2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది.
2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.
దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్‌గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్‌లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్‌పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్‌లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్‌బై చెప్పిన డివైన్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది.
పిన్న వయస్కురాలిగా..
క్రికెటర్‌గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్‌బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్‌లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్‌కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్‌లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్‌లో ఆడే కివీస్ టీమ్‌లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్‌లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్‌తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది.
విధ్వంసకర బ్యాటింగ్‌తో..
పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్‌లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్‌పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం.
సారథిగా నడిపించి..
దుబాయ్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్‌లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్‌లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్‌తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్‌లో భారత్‌తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్‌పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు.
∙మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment