గృహహింసను తట్టుకోలేక కువైట్‌లోని తన ఇంటి నుంచి పారిపోయి శనివారం నాడు థాయ్‌లాండ్‌కు శరణార్థిగా వచ్చిన 18 ఏళ్ల యువతి రహఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్ పాస్‌పోర్ట్‌ను థాయ్ రాజధాని బ్యాంకాక్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఇప్పుడా యువతి.. కువైట్–సౌదీ అరేబియా–థాయ్.. ఈ మూడు దేశాలతో పాటు, ఐక్యరాజ్యసమితి తక్షణం పరిష్కరించవలసిన ఒక సమస్యగా పరిణమించారు! రిటన్ టికెట్ లేకపోవడం వల్ల ఆమెను అనుమానించవలసి వచ్చిందని థాయ్ అధికారులు, ఆమె భద్రతను పర్యవేక్షించడానికి తప్ప ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమకు లేదని సౌదీ రాయబార అధికారులు, ఇప్పటికిప్పుడే ఆ యువతి మాటల్ని విశ్వసించి ఏ నిర్ణయమూ తీసుకోలేమని ఐరాస అధికారులు విడివిడి ప్రకటనలు విడుదల చేయగా, కువైట్‌లోని ఆమె కుటుంబం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాచారమూ లేదు. పద్దెనిమిదేళ్ల ఆ యువతి ప్రస్తుతం టూరిస్టుగా బ్యాంకాక్‌లోని ఒక హోటల్ గదిలో ఉన్నారు. సౌదీ అధికారులు తనను థాయ్‌లాండ్‌లో నిర్బంధించారని శనివారం రాత్రి ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికన్ మహిళల ఓటు హక్కు సాధన ఉద్యమ చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు ఇది. మహిళలకు ఓటు హక్కును కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘సైలెంట్ సెంటినల్స్’ (నిశ్శబ్ద సైనికులు) అనే పేరుతో కొంతమంది మహిళలు 1917 జనవరి 10న వైట్ హౌస్ ఎదుట ప్రదర్శన జరిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఉడ్రోవిల్సన్ పాలన మొదలైన రోజును వారు తమ ప్రదర్శనకు ఎంపిక చేసుకోవడం విశేషం అయింది. ఆ క్రితం రోజే సైలెంట్ సెంటిన ల్స్ ఉడ్రోవిల్సన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి ఓటు హక్కు కల్పించాలని కోరినప్పుడు.. ‘ప్రజామోదం పొందాక తప్పనిసరిగా కల్పించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
హామీని నెరవేర్చేవరకు తమ ఉద్యమం ఆగదని వారు ఆయనకు స్పష్టం చేసిన అనంతరం రెండో రోజు నుంచే వారానికి ఆరు రోజులు చొప్పున 1919 జూన్ 4 వరకు దేశమంతటా ప్రదర్శనలు జరిపారు. ఈ రెండున్నరేళ్ల ప్రదర్శనల కాలంలో అమెరికన్ ప్రభుత్వం సైలెంట్ సెంటినల్స్ పట్ల సున్నితంగా వ్యవహరించింది. ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం కలిగించిన కొన్ని సందర్భాలతో మాత్రం అరెస్టులు చేసినప్పటికీ వెంటనే విడుదల చేసింది. చివరికి 19వ రాజ్యాంగ సవరణతో (1920 ఆగస్టు 18) మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ‘సైలెంట్ సెంటినల్స్’ ను నడిపించిన మహిళ ఆలిస్ పాల్. ఆమె మహిళా హక్కుల కార్యకర్త. అమెరికన్ మహిళల ఓటు హక్కు సాధనలో ఆలిస్ పాల్ స్థానం, ప్రస్థానం చరిత్రాత్మకమైనవి.
Comments
Please login to add a commentAdd a comment