్ సొసైటీని ఏర్పాటు చేసి జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు తెరిచి ఉపాధి కల్పించింది. అప్పట్లో తెరిచిన మిల్లులు అధికారుల అవినీతి కారణంగా 1990వ దశకంలో మూతబడ్డాయి. కార్మికులకు కనీసం వేతన బకాయిలు, పీఎఫ్, ఈఎస్ఐ కూడా రాలేదు. ఉపాధి కోల్పోవడంతో ఆకలి మరణాలు సైతం సంభవించాయి. కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. ప్రస్తుతం ఇక్కడ 374 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. కానీ ఇప్పటికీ భూమి, ఇళ్ల స్థలాలకు సంబంధించిన హామీ మాత్రం నెరవేరలేదు. ఇండ్రస్టియల్ పార్కులో కొలువులివ్వండి.. తమ సంక్షేమానికి కేంద్రం ఏర్పాటు చేసిన మిల్లు లు మూతబడ్డాయని, కేటాయించిన 502 ఎకరాల్లో 250 ఎకరాలైనా తమ కుటుంబాలకు కేటాయించాలని అంతర్గాంలో ఉన్న కాందిశీకులు కోరుతున్నారు. వాస్తవానికి 2009 సెపె్టంబర్ 1న ఇళ్ల స్థలాల విషయమై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని వీరు కలిశారు. దీంతో వెంటనే అందరికీ పట్టాలు ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ మరునాడే వైఎస్ హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో, ఇప్పటివరకు వీరి గోడు పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దాదాపు 100 ఎకరాలు ఇండ్రస్టియల్ పార్కు కోసం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన భూములు కబ్జాలకు గురవుతున్నాయని, తొలుత తమకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి పదిగుంటల నివాస స్థలం ఇచ్చాకే, పరిశ్రమలు స్థాపించాలని శరణార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ స్థాపించబోయే పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనలో బర్మా, శ్రీలంక శరణార్థుల కుటుంబాలకే తొలి ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు అప్పట్లో పునరావాసం కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి మరమ్మతు చేసు కుందామంటే స్థానిక అధికారులు అంగీకరించడం లేదు. కనీసం ఉన్న గూడుకు మరమ్మతులు చేసుకునే అవకాశం కల్పిస్తే..శరణార్థుల కుటుంబాలు తలదాచుకునేందుకు అవకాశం ఉంటుందని శ్రీలంక, బర్మా శరణార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి జమ్ముల రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
పుస్తకంగా 12 ఏళ్ల బాలిక వలస గాథ
యుద్ధంతో శిథిలావస్థకు చేరిన ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే 70 లక్షలకు పైగా పౌరులు వలస బాట పట్టడం తెలిసిందే. అలా కుటుంబంతో పాటు ఖర్కీవ్ నుంచి డబ్లిన్ వలస వెళ్లిన యెవా స్కలెట్‌స్కా అనే 12 ఏళ్ల బాలిక తన భయానక అనుభవాలను గ్రంథస్థం చేయనుంది. వాటిని ‘యూ డోంట్ నో వాట్ వార్ ఈజ్: ద డైరీ ఆఫ్ అ యంగ్ గాళ్ ఫ్రం ఉక్రెయిన్’ పేరిట పుస్తకంగా ప్రచురించేందుకు హారీపోటర్ సిరీస్ ప్రచురణకర్త బ్లూమ్స్బరీ ముందుకొచ్చింది. అక్టోబర్ కల్లా పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. యెవా ఖర్కీవ్‌లో తన నానమ్మతో కలిసి ఉండేది. ఫిబ్రవరి 24న భారీ బాంబుల మోతతో మేల్కొన్నది మొదలు ఆమె జీవితం మారిపోయింది. బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు వారు షెల్టర్లలో తలదాచుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో వారిద్దరూ వలస బాట పట్టారు. అక్కడ ఇంగ్లండ్ జర్నలిస్టుల బృందాన్ని యెవా కలిసింది. తన అనుభవాలతో ఏ రోజుకా రోజు ఆమె రాసుకున్న డైరీ చూసి ఆ రాతల్లో లోతు, వయసుకు మించిన పరిపక్వతకు వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇదంతా ఇప్పుడు పుస్తక రూపంలో రానుంది. యెవా గాథ మమ్మల్ని ఎంతగానో కదిలించిందని పుస్తక ఇంగ్లండ్, కామన్వెల్త్ దేశాల ప్రచురణ హక్కులు కొనుగోలు చేసిన ఇలస్ట్రేటెడ్ పబ్లిషింగ్ ఎడిటర్ సలీ బీట్స్ అన్నారు. ‘యుద్ధ బీభత్సం ఆమె చిన్నారి కళ్లు ఎలా చూశాయో అలాగే పుస్తక రూపు సంతరించుకోనుంది. అందరూ చదివి తీరాల్సిన పుస్తకమిది’అని అభిప్రాయపడ్డారు. పుస్తక ప్రచురణ హక్కులు 12 భాషల్లో అమ్ముడయ్యాయట. -
ఆ శక్తి నీలోనే ఉంది!
కొన్ని జీవితాలు కల్పన కంటే ‘చిత్ర’ంగా ఉంటాయి. ఇరాన్ కార్టూనిస్ట్ అలీ దురాని జీవితం కూడా అంతే. 21 సంవత్సరాల వయసులో దేశం దాటిన అలీ అనుకోని పరిస్థితులలో ఆస్ట్రేలియాలోని ఒక దీవిలో చిక్కుకుపోయాడు. అది మామూలు దీవి కాదు. ఖైదీలను నిర్బంధించే దీవి. నరకానికి నకలుగా నిలిచే దీవి. ఏ స్వేచ్ఛ కోసం అయితే తాను దేశం దాటాడో ఆ స్వేచ్ఛ అణువంత కూడా లేని చీకటి దీవిలో నాలుగు సంవత్సరాల పాటు చిక్కుకుపోయాడు. తన మానసిక పరిస్థితి అదుపు తప్పుతున్న పరిస్థితులలో ‘నన్ను నేను మళ్లీ వెలిగించుకోవాలి’ అనుకున్నాడు. అలా జరగాలంటే ప్రతి వ్యక్తి తనలోని శక్తులను వెదుక్కోవాలి. అలీ దురానీలో ఉన్న శక్తి ఏమిటి? బొమ్మలు వేయడం. తన వైట్ టీషర్ట్‌పై ఆస్ట్రేలియా పటం వేసి అందులో రెండు కన్నీటిచుక్కలు చిత్రించాడు. ‘ఐయామ్ వోన్లీ ఏ రెఫ్యూజీ’ అని రాశాడు. అలా మొదలైంది బొమ్మల ప్రయాణం. కొందరు అధికారులు కరుకుగా వ్యవహరించినా, కొందరు అధికారులు మాత్రం అలీపై సానుభూతి చూపేవారు. ‘బాధ పడకు. నీకు అంతా మంచే జరుగుతుంది’ అని ధైర్యం ఇచ్చేవారు. నరకప్రాయమైన తన జీవితంలో ఇంటర్నెట్ అనే అరుదైన అదృష్టం దూసుకువచ్చింది. ప్రతి ఖైదీ వారానికి ఒకసారి నలభై అయిదు నిమిషాల పాటు ఇంటర్నెట్ను ఉపయోగించుకునేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం దయ తలిచింది. అక్కడ బలహీనమైన ఇంటర్నెట్...అయినప్పటికీ అది అతడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తాను గీసిన బొమ్మలను ఫేస్బుక్లాంటివాటిలో పోస్ట్ చేయడం మొదలుపెట్డాడు. సరిౖయెన సాంకేతిక సదుపాయాలు లేక ఈ పని కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో! స్వేచ్ఛ కోసం తపించే అలీ బొమ్మలు నార్వేకు చెందిన ఇంటర్నేషనల్ సిటీస్ ఆఫ్ రెఫ్యూజీ నెట్వర్క్(ఐకార్న్) దృష్టిలో పడ్డాయి. ఆ సంస్థ చొరవతో ఎట్టకేలకు స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చాడు. వ్యక్తిత్వవికాస తరగతుల్లో అలీ దురాని జీవితం పాఠం అయింది. ప్రసంగం అయింది. ‘నువ్వు అత్యంత బలహీనంగా మారిన పరిస్థితులలో కూడా, నిన్ను బలవంతుడిని చేసే బలం ఎక్కడో కాదు నీలోనే ఉంటుంది. అది నిన్ను చిగురించేలా చేస్తుంది. శక్తిమంతుడిలా మారుస్తుంది’ అనే సందేశాన్ని అలీ జీవితం ఇస్తుంది. -
Afghan Girl: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే! పాపం మరోసారి..
Nat Geo Green-Eyed Girl, "Most Famous Afghanistan Refugee": పాలనా సంక్షోభం ఏర్పడితే దేశ పౌరుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఇటువంటి నిస్సహాయ పరిస్థితులను 30 ఏళ్ల క్రితం ఎదుర్కొని శరణార్థిగా మారింది అఫ్గానిస్తాన్‌కు చెందిన షర్బత్ గుల్. గత నలభై ఏళ్లలో తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న అఫ్గానిస్తాన్ మరోసారి తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో..49 ఏళ్ల వయసులో షర్బత్ మరోసారి శరణార్థిగా మారింది. అది అఫ్గానిస్తాన్‌ను జాహీర్ షా అనే రాజు పరిపాలించే రోజులు. నలభై ఏళ్లపాటు ఒకే రాజు పరిపాలించడంతో.. విసిగిపోయిన ప్రజలు, అధికారులు.. జాహీర్ షా కుటుంబానికి చెందిన మొహమ్మద్ దావుద్ ఖాన్‌కు పట్టంగట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సరికొత్త సంస్కరణలు దావూద్ అమలు చేసేవాడు. అవి నచ్చని ప్రతిపక్షం రకరకాల కుట్రలతో ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ పార్టీ పాలనలో కొన్ని నిర్ణయాలు సొంత సభ్యులకే నచ్చకపోవడంతో.. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి అధికారం కోసం కుమ్ములాటలు, కుతంత్రాలతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో తలెత్తిన రాజకీయ అనిశ్చతిలో ఎంతో మంది అఫ్గాన్లు, సోవియట్ సైనికులు మరణించగా, లక్షలాదిమంది దేశం విడిచి వేరే దేశాలకు వలస వెళ్లిపోయారు. అలా వెళ్లినవారిలో షర్బత్ కూడా ఒకరు. 80వ దశకంలో పాపులర్ ఫోటో.. దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు షర్బత్ కుటుంబం పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. అప్పుడు షర్బత్ వయసు పన్నెండేళ్లు. అఫ్గాన్––పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఓ శరణార్థి శిబిరంలో షర్బత్‌ను స్టీవ్ మెకెర్రీ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ 1984లో చూశాడు. ఆకుపచ్చని రంగులో మెరుస్తున్న ఆమె కళ్లు మెకెర్రీని ఆకర్షించడంతో వెంటనే ఆమె ఫోటో తీశాడు. అప్పటి భీకర యుద్ధవాతావరణ పరిస్థితులన్నీ షర్బత్ పచ్చని కళ్లలో ప్రతిబింబించాయి. దీంతో ఆ ఫోటోను నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజీన్ కవర్ పేజీపైన 1985లో ప్రచురించారు. ‘‘అఫ్ఘన్ గర్ల్’’గా షర్బత్ ప్రపంచమంతా పాపులర్ అయ్యింది. 1980 – 1990 దశకంలో బాగా పాపులర్ అయిన ఫోటోలలో అఫ్గాన్ గర్ల్ ఒకటిగా నిలిచింది. తనకు పాపులారిటి వచ్చిందని షర్బత్‌కు ఏమాత్రం తెలీదు.పెళ్లి తరువాతే తను ఎంత పాపులర్ అయ్యిందో తెలుసుకుని ఆ ఫోటోను తీసుకుంది. 2002 వరకు షర్బత్ ఎక్కడ ఉందన్న విషయం ఎవరికీ తెలీదు. మెకెర్రీ మళ్లీ షర్బత్ ఆచూకీ తెలుసుకుని..ఎఫ్‌బీఐ అనలిస్టు, ఫోరెన్సిక్ విభాగానికి ఇవ్వడంతో.. వారు షర్బత్‌గా నిర్ధారించారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటోన్న సమయంలోనే 16 ఏళ్ల వయసులో రహ్మత్ గుల్‌ను పెళ్లిచేసుకుంది. షర్బత్ దంపతులకు నలుగురు పిల్లలు. పాకిస్థాన్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తోన్న షర్బత్‌కు ముఫ్పై ఏళ్ల తరువాత అక్కడ కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అది 2016 షర్బత్‌కు నలభై ఏళ్లు. “తమ దేశంలో నకిలీ గుర్తింపు పత్రాలతో అక్రమంగా నివసిస్తోందన్న ఆరోపణతో షర్బత్‌కు పాక్ ప్రభుత్వం.. పదిహేను రోజుల జైలుశిక్ష, లక్షాపదివేల రూపాయల రుసుమును కట్టించి స్వదేశానికి పంపించేసింది. ఆ సమయంలో అఫ్ఘన్ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీ... షర్బత్ పరిస్థితి తెలుసుకుని, కాబూల్‌లో ఓ అపార్ట్మెంట్లో ఉండేందుకు వసతి కల్పించారు. అప్పటి నుంచి అక్కడే కుటుంబంతో నివసిస్తోంది షర్బత్. హెపటైటీస్ సీతో 2012లో షర్బత్ భర్త మరణించడం, ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ అధికారం చేపట్టడంతో ఆమె కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాలిబన్ల పాలనలో జీవించలేక, ముందుముందు జీవితం మరింత దారుణంగా మారుతుందని భావించి ఆశ్రయం ఇవ్వాలని ఇటలీ ప్రభుతాన్ని కోరింది. షర్బత్ పరిస్థితి అర్థం చేసుకున్న ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి షర్బత్‌కు ఆశ్రయం కల్పించారు. అప్పుడూ ఇప్పుడూ ఆఫ్ఘన్ అమ్మాయిలకు భద్రత లేదని, తాజాగా షర్బత్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చదవండి: Mother Shipton Cave Facts: భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
ఉగ్రదాడి.. ఏడుగురు రోహింగ్యా వలసదారుల మృతి
బంగ్లాదేశ్: బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దులోని రోహింగ్యా శరణార్థి శిబిరంలోని శిక్షణ సంస్థపై ముష్కరులు జరిపిన దాడుల్లో సుమారు ఏడుగురి చనిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ముష్కరులు కొంతమందిని చంపేసి మరికొంత మంది పై కత్తులతో దాడి చేసినట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. మూడు వారాల క్రితం రోహింగ్యా కమ్యూనిటీ నాయకుడిని అతని పై కాల్పుల జరిగిన సంగతి తెలిసిందే. (చదవండి: తింగరోడు.. లైవ్ టెలికాస్టింగ్‌లో ఫోన్ చోరీ! కట్ చేస్తే..) అయితే ఈ నేపథ్యంలోనే మయన్మార్ నుండి వచ్చిన దాదాపు 9 లక్షల మందికి పైగా ఉన్న శరణార్థుల శిభిరాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి జరిగినపుడు నలుగురు వెంటనే చనిపోగా మిగతా ముగ్గురు బాలుఖాలి క్యాంప్‌లోని ఆసుపత్రిలో మరణించారని అన్నారు. ఈ మేరకు దాడి జరిగిన వెంటనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సాయుధ బలగాల బెటాలియన్ ప్రాంతీయ చీఫ్ శిహాబ్ కైసర్ ఖాన్ తెలిపారు. (చదవండి: మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’) -
శరణార్థులుగా మరో 5 లక్షల మంది అఫ్గాన్లు
జెనీవా: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న అనంతర పరిణామాలతో మరో 5 లక్షల మంది ప్రజలు స్వదేశాన్ని వీడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థుల విభాగం యూఎన్‌హెచ్‌సీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఆ దేశంలో అనిశ్చితి కొనసాగుతోందని, రానున్న రోజుల్లో పరిస్థితులు మరింతగా దిగజారి 5.15 లక్షల మంది వరకు ప్రజలు శరణార్థులుగా మారే ప్రమాదముందని పేర్కొంది. వీరికి ఆహారంతోపాటు తగు వసతులు కల్పించేందుకు సుమారు 30 కోట్ల డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఇప్పటికే ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల్లో 22 లక్షల మంది అఫ్గాన్లు శరణార్థులుగా నమోదై ఉన్నారని తెలిపింది. ‘ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలి, దేశంలో హింస పెచ్చరిల్లిపోవడంతో ఆ ప్రభావం సామాన్య పౌరులపై తీవ్రంగా పడుతోంది. వారంతా ఉన్న చోటును వదిలి వేరే సురక్షిత ప్రాంతాలను వెదుక్కుంటూ మరోచోటుకు తరలివెళ్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా కేవలం ఈ ఏడాదిలోనే 5.58 లక్షల మంది ఇలా తరలివెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు, చిన్నారులే. పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చి.. అంతర్గతంగా, విదేశాలకు తరలివెళ్లే వారి సంఖ్య ముందుముందు మరింత పెరిగే ప్రమాదముంది. అఫ్గాన్ ప్రజలకు రానున్నవి చీకటి రోజులు’ అని యూఎన్ హెచ్‌సీఆర్ ఆసియా పసిఫిక్ రెఫ్యూజీ నెట్వర్క్ సీఈవో నజీబా వజెదాఫోస్ట్ శుక్రవారం వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో తెలిపారు. -
తాలిబన్ల అరాచకాలు: ‘10 ఏళ్లు పురుషుడి వేషంలో’
సాక్షి, వెబ్‌డెస్క్: అఫ్గనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశం అయ్యింది. వారి అరాచక పాలనను తలుచుకుని జనాలు భయంతో బెంబేలెత్తుతున్నారు. వారి రాక్షస పాలనలో మేం బతకలేం అంటూ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అఫ్గన్ మహిళల మనోవేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాలిబన్ల దృష్టిలో స్త్రీ అంటే కేవలం శృంగారానికి పనికివచ్చే ఓ వస్తువు. వారికంటూ ఎలాంటి ఆలోచనలు, ఆశయాలు ఉండకూడదు. కఠినమైన షరియా చట్టాలు అమలు చేస్తారు. ‘మా గురించి ఎవరు ఆలోచించడం లేదంటూ’ ఓ అఫ్గన్ యువతి కంటతడిపెట్టుకున్న వీడియో ప్రపంచాన్ని కదిలించింది. అఫ్గన్‌లో తాలిబన్ల రాజ్యం ప్రారంభం కావడంతో ఓ రచయితకు సంబంధించిన స్టోరీ మరోసారి తెర మీదకు వచ్చింది. ఆ రాక్షసమూక అకృత్యాలకు భయపడి.. విదేశాల్లో శరణార్థిగా బతుకుతున్న ఆ రచయిత్రి తాను అనుభవించిన నరకాన్ని వివరించారు. ఆ వివరాలు.. రచయిత నదియా గులామ్ ప్రస్తుతం స్పెయిన్‌లోని కాటలోనియాలోఅఫ్గన్ శరణార్థిగా ఉంటున్నారు. ఇక రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవడం కోసం పురుషుడిగా మారువేషం వేసుకుని కాలం వెళ్లదీశారు. ఇక ఆమె జీవితం కూడా అనేక అఫ్గన్ మహిళల మాదిరే దారుణమైన అంతర్యుద్ధం, ఆకలి, తాలిబన్ పాలన పర్యవసానాలకు గుర్తుగా మిగిలిపోయింది. 1985లో జన్మించిన నదియా తాలిబన్ల నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకా.. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం దాదాపు 10 ఏళ్ల పాటు పురుషుడిగా మారువేషం వేసుకుని తిరిగింది. ఈ క్రమంలో ఓసారి జరిగిన పేలుళ్లలో నదియా తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఓ ఎన్జీఓ నదియాను చేరదీసి.. చికిత్స చేసింది. ఈరోజు ఆమె జీవించి ఉండటానికి కారణం ఆ ఎన్జీవో అంటుంది నదియా. ఆ ఎన్జీవో సాయంతో నదియా అఫ్గన్ విడిచి వెళ్లింది. కానీ ఆమె కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆమె అఫ్గన్ శరణార్థిగా కాటలోనియాలో స్థిరపడిన తర్వాత నదియా తన కథను ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఈ క్రమంలో ఆమె "ది సీక్రెట్ ఆఫ్ మై టర్బన్" నవలని రాసింది. జర్నలిస్ట్ ఆగ్నెస్ రోట్జర్ సహకారంతో ఆమె ఈ నవలను పూర్తి చేసింది. ఇక నజియా రాసిన నవలకు 2010 ప్రతిష్టాత్మక ప్రుడెన్సీ బెర్ట్రానా ను గెలుచుకోవడమే కాక జాతీయ విమర్శకుల ప్రశంసలను పొందింది. తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను విడిచిపెట్టలేదని నదియా చాలా కాలం నుంచి హెచ్చిరిస్తూనే ఉన్నారు. అంతేకాక అమెరికా శాంతి అనే "అబద్ధం" చిత్రాన్ని విక్రయించింది అన్నారు నదియా. అంతేకక అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర అంతర్జాతీయ శక్తుల వైఖరి అఫ్గనిస్తాన్‌కు "ద్రోహం కంటే ఎక్కువ కీడు" చేశాయని నదియా ఆరోపించారు. ఈ దేశాలు అఫ్గన్ ప్రజలను ఆయుధాలుగా మార్చారు.. అవినీతితో గుర్తించబడిన ప్రభుత్వాలను ప్రోత్సహించారు.. ఇప్పుడు దేశాన్ని వదిలి వెళ్లారు అని మండిపడ్డారు. ప్రస్తుతం అఫ్గన్‌లో పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు. అఫ్గనిస్తాన్‌లోని బడోలా ప్రాంతంలో 35 మంది బాలికలు పాఠశాలకు వెళ్లి చదవడానికి సహాయపడే బ్రిడ్జిస్ ఫర్ పీస్ అసోసియేషన్‌కు నదియా నాయకత్వం వహిస్తున్నారు. -
శరణార్థుల జట్టు.. ఇది ప్రపంచ జట్టు
ప్రపంచంలోని అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. ఇక శరణార్థులకు క్రీడల్లోనూ అవే కష్టాలు. ఆటపై మమకారం చంపుకోలేక.. తమ సొంత దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేక ఎంతో వేదన చెందుతున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఓ గొప్ప ఆలోచన చేసింది. వారికి ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్లతో పోటీపడే అవకాశం ఇవ్వడం కోసం టోక్యో 2020 ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టును బరిలోకి దించుతోంది. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ పోటీలో మొట్టమొదటిసారిగా ‘‘శరణార్థుల జట్టు’’ పోటీ పడింది. ఈ జట్టులో ఇథియోపియా, దక్షిణ సూడాన్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ► గత ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు విజయవంతంగా పాల్గొనడంతో ఐఓసీ.. ఈసారి 29 మందితో కూడిన బలమైన జట్టుకు టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం కల్పించింది. ► 13 దేశాలకు చెందిన 55 మంది ప్రతిభావంతులైన అథ్లెట్ల నుంచి వీరిని ఎంపిక చేశారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, తైక్వాండో, కరాటె, జూడో, సైక్లింగ్, స్విమ్మింగ్.. తదితర క్రీడల్లో ఈ శరణార్థ అథ్లెట్లు పోటీపడతారు. ఇందులో రియోలో పోటీపడ్డవాళ్లు ఆరుగురు ఉన్నారు. ► ఆరంభోత్సవ కార్యక్రమంలో శరణార్థుల జట్టు.. గ్రీస్ తర్వాత రెండో జట్టుగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. ఒలింపిక్ పతాకం కింద పోటీపడే వీళ్లు ఒకవేళ పతకం గెలిస్తే.. పతక ప్రదాన కార్యక్రమం సందర్భంగా ఒలింపిక్ గీతాన్ని వినిపిస్తారు. ► ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే మిగతా 206 ఎన్ఓసిల మాదిరిగానే, ఈ బృందం ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండి అక్కడ స్వయంగా స్వాగత వేడుకను పొందుతుంది. టోక్యో 2020 ఒలింపిక్ క్రీడల తర్వాత కూడా శరణార్థుల అథ్లెట్లకు ఐఓసి మద్దతు ఇస్తుంది. ► ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, క్రొయేషియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, జోర్డాన్, కెన్యా, లక్సెంబర్గ్, పోర్చుగల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ట్రినిడాడ్, టొబాగో, టర్కీ, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ దేశాల నుంచి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కానోయింగ్, సైక్లింగ్, జూడో, కరాటే, టైక్వాండో, షూటింగ్, ఈత, వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ వంటి 12 క్రీడల్లో ‘‘శరణార్థుల జట్టు’’ క్రీడాకారులు పోటీపడనున్నారు. ‘‘శరణార్థుల ఒలింపిక్ జట్టు టోక్యో 2020 ఒలింపిక్స్‌లో పాల్గొనడమంటే.. శాంతిని ఉత్సవంలా జరుపుకోవడమే. ఇది శరణార్థుల సమస్యలపై ప్రపంచం దృష్టి మళ్లేలా చేస్తుంది. ఫలితంగా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరమవుతాయి’’ అని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో వ్యాఖ్యానించారు. -
‘మాల్యా అప్పగింతకు నో టైమ్‌లైన్’
లండన్ : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం నిర్దిష్ట గడువును నిర్ణయించడం సాధ్యం కాదని బ్రిటిష్ హై కమిషనర్ సర్ ఫిలిప్ బార్టన్ గురువారం చెప్పారు. విజయ్ మాల్యాను భారత దేశానికి ఎప్పుడు అప్పగిస్తారు? అని అడిగిన ప్రశ్నపై బార్టన్ స్పందిస్తూ, ఇటువంటి అంశాలపై తమ ప్రభుత్వం ఎటువంటి వ్యాఖ్యలు చేయబోదని చెప్పారు. అయితే బ్రిటన్ కోర్టులు స్వతంత్రంగా పని చేస్తాయన్నారు. నేరస్థులు వేరొక దేశానికి వెళ్ళడం ద్వారా చట్టం నుంచి తప్పించుకుపోవడాన్ని నిరోధించడంలో పోషించవలసిన పాత్ర గురించి బ్రిటన్ ప్రభుత్వం, న్యాయస్థానాలకు తెలుసునని చెప్పారు. ఆన్లైన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఫిలిప్ బార్టన్.. నేరస్థులు సరిహద్దులు దాటి వెళ్లినంతమాత్రాన తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. అయితే మాల్యాను ఫిబ్రవరిలోనే భారత్‌కు అప్పగించాల్సి ఉండగా, కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. దీంతో ఇటీవలె ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దానికి ఆమోదముద్ర వేయవద్దని భారత్ ఇటీవలె బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. తాజాగా శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. (ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్ ) -
మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్ మాల్యాను దేశానికి రప్పించే దిశలో కేంద్రం కీలక చర్య తీసుకుంది. ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా అభ్యర్థిస్తే, దానికి ఆమోదముద్ర వేయవద్దని బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. నిజానికి తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. అయితే ఆయనను తక్షణం భారత్‌కు పంపడం జరిగే పనికాదనీ, ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు వీడాల్సి ఉందని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు తాజా విజ్ఞప్తి చేసినట్లు గురువారంనాటి ఆన్లైన్ మీడియా బ్రీఫింగ్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. -
స్త్రీలోక సంచారం
గృహహింసను తట్టుకోలేక కువైట్‌లోని తన ఇంటి నుంచి పారిపోయి శనివారం నాడు థాయ్‌లాండ్‌కు శరణార్థిగా వచ్చిన 18 ఏళ్ల యువతి రహఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్ పాస్‌పోర్ట్‌ను థాయ్ రాజధాని బ్యాంకాక్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఇప్పుడా యువతి.. కువైట్–సౌదీ అరేబియా–థాయ్.. ఈ మూడు దేశాలతో పాటు, ఐక్యరాజ్యసమితి తక్షణం పరిష్కరించవలసిన ఒక సమస్యగా పరిణమించారు! రిటన్ టికెట్ లేకపోవడం వల్ల ఆమెను అనుమానించవలసి వచ్చిందని థాయ్ అధికారులు, ఆమె భద్రతను పర్యవేక్షించడానికి తప్ప ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమకు లేదని సౌదీ రాయబార అధికారులు, ఇప్పటికిప్పుడే ఆ యువతి మాటల్ని విశ్వసించి ఏ నిర్ణయమూ తీసుకోలేమని ఐరాస అధికారులు విడివిడి ప్రకటనలు విడుదల చేయగా, కువైట్‌లోని ఆమె కుటుంబం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారమూ లేదు. పద్దెనిమిదేళ్ల ఆ యువతి ప్రస్తుతం టూరిస్టుగా బ్యాంకాక్‌లోని ఒక హోటల్ గదిలో ఉన్నారు. సౌదీ అధికారులు తనను థాయ్‌లాండ్‌లో నిర్బంధించారని శనివారం రాత్రి ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికన్ మహిళల ఓటు హక్కు సాధన ఉద్యమ చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు ఇది. మహిళలకు ఓటు హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘సైలెంట్ సెంటినల్స్’ (నిశ్శబ్ద సైనికులు) అనే పేరుతో కొంతమంది మహిళలు 1917 జనవరి 10న వైట్ హౌస్ ఎదుట ప్రదర్శన జరిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఉడ్రోవిల్సన్ పాలన మొదలైన రోజును వారు తమ ప్రదర్శనకు ఎంపిక చేసుకోవడం విశేషం అయింది. ఆ క్రితం రోజే సైలెంట్ సెంటిన ల్స్ ఉడ్రోవిల్సన్ను ఆయన కార్యాలయంలో కలిసి ఓటు హక్కు కల్పించాలని కోరినప్పుడు.. ‘ప్రజామోదం పొందాక తప్పనిసరిగా కల్పించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చేవరకు తమ ఉద్యమం ఆగదని వారు ఆయనకు స్పష్టం చేసిన అనంతరం రెండో రోజు నుంచే వారానికి ఆరు రోజులు చొప్పున 1919 జూన్ 4 వరకు దేశమంతటా ప్రదర్శనలు జరిపారు. ఈ రెండున్నరేళ్ల ప్రదర్శనల కాలంలో అమెరికన్ ప్రభుత్వం సైలెంట్ సెంటినల్స్ పట్ల సున్నితంగా వ్యవహరించింది. ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం కలిగించిన కొన్ని సందర్భాలతో మాత్రం అరెస్టులు చేసినప్పటికీ వెంటనే విడుదల చేసింది. చివరికి 19వ రాజ్యాంగ సవరణతో (1920 ఆగస్టు 18) మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ‘సైలెంట్ సెంటినల్స్’ ను నడిపించిన మహిళ ఆలిస్ పాల్. ఆమె మహిళా హక్కుల కార్యకర్త. అమెరికన్ మహిళల ఓటు హక్కు సాధనలో ఆలిస్ పాల్ స్థానం, ప్రస్థానం చరిత్రాత్మకమైనవి. -
ఇది చాలా జుగుప్సాకరం: షేన్ వార్న్
హైదరాబాద్: ఇంగ్లండ్‌లోని ఓ పాఠశాలలో సిరియా శరణార్థిపై మరో విద్యార్థి దాడికి సంబంధించిన ఘటనపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విద్యార్థుల గొడవకు సంబంధించిన వీడియోపై తాజాగా వార్న్ ట్వీట్ చేశారు. పశ్చిమ యార్క్‌షైర్‌లోని హడ్డర్ ఫీల్డ్‌లోని ఓ కమ్యూనిటీ స్కూల్లో సిరియా విద్యార్థి జమాల్‌పై స్థానిక విద్యార్థి దాడికి దిగాడు. జమాల్ అనే విద్యార్థిపై మరో విద్యార్థి చేయి చేసుకోవడంతో పాటు అతడి నోట్లో నీళ్లు పోస్తూ ఆనందాన్ని పొందాడు. ఈ సంఘటనను పక్కనే ఉన్న మరో విద్యార్థి వీడియో తీయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘ పిల్లలకు ఇళ్లు తర్వాత అత్యంత భద్రతనిచ్చేది పాఠశాలలే. కానీ ఓ సిరియా శరణార్థిపై దాడి జుగుప్పాకరమైనది. దీనిపై వెంటనే ఏదో ఒక చర్య తీసుకోండి’అంటూ వార్న్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై విచారణ చేపట్టామని పశ్చిమ యార్క్‌షైర్ పోలీసులు తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్కూలు నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నన్ను క్షమించండి ప్లీజ్ : ప్రియాంకచోప్రా
జనాలకు విపరీతమైన కోపం తెప్పిస్తూ టీషర్ట్ ధరించిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తన తప్పు తెలుసుకుంది. ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై తాను ధరించిన టీషర్ట్‌పై తనను మన్నించాల్సిందిగా ఆ అమ్మడు వేడుకుంది. ఇతర దేశాలకు తరలివెళ్లే శరణార్థులను, వలసవాదులను కించపరుస్తూ పిచ్చిరాతలతో ఉన్న తెల్లటి కలర్ టీషర్ట్‌ను వేసుకుని ఉన్న ప్రియాంక ఓ ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. ఆ టీషర్ట్‌పై రెఫ్యూజీ(శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్ లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి... ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది. ఆ కవర్ పేజ్ పిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటి (క్వాంటికో టీవీ సీరియల్)కి శరణార్థుల బాధలు ఏమి తెలుస్తాయని ప్రశ్నించారు. దీంతో చేసిన తప్పుకు ప్రియాంక క్షమాపణ చెప్పింది. తమ మనోభావాలను కించపరిచినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్టు పేర్కొంది.. కొండే నాస్ట్ ట్రావెలర్ వాళ్లే స్పెషల్‌గా ఈ టీషర్ట్‌ను తెప్పించారని, వారే తనను వేసుకోమన్నారని ప్రియాంక చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న జెనోఫోబియాను గుర్తించడానికి ఈ టీషర్ట్ ధరించాల్సిందిగా కోరారని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే మ్యాగజీన్ ఈ చర్యకు పాల్పడినట్టు తెలిపింది. కానీ తాము శరణార్థులను, వలసవాదులను కించపరచడానికి చేసింది కాదని పేర్కొంది. తనను క్షమించాల్సిందిగా వేడుకుంది. -
స్ఫూర్తిదాయకం మర్దినీ ప్రస్థానం
శరణార్థిగా ఒలింపిక్స్ బరిలోకి బతకాలంటే పోరాడాలి... ఏ క్షణంలో మీద బాంబు పడుతుందో తెలియదు... పారిపోదామంటే సముద్రాన్నే ఈదాలి... ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది చిన్నప్పటి నుంచీ కల... క్రీడల సంగతి తర్వాత ముందు బతికి బట్టకడితే చాలనే పరిస్థితి... ఐదేళ్ల క్రితం సిరియాలో 13 ఏళ్ల చిన్నారి యుస్రా మర్దినీ పరిస్థితి ఇది. ఇప్పుడు... రియో ఒలింపిక్స్‌లో ఈత కొలనులో యుస్రా మర్దినీ దూసుకుపోతోంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే స్ఫూర్తిని ప్రపంచానికి అందిస్తూ తన కలను సాకారం చేసుకుంది. 18 ఏళ్ల ఈ స్విమ్మర్ ఐఓసీ పతాకం కింద శరణార్థుల జట్టులో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. సాక్షి క్రీడావిభాగం : ఏడాది క్రితం ప్రాణాలు కాపాడుకునేందుకు మూడున్నర గంటలపాటు సముద్రంలో రాకాసి అలలకు ఎదురీది.. ఇప్పుడు ఒలింపిక్స్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది సిరియా శరణార్థి యుస్రా మర్దినీ. వందమీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్ హీట్స్‌లో సత్తాచాటింది. సెమీఫైనల్స్‌లో టాప్-16కు అర్హత సాధించలేకపోయినా మంచి ప్రతిభతో శభాష్ అనిపించుకుంది. బుధవారం జరిగే వందమీటర్ల ఫ్రీస్టయిల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కేవలం ఆర్నెళ్లలోనే కఠోరమైన ప్రాక్టీస్‌తో అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిరియాలోని డమాస్కస్ సమీపంలో ఓ మధ్యతరగతి కుటుంబలో పుట్టింది యుస్రా. తండ్రి స్విమ్మింగ్ కోచ్ కావటంతో.. చెల్లితోపాటు చిన్నప్పటినుంచీ శిక్షణ పొందింది. జాతీయ స్థాయిలో పలు ఈవెంట్లలో సిరియా టాప్ స్విమ్మర్లను ఓడించి... సిరియా ఒలింపిక్స్ సంఘాన్ని మెప్పించింది. స్విమ్మింగ్‌ను జీవితంగా మార్చుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసారి ఒలింపిక్స్‌లో సిరియా నుంచి బరిలో దిగే అవకాశం వచ్చేది. కానీ బలీయమైన విధి ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. 2011లో సిరియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సిరియా ప్రభుత్వం, ఐసిస్ బలగాల మధ్య జరిగిన ఆధిపత్యపోరులో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది బతుకుజీవుడా అంటూ.. దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. రెండు సార్లు మర్దినీ కుటుంబం ఉంటున్న ఇంటిపై అర్ధరాత్రి బాంబులు పడ్డాయి. తృటిలో ప్రాణాలు దక్కించుకున్న వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదంతా జరుగుతున్నప్పుడు యుస్రా వయసు కేవలం 13 ఏళ్లు. అయినా ఏదోలా జీవితాన్ని మూడేళ్ల పాటు వెళ్లదీశారు. గత ఏడాది యూస్రా తల్లి... తన ఇద్దరు కూతుళ్లను తెలిసిన వారికి అప్పజెప్పి దేశం దాటించాలని కోరింది. ఏడుస్తూనే తల్లిని వదిలి చెల్లితో పాటు యూస్రా పడవెక్కింది. టర్కీ తీరప్రాంత గస్తీ దళాలు వీరిని గుర్తించి వెనక్కు పంపాయి. వెనక్కు వెళితే యుద్ధంలో చనిపోతారు. ముందుకు వెళితే సముద్రంలో చనిపోతారు. ఇలాంటి స్థితితో స్మగ్లర్లను ఆశ్రయించి వారి ద్వారా సముద్రం దాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్పటికే స్మగ్లర్లు శరణార్థుల కోసం నడుపుతున్న పడవలు బోల్తాపడి వేల మంది చనిపోయారు. టర్కీ, గ్రీసు మధ్యలోనున్న ఏజియన్ సముద్రాన్ని దాటేందుకు యుస్రా సిస్టర్స్తోపాటు మరో 20 మందికి కలిపి ఓ చిన్న బోటును ఇచ్చారు స్మగ్లర్లు. దీంట్లో బయలుదేరిన కాసేపటికే.. తీవ్రమైన గాలులు, రాకాసి అలలతో పడవ ఎగిరిపడుతోంది. పడవలో సామర్థ్యానికి మించి బరువుండటంతో పడవలోకి నీళ్లొస్తున్నాయి. అందరూ బతకాలంటే కనీసం ముగ్గురైనా ఖాళీ అవ్వాలి. అదృష్టం కొద్దీ ఈ పడవలో యుస్రా సిస్టర్స్తోపాటు మరో యువకుడికీ ఈత వచ్చు. కానీ.. పూల్‌లో ఈదటం వేరు.. సముద్రంలో అలల ధాటిని ఎదుర్కొనటం వేరు. అయినా ఈ ముగ్గురు ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే సముద్రంలోకి దూకి.. పడవ బోల్తా పడకుండా జాగ్రత్తపడ్డారు. ఉప్పునీళ్లు కళ్లలో చేరి మంటపుడుతున్నా.. దాదాపు మూడున్నర గంటలసేపు ఈది.. గ్రీకు ద్వీపమైన లెస్బోస్ చేరుకున్నారు. వీరితోపాటు పడవలో ఉన్న పదిహేడు మందిని కాపాడారు. అక్కడినుంచి హంగేరీ మీదుగా ఎన్నో కష్టనష్టాలకోర్చి యుస్రా జర్మనీ శరణార్థి శిబిరంలో చేరింది. ‘ఆ రోజు పడవలో ఓ ఆరేళ్ల చిన్నారి కళ్లలో భయం చూసి ఆమెను బతికించాలనే కసితోనే సముద్రంలో దూకాను’ అని యుస్రా తెలిపింది. ఒలింపిక్స్‌కు ఎలా? బెర్లిన్‌లో శరణార్థి శిబిరంలో యుస్రాకు పరిచయమైన ఓ స్థానికుడు.. ఆమెకు స్విమ్మింగ్పైన ఉన్న ఆసక్తిని స్థానిక కోచ్‌కు తెలిపాడు. ఆమెను పరీక్షించిన ఆ కోచ్.. తొలిసారి పూల్‌లో ప్రతిభ చూడగానే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2012 తర్వాత ఇంట్లోనుంచి బయటకెళ్లకుండా స్విమ్మింగ్‌కు దూరంగా ఉన్నా.. డైవింగ్, స్విమ్మింగ్ స్టైల్ అద్భుతంగా ఉండటం చూసి.. మరింత శిక్షణ ఇచ్చాడు. 1936లో ఒలింపిక్స్ నిర్వహణ కోసం నాజీలు నిర్మించిన పూల్‌లో యుస్రా మరింత రాటుదేలింది. అక్కడ చూపిన ప్రతిభే ఆమెను ఐఓసీ శరణార్థుల జట్టులో సభ్యురాలిని చేసింది. దీంతో ఆమె కల సాకారమైంది. -
అయ్యో.. బాలుడ్ని రోడ్డుకేసి కొట్టాడు
టర్కీ: సినిమాల్లో మాత్రమే కనిపించే ఒళ్లు గగుర్పొడిచేలాంటి సంఘటనలు కళ్లెదురుగా జరిగితే.. అది కూడా ఓ చిన్నారి జీవితంలో ఎదురైతే ఎలా ఉంటుంది. టర్కీలో నిజంగానే ఓ బాలుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఆ బాలుడు సిరియా నుంచి ఓ శరణార్ధి. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు.. ఏం తినాలో కూడా తెలియదు. కొత్తప్రదేశం, ఒంట్లో బెరుకు.. ఆ కంగారులో ఏం చేశాడో ఏమోగానీ.. ఓ వ్యాపారి అమాంతం పైకి లేపి రోడ్డుకేసి బలంగా విసిరి కొట్టాడు. ఈ ఘటన టర్కీలోని ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ లో ఇది రికార్డయింది. అందులో చూపించిన ప్రకారం ఓ బాలుడు భయంతో పరుగు తీశాడు. అతడి వెనుక ముసా డి అనే వీధి వ్యాపారస్తుడు వేగంగా వచ్చి ఆ బాలుడిని పట్టుకొని అమాంతం పైకి లేపి సీసీ రోడ్డుకు వేసి కొట్టాడు. ఈ ఘటన చూసి మార్కెట్ వాళ్లంతా కుర్రాడిని కొట్టిన వ్యక్తితో తగువుకు దిగారు. ఓ వ్యక్తి కోపాన్ని ఆపుకోలేక ఆ వ్యాపారస్తుడిపై చేయి చేసుకున్నాడు. -
బాత్రూం సైజు ఇళ్లలో వేలమంది నివాసం!
తీవ్రవాద చర్యలకు భయపడి పారిపోతున్న శరణార్థులు... సహాయ శిబిరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న బాత్రూం పరిమాణంలో ఉన్న ఇళ్లలో వేలమంది నివసిస్తున్నారు. తాజాగా బయటపడ్డ కొన్ని ఫొటోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయినవారంతా మఫ్ రాక్ నగరానికి దగ్గరలోని అల్ జతారి క్యాంప్‌లో తలదాచుకుంటున్నారు. జోర్డాన్‌లోని ఆ శిబిరాలే ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. తీవ్రవాదానికి దూరంగా.. మెరుగైన జీవితం గడపడం కోసం సిరియా, ఇరాక్ దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు సుమారు ఆరు లక్షల మంది జోర్డాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. లక్షల మంది ఈ అగ్గిపెట్టెల్లాంటి శిబిరాల్లో తల దాచుకొని కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి అందుబాటులో కాఫీ, పిజ్జా, బార్బర్ షాప్‌లు కూడా వెలిశాయి. ఇప్పుడీ ప్రాంతం.. వారి సొంత నగరంగానే మారిపోయినా, సమస్యలు మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజుకు శరణార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ నివపిస్తున్నట్లు గుర్తింపు పొందిన మొత్తం 6 లక్షల మంది శరణార్థులకే కాక, లెక్కల్లో లేని సుమారు మరో 10 లక్షల మంది సిరియన్లకు కూడా సహాయం అందించాలని కోరుతున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మాత్రం తమ విద్యావ్యవస్థ, ఆరోగ్య విషయాల్లో శరణార్థులకు హాని ఏమీ లేదని అంటున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని నిర్మించడంలో తాము సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ప్రతిరోజూ 15.5 టన్నుల బ్రెడ్‌ను శిబిరానికి పంపిణీ చేస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో శరణార్థ శిబిరాల్లో రద్దీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావాలని భావించినా.. సిరియాలో సంక్షోభం వల్ల అది సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా శరణార్థుల సమస్య తీరి.. యూరోపియన్ దేశాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలని అంతా కోరుకుంటున్నారు. -
స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే!
ప్రముఖ బ్రిటన్ గ్రాఫిటీ చిత్రకారుడు బాన్క్సీ వేసిన ఓ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల సమస్యను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. ఉత్తర ఫ్రాన్స్ కలైస్ పట్టణంలోని శరణార్ధుల శిబిరం వద్ద యాపిల్ సంస్థ స్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ చిత్రాన్ని బాన్క్సీ గోడపై వేశాడు. ఈ చిత్రంలో స్టీవ్ జాబ్స్ పాతకాలపు యాపిల్ కంప్యూటర్ను చేతిలో పట్టుకొని భుజాన నల్లని బ్యాగు వేసుకొని ఉన్నాడు. ఇటీవల అనేక దేశాలు.. శరణార్థుల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామనే భావిస్తున్నాయి. దీనిని తప్పుపడుతూ బాన్క్సీ ఈ చిత్రాన్ని వేశాడు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం స్టీవ్ జాబ్స్ కూడా సిరియా నుంచి ఒక శరణార్థి లాగే అమెరికాలోకి ప్రవేశించాడని, జాబ్స్ ద్వారా ఆ దేశానికి ఆర్ధికంగా మేలే జరిగింది అనే విషయాన్ని బాన్క్సీ వెల్లడించాడు. 'ది జంగిల్' అనే శరణార్థుల శిబిరం వద్ద ఈ చిత్రాన్ని గమనించిన అధికారులు.. దీనిని అమూల్యమైన సంపదగా భావించి సంరక్షిస్తామని తెలిపారు. అలాగే ధ్వంసమైన పడవలో అవస్థలు పడుతున్న శరణార్థులు.. ఓ ఖరీదైన నౌక సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాన్ని సైతం బాన్క్సీ అద్భుతంగా ఆవిష్కరించి శరణార్థుల సమస్యలను కళ్లకు కట్టాడు. -
'అది చెప్పలేను.. గుండె చివుక్కుమంది'
టర్కీ: 'విధుల్లో భాగంగా మధ్యదరా సముద్ర తీరానికి వెళ్లిన నాకు అలలు ఎగిసిపడుతుండగా ఇసుకలో ఓ మూడేళ్ల బాలుడు కదలకుండా పడిఉండి కనిపించాడు. సముద్రంవైపే ముఖం పెట్టి ఉండగా అతడిని అప్పుడప్పుడు అలలు తాకి వెళుతున్నాయి. ఆ బాలుడిలో మాత్రం చలనం లేదు. నేను ఆ బాలుడిని సమీపిస్తున్నాను. మనసులో గట్టిగా ప్రార్థించాను. భగవంతుడా ఆ బాలుడు ప్రాణాలతో ఉండాలని.. కానీ అలా జరగలేదు. అతడు ప్రాణాలతో లేడని అర్థమై గుండె చివుక్కుమంది' 'లోపలే ఏడ్చేశాను. మనసులో ఎంత ఇబ్బందిపడ్డానో నాకే తెలియదు. నా సొంత కొడుకే అన్నంత భావన కలిగింది' అని ఇటీవల సిరియా నుంచి ప్రాణభయంతో మధ్యదరా సముద్రం గుండా వచ్చి ప్రాణాలు కోల్పోయిన మూడేళ్ల బాలుడు అయలాన్ కుర్దీ గురించి అతడిని చేతుల్లోకి మొట్టమొదటిసారి తీసుకున్న మెమెట్ క్లిపాక్ అనే పోలీసు చెప్పాడు. తనకు ఆరేళ్ల బాలుడు ఉన్నాడని, అయలాన్ మొదటి చూసినప్పుడు నా స్థానంలో తన తండ్రి ఉంటే ఎంతటి భావోద్వేగానికి లోనవుతాడో అంతగా తాను అయ్యానని ఆ క్షణం మాటల్లో వర్ణించలేనని తెలిపాడు.