స్ఫూర్తిదాయకం మర్దినీ ప్రస్థానం | Refugee Team swimmer Yusra Mardini makes her mark at Rio Olympics | Sakshi
Sakshi News home page

స్ఫూర్తిదాయకం మర్దినీ ప్రస్థానం

Published Mon, Aug 8 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

స్ఫూర్తిదాయకం మర్దినీ ప్రస్థానం

స్ఫూర్తిదాయకం మర్దినీ ప్రస్థానం

శరణార్థిగా ఒలింపిక్స్ బరిలోకి

బతకాలంటే పోరాడాలి... ఏ క్షణంలో మీద బాంబు పడుతుందో తెలియదు... పారిపోదామంటే సముద్రాన్నే ఈదాలి... ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది చిన్నప్పటి నుంచీ కల... క్రీడల సంగతి తర్వాత ముందు బతికి బట్టకడితే చాలనే పరిస్థితి... ఐదేళ్ల క్రితం సిరియాలో 13 ఏళ్ల చిన్నారి యుస్రా మర్దినీ పరిస్థితి ఇది.

ఇప్పుడు... రియో ఒలింపిక్స్‌లో ఈత కొలనులో యుస్రా మర్దినీ దూసుకుపోతోంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే స్ఫూర్తిని ప్రపంచానికి అందిస్తూ తన కలను సాకారం చేసుకుంది. 18 ఏళ్ల ఈ స్విమ్మర్ ఐఓసీ పతాకం కింద శరణార్థుల జట్టులో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.

సాక్షి క్రీడావిభాగం : ఏడాది క్రితం ప్రాణాలు కాపాడుకునేందుకు మూడున్నర గంటలపాటు సముద్రంలో రాకాసి అలలకు ఎదురీది.. ఇప్పుడు ఒలింపిక్స్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది సిరియా శరణార్థి యుస్రా మర్దినీ. వందమీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్ హీట్స్‌లో సత్తాచాటింది. సెమీఫైనల్స్‌లో టాప్-16కు అర్హత సాధించలేకపోయినా మంచి ప్రతిభతో శభాష్ అనిపించుకుంది. బుధవారం జరిగే వందమీటర్ల ఫ్రీస్టయిల్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కేవలం ఆర్నెళ్లలోనే కఠోరమైన ప్రాక్టీస్‌తో అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 సిరియాలోని డమాస్కస్ సమీపంలో ఓ మధ్యతరగతి కుటుంబలో పుట్టింది యుస్రా. తండ్రి స్విమ్మింగ్ కోచ్ కావటంతో.. చెల్లితోపాటు చిన్నప్పటినుంచీ శిక్షణ పొందింది. జాతీయ స్థాయిలో పలు ఈవెంట్లలో సిరియా టాప్ స్విమ్మర్లను ఓడించి... సిరియా ఒలింపిక్స్ సంఘాన్ని మెప్పించింది. స్విమ్మింగ్‌ను జీవితంగా మార్చుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసారి ఒలింపిక్స్‌లో సిరియా నుంచి బరిలో దిగే అవకాశం వచ్చేది. కానీ బలీయమైన విధి ఆమె ఆశలపై నీళ్లు చల్లింది.

 2011లో సిరియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సిరియా ప్రభుత్వం, ఐసిస్ బలగాల మధ్య జరిగిన ఆధిపత్యపోరులో లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది బతుకుజీవుడా అంటూ.. దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. రెండు సార్లు మర్దినీ కుటుంబం ఉంటున్న ఇంటిపై అర్ధరాత్రి బాంబులు పడ్డాయి. తృటిలో ప్రాణాలు దక్కించుకున్న వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇదంతా జరుగుతున్నప్పుడు యుస్రా వయసు కేవలం 13 ఏళ్లు. అయినా ఏదోలా జీవితాన్ని మూడేళ్ల పాటు వెళ్లదీశారు. గత ఏడాది యూస్రా తల్లి... తన ఇద్దరు కూతుళ్లను తెలిసిన వారికి అప్పజెప్పి దేశం దాటించాలని కోరింది.

ఏడుస్తూనే తల్లిని వదిలి చెల్లితో పాటు యూస్రా పడవెక్కింది. టర్కీ తీరప్రాంత గస్తీ దళాలు వీరిని గుర్తించి వెనక్కు పంపాయి. వెనక్కు వెళితే యుద్ధంలో చనిపోతారు. ముందుకు వెళితే సముద్రంలో చనిపోతారు. ఇలాంటి స్థితితో స్మగ్లర్లను ఆశ్రయించి వారి ద్వారా సముద్రం దాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్పటికే స్మగ్లర్లు శరణార్థుల కోసం నడుపుతున్న పడవలు బోల్తాపడి వేల మంది చనిపోయారు. టర్కీ, గ్రీసు మధ్యలోనున్న ఏజియన్ సముద్రాన్ని దాటేందుకు యుస్రా సిస్టర్స్‌తోపాటు మరో 20 మందికి కలిపి ఓ చిన్న బోటును ఇచ్చారు స్మగ్లర్లు. దీంట్లో బయలుదేరిన కాసేపటికే..

తీవ్రమైన గాలులు, రాకాసి అలలతో పడవ ఎగిరిపడుతోంది. పడవలో సామర్థ్యానికి మించి బరువుండటంతో పడవలోకి నీళ్లొస్తున్నాయి. అందరూ బతకాలంటే కనీసం ముగ్గురైనా ఖాళీ అవ్వాలి. అదృష్టం కొద్దీ ఈ పడవలో యుస్రా సిస్టర్స్‌తోపాటు మరో యువకుడికీ ఈత వచ్చు. కానీ.. పూల్‌లో ఈదటం వేరు.. సముద్రంలో అలల ధాటిని ఎదుర్కొనటం వేరు. అయినా ఈ ముగ్గురు ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే సముద్రంలోకి దూకి.. పడవ బోల్తా పడకుండా జాగ్రత్తపడ్డారు. ఉప్పునీళ్లు కళ్లలో చేరి మంటపుడుతున్నా.. దాదాపు మూడున్నర గంటలసేపు ఈది.. గ్రీకు ద్వీపమైన లెస్బోస్ చేరుకున్నారు. వీరితోపాటు పడవలో ఉన్న పదిహేడు మందిని కాపాడారు. అక్కడినుంచి హంగేరీ మీదుగా ఎన్నో కష్టనష్టాలకోర్చి యుస్రా జర్మనీ శరణార్థి శిబిరంలో చేరింది. ‘ఆ రోజు పడవలో ఓ ఆరేళ్ల చిన్నారి కళ్లలో భయం చూసి ఆమెను బతికించాలనే కసితోనే సముద్రంలో దూకాను’ అని యుస్రా తెలిపింది.

 ఒలింపిక్స్‌కు ఎలా?
బెర్లిన్‌లో శరణార్థి శిబిరంలో యుస్రాకు పరిచయమైన ఓ స్థానికుడు.. ఆమెకు స్విమ్మింగ్‌పైన ఉన్న ఆసక్తిని స్థానిక కోచ్‌కు తెలిపాడు. ఆమెను పరీక్షించిన ఆ కోచ్.. తొలిసారి పూల్‌లో ప్రతిభ చూడగానే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2012 తర్వాత ఇంట్లోనుంచి బయటకెళ్లకుండా స్విమ్మింగ్‌కు దూరంగా ఉన్నా.. డైవింగ్, స్విమ్మింగ్ స్టైల్ అద్భుతంగా ఉండటం చూసి.. మరింత శిక్షణ ఇచ్చాడు. 1936లో ఒలింపిక్స్ నిర్వహణ కోసం నాజీలు నిర్మించిన పూల్‌లో యుస్రా మరింత రాటుదేలింది. అక్కడ చూపిన ప్రతిభే ఆమెను ఐఓసీ శరణార్థుల జట్టులో సభ్యురాలిని చేసింది. దీంతో ఆమె కల సాకారమైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement