‘భాషా’..! ఒక్క ప్రశ్న కాదు.. వందైనా ఓకే! | Success Story Of Lakshmi And Animika Dutta In International Linguistics Olympiad | Sakshi
Sakshi News home page

‘భాషా’..! ఒక్క ప్రశ్న కాదు.. వందైనా ఓకే!

Published Fri, Sep 13 2024 10:27 AM | Last Updated on Fri, Sep 13 2024 10:27 AM

Success Story Of Lakshmi And Animika Dutta In International Linguistics Olympiad

కేవలం 250 మంది మాట్లాడే భాష పేరు చెప్పగలరా? దాని నిర్మాణం ఏమిటి? ఎలా మాట్లాడుతారు, ఎలా రాస్తారో చెప్పగలరా? కొన్ని గంటల్లోనే ఆ భాషను అనువదించగలరా? ‘కష్టం’ అనేవాళ్లే ఎక్కువ. కాని కొందరు ఇష్టంగా ఇంటర్నేషనల్‌ లింగ్విస్టిక్స్‌ ఒలింపియాడ్‌లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. మన దేశం తరఫున ఈ పోటీలో పాల్గొన్న లక్ష్మీ, అనిమికా దత్తాలు పతకాలు గెలుచుకున్నారు...

ఇంటర్నేషనల్‌ లింగ్విస్టిక్స్‌ ఒలింపియాడ్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, భాషాశాస్త్ర నిపుణులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ పోటీ. 2003లో ఇది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వ్యాకరణం, నిర్మాణం, సంస్కృతి, చరిత్రను విశ్లేషించడానికి, పజిల్స్‌ను సాల్వ్‌ చేయడం ద్వారా భాష సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ పోటీ అవకాశం కల్పిస్తుంది. సృజనాత్మకత, ఊహాశక్తిని మెరుగుపరచడానికి ఈ పోటీ ఉపకరిస్తుంది. భవిష్యత్తు భాషాశాస్త్ర నిపుణులను తయారుచేస్తుంది.

‘భాష లేదా భాషాశాస్త్రంపై లోతైన పరిజ్ఞానం అవసరం లేదు. అత్యంత సవాలుతో కూడిన సమస్యలకు కూడా తార్కిక సామర్థ్యంతో, ఓపికతో పరిష్కారం కనుక్కోవచ్చు’ అంటుంది ఐవోఎల్‌. పోటీలో పాల్గొన్న వారికి ఇన్‌ఫుట్స్‌ ఇస్తారు. వాటి ఆధారంగా పజిల్స్‌ సాల్వ్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం ‘ఐవోఎల్‌’కు బ్రెజిల్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలో 38 దేశాల నుంచి 51 టీమ్‌లు పాల్గొన్నాయి. బ్రెజిల్‌ రాజధాని బ్రజిలియాలో జరిగిన 2024 ఇంటర్నేషనల్‌ లింగ్విస్టిక్స్‌ ఒలింపియాడ్‌(ఐవోఎల్‌)లో మన దేశానికి చెందిన అనిమికా దత్తా ధర్, శ్రీలక్ష్మీ వెంకట్రామన్, ఫరాజ్‌ సిద్దిఖీ, అనన్య అగర్వాల్‌లు అద్బుత ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించారు.

‘ఐవోఎల్‌ వెబ్‌సైట్‌లో గత ఒలింపియాడ్‌లో వచ్చిన ్రపాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేస్తూ ్రపాక్టీస్‌ చేశాను’ అంటుంది పద్నాలుగు సంవత్సరాల శ్రీలక్ష్మీ.  బెంగళూరులోని జైగోపాల్‌ రాష్ట్రీయ విద్యాకేంద్రలో చదువుతున్న శ్రీలక్ష్మీ ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థి ఫరాజ్‌ సిద్దిఖీతో కలిసి కాంస్య పతకం సాధించింది. పదిహేడు సంవత్సరాల అనిమికా దత్తా ఈ ఒలింపియాడ్‌లో రజత పతకం గెలుచుకుంది. అనిమిక చెన్నై మ్యాథమెటికల్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్ధి. తృటిలో పతకం చేజార్చుకున్న అనన్య పతకం సొంతం చేసుకోకపోయినా బోలెడు ప్రశంసలు అందుకుంది.

ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్న మన బృందానికి మైండ్‌–బ్లోయింగ్‌ వర్డ్‌ పజిల్స్‌ సవాలు విసిరాయి. ఇచ్చిన వ్యవధి ఆరు గంటలు. కొరియాక్‌(రష్యా), హడ్జా(టాంజానియా), కొమ్టో(పపువా న్యూ గినియా), దావ్‌ (బ్రెజిల్‌), యానువ్యవా(ఆస్ట్రేలియా)లాంటి మారుమూల భాషలకు సంబంధించిన పజిల్స్‌ ఇచ్చారు. ‘భాష నుంచి చారిత్రక సందర్భాలను నిర్వచించవచ్చు’ అంటున్న అనిమిక పపువా న్యూ గినియాకు చెందిన ఎన్డు భాషతో పాటు చారిత్రక విషయాల గురించి కూడా మాట్లాడగలదు. భాషాశాస్త్రం లోతుపాతుల గురించి పెద్దగా తెలియని అనిమిక ఆ శాస్తంపై ఆసక్తి పెంచుకోవడానికి పజిల్స్‌ కారణం.

‘లింగ్విస్టిక్స్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనడం వల్ల కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం పెరుగుతుంది’ అంటుంది శ్రీలక్ష్మి. ‘నా సాంస్కృతిక నేపథ్యమే నాకు స్ఫూర్తి’ అంటుంది అనన్య అగర్వాల్‌. ‘ఐవోఎల్‌’ బ్రెయిన్‌టీజర్‌ ఫీచర్‌లు సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ సంస్కృతి తెలియకపోతే పజిల్స్‌ పరిష్కరించడం కష్టం. ఉదాహరణకు ఈ సంవత్సరం ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు. ఫరెమ్‌ ప్రజల గురించి తెలియకపోతే ఆ సమస్య పరిష్కరించలేము. ఫరెమ్‌ అనేవాళ్లు  కొమ్జో భాష మాట్లాడే ప్రజలు. వివాహనికి సంబంధించిన వీరి ఆచారవ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. ‘ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రవేశం అనేది సూక్ష్మస్థాయిలో విశ్లేషణకు, సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది’ అనే విషయాన్ని ‘ఐవోఎల్‌’ పోటీలు చెప్పకనే చెబుతున్నాయి. బహు భాషలపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రేరణను ఇస్తున్నాయి.

మరింత సులువుగా...
ఒక భాషకు సంబంధించిన వాక్యనిర్మాణం, వ్యాకరణం, ధ్వనులు... మొదలైన వాటిపై భాషాశాస్త్రం పనిచేస్తుంది. భాషాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తి ఊపందుకోవడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రధాన కారణం. జీపీటి–4, క్లాడ్, జెమినిలాంటి లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఇందుకు ఉదాహరణ. మనిషి ఇచ్చే ఇన్‌పుట్స్, కమాండ్స్‌కు మెషిన్‌ అర్థం చేసుకోవడానికి మధ్య అంతరాన్ని పూడ్చడానికి నేచురల్‌ లాంగ్వేజ్‌ ్రపాసెసింగ్‌ సిస్టమ్స్‌ (ఎన్‌ఎల్‌పీ) అవసరం. ఎక్కువ సంఖ్యలో భాషాశాస్త్రవేత్తలు ‘ఎన్‌ఎల్‌పీ’ రిసెర్చ్‌లో భాగం అయితే సహజత్వ ప్రక్రియ మరింత సులువు అవుతుంది.

ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement