సాక్షి, వెబ్‌డెస్క్: అఫ్గనిస్తాన్ మరోసారి తాలిబన్ల వశం అయ్యింది. వారి అరాచక పాలనను తలుచుకుని జనాలు భయంతో బెంబేలెత్తుతున్నారు. వారి రాక్షస పాలనలో మేం బతకలేం అంటూ విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అఫ్గన్ మహిళల మనోవేదన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాలిబన్ల దృష్టిలో స్త్రీ అంటే కేవలం శృంగారానికి పనికివచ్చే ఓ వస్తువు.
వారికంటూ ఎలాంటి ఆలోచనలు, ఆశయాలు ఉండకూడదు. కఠినమైన షరియా చట్టాలు అమలు చేస్తారు. ‘మా గురించి ఎవరు ఆలోచించడం లేదంటూ’ ఓ అఫ్గన్ యువతి కంటతడిపెట్టుకున్న వీడియో ప్రపంచాన్ని కదిలించింది. అఫ్గన్‌లో తాలిబన్ల రాజ్యం ప్రారంభం కావడంతో ఓ రచయితకు సంబంధించిన స్టోరీ మరోసారి తెర మీదకు వచ్చింది. ఆ రాక్షసమూక అకృత్యాలకు భయపడి.. విదేశాల్లో శరణార్థిగా బతుకుతున్న ఆ రచయిత్రి తాను అనుభవించిన నరకాన్ని వివరించారు. ఆ వివరాలు..
రచయిత నదియా గులామ్ ప్రస్తుతం స్పెయిన్‌లోని కాటలోనియాలోఅఫ్గన్ శరణార్థిగా ఉంటున్నారు. ఇక రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవడం కోసం పురుషుడిగా మారువేషం వేసుకుని కాలం వెళ్లదీశారు. ఇక ఆమె జీవితం కూడా అనేక అఫ్గన్ మహిళల మాదిరే దారుణమైన అంతర్యుద్ధం, ఆకలి, తాలిబన్ పాలన పర్యవసానాలకు గుర్తుగా మిగిలిపోయింది.
1985లో జన్మించిన నదియా తాలిబన్ల నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకా.. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం దాదాపు 10 ఏళ్ల పాటు పురుషుడిగా మారువేషం వేసుకుని తిరిగింది. ఈ క్రమంలో ఓసారి జరిగిన పేలుళ్లలో నదియా తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో ఓ ఎన్‌జీఓ నదియాను చేరదీసి.. చికిత్స చేసింది. ఈరోజు ఆమె జీవించి ఉండటానికి కారణం ఆ ఎన్‌జీవో అంటుంది నదియా. ఆ ఎన్‌జీవో సాయంతో నదియా అఫ్గన్ విడిచి వెళ్లింది. కానీ ఆమె కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది.
ఆమె అఫ్గన్ శరణార్థిగా కాటలోనియాలో స్థిరపడిన తర్వాత నదియా తన కథను ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఈ క్రమంలో ఆమె "ది సీక్రెట్ ఆఫ్ మై టర్బన్" నవలని రాసింది. జర్నలిస్ట్ ఆగ్నెస్ రోట్జర్ సహకారంతో ఆమె ఈ నవలను పూర్తి చేసింది. ఇక నజియా రాసిన నవలకు 2010 ప్రతిష్టాత్మక ప్రుడెన్సీ బెర్ట్రానా ను గెలుచుకోవడమే కాక జాతీయ విమర్శకుల ప్రశంసలను పొందింది.
తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను విడిచిపెట్టలేదని నదియా చాలా కాలం నుంచి హెచ్చిరిస్తూనే ఉన్నారు. అంతేకాక అమెరికా శాంతి అనే "అబద్ధం" చిత్రాన్ని విక్రయించింది అన్నారు నదియా. అంతేకక అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర అంతర్జాతీయ శక్తుల వైఖరి అఫ్గనిస్తాన్‌కు "ద్రోహం కంటే ఎక్కువ కీడు" చేశాయని నదియా ఆరోపించారు. ఈ దేశాలు అఫ్గన్ ప్రజలను ఆయుధాలుగా మార్చారు.. అవినీతితో గుర్తించబడిన ప్రభుత్వాలను ప్రోత్సహించారు.. ఇప్పుడు దేశాన్ని వదిలి వెళ్లారు అని మండిపడ్డారు. ప్రస్తుతం అఫ్గన్‌లో పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు. అఫ్గనిస్తాన్‌లోని బడోలా ప్రాంతంలో 35 మంది బాలికలు పాఠశాలకు వెళ్లి చదవడానికి సహాయపడే బ్రిడ్జిస్ ఫర్ పీస్ అసోసియేషన్‌కు నదియా నాయకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment