Youngest Indian
-
13 ఏళ్లకే కోటి రూపాయలు.. క్రికెట్లో కొత్త ‘వైభవం’
12 సంవత్సరాల 9 నెలల 9 రోజులు.. సాధారణంగా ఈ వయసులో చిన్నారులంతా ఏం చేస్తుంటారు? బడిలో పాఠాలు నేర్చుకుంటూంటారు. కానీ ఆ అబ్బాయి దేశంలో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. 13 సంవత్సరాల 7 నెలల 29 రోజులు.. ఈ వయసులో చిన్నారులు సంపాదిస్తారా? తాము కోరుకున్నది పేరెంట్స్ కొనిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఆ బాలుడు తన ఆటతో కోటి రూపాయలు సంపాదించి, ఔరా అనిపించాడు. భారత క్రికెట్లో సంచలనంలా మారిన ఆ అబ్బాయే వైభవ్ సూర్యవంశీ. అతి పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాడిగా కొత్త ఘనతను నమోదు చేశాడు.చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను ప్రదర్శించిన వైభవ్ ఎప్పటికప్పుడు తనకంటే పెద్ద వయసు ఉన్న ఆటగాళ్ల టోర్నీలలోనే పాల్గొంటూ వచ్చాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఇతర ఆటగాళ్లు అతని కంటే కనీసం 5–6 ఏళ్లు పెద్దవాళ్లు. అలాంటి చోట బరిలోకి దిగడమే కాదు.. తన పదునైన బ్యాటింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. స్థానికంగా జరిగిన ఒక అండర్–19 స్థాయి టోర్నీలో ఏకంగా 332 పరుగులతో వైభవ్ అజేయంగా నిలవడం విశేషం. ఫలితంగా బిహార్ రాష్ట్ర అండర్–19 జట్టులో చోటు దక్కింది. ఈ స్థాయిలో బీసీసీఐ నిర్వహించే రెండు ప్రధాన టోర్నీలు కూచ్‌బెహర్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో ప్రదర్శన వైభవ్ ఆట గాలివాటం కాదని నిరూపించింది. కూచ్‌బెహర్ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 బంతుల్లోనే 151 పరుగులు చేయడంతో అతని ఆట అందరికీ తెలిసింది. వినూ మన్కడ్ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లో 78.60 సగటుతో 393 పరుగులు చేయడం వైభవ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. సహజంగానే ఈ ప్రదర్శన భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. విజయవాడలో నాలుగు జట్ల మధ్య జరిగిన చాలెంజర్ టోర్నీలో భారత అండర్–19 బి జట్టు తరఫున బరిలోకి దిగిన అతను తన చూడ చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక్కడే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. వైభవ్‌లోని ప్రతిభను గుర్తించాడు. అప్పటి నుంచి జాఫర్ అతనికి మార్గనిర్దేశనం చేస్తూ వచ్చాడు. నాన్న నేర్పిన ఓనమాలతో..బిహార్‌లోని సమస్తీపుర్కి చెందిన సంజీవ్ సూర్యవంశీకి క్రికెట్ అంటే పిచ్చి. ఆటను అభిమానించడమే కాదు.. క్రికెటర్‌గా కూడా ఎదిగే సత్తా తనలో ఉందని నమ్మిన అతను భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబైకి చేరాడు. అక్కడి ప్రఖ్యాత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాతే సంజీవ్‌కు వాస్తవం అర్థమైంది. ముంబై మహానగరంలో తనలాంటివారు, తనకంటే ప్రతిభావంతులు ఎందరో క్రికెట్లో ఎదిగేందుకు సర్వం ఒడ్డి పోరాడుతున్నారని! దాంతో తన ఆశలను కట్టిపెట్టి మళ్లీ బిహార్ చేరాడు. అయితే తాను చేయలేనిది కొడుకు ద్వారా సాధించాలనే తపనతో వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్ బ్యాట్ పట్టిన వైభవ్.. తండ్రి శిక్షణ, పర్యవేక్షణలో రాటుదేలాడు. 13 ఏళ్ల వయసుకే ప్రపంచ క్రికెట్ దృష్టిలో పడ్డాడు.రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టి..ఏజ్ గ్రూప్ క్రికెట్ తర్వాత ప్రతి ఆటగాడి లక్ష్యం సీనియర్ టీమ్‌లోకి ఎంపిక కావడమే. అక్కడికి వెళ్లాక ఆట స్థాయి, ప్రత్యర్థుల స్థాయి కూడా పెరుగుతుంది. సీనియర్ టీమ్‌లోకి రావడం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి భీకరమైన బౌలింగ్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అతి పిన్న వయసులో రంజీ ట్రోఫీలోకి అడుగు పెడుతూ అతను తొలి మ్యాచ్‌లోనే అత్యంత పటిష్ఠమైన ముంబై టీమ్‌ను ఎదుర్కొన్నాడు. భారీ స్కోరు చేయకపోయినా అతని షాట్లు చూసినవారు ప్రశంసల వర్షం కురిపించారు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాను అభిమానించే ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ ఇప్పటికి 5 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన ఏకైక టి20 మ్యాచ్‌లో కొట్టిన భారీ సిక్సర్లు అతని ధాటిని చూపించాయి. వేలంలో ప్రధాన ఆకర్షణగా..వైభవ్ కెరీర్లో అసలు మలుపు రెండు నెలల క్రితం చెన్నైలో ఆస్ట్రేలియా అండర్–19 టీమ్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో వచ్చింది. ఈ పోరులో భారత అండర్–19కు ప్రాతినిధ్యం వహించిన అతను 62 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు బాదాడు. ఇదే ఆట అతణ్ణి ఐపీఎల్ దిశగా అడుగులు వేయించింది. నాగపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ట్రయల్స్‌లో వైభవ్ దూకుడు టీమ్ సీఈఓ జేక్ లష్ను ఆకర్షించింది. భవిష్యత్తు కోసం తీర్చిదిద్దగల తారగా ఆయన భావించాడు. అందుకే వేలంలో రూ. 30 లక్షల కనీస విలువ నుంచి ఢిల్లీతో పోటీ పడి మరీ రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్‌ను ఎంచుకుంది. ‘వైభవ్‌లో నిజంగా చాలా ప్రతిభ ఉంది. మా టీమ్‌లో అతను ఎదిగేందుకు తగిన వాతావరణం ఉంది. అందుకే అతణ్ణి తీసుకోవడం పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం’ అని రాజస్థాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పడం వైభవ్ కెరీర్ సరైన రీతిలో వెళ్లనుంది అనేందుకు సంకేతం. -
శెభాష్ కామ్య..!
జంషెడ్పూర్: కామ్య కార్తికేయన్. 16 ఏళ్లు. చదివేది ప్లస్‌టూ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి చిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలికగా కూడా నిలిచింది. ఈ నెల 20వ తేదీన తండ్రితో కలిసి ఆమె ఈ ఘనత సాధించినట్లు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్(టీఎస్‌ఏఎఫ్) గురువారం తెలిపింది. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించిన రికార్డు సాధించేందుకు కామ్య మరో అడుగు దూరంలోనే ఉన్నట్లు టీఎస్‌ఏఎఫ్ చైర్మన్ చాణక్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమనే విషయం కామ్య రుజువు చేసిందని, సాహసికులకు ఆమె ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ఈ సంస్థే కామ్యకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఏప్రిల్ ఆరో తేదీన తన బృందంతోపాటు కఠ్మాండుకు చేరుకున్న కామ్య..పూర్తిస్థాయి సన్నద్ధతతో మే 16వ తేదీన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి తండ్రి కార్తికేయన్‌తోపాటు సాహసయాత్రను ప్రారంభించింది. తండ్రితో కలిసి మే 20వ తేదీన వేకువజామున 8,848 మీటర్ల ఎత్తయిన శిఖరంపైకి చేరుకుందని టీఎస్‌ఏఎఫ్ వివరించింది. తాజా విజయంతో ఆరు ఘనతలను సాధించిన కామ్య.. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలన్న ధ్యేయానికి కేవలం అడుగు దూరంలో నిలిచిందని వెస్టర్న్ నేవీ కమాండ్ ‘ఎక్స్’లో పేర్కొంది. ఏడో లక్ష్యమైన అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్‌ను వచ్చే డిసెంబర్లో అధిరోహించేందుకు సిద్ధమవుతున్న కామ్య.. ఈ అరుదైన ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర పుటల్లో నిలవాలని కోరుకుంటున్నట్లు వివరించింది.నేవీ కమాండర్ ఎస్.కార్తికేయన్ కుమార్తె కామ్య. ముంబైలోని నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో ప్లస్‌టూ చదువుకుంటోంది. పర్వతారోహణ అంటే కామ్యకు చిన్ననాటి నుంచే ఎంతో ఆసక్తి. ఏడో ఏటనే, 2015లో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశిల పర్వతాన్ని అధిరోహించి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016లో 13,500 అడుగుల ఎత్తున్న మరింత కఠినమైన హరి కీ దున్ను, కేదార్నాథ్ శిఖరాలను అవలీలగా ఎక్కింది. అదేవిధంగా, 16,400 అడుగుల ఎత్తులో రూప్‌కుండ్ సరస్సుకు చేరుకుంది. అసా ధారణ విజయాలను నమోదు చేసిన బాలల కిచ్చే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పుర స్కారం కూడా కామ్య అందుకుంది. 2017లో నేపాల్‌లోని 17,600 అడుగుల ఎత్తున ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుని ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.ఎవరెస్ట్ కీ బేటీ– ప్రత్యేక కథనం ఫ్యామిలీలో -
మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' (Mercedes Maybach S 680) ఒకటి. ధనవంతులు సైతం ఈ కారుని కొనుగోలు చేయడానికి వెనుకాడతారు, కానీ 33 ఏళ్ల వయసులోనే 'అభిషేక్ మాంటీ అగర్వాల్' మేబ్యాచ్ సెడాన్ కొనుగోలు చేసాడు. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఫౌండర్ అభిషేక్ మాంటీ అగర్వాల్ రూ. 4 కోట్ల విలువైన 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' కారు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ భయాని అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అభిషేక్ మాంటీ అగర్వాల్ కొత్త బెంజ్ కారు భారత్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం వల్ల భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ డ్రైవ్ చేయడానికి అర్హత కలిగి ఉంది. సాధారణ నెంబర్ ప్లేట్ అయితే ఈ అవకాశం ఉండదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు కొంత సమస్య ఉంటుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ సెడాన్.. పరిమాణం పరంగా చాలా విశాలంగా ఉంటుంది. దీని పొడవు ఏకంగా 5.5 మీటర్ల. భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కారు ఇదే కావడం గమనార్హం. హెడ్ లైట్స్, విస్తరించి ఉండే గ్రిల్, బ్రాండ్ లోగో వంటివి ముందు భాగంలో చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ టెయిల్ లైట్, రియర్ స్పాయిలర్ మొదలైనవి పొందుతుంది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్, టాకొమీటర్, డిజిటల్ ఓడోమీటర్ వంటివి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ మల్టి ట్రిప్ మీటర్, వెనుక వైపు ఫోల్డింగ్ టేబుల్, రెండవ వరుస ప్రయాణికుల కోసం డిస్ప్లే వంటి అనేక లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!) మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680 సెడాన్ 6.0 లీటర్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 603.46 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. -
పిట్ట కొంచెం.. ఘనత ఘనం..
పిట్టకొంచెం కూత ఘనం అన్న మాటను నిజం చేస్తోందా చిన్నారి. కేవలం పదేళ్ళ వయసులోనే రచయిత, వక్త, రస్కిన్ బాండ్, నర్తకి, గాయకురాలుగా పలు కళల్లో ఆరితేరిపోయి.. తన ప్రత్యేకతను చాటుతోంది. ఖాళీ సమయాల్లో బాస్కెట్ బాల్ ఆడటం, మంచి పుస్తకాలను చదవడం ఆమె హాబీలు.. ఇప్పటికే సకల కళా వల్లభురాలుగా గుర్తింపు పొందిన ఆమె... ప్రస్తుతం న్యూయార్క్ లోని 'టెడ్ ఎక్స్' కాన్ఫరెన్స్ లో మాట్లాడి.. అతి చిన్న వయసులో తన కీర్తి కిరీటానికి మరో ప్రత్యేకతను జోడించింది. పూనె బలెవాడి విబ్ గ్యోర్ హై విద్యార్థి.. పదేళ్ళ ఇషితా కత్యాల్ భారత్ కు చెందిన అతి చిన్న వ్యాఖ్యాతగా పేరొందింది. టెడెక్స్ సమావేశంలోని చర్యలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సమావేశంలో అదే వయసుకు చెందిన వారిని తరచుగా అడిగే ప్రశ్నల్లో భాగంగా 'మీరు ఏమి అవుదామనుకుంటున్నారు?' (what do you want to be now?) అన్న ప్రశ్నకు విభిన్నంగా స్పందించి, అనర్గళంగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంది. నాలుగు నిమిషాల నిడివిలో ఆమె మాట్లాడిన ప్రతి మాటా వ్యవస్థకు సవాలుగా మారింది. 2013 లో టెడెక్స్ పూనెలో నిర్వహించిన తొలి సమావేశానికి హాజరవ్వడంతో ఈ యువ స్పీకర్ ఇషిత ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో ఆ కార్యక్రమం అమెను ఎంతో ఆకట్టుకోవడంతో వెంటనే నిర్వాహకులను కలిసి ఆ జట్టులో సభ్యత్వం నమోదు చేసుకుంది. తన అభిరుచితో ప్రత్యేకంగా టెడెక్స్ యూత్@బలెవాడి కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరినో ఆకట్టుకుంది. ఎనిమిదేళ్ళ వయసులో అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన అతి చిన్న వయస్కురాలుగా అప్పట్లోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు వారి కలలను సాకారం చేసుకోవచ్చు అనేందుకు ఎంతోమంది చిన్నారుల్లో ఇషిత తాజా చర్చ ప్రేరణ కల్పించింది. అతి చిన్న వయసు నుంచే అసాధారణ ప్రతిభను చూపుతూ ఇషిత ప్రత్యేకతను సాధించుకుంటోంది. ఓ రచయితగా ఉండాలని కోరుకున్న ఆమె... ఎనిమిది సంవత్సరాల వయసులోనే 'సిమ్రాన్ డైరీ' పుస్తకాన్ని రాసి ఆకట్టుకుంది. వేసవి సెలవులను వినియోగించుకొని పిల్లల మనసులో ప్రవేశించే విషయాలను వారు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అన్న విషయంపై రాసిన ఆమె పుస్తకం... మొదట్లో ఆమెజాన్ క్లిండ్ స్టోర్ లోనూ, అనంతరం పార్ట్ రిడ్జ్ పబ్లిషర్స్ లో ప్రచురితమైంది. ''స్కూలు హోంవర్స్ లు, టెడెక్స్ కార్యక్రమాలు, రచనలు ఇలా ప్రతిది నిర్వహించడం మొదట్లో నాకు కాస్త కష్టంగా అనిపించేది. అప్పట్లో నేను ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేదాన్ని. కొన్నిసార్లు హోంవర్క్ చేయడానికి సమయం మిగిలేది కాదు. అప్పట్లో మా నాన్నగారు అన్ని పనులూ పూర్తవ్వాలంటే ఉదయం మేల్కొనే సమయాన్ని మార్చమని సూచించారు. ఆ తర్వాత ఐదు గంటలకే లేవడం ప్రారంభించాను. లేచిన వెంటనే ఆరోజు చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ చేసుకొని చేయడం ప్రారంభించాను'' అంటూ తన కార్యసాధనకు వెనుక కష్టాన్ని, పట్టుదలను వివరిస్తోంది ఇషిత. అయితే ఇషిత తాజా న్యూయార్క్ స్పీచ్ ఇంకా విడుదల కాలేదు.