Vamsi Modem: బస్తాలు మోసిన భుజం.. పతకాలు తెస్తోంది! | Modem Vamsi Success Story At International Level In Weightlifting | Sakshi
Sakshi News home page

Vamsi Modem: బస్తాలు మోసిన భుజం.. పతకాలు తెస్తోంది!

Published Fri, Aug 30 2024 9:37 AM | Last Updated on Fri, Aug 30 2024 9:37 AM

Modem Vamsi Success Story At International Level In Weightlifting

సక్సెస్‌ స్టోరీ

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేసిన భద్రాద్రి ఏజెన్సీకి చెందిన మోడెం వంశీ ఇప్పుడు వెయిట్‌ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నాడు. కూలీగా మొదలైన ప్రస్థానం ఇపుడు కామన్ వెల్త్‌ దిశగా సాగుతోంది...

మోడెం వంశీ స్వస్థలం ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని వాజేడు మండలం ఇప్పగూyð ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువును అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపట్నంలో ఓ నర్సరీలో పని చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు. అక్కడ నర్సీరీలో 50 కేజీల బరువు ఉన్న యూరియా బస్తాలను అలవోకగా ఎత్తుకుని తిరగడాన్ని ఆ నర్సరీ యజమాని, మాజీ వెయిట్‌ లిఫ్టరైన అబ్దుల్‌ ఫరూక్‌ గమనించాడు.

దీంతో నర్సరీ ప్రాంగణంలోనే వంశీలో ఉన్న ప్రతిభకు సాన పట్టాడు. ఎంతటి బరువులైనా అవలీలగా ఎత్తేస్తుండటంతో తక్కువ సమయంలోనే ఇబ్రహీంపట్నం నర్సరీ నుంచి భద్రాచలం సిటీ స్టైల్‌ జిమ్‌ మీదుగా హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలోని పవర్‌ లిప్టింగ్‌ హాల్‌కు వంశీ అడ్రస్‌ మారింది హైదరాబాద్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తూనే ఎల్‌బీ స్టేడియంలో వంశీ కోచింగ్‌ తీసుకునేవాడు. అక్కడ పవర్‌ లిఫ్టింగ్‌లో ఇండియా తరఫున ఏషియా లెవల్‌ వరకు ఆడిన సాయిరాం వంశీ ఎదుగుదలకు అండగా నిలిచాడు.

గోవాలో 2021లో జరిగిన పోటీల్లో మొదటిసారి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు వంశీ. ఆ తర్వాత 2022లో కేరళ, హైదరాబాద్‌లో 2023లో ఇండోర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్, పటియాల (పంజాబ్‌)లో జరిగిన పోటీల్లోనూ వంశీ పతకాలు గెల్చుకున్నాడు. దీంతో యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు వంశీని ఎంపిక చేస్తూ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్  ఆఫ్‌ ఇండియా 2024 జూన్ లో నిర్ణయం తీసుకుంది.

"ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్‌ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్‌ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్‌ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం స్థానం దక్కింది."

తొలిసారిగా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం దక్కిందనే ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. పాస్‌పోర్టు, వీసా, ప్రయాణం తదితర ఖర్చులకు రూ. 2.10 లక్షల అవసరం పడింది. హైదరాబాద్‌లో స్పాన్సర్‌లు దొరకడం కష్టం కావడంతో తన వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రస్థానం మొదలైన భద్రాచలంలోని సిటీ స్టైల్‌ జిమ్‌లో కోచింగ్‌ ఇచ్చిన రామిరెడ్డిని సంప్రదించాడు. క్రౌడ్‌ ఫండింగ్‌ కోసం లోకల్‌ గ్రూప్‌లలో రూ.100 వంతున సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు పట్టణానికి చెందిన వైద్యులు  సోమయ్య, శ్రీకర్, కృష్ణప్రసాద్, రోశయ్య, స్పందనలు తమ వంతు సాయం అందించారు.

యూరప్‌ వెళ్లేందుకు వీసా కోసం కాన్సులేట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో వంశీకి ఊహించని ఇబ్బంది ఎదురైంది. ‘యూరప్‌ ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నావ్‌?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తే ‘ఇక్కడ ఏం జాబ్‌ చేస్తున్నావు?’ అని అడిగినట్లు భావించి ‘పార్ట్‌టైం జాబ్‌’ అని బదులు ఇచ్చాడు వంశీ.  వీసా క్యాన్సల్‌ అయ్యింది. దీంతో క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా వచ్చిన రూ.20వేలు వృథా కాగా మళ్లీ స్లాట్‌ బుకింగ్‌కు రూ.15 వేల వరకు అవసరం పడ్డాయి. ఈసారి ఆర్థిక సాయం అందించేందుకు భద్రాచలం ఐటీడీఏ – పీవో రాహుల్‌ ముందుకు వచ్చాడు.

ఇంగ్లీష్‌ గండం దాటేందుకు స్నేహితులు, కోచ్‌ల ద్వారా ప్రశ్నా – జవాబులు రాయించుకుని వాటిని ్రపాక్టీస్‌ చేశాడు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఫోన్  చేసి నేర్చుకున్న దాన్ని వల్లెవేయడం, అద్దం ముందు మాట్లాడటం చేస్తూ చివరకు వీసా గండం గట్టెక్కాడు. ఈ పోటీలో పాల్గొనే బృందం ముందుగానే మాల్టా వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 25న హైదరాబాద్‌ నుంచి ముంబైకి వంశీ ఒక్కడే బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ మీదుగా మాల్టా వరకు ఎయిర్‌బస్‌లో చేరుకున్నాడు.

ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్‌ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్‌æ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్‌ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం  దక్కింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో వచ్చే అక్టోబరులో జరిగే కామన్ వెల్త్‌ గేమ్స్‌లో సత్తా చాటేందుకు వంశీ సిద్ధం అవుతున్నాడు. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement