మానకొండూర్ రూరల్: ఊరిలో ఆ కులానివి దాదాపు 50 గడపలు. శుభకార్యమైనా.. అశుభ కార్యమైనా అందరూ కలసికట్టుగా హాజరవుతారు. అయితే పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినలేదని, వారి తీర్పును తిరస్కరించారని కులం నుంచి ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఏడాదికాలంగా గ్రామంలో పెళ్లయినా, చావైనా వీరిని పిలవడంలేదు.
బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాదాసు సంపత్ కుటుంబానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.03 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి కొమురయ్య పేరున ఉంది. 2014లో సంపత్ తండ్రి కొమురయ్య మరణించాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అడప శ్రీనివాస్ ఆ భూమి విషయంలో సంపత్‌తో గొడవకు దిగాడు. స్థానిక కోర్టుకు వెళ్లడంతో తీర్పు సంపత్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో తమ భూమిని సాగు చేసేందుకు అతను వెళ్లాడు. అయితే..
అడప శ్రీనివాస్, సంపత్‌ను అడ్డుకుని.. దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో ఇరువురూ పోలీసుస్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరూ ఏడాది క్రితం గ్రామంలోని పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. వారు ఇరువర్గాలు రూ.50 వేలు డిపాజిట్ పెట్టాలని సూచించారు. సంపత్ తనవద్ద అంతమొత్తం లేవని, రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో తాము చెప్పినట్లు వినలేదని పంచాయితీ పెద్దలు సంపత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వారి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
గ్రామంలోని తమ కులస్తులు ఏడాదికాలంగా తమను ఎలాంటి కార్యాలకు పిలవకపోవడంతో మనోవేదనకు గురవుతున్నట్లు సంపత్ కుటుంబం వెల్లడించింది. కుల బహిష్కరణ చేసిన 11 మంది పంచాయితీ పెద్దలపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయన ఇటీవల సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment