ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్‌కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు.
అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్‌లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్‌గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్‌లోని కోచ్‌లను ఆకర్షించింది.
అనంతరం జట్లు ప్రాక్టీస్‌కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్‌ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు.
దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్‌బ్యాక్స్‌లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్‌లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది.
దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్‌గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్‌స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం.
స్టూవర్ట్ మెక్‌గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్‌గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది.
ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు.
వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్‌లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది.
అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్‌గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్‌గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్‌కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు.
అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్‌లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్‌ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్‌కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్.
అలా మొదలైంది..
2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌కు దిగాడు. రౌండ్ ద వికెట్‌గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్‌ను తాకిన బంతి స్లిప్స్‌లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది.
అంతే.. అటు లయన్‌తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్‌కు చోటు లభించింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు.
యాషెస్‌తో మేలిమలుపు..
ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్‌కు చాన్స్ లభించింది.
ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్‌మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.
అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి ఆసీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్‌తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్‌మెంట్‌కు బాగా తెలిసొచ్చింది.
సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు.
ఆసీస్ దిగ్గజంగా ఎదిగి..
షేన్‌వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్‌గా లయన్‌కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్‌లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్‌కంటే సరైన వేదిక ఏముంటుంది.
భారత గడ్డపై సత్తా చాటి
స్పిన్‌కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం.
షేన్ వార్న్ సరసన
లయన్ కెరీర్‌లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్.
ఆసీస్ ఓడిన మ్యాచ్‌లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్‌లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్‌లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్‌లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం.
-మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment