అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. హరీస్ నిప్పులు చెరిగే బంతులలో ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. రౌఫ్ 8 ఓవర్లలో 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్ నుంచి ఫాహీన్ అఫ్రిది కూడా ఆసీస్ బ్యాటర్లపై అటాకింగ్ చేశాడు. అఫ్రిది 8 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
పేసర్లు నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ 19, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 13, జోష్ ఇంగ్లిస్ 18, లబూషేన్ 6, హార్డీ 14, మ్యాక్స్‌వెల్ 16, కమిన్స్ 13, స్టార్క్ 1, జంపా 18, హాజిల్‌వుడ్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.
అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్ సైమ్ అయూబ్ మెరుపు హాఫ్ సెంచరీతో (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించగా.. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు.
బాబర్ ఆజమ్ 20 బంతుల్లో సిక్సర్ సాయంతో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment