హైదరాబాద్: ఇంగ్లండ్‌లోని ఓ పాఠశాలలో సిరియా శరణార్థిపై మరో విద్యార్థి దాడికి సంబంధించిన ఘటనపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విద్యార్థుల గొడవకు సంబంధించిన వీడియోపై తాజాగా వార్న్ ట్వీట్ చేశారు. పశ్చిమ యార్క్‌షైర్‌లోని హడ్డర్ ఫీల్డ్‌లోని ఓ కమ్యూనిటీ స్కూల్‌లో సిరియా విద్యార్థి జమాల్‌పై స్థానిక విద్యార్థి దాడికి దిగాడు.
జమాల్ అనే విద్యార్థిపై మరో విద్యార్థి చేయి చేసుకోవడంతో పాటు అతడి నోట్లో నీళ్లు పోస్తూ ఆనందాన్ని పొందాడు. ఈ సంఘటనను పక్కనే ఉన్న మరో విద్యార్థి వీడియో తీయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘ పిల్లలకు ఇళ్లు తర్వాత అత్యంత భద్రతనిచ్చేది పాఠశాలలే. కానీ ఓ సిరియా శరణార్థిపై దాడి జుగుప్పాకరమైనది. దీనిపై వెంటనే ఏదో ఒక చర్య తీసుకోండి’అంటూ వార్న్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై విచారణ చేపట్టామని పశ్చిమ యార్క్‌షైర్ పోలీసులు తెలిపారు. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్కూలు నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment