ప్రపంచంలోని అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. ఇక శరణార్థులకు క్రీడల్లోనూ అవే కష్టాలు. ఆటపై మమకారం చంపుకోలేక.. తమ సొంత దేశాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేక ఎంతో వేదన చెందుతున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఓ గొప్ప ఆలోచన చేసింది. వారికి ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్లతో పోటీపడే అవకాశం ఇవ్వడం కోసం టోక్యో 2020 ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టును బరిలోకి దించుతోంది. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ పోటీలో మొట్టమొదటిసారిగా ‘‘శరణార్థుల జట్టు’’ పోటీ పడింది. ఈ జట్టులో ఇథియోపియా, దక్షిణ సూడాన్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
► గత ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు విజయవంతంగా పాల్గొనడంతో ఐఓసీ.. ఈసారి 29 మందితో కూడిన బలమైన జట్టుకు టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం కల్పించింది.
► 13 దేశాలకు చెందిన 55 మంది ప్రతిభావంతులైన అథ్లెట్ల నుంచి వీరిని ఎంపిక చేశారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, తైక్వాండో, కరాటె, జూడో, సైక్లింగ్, స్విమ్మింగ్.. తదితర క్రీడల్లో ఈ శరణార్థ అథ్లెట్లు పోటీపడతారు. ఇందులో రియోలో పోటీపడ్డవాళ్లు ఆరుగురు ఉన్నారు.
► ఆరంభోత్సవ కార్యక్రమంలో శరణార్థుల జట్టు.. గ్రీస్ తర్వాత రెండో జట్టుగా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంటుంది. ఒలింపిక్ పతాకం కింద పోటీపడే వీళ్లు ఒకవేళ పతకం గెలిస్తే.. పతక ప్రదాన కార్యక్రమం సందర్భంగా ఒలింపిక్ గీతాన్ని వినిపిస్తారు.
► ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే మిగతా 206 ఎన్‌ఓసిల మాదిరిగానే, ఈ బృందం ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండి అక్కడ స్వయంగా స్వాగత వేడుకను పొందుతుంది. టోక్యో 2020 ఒలింపిక్ క్రీడల తర్వాత కూడా శరణార్థుల అథ్లెట్లకు ఐఓసి మద్దతు ఇస్తుంది.
► ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, క్రొయేషియా, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, జోర్డాన్, కెన్యా, లక్సెంబర్గ్, పోర్చుగల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ట్రినిడాడ్, టొబాగో, టర్కీ, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల నుంచి అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, కానోయింగ్, సైక్లింగ్, జూడో, కరాటే, టైక్వాండో, షూటింగ్, ఈత, వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ వంటి 12 క్రీడల్లో ‘‘శరణార్థుల జట్టు’’ క్రీడాకారులు పోటీపడనున్నారు.
‘‘శరణార్థుల ఒలింపిక్ జట్టు టోక్యో 2020 ఒలింపిక్స్‌లో పాల్గొనడమంటే.. శాంతిని ఉత్సవంలా జరుపుకోవడమే. ఇది శరణార్థుల సమస్యలపై ప్రపంచం దృష్టి మళ్లేలా చేస్తుంది. ఫలితంగా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరమవుతాయి’’ అని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment