ఆస్తుల కోసం కాదు ఒలింపిక్స్‌కు వెళ్లడానికి
డబ్బు పొదుపు చేసే రాబిన్‌సన్ కథ
సూపర్ ఫ్యాన్
మనసు ఉంటే మార్గమే కాదు ‘మనీ’ కూడా ఉంటుంది. ‘అదెలా!’ అని ఆశ్చర్యపడితే... వివియానా రాబిన్‌సన్ గురించి తెలుసుకోవాల్సిందే. ‘ఒలింపిక్స్’ అనే మాట వినబడగానే ఆమె ఒళ్లు పులకించి΄ోతుంది. ప్రపంచ సంగ్రామ క్రీడను టీవీలో కాదు ప్రత్యక్షంగా చూడాలనేది ఆమె కల. అలా కల కని ఊరుకోలేదు. ఒక్కసారి కాదు ఏడుసార్లు ఒలింపిక్స్ వెళ్లింది... అలా అని ఆమె సంపన్నురాలేం కాదు. చాలా సామాన్యురాలు.
ఒలింపిక్స్‌పై ఆసక్తి రాబిన్‌సన్‌కు 1984 ఒలింపిక్స్ సమయం లో మొదలైంది. ఆమె తల్లి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో అథ్లెట్‌లకు ట్రాన్స్‌లేటర్‌గా ఉండేది. తల్లి నోటినుంచి ఒలింపిక్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలు, విశేషాలు వినేది. ఆ ఆసక్తి రాబిన్‌సన్‌ను అట్లాంటా ఒలింపిక్స్‌కు వెళ్లేలా చేసింది.
‘ఇప్పటిలా అప్పట్లో అథ్లెట్స్‌కు హైసెక్యూరిటీ ఉండేది కాదు. దీంతో ఎంతోమంది అథ్లెట్స్‌తో మాట్లాడే అవకాశం దొరికేది. కాని ఇప్పుడు సమీపంలోకి కూడా వెళ్లే పరిస్థితి లేదు’ అని ఆరోజులను గుర్తు చేసుకుంటుంది రాబిన్‌సన్.
లాస్ ఏంజెల్స్, అట్లాంటా, సిడ్నీ, ఏథెన్స్, లండన్, రియో డి జెనీరోలతో పాటు తాజాగా ప్యారిస్ ఒలిపింక్స్‌కు కూడా వెళ్లింది.
స్థలం కొనడానికో, ఇల్లు కొనడానికో, భవిష్యత్ అవసరాల కోసమో సాధారణంగా డబ్బు పొదుపు చేస్తారు. కాని రాబిన్‌సన్ మాత్రం ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డబ్బు పొదుపు చేస్తుంది. రోజుకు రెండు ఉద్యోగాలు చేసింది. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ కోసం కూడా ఎప్పటినుంచో పొదుపు మంత్రం పాటించింది.
ఒలింపిక్ థీమ్‌డ్ ట్రాక్‌సూట్‌తో ప్యారిస్‌లో టూరిస్ట్‌లు, వాలెంటీర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది రాబిన్‌సన్. ఎంతోమంది ఆమెతో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు ఆమె పాపులర్ టిక్‌టాక్ వీడియోల గురించి మాట్లాడుతుంటారు.
‘సాధారణ దుస్తుల్లో కంటే ఇలాంటి దుస్తుల్లో కనిపించడం వల్ల నాతో మాట్లాడటానికి ఉత్సాహం చూపుతారు’ అంటుంది తన ప్రత్యేక వేషధారణ గురించి చెబుతూ.
ఒలింపిక్స్ పుణ్యమా అని ప్రఖ్యాత అథ్లెట్లతో పాటు టామ్ క్రూజ్, లేడీ గాగా లాంటి సెలబ్రిటీ ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది.
ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత ఉండక΄ోవచ్చు. అయితే 66 సంవత్సరాల వయసులోనూ రాబిన్‌సన్ కు ఒలిపింక్స్‌పై ఆసక్తి తగ్గలేదు.
‘డబ్బును పొదుపు చేస్తూ నేను బతికి ఉన్నంత వరకు ఒలింపిక్స్‌కు వెళుతూనే ఉంటాను’ అంటుంది మెరిసే కళ్లతో రాబిన్‌సన్. అయితే నెక్స్›్టఒలింపిక్స్ కోసం ఆర్థికరీత్యా రాబిన్‌సన్ అంతగా కష్టపడక్కర్లేదు. ఎందుకంటే తన హోమ్‌టౌన్ లాస్ ఏంజెల్స్‌లోనే అవి జరగనున్నాయి.
వివియానా రాబిన్‌సన్ పేరుతో ఎంతోమంది ్రపొఫెసర్‌లు, రచయితలు, రకరకాల వృత్తుల వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఒలింపిక్స్’ అనేది రాబిన్‌సన్ ఇంటి పేరు అయింది. ఆటల ప్రేమికులు, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్‌లకు వివియానా రాబిన్‌సన్ అనే కంటే ‘ఒలింపిక్స్ రాబిన్‌సన్’ అంటేనే సుపరిచితం.
ఒలింపిక్స్ డైరీస్
ఒక్కసారి ఒలింపిక్స్‌కు వెళ్లొస్తేనే ఆ అనుభవం ‘ఆహా ఓహో’ అనిపిస్తుంది. అలాంటిది ఏడుసార్లు వెళ్లడం అంటే అంతులేని అనుభూతి. అలాంటి అనుభూతిని సొంతం చేసుకుంది రాబిన్‌సన్. అథ్లెట్లకు లక్ష్యం మాత్రమే, వాలెంటీర్‌లకు వారు చేస్తున్న పని మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రేక్షకులుగా వెళ్లాలనుకునే వారికి మాత్రం 360 డిగ్రీల కోణంలో ఒలింపిక్స్ అనుభూతి సొంతం అవుతుంది.
ఏడు ఒలింపిక్‌ల జ్ఞాపకాల సంపదను వృథా చేయవద్దు అంటున్నారు రాబిన్‌సన్ స్నేహితులు. సామాన్య ప్రేక్షకురాలిగా తాను చూసిన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన గ్రంథం అవుతుంది. డైరీలలో దాగి ఉన్న ఆమె ఒలింపిక్ అనుభవాలు ఏదో ఒకరోజు పుస్తకరూపం దాల్చుతాయని ఖాయంగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment