నన్ను క్షమించండి ప్లీజ్ : ప్రియాంకచోప్రా
నన్ను క్షమించండి ప్లీజ్ : ప్రియాంకచోప్రా
Published Tue, Oct 18 2016 9:17 AM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM
జనాలకు విపరీతమైన కోపం తెప్పిస్తూ టీషర్ట్ ధరించిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తన తప్పు తెలుసుకుంది. ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై తాను ధరించిన టీషర్ట్పై తనను మన్నించాల్సిందిగా ఆ అమ్మడు వేడుకుంది. ఇతర దేశాలకు తరలివెళ్లే శరణార్థులను, వలసవాదులను కించపరుస్తూ పిచ్చిరాతలతో ఉన్న తెల్లటి కలర్ టీషర్ట్ను వేసుకుని ఉన్న ప్రియాంక ఓ ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. ఆ టీషర్ట్పై రెఫ్యూజీ(శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్ లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి... ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది. ఆ కవర్ పేజ్ పిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటి (క్వాంటికో టీవీ సీరియల్)కి శరణార్థుల బాధలు ఏమి తెలుస్తాయని ప్రశ్నించారు.
దీంతో చేసిన తప్పుకు ప్రియాంక క్షమాపణ చెప్పింది. తమ మనోభావాలను కించపరిచినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నట్టు పేర్కొంది.. కొండే నాస్ట్ ట్రావెలర్ వాళ్లే స్పెషల్గా ఈ టీషర్ట్ను తెప్పించారని, వారే తనను వేసుకోమన్నారని ప్రియాంక చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న జెనోఫోబియాను గుర్తించడానికి ఈ టీషర్ట్ ధరించాల్సిందిగా కోరారని ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే మ్యాగజీన్ ఈ చర్యకు పాల్పడినట్టు తెలిపింది. కానీ తాము శరణార్థులను, వలసవాదులను కించపరచడానికి చేసింది కాదని పేర్కొంది. తనను క్షమించాల్సిందిగా వేడుకుంది.
Advertisement
Advertisement