పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షాదాబ్ ఖాన్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ ఈ ఘనత సాధించాడు. రౌఫ్ తన 72 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్‌లో 107 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 96 ఇన్నింగ్స్‌ల్లో 107 వికెట్లు పడగొట్టాడు.
పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ తర్వాత షాహిద్ అఫ్రిది (97 వికెట్లు), షాహీన్ అఫ్రిది (96) ఉన్నారు. 2020లో టీ20 అరంగేట్రం చేసిన రౌఫ్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పాక్ తరఫున లీడింగ్ వికెట్‌టేకర్‌గా అవతరించాడు.
ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు (4-0-22-4) నమోదు చేసిన విదేశీ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర పేరిట ఉండేది. కులశేఖర 2017లో నాలుగు వికెట్లు తీసి 31 పరుగులిచ్చాడు. ఈ జాబితాలో రౌఫ్, కులశేఖర తర్వాత కృనాల్ పాండ్యా (4/36), క్రిస్ వోక్స్ (3/4), టిమ్ సౌథీ (3/6) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే 12 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment