12 సంవత్సరాల 9 నెలల 9 రోజులు.. సాధారణంగా ఈ వయసులో చిన్నారులంతా ఏం చేస్తుంటారు? బడిలో పాఠాలు నేర్చుకుంటూంటారు. కానీ ఆ అబ్బాయి దేశంలో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. 13 సంవత్సరాల 7 నెలల 29 రోజులు.. ఈ వయసులో చిన్నారులు సంపాదిస్తారా? తాము కోరుకున్నది పేరెంట్స్ కొనిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ బాలుడు తన ఆటతో కోటి రూపాయలు సంపాదించి, ఔరా అనిపించాడు. భారత క్రికెట్‌లో సంచలనంలా మారిన ఆ అబ్బాయే వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా కొత్త ఘనతను నమోదు చేశాడు.
చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ ఎప్పటికప్పుడు తనకంటే పెద్ద వయసు ఉన్న ఆటగాళ్ల టోర్నీలలోనే పాల్గొంటూ వచ్చాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఇతర ఆటగాళ్లు అతని కంటే కనీసం 5–6 ఏళ్లు పెద్దవాళ్లు. అలాంటి చోట బరిలోకి దిగడమే కాదు.. తన పదునైన బ్యాటింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. స్థానికంగా జరిగిన ఒక అండర్–19 స్థాయి టోర్నీలో ఏకంగా 332 పరుగులతో వైభవ్ అజేయంగా నిలవడం విశేషం. ఫలితంగా బిహార్ రాష్ట్ర అండర్–19 జట్టులో చోటు దక్కింది. ఈ స్థాయిలో బీసీసీఐ నిర్వహించే రెండు ప్రధాన టోర్నీలు కూచ్‌బెహర్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో ప్రదర్శన వైభవ్ ఆట గాలివాటం కాదని నిరూపించింది. కూచ్‌బెహర్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లోనే 151 పరుగులు చేయడంతో అతని ఆట అందరికీ తెలిసింది.
వినూ మన్కడ్ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లో 78.60 సగటుతో 393 పరుగులు చేయడం వైభవ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహజంగానే ఈ ప్రదర్శన భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. విజయవాడలో నాలుగు జట్ల మధ్య జరిగిన చాలెంజర్ టోర్నీలో భారత అండర్–19 బి జట్టు తరఫున బరిలోకి దిగిన అతను తన చూడ చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక్కడే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వైభవ్‌లోని ప్రతిభను గుర్తించాడు. అప్పటి నుంచి జాఫర్ అతనికి మార్గనిర్దేశనం చేస్తూ వచ్చాడు.
నాన్న నేర్పిన ఓనమాలతో..
బిహార్‌లోని సమస్తీపుర్‌కి చెందిన సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే పిచ్చి. ఆటను అభిమానించడమే కాదు.. క్రికెటర్‌గా కూడా ఎదిగే సత్తా తనలో ఉందని నమ్మిన అతను భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబైకి చేరాడు. అక్కడి ప్రఖ్యాత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాతే సంజీవ్‌కు వాస్తవం అర్థమైంది. ముంబై మహానగరంలో తనలాంటివారు, తనకంటే ప్రతిభావంతులు ఎందరో క్రికెట్‌లో ఎదిగేందుకు సర్వం ఒడ్డి పోరాడుతున్నారని! దాంతో తన ఆశలను కట్టిపెట్టి మళ్లీ బిహార్ చేరాడు. అయితే తాను చేయలేనిది కొడుకు ద్వారా సాధించాలనే తపనతో వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్.. తండ్రి శిక్షణ, పర్యవేక్షణలో రాటుదేలాడు. 13 ఏళ్ల వయసుకే ప్రపంచ క్రికెట్ దృష్టిలో పడ్డాడు.
రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి..
ఏజ్ గ్రూప్ క్రికెట్ తర్వాత ప్రతి ఆటగాడి లక్ష్యం సీనియర్ టీమ్‌లోకి ఎంపిక కావడమే. అక్కడికి వెళ్లాక ఆట స్థాయి, ప్రత్యర్థుల స్థాయి కూడా పెరుగుతుంది. సీనియర్ టీమ్‌లోకి రావడం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి భీకరమైన బౌలింగ్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతూ అతను తొలి మ్యాచ్‌లోనే అత్యంత పటిష్ఠమైన ముంబై టీమ్‌ను ఎదుర్కొన్నాడు. భారీ స్కోరు చేయకపోయినా అతని షాట్లు చూసినవారు ప్రశంసల వర్షం కురిపించారు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అభిమానించే ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ ఇప్పటికి 5 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన ఏకైక టి20 మ్యాచ్‌లో కొట్టిన భారీ సిక్సర్లు అతని ధాటిని చూపించాయి.
వేలంలో ప్రధాన ఆకర్షణగా..
వైభవ్ కెరీర్‌లో అసలు మలుపు రెండు నెలల క్రితం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్–19 టీమ్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో వచ్చింది. ఈ పోరులో భారత అండర్–19కు ప్రాతినిధ్యం వహించిన అతను 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. ఇదే ఆట అతణ్ణి ఐపీఎల్ దిశగా అడుగులు వేయించింది. నాగపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ దూకుడు టీమ్ సీఈఓ జేక్ లష్‌ను ఆకర్షించింది. భవిష్యత్తు కోసం తీర్చిదిద్దగల తారగా ఆయన భావించాడు.
అందుకే వేలంలో రూ. 30 లక్షల కనీస విలువ నుంచి ఢిల్లీతో పోటీ పడి మరీ రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్‌ను ఎంచుకుంది. ‘వైభవ్‌లో నిజంగా చాలా ప్రతిభ ఉంది. మా టీమ్‌లో అతను ఎదిగేందుకు తగిన వాతావరణం ఉంది. అందుకే అతణ్ణి తీసుకోవడం పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం’ అని రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం వైభవ్ కెరీర్ సరైన రీతిలో వెళ్లనుంది అనేందుకు సంకేతం.
Comments
Please login to add a commentAdd a comment