![Naba Mohammadi Of Karimnagar District Was Selected In The Sakura Science Festival Held In Japan](/styles/webp/s3/article_images/2024/08/9/naba.jpg.webp?itok=ndEBB5gR)
సకుర సైన్స్ ఫెస్టివల్‌లో కరీంనగర్ బాలికకు చోటు
బోటనీ పాఠమంటే.. బోరు..బోరు.. హిస్టరీ రొస్టు్ట కంటే రెస్ట్ మేలు.. అని పాడుకుంటే పొరపాటే.. పాఠం సరిగా వింటే విదేశీయానం, విమోనమెక్కే యోగం దక్కుతుందని నిరూపించింది కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన నబా మొహమ్మదీ. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏకంగా ఈ ఏడాది నవంబరులో జపాన్ లో జరిగే సకుర సైన్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? కేవలం సైన్స్ మీద ఉన్న ఆసక్తి.. మోటారు పాఠం వినడం వల్లే అంటుంది. నబా..! తనకు సైన్స్పై ఉన్న ఆసక్తి తనను జపాన్ గడ్డపై కాలు మోపేలా చేస్తుందని ‘సాక్షి’కి చెప్పింది.
ఏంటా మోటారు కథ...!
నబా ప్రస్తుతం శంకరపట్నంలోనే ఇంటర్ సెకండియర్ చదువుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం తాను 9వ తరగతిలో ఉండగా.. విన్న ఫిజిక్స్ పాఠం తన ఆలోచన తీరును మార్చివేసింది. 8 వ తరగతి వరకు బేసిక్ సైన్స్ విన్న తాను.. తొలిసారిగా మోటారు ఎలా పనిచేస్తుందో తన గురువులు చెప్పిన పాఠానికి ముగ్ధురాలైంది. విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తిని కలిపి మోటారు నడిపే విధానం తెలుసుకోవడం తనకు సైన్స్ ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిన్న సూత్రం ఆధారంగా ప్రపంచంలోని ఎన్నో మోటార్లు ఎలా నడుస్తున్నాయన్న విషయంపై తనకు పూర్తి అవగాహన వచ్చింది. అది మొదలు సైన్స్పాఠాలను మరింత శ్రద్ధగా చదువుతూ విశ్లేషణ చేసుకునేది. ప్రతీది తనకు అర్థమయ్యేందుకు అదనపు పుస్తకాలు, యూట్యూబ్ చూసేది. ఇటీవల జిల్లా స్థాయిలో ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కరీంనగర్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. అదే ఊపులో రాష్ట్రస్థాయికి ఎంపికై టాప్–5లో టాప్–2 స్థానం దక్కించుకుంది. ఫలితంగా నవంబరులో జపాన్ లో జరిగే సుకుర సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.
తాను కూడా ఏదైనా సాధించాలంటే..!
అదే ఉత్సాహంతో తాను కూడా ఏదైనా సాధించాలని తలచింది. అంధులకు దారి చూపేందుకు ప్రత్యేక డివైజ్ రూపొందించింది. ఇది ప్రస్తుతంప్రోటోటైప్ దశలోనే ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. దీనికి త్వరలోనే పేటెంట్ కూడా దరఖాస్తు చేసుకుంటానని నబా ‘సాక్షి’కి వివరించింది. జపాన్ పర్యటనలో అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలను గమనించి, వాటిని ఇక్కడఅమలు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. తాను ఈ ప్రగతి సాధించడం వెనక తన తండ్రి షాబీర్, ఫిర్దౌస్ సుల్తానాలు ఎంతోప్రోత్సహించారని, సంప్రదాయ కుటుంబమైనా, బాలికనైన తనను అన్ని కాంపిటీషన్లకు పంపించారని తెలిపింది. అదే సమయంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దయ్యాక శాస్త్రవేత్తనవుతాననీ, అంధులకు చూపునవుతాననీ వారికి దారిచూపేందుకు రూపొందించిన ఉపకరణాన్ని మరింత అభివృద్ధి చేస్తాననీ చెప్పింది. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదగడమే తన కల అని వివరించింది నబా. – బి. అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment