power lifting championship
-
Vamsi Modem: బస్తాలు మోసిన భుజం.. పతకాలు తెస్తోంది!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువు ఆపేసిన భద్రాద్రి ఏజెన్సీకి చెందిన మోడెం వంశీ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నాడు. కూలీగా మొదలైన ప్రస్థానం ఇపుడు కామన్ వెల్త్ దిశగా సాగుతోంది...మోడెం వంశీ స్వస్థలం ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని వాజేడు మండలం ఇప్పగూyð ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడో తరగతితోనే చదువును అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపట్నంలో ఓ నర్సరీలో పని చేస్తున్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు. అక్కడ నర్సీరీలో 50 కేజీల బరువు ఉన్న యూరియా బస్తాలను అలవోకగా ఎత్తుకుని తిరగడాన్ని ఆ నర్సరీ యజమాని, మాజీ వెయిట్ లిఫ్టరైన అబ్దుల్ ఫరూక్ గమనించాడు.దీంతో నర్సరీ ప్రాంగణంలోనే వంశీలో ఉన్న ప్రతిభకు సాన పట్టాడు. ఎంతటి బరువులైనా అవలీలగా ఎత్తేస్తుండటంతో తక్కువ సమయంలోనే ఇబ్రహీంపట్నం నర్సరీ నుంచి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ మీదుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని పవర్ లిప్టింగ్ హాల్‌కు వంశీ అడ్రస్ మారింది హైదరాబాద్‌లో పార్ట్‌టైం జాబ్ చేస్తూనే ఎల్బీ స్టేడియంలో వంశీ కోచింగ్ తీసుకునేవాడు. అక్కడ పవర్ లిఫ్టింగ్‌లో ఇండియా తరఫున ఏషియా లెవల్ వరకు ఆడిన సాయిరాం వంశీ ఎదుగుదలకు అండగా నిలిచాడు.గోవాలో 2021లో జరిగిన పోటీల్లో మొదటిసారి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు వంశీ. ఆ తర్వాత 2022లో కేరళ, హైదరాబాద్‌లో 2023లో ఇండోర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ఈ ఏడాది రాజస్థాన్, పటియాల (పంజాబ్)లో జరిగిన పోటీల్లోనూ వంశీ పతకాలు గెల్చుకున్నాడు. దీంతో యూరప్‌లోని మాల్టా దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు వంశీని ఎంపిక చేస్తూ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2024 జూన్ లో నిర్ణయం తీసుకుంది."ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం స్థానం దక్కింది."తొలిసారిగా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనే అవకాశం దక్కిందనే ఆనందం కొద్ది సేపట్లోనే ఆవిరైంది. పాస్‌పోర్టు, వీసా, ప్రయాణం తదితర ఖర్చులకు రూ. 2.10 లక్షల అవసరం పడింది. హైదరాబాద్‌లో స్పాన్సర్లు దొరకడం కష్టం కావడంతో తన వెయిట్ లిఫ్టింగ్ ప్రస్థానం మొదలైన భద్రాచలంలోని సిటీ స్టైల్ జిమ్‌లో కోచింగ్ ఇచ్చిన రామిరెడ్డిని సంప్రదించాడు. క్రౌడ్ ఫండింగ్ కోసం లోకల్ గ్రూప్‌లలో రూ.100 వంతున సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టాడు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు పట్టణానికి చెందిన వైద్యులు సోమయ్య, శ్రీకర్, కృష్ణప్రసాద్, రోశయ్య, స్పందనలు తమ వంతు సాయం అందించారు.యూరప్ వెళ్లేందుకు వీసా కోసం కాన్సులేట్‌లో జరిగిన ఇంటర్వ్యూలో వంశీకి ఊహించని ఇబ్బంది ఎదురైంది. ‘యూరప్ ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నావ్?’ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంగ్లీష్‌లో ప్రశ్నిస్తే ‘ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నావు?’ అని అడిగినట్లు భావించి ‘పార్ట్‌టైం జాబ్’ అని బదులు ఇచ్చాడు వంశీ. వీసా క్యాన్సల్ అయ్యింది. దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన రూ.20వేలు వృథా కాగా మళ్లీ స్లాట్ బుకింగ్‌కు రూ.15 వేల వరకు అవసరం పడ్డాయి. ఈసారి ఆర్థిక సాయం అందించేందుకు భద్రాచలం ఐటీడీఏ – పీవో రాహుల్ ముందుకు వచ్చాడు.ఇంగ్లీష్ గండం దాటేందుకు స్నేహితులు, కోచ్‌ల ద్వారా ప్రశ్నా – జవాబులు రాయించుకుని వాటిని ్రపాక్టీస్ చేశాడు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఫోన్ చేసి నేర్చుకున్న దాన్ని వల్లెవేయడం, అద్దం ముందు మాట్లాడటం చేస్తూ చివరకు వీసా గండం గట్టెక్కాడు. ఈ పోటీలో పాల్గొనే బృందం ముందుగానే మాల్టా వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 25న హైదరాబాద్ నుంచి ముంబైకి వంశీ ఒక్కడే బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మీదుగా మాల్టా వరకు ఎయిర్‌బస్‌లో చేరుకున్నాడు.ఆగస్టు 28 రాత్రి (భారత కాలమానం ప్రకారం) 66 కేజీల జూనియర్ విభాగంలో జరిగిన పోటీలో స్క్వాట్æ 280 కేజీలు, బెంచ్‌ప్రెస్ 140 కేజీలు, డెడ్‌లిఫ్ట్ 242.50 కేజీలు మొత్తం 662.5 కేజీలు ఎత్తడంతో వంశీకి ప్రథమ స్థానం దక్కింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో వచ్చే అక్టోబరులో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటేందుకు వంశీ సిద్ధం అవుతున్నాడు. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం. -
మన బలమేంటో మనమే నిరూపించాలి
క్రీడల పట్ల ఆసక్తితోపాటు చదువులోనూ రాణిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది హైదరాబాద్ వాసి, 28 ఏళ్ల స్ఫూర్తి ఏనుగు. లా చదువుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధిస్తోంది. ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ స్ఫూర్తి ఏనుగు పంచుకున్న విషయాలు ఇవి... ‘‘సహజంగా ఇళ్లలో బరువులెత్తే పనులు అమ్మాయిలకు చెప్పరు. అవి, కేవలం అబ్బాయిల పనే అన్నట్టు చూస్తారు. చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం లేదా టెక్నిక్స్ తెలుసుకుంటే బరువులు ఎత్తడం అమ్మాయిలకూ సులువే. ప్రొఫెషనల్ అవ్వాలన్నా, శారీరక బరువు, మానసిక సమతుల్యత సాధించాలన్నా వెయిట్ మానేజ్మెంట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఛాలెంజెస్ అమ్మాయిలకు ఈ రంగంలో ప్రధాన సమస్య నెలసరి సమస్య. అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఒకే బరువును మోయలేం. శక్తిలోనూ మార్పులు వస్తుంటాయి. ఇందుకు తీసుకునే ఆహారం అబ్బాయిలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తే సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి. దెబ్బలు తగులుతుంటాయి. జాయింట్స్ దగ్గర సమస్యలు వస్తుంటాయి. బరువులు ఎత్తే సమయంలో ఊపిరిలో తేడాలు వస్తుంటాయి. కానీ, వీటన్నింటినీ సాధనతో అధిగమిస్తుంటాను. మంచి ఆహారం, సరైన నిద్రాసమయం, స్ట్రెస్ లెవల్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను. ఈ విషయంలో మా అమ్మ సాధన, నాన్న రామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బరువును బ్యాలెన్స్ చేసుకోవడానికి... సెకండ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉంది. డిస్క్ త్రో, జావలిన్ త్రో వంటి క్రీడల్లో పతకాలు సాధించాను. రెండేళ్ల నుంచి వెయిట్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కరోనా టైమ్‌లో బరువు పెరిగాను. పది కేజీల బరువు తగ్గాలనుకున్నాను. అందుకు డైట్లో మార్పులు చేసుకోవడానికి బదులు నాకు ఎలాగూ స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి, బరువు తగ్గడానికి వెయిట్‌లిఫ్టింగ్ సాధన చేశాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనల్ని మనం ఎలా క్రమశిక్షణగా మలచుకోవాలో నిపుణుల ఆధ్యర్వంలో తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా సరైన దినచర్యను అమలు చేసుకుంటూ, విజయం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఆలోచనలో మార్పు.. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే క్రీడలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారు ఎంచుకున్న రంగంలోనూ చాలా బాగా దూసుకుపోగలరు. ఇంట్లో వాటర్క్యాన్స్, గ్యాస్ సిలిండర్, సోఫా.. వంటి బరువులు ఎత్తడంలో కూడా టెక్నిక్స్ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు కూడా 50–60 కేజీల బరువు ఎత్తగలరు. కానీ, టెక్నిక్స్ తెలియకుండా ఎత్తి, నొప్పితో బాధపడుతుంటారు. దీంతో అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు అనే అభిప్రాయం మనలో చాలా మందిలో పాతుకుపోయి ఉంది. మన ఆలోచనలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ దిశగా అమ్మాయిలను ప్రోత్సహించాలి. క్రీడలతోపాటు ... చదువునూ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంబీయే పూర్తి చేశాను. సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతూనే స్పోర్ట్స్‌లో సాధన చేస్తూ వచ్చాను. ఇప్పుడు లా చదువుతున్నాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనే కాదు, కిందటి నెలలో కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఏడబ్ల్యూసీ ఓపెన్ వరల్డ్ కప్‌లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. మా అమ్మనాన్నల ప్రోత్సాహంతో పాటు కోచ్ ఇచ్చే గైడెన్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయి. మరిన్ని పోటీలు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిచోటా ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ‘వెయిట్ లిఫ్టింగ్ అంటే అబ్బాయిలదే. అమ్మాయిలకు ఏం సాధ్యమవుతుంది, సూటవదు’ అనే మాట ఇప్పటికీ ఈ రంగంలో మొదటగా వినిపిస్తుంది. కానీ, మనల్ని మనం గెలిచి చూపినప్పుడు అమ్మాయిలుగా మన బలం ఏంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది’’ అని వివరిస్తుంది స్ఫూర్తి. – నిర్మలారెడ్డి -
Reeni Tharakan: బామ్మ పవర్
53 ఏళ్ల వయసులో ఆమె జిమ్‌లో చేరింది ఫిట్నెస్ కోసం. పదేళ్లు తిరిగేసరికి 63 ఏళ్ల వయసులో పవర్ లిఫ్టింగ్ చాంపియన్ అయ్యింది. ఇటీవల మంగోలియాలో నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. ఏ వయసులోనైనా ఆరోగ్యంగా... దృఢంగ శరీరాన్ని మలుచుకునేందుకు స్త్రీలు శ్రద్ధ పెడితే సాధ్యం కానిది లేదని కొచ్చికి చెందిన రీని తారకన్ సందేశం ఇస్తోంది. మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్‌లో ఇటీవల ‘ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఫెడరేషన్’ (ఐ.పి.ఎఫ్) చాంపియన్‌షిప్స్ జరిగాయి. మన దేశం నుంచి 25 మంది పాల్గొంటే వారిలో 15 మంది స్త్రీలే. వారిలో కొచ్చిన్‌కు చెందిన రీని తారకన్ నాలుగు గోల్డ్‌మెడల్స్ సాధించింది. 63 ఏళ్ల వయసులో ఆమె ఇలా దేశం తరఫున పతకాలు గెలుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కాని అలా జరిగింది. అందుకు ఆమె చేసిన పరిశ్రమ, చూపిన శ్రద్ధే కారణం. భారీ పోటీ మంగోలియాలో జరిగిన ఐ.పి.ఎఫ్‌కు 44 దేశాల నుంచి 145 మంది పవర్‌లిఫ్టర్లు హాజరయ్యారు. వీరిని 40, 50, 60, 70 ఏళ్లుగా నాలుగు కేటగిరీల్లో విభజించి పోటీలు నిర్వహించారు. మళ్లీ ఈ కేటగిరీల్లో బరువును బట్టి పోటీదార్లు ఉంటారు. స్త్రీ, పరుషులు వేరువేరుగా పాల్గొంటారు. రీని తారకన్ అరవై ఏళ్ల కేటగిరిలో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది. డెడ్లిఫ్టింగ్లో 112.5 కిలోల బరువు ఎత్తగలిగింది. ప్రశంసలు అందుకుంది. ‘ఈ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో నాకు బాగా నచ్చిన అంశం స్త్రీలు ఎక్కువగా పాల్గొనడం. మన దేశం నుంచి స్త్రీలే ఎక్కువ మంది ఉన్నాం. అంటే నేటì కాలంలో స్త్రీలు తమ సామర్థ్యాలను ఏ వయసులోనైనా మెరుగు పరుచుకోవడానికి వెనుకాడటం లేదని తెలుసుకోవాలి’ అంది రీని తారకన్. బరువు తగ్గడానికి వెళ్లి రీని తారకన్ కొచ్చిన్ శివార్లలోని తైకట్టశ్శేరి అనే గ్రామంలో ఉంటుంది. భర్త ఆంటోని తారకన్ రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు అమెరికాలో స్థిరపడితే మరొకరు చెన్నైలో రెస్టరెంట్‌ను నడుపుతున్నారు. ఇంట్లో విశ్రాంతిగా ఉండటం వల్ల తాను బరువు పెరుగుతున్నానని రీని తారకన్కు అనిపించింది. దాంతో కొచ్చిన్ సిటీలోని వైట్టిలా ప్రాంతంలో ఒక జిమ్ లో చేరింది. ఇంటినుంచి జిమ్ పాతిక కిలోమీటర్ల దూరమైనా బరువు తగ్గాలనే కోరికతో రోజూ వచ్చేది. భర్త ఆమెను తీసుకొచ్చి దిగబెట్టేవాడు. అయితే ఆ జిమ్‌లోని ట్రైనర్ ఆమెలో బరువులెత్తే సామర్థ్యం ఉందని ఆ దారిలో ప్రోత్సహించాడు. పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌గా మారొచ్చని చెప్పాడు. అందుకు తర్ఫీదు ఇస్తానన్నాడు. 2021 నుంచి ఆమెను పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నాడు. అప్పటి నుంచి రీని మెడల్స్ సాధిస్తూనే ఉంది. ‘పదేళ్ల క్రితం నాకు జిమ్ అంటేనే తెలియదు. కాని క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు పవర్లిఫ్టర్ని అయ్యాను. ఈ గుర్తింపు సంతృప్తినిస్తోంది’ అంది రీని తారకన్. సమర్థింపులు, సూటిపోట్లు ‘నేను పవర్‌లిఫ్టర్ కావాలని ప్రయత్నించినప్పుడు నా కుటుంబం పూర్తి సహకారం ప్రకటించింది. నా పిల్లలు ‘‘ట్రై చెయ్యమ్మా’’ అన్నారు. కాని బంధువుల్లో కొందరు సూటిపోటి మాటలు అన్నారు. ఈ వయసులో ఇదంతా అవసరమా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారికి పని చేస్తూనే సమాధానం చెప్పాలనుకున్నాను. అప్పుడు అలా అన్నవాళ్లు ఇవాళ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిమ్ స్త్రీలకు చాలామంచిది. పవర్‌లిఫ్టింగ్ లాంటివి మన ఎముకలకు బలాన్నిస్తాయి. నేను నా బరువును అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉంటున్నాను. వారంలో నాలుగు రోజులు జిమ్‌కు వచ్చి రెండు గంటలు వర్కవుట్ చేస్తాను. రెండు రోజులు ఇంట్లో వ్యాయామం చేస్తాను. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటాను. వ్యాయామం ఉత్సాహాన్నిస్తుంది. తప్పక చేయండి’ అంటోంది రీని తారకన్. -
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం గెలిచిన తెలంగాణ అమ్మాయి
సాక్షి, జగిత్యాల: అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెలంగాణ అమ్మాయి రంగు విరించి స్వప్నిక స్వర్ణంతో మెరిసింది. షార్జాలో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ కప్ టోర్నీలో స్వప్నిక ఈ ఘనత సాధించింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందిన స్వప్నిక.. జూన్ నెలలో రాంచీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఏషియన్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైంది. ఈ పోటీల్లో ఇండియా తరపున మొత్తం ఐదుగురు పాల్గొనగా.. స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ అనే మూడు విభాగాల్లో స్వప్నిక సత్తా చాటింది. మూడు విభాగాల్లో వేర్వేరుగా గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు క్లాసిక్ పవర్ లిఫ్టింగ్‌లోనూ (మూడు కలిపి) గోల్డ్ మెడల్ సాధించింది. స్వప్నిక ఈ ఫీట్ సాధించడంపై ఆమె తండ్రి రంగు వెంకటరమణతో పాటక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై స్వప్నిక స్వర్ణం సాధించడంతో ధర్మపురి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వప్నిక స్ధానిన ఎస్సారార్ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతుంది. -
ఆసియా పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన సాధియా ఆల్మస్
కేరళలో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్ సాధియా ఆల్మస్ సత్తా చాటింది. మంగళగిరికి చెందిన సాధియా 57 కేజీల జూనియర్ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్‌తో పాటు ఒక కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని సాధియా కోచ్, తండ్రి ఎస్కే సందాని పేర్కోన్నాడు. కాగా పోటీల్లో ఆల్మస్ స్వ్కాట్లో 57 కేజీల విభాగంలో 190 కేజీల బరువు ఎత్తి వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా సాధియా ఆల్మస్ను రాష్ట్ర పవర్ లిఫ్గింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ సెక్రటరీ సూర్యనారాయణ తదితరులు అభినందించారు. చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని ఇస్తోంది: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మంగళవారం యూసుఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నేషనల్ జూనియర్, సబ్ జూనియర్, మాస్టర్ మెన్, ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పోటీలకు 26 రాష్ట్రాల నుంచి 800 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని చెప్పారు. క్రీడలలో పాల్గొనడం వలన ఎంతో ఆరోగ్యంగా, దృఢంగా ఉంటామని చెప్పారు. ఈ చాంపియన్ షిప్ ఏర్పాటు చేసిన నిర్వహకులు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. క్రీడలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశం తో ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరగడం ఎంతో సంతోషిదగ్గ విషయం అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మల్లికా
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 18 నుంచి 23 వరకు దుబాయ్‌లో జరిగే సీనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన మల్లికా యాదవ్‌ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంగళవారం అభినందించారు. పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా మల్లికా యాదవ్ మంత్రిని అభ్యర్థించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఆసియా చాంపియన్ పవర్ లిఫ్టర్ రాఘవేందర్ గౌడ్ పాల్గొన్నారు. -
పవర్ గర్ల్
పూటగడవని కుటుంబంలో పుట్టిన అనూషకు ఆర్థిక పరిస్థితులు అవరోధంగా నిలిచాయి. అయితే పతకం సాధించి దేశానికి ఖ్యాతి తీసుకురావాలన్న తపన ఆ అవరోధాలను అధిగమించేలా చేసింది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా మొక్కవోని ఆత్మ సై ్థర్యంతో పతకాలను సాధిస్తూ పవర్ గర్ల్‌గా, వేమన విశ్వవిద్యాలయ మహిళా శక్తిగా ఖ్యాతి గడించి.. ప్రపంచక్రీడాపటంలో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు అనూష. యోగివేమన విశ్వవిద్యాలయం క్రీడాకారిణి పవర్‌లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తూ తెలుగు మహిళల సత్తా ప్రపంచానికి చాటుతోంది. వైవీయూ అనుబంధంగా గల బద్వేలు పట్టణంలోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న డొంకెన అనూష స్వస్థలం కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందగల గ్రామం. ఫిబ్రవరి 16 నుంచి 18వ (నేడు) వరకు కేరళలోని కాలికట్లో నిర్వహించనున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు అనూషను ‘సాక్షి’ పలకరించినప్పుడు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని.. ఆర్థిక చేయూతనిస్తే కామన్వెల్త్లో పతకం సాధించి దేశఖ్యాతిని ప్రపంచక్రీడాపటంలో చాటిచెబుతానని ఆమె ఆత్మవిశ్వాసంతో అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘నాన్న కల్లుగీత కార్మికుడు. ఎంత కష్టమైనా సరే నన్ను చదివించాలనుకున్నారు. నాకు మాత్రం చదువుతో పాటు ఆటలంటే ఎంతో ఆసక్తి. చిన్నతనం నుంచి రకరకాల ఆటల్లో పాల్గొనేదాన్ని పాఠశాలస్థాయిలో కబడ్డీ క్రీడలో రాణించాను కూడా. మగరాయుడిలా వేషాలేంటన్నారు మా ఊర్లో ఆడపిల్లలంటే చిన్నచూపు. దానికి కారణం నిరక్షరాస్యత అయితే.. రెండో కారణం ఆటలపై అవగాహన లేకపోవడమే. నేను పదోతరగతి చదువుతున్నప్పుడు మైలవరంలో ఓ శిక్షణ శిబిరం జరిగింది. అక్కడకు వెళ్లినప్పుడు నాకు పవర్‌లిఫ్టింగ్ మీద ఆసక్తి పెరిగింది. నాకూ శిక్షణ తీసుకోవాలనిపించింది. దీని కోసం ప్యాంట్లు వేసుకోవాల్సి వచ్చేది. మా గ్రామంలో చాలామందికి నచ్చలేదు. నేను అలా వేసుకుని వెళ్లినప్పుడల్లా మగరాయుడిలా ఆ బట్టలేంటి.. వేషాలేంటి.. ఆటలేంటి అని అనేవారు. నేనేదో చేయకూడని పని చేస్తున్నట్లుగా చూసేవారు. దాంతో మానసికంగా కుంగిపోయేదాన్ని. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. ఎవరేమనుకుంటే నాకేం అనే పరిణతి చాలా రోజులకు వచ్చింది. ఎంతకష్టమైనా సరే ఆట, చదువుని నిర్లక్ష్యం చేయకూడదనుకున్నా. నా కోసం.. నా తమ్ముడు కూలీపనులకు వెళ్లాడు పదోతరగతి పరీక్షల కోసమని కొన్నాళ్లు పవర్‌లిఫ్టింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్లో చేరాక శిక్షణ మీద దృష్టి పెట్టాను క్రమంగా జిల్లాస్థాయి పోటీలకు వెళ్లాను. పతకాలు వచ్చేవి. శిక్షణ తీసుకోవడం తేలికైంది. కానీ.. ఆ సమయంలో ఆర్థికంగా సమస్యలు తప్పలేదు. పవర్‌లిఫ్టింగ్ కోసం ఫిట్‌గా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.. నిపుణుల ఆధ్వర్యంలో వ్యాయామాలు చేయాలి. ఇంట్లో చూస్తేనేమో నాన్న మా పోషణకు, చదువులకే కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను అడగడం భావ్యం కాదనిపించింది. అందుకే పవర్‌లిఫ్టింగ్ వదిలేసి.. ఓ ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా చేరా. నా మనసు మాత్రం పవర్‌లిఫ్టింగ్‌పై ఉండేది. కొన్నాళ్లకు అమ్మానాన్నలకి విషయం చెప్పా, వాళ్లు అప్పులైనా ఫర్వాలేదు.. నువ్వు అనుకున్నది చెయ్ అంటూ ప్రోత్సహించారు. అయితే కొన్ని రోజులకే నాన్న (శ్రీనివాసరావు) కు పక్షవాతం వచ్చింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మా తమ్ముడు వంశీ నా గురించి ఆలోచించి చదువు మానేశాడు. కూలీ పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. అమ్మ మల్లేశ్వరి కూడా నా కోసం పనులకు వెళ్లేది. అలా కుటుంబసభ్యుల సహకారంతో 2016లో మళ్లీ పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లా. చదువుకుంటూనే.. తొలుత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎల్ఎల్బీ చదివేందుకు వెళ్లినా.. ఇబ్బందుల దృష్ట్యా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో ఎవరో శ్రేయోభిలాషులు చెప్పడంతో వైవీయూలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉచితంగా విద్యనందిస్తారని తెలిసి కృష్ణా జిల్లా నుంచి వైవీయూకు వచ్చాను. వైవీయూ పరిధిలోని బద్వేలులోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో 2016లో డిగ్రీ బీఏ (హెచ్ఈపీ)లో చేరిపోయా. కళాశాల యాజమాన్యం ఉచిత విద్యతో పాటు నెలకు రూ.5 వేలు నా భోజన ఖర్చులకు వెచ్చిస్తూ చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నారు. దీంతో పాటు మెరుగైన శిక్షణ కోసం చెన్నైలోని అంజుకర్ పవర్‌లిఫ్టింగ్ అకాడమీలో చేరా. కోచ్ ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగా. దక్షిణాఫ్రికాలో 2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. దాదాపు 50 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 18 మంది వెళితే అందులో నేను ఉన్నా. జూనియర్స్ 84 కిలోల విభాగంలో పోటీపడ్డా. స్క్వాట్ విభాగంలో 190 కిలోలు, బెంచ్ ప్రెస్ విభాగంలో 110 కిలోలు, డెడ్‌లిఫ్ట్ విభాగంలో 182.5 కిలోలు ఎత్తి మొత్తం మీద 482.25 కిలోల బరువు ఎత్తి రజత పతకం సాధించా. ఈ పోటీలకు వెళ్లడానికి ముందు నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా గురించి తెలిసి చాలా మంది దాతలు ఆర్థికంగా సాయం చేశారు. పతకం సాధించాలి.. అప్పులూ తీర్చాలి.. ప్రస్తుతానికి నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కామన్వెల్త్లో దేశానికి పతకం తీసుకురావడం ఒక లక్ష్యమైతే నాకోసం మా కుటుంబసభ్యులు చేసిన అప్పులు తీర్చడం మరో లక్ష్యంగా భావిస్తున్నా. ప్రపంచ పతకం సాధించిన సమయంలో ప్రభుత్వం రూ.10 లక్షలు, డీఎస్పీ స్థాయి ఉద్యోగం ప్రకటించింది. అయితే అది ఇంకా చేతికి అందలేదు. వస్తే నా కష్టాలు తీరతాయని భావిస్తున్నా. నాగరాజు, సాక్షి, కడప వైవీయూ అధికారుల ప్రోత్సాహం అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న డొంకెన అనూషకు వైవీయూ అధికారులు అండగా నిలిచారు. ఆమె సాధన చేసుకునేందుకు ప్రపంచస్థాయి పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆమెకు ఉచితంగా వసతి కల్పించారు. దీంతో పాటు అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రాణించడంతో పాటు పతకం సాధిస్తే రూ. 30 వేలు నగదు ప్రోత్సాహకంతో పాటు నెలకు రూ.5 వేలు చొప్పున ఉపకార వేతనం ఇచ్చేందుకు వైవీయూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు పరీక్షల్లో సైతం 20 శాతం మేర మార్కులు కలిపి ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైవీయూ అధికారులు స్పష్టం చేశారు’’ అని అనూష తెలిపారు. అనూష సాధించిన పతకాలు ►2012లో ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం. ►ఎస్జీఎఫ్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం ►జూనియర్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం ►2014, 15, 16 జూనియర్ నేషనల్స్‌లో వరుసగా స్వర్ణం సాధించి చాంపియన్‌గా గుర్తింపు ►2014 గోవాలో నిర్వహించిన సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం. ►2014లో పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం ►2016లో చండీగఢ్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం ►2016లో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఫెడరేషన్ కప్‌లో కాంస్యం. ►2018లో శ్రీకాకుళం రాజాంలో నిర్వహించిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ క్యాంపులో ప్రతిభ.. ప్రథమ స్థానంలో నిలవడంతో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం. ►2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలోని కొచెస్ట్రామ్లో నిర్వహించిన ప్రపంచ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం. -
దేశానికి లిఫ్ట్ ఇచ్చినా దేశం లిఫ్ట్ ఇవ్వలేదు!
అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన శ్యామలాదేవికి నేడు సొంత రాష్ట్రంలోనే ఆదరణ కరువైంది! శిక్షకులు, మార్గదర్శకులు లేకుండా.. పట్టుదల, సాధనే కృషిగా అంతర్జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు దేశాలు పాల్గొన్న ఆసియా జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి దేశానికి వన్నె తెచ్చినప్పటికీ ఏ గుర్తింపు లేకుండా ఆమె అనామకంగా ఉండవలసి వస్తోంది! కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం అందకపోవడంతో చిరు ఉద్యోగంతో ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. శ్యామల 2006లో దక్షిణకొరియాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో బంగారు పతకం సాధించి, భారతదేశ జెండాను రెపరెపలాడించారు. దాంతో పాటు జాతీయ స్థాయిలో 8 రజిత, 16 కాంస్య పతకాలు గెలుపొందారు.శ్యామల స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. తండ్రి కిషోర్‌కుమార్. తల్లి విజయలక్ష్మి. తండ్రి అల్యూమినియం వస్తువులు తయారు చేసే పరిశ్రమలో దినసరి కార్మికుడిగా పని చేసేవారు. పెద్ద కుటుంబం, తక్కువ ఆదాయం కావడంతో తండ్రికి అండగా ఉండేందుకు బి.కాం. చదివినప్పటికీ శ్యామల కూడా దినసరి కార్మికురాలిగా వెళ్లేవారు. శ్యామలకు పాఠశాలస్థాయి నుంచే ఆటలపై మక్కువ. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా వెయిట్ లిఫ్టింగ్ సాధన చేస్తూ పవర్ లిఫ్టింగ్‌లో ఒడుపు సాధించారు. అలా కళాశాల నుంచి జాతీయ స్థాయికి అక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2005లో పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినప్పటికీ లక్షల్లో ఖర్చు కనుక ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్యామలకు ఆ అవకాశం చేజారిపోయింది. ‘శాప్’ అధికారులకు విన్నవించుకుంటే.. ‘ఇంతా ఖర్చు చేశాక పతకం తీసుకురాకుంటే!’ అనే సందేహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి సంవత్సరం దాతలు కొందరు ముందుకు రావడంతో పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించి దక్షిణ కొరియాలో పతకం సాధించారు. అప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె వైపు చూడను కూడా చూడలేదు. ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో ఆ క్షణం నుంచే ఆటలకు ఆమె స్వస్తి పలికారు. ప్రస్తుతం శ్యామల నెల్లూరు పౌర సరఫరాల సంస్థలో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. భర్త ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ప్రోత్సహించే వారు కరువవడం, బంగారుపతకం సాధించిన తరువాత ఆమెను మంత్రులు, పెద్ద అధికారులకు పరిచయం చేసే వారు లేకపోవడంతో ఆ ఆణిముత్యం ప్రతిభ అంతటితో అగిపోయింది. పేద కుటుంబంలో జన్మించి దేశం గర్వించే విధంగా పతకం సాధించిన శ్యామలాదేవి ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆమెకు ఆర్థికంగా సహాయం చేయవలసిన అవసరం ఉంది. వెయిట్ ‘లిస్ట్’ ►2004 ఆగస్టులో... సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం. ►2004 నవంబర్‌లో... సౌత్ ఇండియాచాంపియన్షిప్లో స్వర్ణం. ►2005 జనవరిలో...జూనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లో 4 కాంస్యాలు. ►2005 ఫిబ్రవరిలో...జూనియర్స్ ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం. ►2005లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత.అదే ఏడాది...అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో రజతం. ►2006లో...జూనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్‌లో 4 రజతాలు. ►2006... ఫెడరేషన్ కప్ జూనియర్స్ పోటీలలో స్వర్ణం. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోపాల్గొనేందుకు అర్హత. -
బరువు.. బాధ్యత!
శ్రీకాకుళం, వీరఘట్టం: కోడి రామ్మూర్తి నాయుడు నుంచి కరణం మల్లీశ్వరి వరకు జిల్లా క్రీడాకారులు బరువును బాధ్యతగానే తీసుకున్నారు. అదే వరుసలో పయనిస్తోంది వీరఘట్టం అమ్మాయి తూముల సంయుక్త. రాజాం జీఎంఆర్‌ఐటీలో ద్వితీయ ఏడాది ట్రిపుల్ ఈ చదువుతున్న సంయుక్త పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయిలో సిక్కోలు కీర్తి పతాకం ఎగురవేస్తోంది. ఇంటర్మీడియెట్ వరకు కనీసం క్రీడల్లో ప్రావీణ్యత లేని సంయుక్త ఇంజినీరింగ్‌లో మాత్రం కళాశాల యాజమాన్యం చొరవతో పవర్ లిఫ్టింగ్‌పై దృష్టి సారించింది. ట్రైనర్ మహేష్ పర్యవేక్షణలో ప్రతి రోజూ 4 గంటల చొప్పున సాధన చేస్తూ పవర్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది ఈ వీరఘట్టం వనిత. పవర్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తున్న సంయుక్తకు వీరఘట్టం కళింగ వైశ్యసంఘం సభ్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కూర్మనా«థ్, బి.సంపత్‌కుమార్, రిటైర్డ్ ఎంఈఓ బీవీ సత్యానందం, తహసీల్దార్ ఎస్.ఆంజనేయులు అభినందనలు తెలిపారు. ప్రాథమిక విద్య వీరఘట్టంలోనే.. వీరఘట్టంకు చెందిన వ్యాపారి తూముల శ్రీనివాసరావు, తేజశ్రీల కుమార్తె సంయుక్త 1 నుంచి 7వ తరగతి వరకు స్థానిక మహర్షి హైస్కూల్లో, 8 నుంచి పదో తరగతి వరకు పాలకొండ నవోదయ విద్యాలయంలో చదివి టెన్త్‌లో 8.5 గ్రేడ్ పాయింట్లతో పాసైంది. తర్వాత విశాఖలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివి 940 మార్కులు సాధించింది. ప్రస్తుతం రాజాం జీఎంఆర్ ఐటీలో ద్వితీయ సంవత్సరం ట్రిపుల్ ఈ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ కోర్సు చేస్తోంది. అంతర్జాతీయ పతకాలే లక్ష్యం ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత పవర్ లిఫ్టింగ్ పై ఆసక్తి కలిగింది. జీఎంఆర్ యాజమాన్యం పూర్తి సహకారాన్ని అందించడంతో ట్రైనర్ మహేష్ శిక్షణలో రాణిస్తున్నాను. అంతర్జాతీ య వేదికపై సత్తాచాటి బంగారు పతకం సాధించడంమే నా లక్ష్యం. అందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాను.– తూముల సంయుక్త, వీరఘట్టం పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తూ.. ♦ ఈ ఏడాది మే 26, 27 తేదీల్లో విశాఖ బుల్లయ్య కాలేజీలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ♦ ఈ ఏడాది జూన్ 21 నుంచి 25 వరకు జీఎంఆర్ కాలేజీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఐదో స్థానంలో నిలిచింది. ♦ జూలై 14, 15వ తేదీల్లో విజయవాడలో జరిగిన సబ్ జూనియర్ అంతర జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలో రెండో స్థానం కైవసం చేసుకుంది. ♦ గత ఏడాది నవంబర్‌లో రాజమహేంద్రవరంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ♦ తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు లక్నోలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది. -
స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణగా ‘మల్లికా యాదవ్’
సూపర్‌బజార్(కొత్తగూడెం) : కొత్తగూడెం పట్టణంలోని నేతాజీ వ్యాయామశాలకు చెందిన వి.మల్లికాయాదవ్ రాష్ట్రస్థాయి సీనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారుపతకం సాధించడంతోపాటు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మల్లికాయాదవ్ బ్యాక్స్కాడ్ విభాగంలో 180 కేజీలు, బెంచ్‌ప్రెస్‌లో 80, డెడ్‌లిఫ్ట్‌లో 180 కేజీల బరువులు ఎత్తి బంగారు పతకంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టులో గుంటూరు జిల్లా మదనపల్లిలో జరగనున్న సీనియర్ జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా మల్లికకు ఉమ్మడి జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ఎ.నాగరాజు, జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వసంతరావు, ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీనివాస్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ కూచన కృష్ణారావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.మహిదర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖాసీ హుస్సేన్, కె.మొగిళిలు అభినందనలు తెలిపారు. -
మనోజ్‌కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మనోజ్ 66 కేజీ కేటగిరీలో 490 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. శివ కుమార్ 440 కేజీల బరువెత్తి రజతం, ఓంప్రసాద్ (420 కేజీలు) కాంస్యం నెగ్గారు. 74 కేజీ కేటగిరీలో జానకిరామ్ 637.5 కేజీల బరువెత్తి బంగారు పతకం సాధించాడు. రమేష్ (575 కేజీలు), చంద్రకాంత్ (437.5 కేజీలు) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. మహిళల 72 కేజీ కేటగిరీలో నిత్య స్వర్ణం నెగ్గింది. ఇతర విభాగాల విజేతలు 59 కేజీ కేటగిరీ: 1. కుమార్ (500 కేజీలు), 2. శ్రీశైలం (360 కేజీలు); 83 కేజీ కేటగిరీ: 1. చందర్ శంకర్ (662.5 కేజీలు), 2. బాలకృష్ణ (502.5 కేజీలు); 93 కేజీ కేటగిరీ: 1. శ్రీనివాస్ (625 కేజీలు), 2. శ్రీకాంత్ (480 కేజీలు); 105 కేజీ కేటగిరీ: 1. కార్తి (582.5 కేజీలు), 2. రాజత్ సింగ్ (375 కేజీలు); ప్లస్ 120 కేజీ కేటగిరీ: 1. సుమిత్ (747.5 కేజీలు). -
‘స్ట్రాంగ్‌మాన్’ స్టీఫెన్
హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ జిల్లా సీనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్టీఫెన్ మెరిశాడు. జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన 61 కేజీల విభాగం ఫైనల్లో స్టీఫెన్ అత్యుత్తమ పవర్లిఫ్టర్గా ఎంపికయ్యాడు. దీంతో అతనికి హైదరాబాద్ ‘స్ట్రాంగ్ మాన్’ అవార్డు దక్కింది. ఈ పోటీల విజేతలకు బేగంబజార్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శి గోవింద్ రాజ్, తెలంగాణ పవర్ లిఫ్టింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: 59 కేజీలు: 1.జి.రమేష్ (460 కేజీలు), 2.బి.పవన్ కుమార్, 3.ఎం.భాను ప్రకాష్. 66 కేజీలు: 1.కె.స్టీఫెన్ (565 కేజీలు), 2.కె.దినేష్, 3.డి.శివకుమార్. 74 కేజీలు: 1.ఎం.జానకిరామ్ (570 కేజీలు), 2.జి.శేషు, 3. కె.మనోజ్ యాదవ్. 83 కేజీలు:1.ఎన్.అంజయ్య (572.5 కేజీలు), 2.ఎస్.కృష్ణ, 3.జె.నరేందర్. 93 కేజీలు: 1.కె.సంతోష్ (425 కేజీలు), 2. కె.శ్రీకాంత్, 3.ఎ.విక్టర్. 105 కేజీలు: 1.వై. రాఘవేంద్ర గౌడ్ (765 కేజీలు), 2.ఆర్.ఉదయ్ కృష్ణ. 120 కేజీలు: 1.ఎల్.ప్రవీణ్ (752 కేజీలు). ప్లస్ 120 కేజీలు: 1.బి.సుమిత్ (747.5 కేజీలు). -
ఇంటర్ వర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీకి ఓయూ జట్లు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్లను ప్రకటించారు. ఈ పోటీలు వచ్చేనెల 1 నుంచి చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరుగుతాయి. ఓయూ వెయిట్‌లిఫ్టింగ్ జట్టు: 56 కేజీలు:ఎం.సంపత్ కుమార్ (వి.వి.కాలేజి), 62 కేజీలు: జి.వెంకటేష్ (ఎ.వి.కాలేజి), 69 కేజీలు: జి.సందీప్ (నిజాం కాలేజి), 77కేజీలు: వై.రాహుల్ సాగర్ (జి.పుల్లారెడ్డి కాలేజి), 85 కేజీలు: ఐ.ప్రమోద్(ఎ.వి.కాలేజి), 94 కేజీలు: టి.నవీన్ కుమార్ (నిజాం కాలేజి). 105 కేజీలు: ఎం.ఆర్.చైతన్య (భవాన్స్ కాలేజి), +105 కేజీలు: రాహుల్ (సుప్రభాత్ కాలేజి). పవర్ లిఫ్టింగ్ జట్టు: 59 కేజీలు: జి.రమేష్ (ఎ.వి.కాలేజి), 66 కేజీలు: ఎం.జానకిరామ్ (ఎ.వి.కాలేజి), 74 కేజీలు: ఎన్.అంజయ్య (ప్రజావాలా కాలేజి), 83 కేజీలు: ఎం.బి.అబిద్ (వెస్లీ కాలేజి), 93 కేజీలు: అమర్ సింగ్ (హస్విత కాలేజి), 105 కేజీలు: వై.రాఘవేందర్ గౌడ్ (సెయింట్ జోసెఫ్ కాలేజి), పర్వానంద్ (లయోలా అకాడమీ). మహిళల 84 కేజీలు: డి.అనూష (ఎ.వి.కాలేజి). -
ఏవీ కాలేజీకి పవర్‌లిఫ్టింగ్ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల ఓవరాల్ టీమ్ టైటిల్‌ను గగన్‌మహల్ ఆంధ్రా విద్యాలయం (ఏవీ) కాలేజి చేజిక్కించుకుంది. సిగ్నోడియా కాలేజి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఏవీ కాలేజీకి చెందిన నలుగురు లిఫ్టర్లు తమ వెయిట్ కేటగిరీల్లో సత్తా చాటి స్వర్ణ పతకాలను గెల్చుకోవడంతోపాటు తమ కాలేజి జట్టుకు టీమ్ టైటిల్‌ను అందించారు. వెస్లీ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా, ప్రజావాలా కాలేజి, హస్విత కాలేజి, సెయింట్ జోసెఫ్ కాలేజి జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఫైనల్స్ ఫలితాలు 59 కేజీలు: 1.జి.రమేష్ (ఏవీ కాలేజి), 2.ఆనంద్ కుమార్ సింగ్ (టీకేఆర్ కాలేజి), 3.కె.దినేష్ (ఐఐఎంసీ). 66 కేజీలు: 1.ఎం.జానకీరామ్ (ఏవీ కాలేజి), 2.కె.వినోద్ కుమార్ (వి.స్వామి కాలేజి), 3.ఎం.ఓం ప్రసాద్ (శ్రీవిజ్ఞాన్ కాలేజి). 74 కేజీలు: 1.ఎన్.అంజయ్య (ప్రజావాలా కాలేజి), 2.ఎం.అమరనాథ్ యాదవ్ (పీజీ కాలేజి), 3.యుశంధర్ గౌడ్ (వెస్లీ కాలేజి). 83 కేజీలు: 1.ఎం.బి.అబిద్ ( వెస్లీ కాలేజి), 2.ఎల్.ప్రవీణ్ కుమార్ (శ్రీవిజ్ఞాన్ కాలేజి), 3.ఎస్.కృష్ణ (నిజాం కాలేజి). 93 కేజీలు: 1.అమర్ సింగ్ (హస్విత కాలేజి), 2. టి.ఆర్.సి.క్రాంతి(కేన్ కాలేజి), 3.నితిన్ కుమార్ (సుప్రభాత్ కాలేజి). 105 కేజీలు: 1.వై.రాఘవేందర్ గౌడ్ (సెయింట్ జోసెఫ్ కాలేజి), 2.ఆర్.గణేష్ యాదవ్ (సుప్రభాత్ కాలేజి), 3.ఆర్.సాయి కుమార్ (వెస్లీ కాలేజి). 120 కేజీలు: 1.పర్వానంద్ (లయోలా అకాడ మీ). మహిళల విభాగం 84 కేజీలు: 1.డి.అనూష గౌడ్ (ఏవీ కాలేజి).