లాల్ బహదూర్ శా్రస్తి–సిరిమావో బండారు నాయకేల ఇండో, శ్రీలంక ఒప్పందం 1964 (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రాణభయంతో ఓ దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లే వారిని కాందిశీకులు అంటారు. ఇలాంటి వారికి పరాయిగడ్డపై ఆశ్రయం దొరకడమే గగనం. దొరికినా వారికి పెద్దగా హక్కులు ఉండవు. కానీ బ్రిటిష్ పాలనలో పని కోసం మన దేశం నుంచి పొరుగున ఉన్న బర్మా (మయన్మార్), శ్రీలంకలకు వలసవెళ్లి అక్కడ సైనిక నియంతల హెచ్చరికలు, అంతర్యుద్ధాల కారణంగా తిరిగి భారతదేశానికి వచ్చిన కాందిశీకులది మరో కథ. వెళ్లిన కొన్నేళ్ల తర్వాత మాతృ దేశంలో బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టిన వారిని భారత్ తల్లిలా అక్కున చేర్చుకుంది.
వారికి పునరావాసం కల్పించింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాంలో వెలసిన శరణార్థుల కాలనీలో తెలుగు వారికి కేంద్రం పునరావాసం కల్పించింది. ఇలాంటి వారందరికీ దేశవ్యాప్తంగా..ఇళ్లు, వ్యవసాయ స్థలాలు పంపిణీ చేసినా అంతర్గాంలో మాత్రం ఇంకా ప్రభుత్వ హామీలు నెరవేరలేదు. తమకు కనీసం ఇళ్లైనా మంజూరు చేయాలని వారు దీనంగా వేడుకుంటున్నారు.
అసలు ఏం జరిగింది?
19వ శతాబ్దంలో దేశంలో విపరీతమైన కరువు వచ్చింది. ఈ కరువును ఎదుర్కొనే ప్రయత్నాలు చేయకుండా మన దేశంలోని పేదలను బర్మా, శ్రీలంక, మలేసియా తదితర దేశాల్లో తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా పంపారు. అలా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర నుంచి వేలాదిమంది బర్మాకు వలస వెళ్లారు. అక్కడ వ్యాపారాలు, పనులు చేసి రూ.కోట్లు గడించారు. అయితే 1962లో బర్మాలో సైనిక నియంత నె విన్ తిరుగుబాటుతో ప్రభుత్వం కుప్పకూలింది. పగ్గాలు చేపట్టిన నె విన్ విదేశీయులు కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాలంటూ హుకూం జారీ చేశాడు. సైనికులు భారతీయుల ఇళ్లను దోచుకున్నారు. కనీసం మెడలో తాళిబొట్టును కూడా అనుమతించలేదు.
అయితే అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు భారత సంతతి ప్రజలను దేశానికి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు. ఈ తరలింపు లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ హయాం వరకు పలు దఫాలుగా సాగింది. వీరితో పాటే శ్రీలంకలో జాతుల మధ్య పోరు వల్ల ఇండియాకు వచ్చిన తమిళులకూ చోటు ఇచ్చారు. ఇలా 1971 నాటికి అంతర్గాంలో దాదాపు 1,000 బర్మా, శ్రీలంక కుటుంబాలు ఆశ్రయం పొందాయి. 1989లో దేశవ్యాప్తంగా ఇలాంటి వారికి నాలుగెకరాల భూమి, ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇదే క్రమంలో అంతర్గాం కాందిశీకులకు కేంద్రం 502 ఎకరాల భూమి కేటాయించింది.
ప్రత్యేకంగా వీవింగ్ సొసైటీని ఏర్పాటు చేసి జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు తెరిచి ఉపాధి కల్పించింది. అప్పట్లో తెరిచిన మిల్లులు అధికారుల అవినీతి కారణంగా 1990వ దశకంలో మూతబడ్డాయి. కార్మికులకు కనీసం వేతన బకాయిలు, పీఎఫ్, ఈఎస్‌ఐ కూడా రాలేదు. ఉపాధి కోల్పోవడంతో ఆకలి మరణాలు సైతం సంభవించాయి. కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. ప్రస్తుతం ఇక్కడ 374 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. కానీ ఇప్పటికీ భూమి, ఇళ్ల స్థలాలకు సంబంధించిన హామీ మాత్రం నెరవేరలేదు.
ఇండ్రస్టియల్ పార్కులో కొలువులివ్వండి..
తమ సంక్షేమానికి కేంద్రం ఏర్పాటు చేసిన మిల్లు లు మూతబడ్డాయని, కేటాయించిన 502 ఎకరాల్లో 250 ఎకరాలైనా తమ కుటుంబాలకు కేటాయించాలని అంతర్గాంలో ఉన్న కాందిశీకులు కోరుతున్నారు. వాస్తవానికి 2009 సెపె్టంబర్ 1న ఇళ్ల స్థలాల విషయమై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని వీరు కలిశారు. దీంతో వెంటనే అందరికీ పట్టాలు ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ మరునాడే వైఎస్ హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో, ఇప్పటివరకు వీరి గోడు పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దాదాపు 100 ఎకరాలు ఇండ్రస్టియల్ పార్కు కోసం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన భూములు కబ్జాలకు గురవుతున్నాయని, తొలుత తమకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి కుటుంబానికి పదిగుంటల నివాస స్థలం ఇచ్చాకే, పరిశ్రమలు స్థాపించాలని శరణార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ స్థాపించబోయే పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనలో బర్మా, శ్రీలంక శరణార్థుల కుటుంబాలకే తొలి ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు అప్పట్లో పునరావాసం కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి మరమ్మతు చేసు కుందామంటే స్థానిక అధికారులు అంగీకరించడం లేదు. కనీసం ఉన్న గూడుకు మరమ్మతులు చేసుకునే అవకాశం కల్పిస్తే..శరణార్థుల కుటుంబాలు తలదాచుకునేందుకు అవకాశం ఉంటుందని శ్రీలంక, బర్మా శరణార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి జమ్ముల రామారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment