టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ (Nathan Lyon) భారత తాజా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను (Ravichandran Ashwin) వెనక్కు నెట్టాడు. మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ ఘనత సాధించాడు. సిరాజ్ వికెట్‌తో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో లియోన్ ఏడో స్థానానికి ఎగబాకడు. అశ్విన్ 106 టెస్ట్‌ల్లో 537 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 133 టెస్ట్‌ల్లో 538 వికెట్లు తీశాడు.
టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), నాథన్ లియోన్ (538), రవి అశ్విన్ (537), కోట్నీ వాల్ష్ (519), డేల్ స్టెయిన్ (439) టాప్-10లో ఉన్నారు.
మెల్‌బోర్న్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు చివరి సెషన్ వరకు సాగిన మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను దారుణంగా దెబ్బ తీసింది. ఏడో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. మరోవైపు సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.
మెల్‌బోర్న్ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
105 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. లబూషేన్ (70) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పాట్ కమిన్స్ (41), నాథన్ లియోన్ (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 3, రవీంద్ర జడేజా ఓ వికెట్ తీశారు.
340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. లియోన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment