ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ మాస్టర్ ప్లాన్ వేసింది. అచ్చం అశ్విన్‌లాగే బౌలింగ్ చేసే బరోడా ఆఫ్ స్పిన్నర్ మహేశ్ పితియా సేవలు వినియోగించుకోవాలని ఆసీస్ టీమ్ భావించింది. ప్రాక్టీస్‌లో పితియా బౌలింగ్‌ను ఎదుర్కొంటే, ఈనెల 8న టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో అశ్విన్‌ను ఎదుర్కోవడం సులువవుతుందని ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది.
ఇందు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు పితియాను సంప్రదించారు. అయితే పితియా ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. టీమిండియాకు మైనస్ అయ్యే ఏ పనిని తాను చెయ్యనని అన్నాడు. ఆస్ట్రేలియా క్యాంప్ చేరకపోవడానికి మరో కారణం కూడా ఉందని పితియా తెలిపాడు. త్వరలో జరిగే దేశవాలీ సీజన్‌లో తాను బరోడా టీమ్‌కు ఆడాల్సి ఉందని, అందుకు తాను ఆసీస్ టీమ్ క్యాంప్‌లో కలవడం లేదని వివరణ ఇచ్చాడు.
కాగా, పితియా గతంలో ఓ సందర్భంలో ఆసీస్ టీమ్‌తో కలిసి పనిచేశాడు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా పితియా ఆసీస్‌కు తన సేవలను అందించాడు. ఆ సిరీస్‌లో పితియా సేవల వల్ల ఆసీస్ బాగా లాభపడింది. ఆ జట్టు బ్యాటర్లు ఆ సిరీస్‌లో అశ్విన్‌కు దాసోహమైనప్పటికీ, పరుగులు మాత్రం బాగానే చేశారు. దీంతో ఈసారి కూడా పితియా సేవలను వినియోగించుకుంటే తమకు మేలవుతుందని అస్ట్రేలియన్లు భావించారు. అయితే పితియా ఆఫర్‌ను తిరస్కరించడంతో ఆస్ట్రేలియన్ల ప్లాన్ బెడిసికొట్టింది.
ఇదిలా ఉంటే, అక్టోబర్ 5న నుంచి ప్రారంభమయ్యే వరల్డ్‌కప్ కోసం అన్ని జట్లు భారత్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం అన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌కప్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో ఈ వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియా జర్నీ స్టార్ట్ అవుతుంది. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం అశ్విన్‌కు హోం గ్రౌండ్ కావడం టీమిండియాకు అదనంగా కలిసొస్తుంది. ఈనెల 14న టీమిండియా పాకిస్తాన్‌తో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment